Wednesday, November 6, 2024

‘రామ్ చరిత్ మానస్’ లో తులసీదాసు ఏమి రాశారు?

ఎవరైనా సరే వారి వ్యక్తిగత విశ్వాసాల్ని వారి వ్యక్తిగత స్థాయిలో ఉంచుకుంటే ఎవరూ విమర్శించాల్సిన పనిలేదు. వారి పైత్యాన్ని జనంమీద రుద్దితేనే గొడవ. అలాగే వైజ్ఞానిక స్పృహ అనేది వ్యక్తిగత విశ్వాసం కాదు. అది విశ్వమానవుల వాస్తవ విశ్వాసం. ఉదాహరణకు ఎలక్ట్రిక్ బల్బు వెలగడం గురించి మీరు ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడొచ్చు. తుపానుల గురించీ, రోబోట్ ల గురించీ, కంప్యూటర్ ప్రోగ్రాంల గురించీ ప్రపంచంలో ఎవరు ఎవరితోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. హేతుబద్ధంగా ప్రశ్నించడం గురించి ఎవరు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు.

నిర్హేతుకమైనవాటిపై పట్టుపట్టకూడదు

 కానీ, మీరు మీ పోశమ్మ దేవతకు కల్లు పొంగించడం గురించి, శ్రీరాముడు దశరథుడికి కాకుండా పాయసానికి పుట్టడం గురించి. సీతాదేవి నాగేటి చాళ్ళలో దొరకడం గురించి….మీరు గాఢంగా విశ్వసిస్తూ ఉంటే విశ్వసించొచ్చు. కానీ, ఇతరులు కూడా మీ లాగే విశ్వసించాలంటే కుదరకపోవచ్చు. ఇక ఇతర దేశాలవారికైతే ఆ దేవుళ్ళే, ఆ నేపథ్యం తెలిసి ఉండదు గనుక వారికి విషయమేదీ అర్థం కాదు. ఏ గ్రీకు దేవతనో ఆరాధించేవాడు ఎక్కడో ఆ దేశంలో ఉంటే ఇక్కడ మీరు పట్టించుకోరు కదా? ఇదీ అంతే. ఇక్కడి మీ విశ్వాసాల్ని అక్కడివారు పట్టించుకోరు. అంతేకాదు, విశ్వాసం లేకపోతే ఇక్కడివారు కూడా పట్టించుకోరు. విషయమేదైనా సరే, సందేహనివృత్తి జరగాల్సిందే. కార్యకారణ సంబంధం బయటికి రావలసిందే!

హనుమాన్ ఛాలీసా కరోనాకు విరుగుడా?

‘‘రోజుకు ఐదుసార్లు ‘హనుమాన్ ఛాలీసా’ పఠించడం వల్ల కరోనాను దూరం చేయొచ్చు’’- అని బీజేపీ ఎంపి ప్రజ్ఞాసింగ్ టాకూర్ ప్రకటించారు. ‘ప్రజ్ఞా’ అని పేరు పెట్టుకోగానే సరిపోదు. అది ఇంతో అంతో మాట్లాడే మాటల్లో కనిపించాలి. కేవలం హిందూమతంపై ప్రేమ ఉన్నవాళ్ళని ఆకర్షించడానికి మతవిద్వేషం రేకెత్తించడానికి మాత్రమే ఆ పిలుపు పనికొస్తుంది. శ్రీరాముడి భక్తులుగా చలామణి అయినవారు చాలామంది ఉననారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదగినవాడు సంత్ తులసీదాస్. ‘హనుమాన్ ఛాలీసా’ రచయితగా, ‘రామ్ చరిత్ మానస్’ రాసినవాడిగా గుర్తింపు ఉంది.  

తులసీదాసు ‘రామ్ చరిత్ మానస్’

ఇంటిపేరు దూబే. దేశంలో వర్థిల్లుతూ ఉన్న నిచ్చెనమెట్ల సంస్కృతిలో అగ్రభాగాన ఉన్నవాడు. బ్రాహ్మణుడు. క్రీస్తు శకం 13 ఆగస్టు 1497-1623 మధ్య కాలంలో సుమారు 125 సంవత్సరాలు జీవించివాడిగా చెబుతారు. ఉత్తరప్రదేశ్ లోని రాజాపూర్ లో జన్మించాడు. ఆస్సీఘాట్, వారణాసిలోజీవించాడు. గోస్వామి తులసీదాస్ ప్రసిద్ధుడు. సంస్కృత రామాయణాన్ని ‘రామ్ చరిత్ మానస్’ గా రాసినవాడు. సంస్కృతం, అవధి భాషల్లో రచనలు ప్రకటించాడు. వినయపత్రిక, హనుమాన్ ఛాలీసా వంటి రచనతో ఆ నాటి సమాజంలో తన అస్థిత్వాన్ని నిలుపుకున్నాడు. మనకు ఎంతోమంది భక్తకవులు ఉన్నారు. వారి భక్తిని ఆరాధించేవారు కొందరైతే, వారి భజనల్ని, కృతుల్ని, కీర్తనల్ని భక్తితో పాడుకునేవారు మరికొందరు. అలాగే, ఆ భక్తి సాహిత్యాన్ని లోతుగా పరిశీలించి, విశ్లేషించేవారు కూడా కొందరుంటారు. అయితే, వాళ్ళను – వాళ్ళు జీవించిన కాలానికే పరిమితం చేసి చూస్తే మంచిది. అంతేగాని, విషయాన్ని సర్వకాలాలకూ అన్వయించగూడదు. ఆధునిక కోణంలోంచి సమీక్షిస్తే, వారి కృషి మారిన కాలంలో ఎందుకూ పనికిరానిదిగా మిగిలిపోవచ్చు.

వాస్తవాల్ని వాస్తవాలుగా చెప్పుకోగలగాలి

కొన్ని వాస్తవాల్ని వాస్తవాలుగా ఒప్పుకోగలిగే ధైర్యముంటేనే మనం ముందుకు పోగలం. మాకు ఇలాగే బాగుంది. మేమిక్కడే ఉంటాం అని ఎవరైనా గతంలోనే ఆగిపోదలిస్తే, అది వారి ఇష్టం! నేనిక్కడ భక్తకవి తులసీదాస్ గౌరవాన్ని తగ్గించి చూపాలని ప్రయత్నించడం లేదు. కేవలం వాస్తవాలు తెలియజేస్తున్నాను. అవి తెలుసుకున్న తర్వాత కూడా … ఆయన  మహానుభావుడూ, సమాజఉద్ధారకుడూ అని ఎవరైనా భావిస్తే, అది వారి ఇష్టం. అయితే తటస్థంగా ఉండేవారు విషయాల్ని హేతుబద్ధంగా విశ్లేషించుకోగలిగేవారు కూడా అనాలోచితంగా మనువాదుల ప్రభావంలో పడి కొట్టుకొని పోకూడదని అనుకోవడంలో తప్పులేదు కదా?

ప్రగతిశీలంగా ఉన్నదా, లేదా?

విషయం ఏదైనా, ఏ కాలం నాటిదైనా, ప్రజాహితంగా ఉందా? ప్రగతిశీలంగా ఉందా? అని బేరీజు వేసుకోకుండా దేన్నీ ఒప్పుకోకూడదు. ఊరికే కల్పనల్లో, ఇతరుల భ్రమల్లో మనం పడి కొట్టుకుపోగూడదు. ఎందుకంటే గంగానది స్వచ్ఛత, పవిత్రత మనువాదుల రచనల్లో కనిపించడం తప్పితే, ఎప్పుడైనా మనకు కానీ, మన తాతలకు కానీ అందులో స్వచ్ఛజలాలు కనిపించాయా? అందువల్ల, వాస్తవాలు తెలుసుకోవడం, మాట్లాడుకోవడం ఆరోగ్యానికి మంచిది. తులసీదాస్ కు రాముడిపై విశ్వాసమున్నట్లే, తులసీదాసు గురించి కూడా కొన్ని విశ్వాసాలు జనంలో ప్రచారమయ్యాయి. భక్తి పేరుతో మూఢనమ్మకాలు తలకెక్కితే, ఎలాంటి భ్రమలు వ్యాపిస్తాయో గమనించండి. గంగానది ఒడ్డున సంకట్ మోచన్ గుడి ఉంది. అది ఆంజనేయుడి గుడి. ఆ గుడి ఉన్నచోటే తులసీదాసుకు ఆంజనేయస్వామి ప్రత్యక్షమైనాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పటికీ గంగ ఒడ్డున తులసీఘాట్ ఉంది. తులసీదాస్ ను వాల్మీకిమహర్షి అవతారంగా కూడా భావిస్తారు. వాల్మీకి రచించిన రామాయణానికి రామభక్తుడైన ఆంజనేయుడు పరవశించి – వాల్మీకి కలియుగంలో మళ్ళీ పుట్టిన రామకథను గానంచేసేట్లు వరం ఇచ్చాడనీ, అందువల్లనే వాల్మీకి మళ్ళీ తులసీదాసుగా పుట్టి, రామభక్తుడై, ‘రామ్ చరిత్ మానస్’ ను గానం చేశాడనీ మరోకథం ప్రచారంలో ఉంది.

వాల్మీకి అవతారంగా తులసీదాసు

ఈ విషయం భవిష్యోత్తర పురాణం – ప్రతి సర్గ పర్వం 4.20 లో ఉన్నట్టు నబదాస్ చెప్పాడు. ఈయన తులసీదాసు సమకాలికుడు. తులసీదాసును వాల్మీకి అవతారంగా భావించి, ఆ విషయాన్ని ఆరు చరణాల కవితగా రాసి ప్రచారం చేశాడు. కథల మాట, విశ్వాసాల మాట ఎలా ఉన్నా తులసీదాసు ఆలోచనలు ఎలా ఉండేవి? ఆయన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరించారో చూద్దాం. ఆయన జీవించిన కాలం చూస్తే అది భారతదేశాన్ని మొగలులు పాలించిన కాలం. అయోధ్యలో శ్రీరామచంద్రుడి భవ్యమందిరాన్ని కూలగొట్టి, ఆ స్థలంలో బాబ్రీమసీదు కట్టారని ఒక వాదన ఉంది కదా?

బాబ్రీమసీదు ప్రస్తావన ఏదీ?

మరి తులసీదాసు రచనల్లో ఆ రామాలయం గురించి ప్రసక్తి ఎందుకు లేదూ? దాన్ని కూలగొట్టడానికి కుట్రలు, కుతంత్రాలు జరిగితే అవి అన్నీ రామభక్తుడైన తులసీదాసు ఎలా ఓర్చుకున్నాడూ? నిజంగా ఆయన జీవించి ఉన్న కాలంలో అలాంటివి జరిగితే, ఆయన ఎక్కడో ఒక చోట వెల్లగక్కేవాడేకదా? మరి ఆయన రచనల్లో ఆ ఊసే లేదెందుకూ? ఆయనకు ముందూ వెనక తరాల్లో ఎవరూ కూడా ఆ భవ్యరామాలయం గురించి ఎందుకు రాయలేదు? మనకు ఉన్న ఎన్నో పుక్కిటి పురాణాల్లాగే ఈ అయోధ్య రామాలయం కూడా ఒక కట్టు కథేనని అనిపిస్తుంది. పైగా ఒక పథకం ప్రకారం బాబ్రీమసీదు కూల్చిన తర్వాత హిందూ దేవాలయ అవశేషాలు బయటపడాలి కదా? పడలేదు. బౌద్ధవిహారాలకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అదంతా వేరే విషయం!

దోహాలలో సామాజిక బాధ్యత ఎంత?

ఇక తులసీదాసు రచించిన దోహాలలో (కవితాపంక్తులలో) ఆయనకు ఉన్న సామాజిక బాధ్యత ఏ పాటిదో, అవి ఈ కాలానికి ఎంతవరకూ పనికొస్తాయో పరిశీలిద్దాం.

జోవర్న్ ధమ్ తేలీ కుమ్హారా!

స్వపచ్ కిరాత్ కౌల్ కల్వారా!!

(రామ్ చరిత్ మానస్ : పుష్ట్ 1029 దోహా: 129 ఛంద్: 1 ఉత్తరాఖండ్)

దీని అర్థం ఏమిటంటే తేలీ, కుమ్హారా, సఫాయి, కర్మచారీ, ఆదివాసీ, కౌల్, కల్వార్ మొదలైనవారంతా అత్యంత నీచవర్ణాలకు చెదినవారు.

అధమ్ జాతీమె విదూయపాయ్!

భయహూ తథా ఉన్హీ దూధ్ పిలాయ!!

(రామ్ చరిత్ మానస్ : పుష్ట్ 986 దోహా: 99 ఛంద్: 3 ఉత్తరాఖండ్)

పాముకు పాలుపోస్తే అది మరింత బలపడి విషం చిమ్ముతూ మరింత ప్రమాదకారి ఎలా అవుతుందో, నీచజాతివారికివిద్యనిస్తే వారు కూడా అలాగే విషయంచిమ్మతూ ప్రమాదకారులువుతారు.

అభీర్, యవన్, కరాత్, ఖల్!

స్వపచారీ అతీ అథరూప్ జో!!

(పుష్ట్ : 338 దోహా: 12 ఛంద్ : 2 అయోధ్యకాండ)

అభీర్ అంటే యాదవులు. యవన్ అంటే బయటిదేశాల నుండి వచ్చిన ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా ఆదివాసీలు, కర్మచారి మొదలైన వారంతా పరమపాపులు, నీచులు.

తులసీదాస్ సదా హరి చేరా!

కీజౌ నాథ్ హృదయ్ మహడేరా!! (40)

తులసీదాసు ఎల్లప్పుడూ శౌర్యవంతుడైన రాముడి దాసుడు. అందుకనిమీరు అతడి (తులసీదాసు) హృదయంలో నివాసముండండి. (పనిలో పనిగా ఇక్కడ తులసీదాసు తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.)

ఇంత కాలం ఎలా ఉన్నాయి?

కుట్రపూరితంగా రాసుకున్న ఇలాంటి గ్రంథాలు ఇంతకాలం దాకా ఎలా ఉన్నాయీ? అని ఎవరికైనా అనుమానం రావడం సహజం. అలా ఎందుకయ్యిందంటే కొంతమంది అగ్రవర్ణాలవారు తప్ప, మిగతతావవారెవరూ ఆ గ్రంథాలు చదవడానికి వీలయ్యేది కాదు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా దేశంలో విద్యావంతుల అతి కొద్దిమందే ఉండేవారు. ఆ పవిత్ర మతగ్రంథాలు దేవుడిచ్చివనని అబద్ధాలు చెప్పి, సమాజంలోని అధిక సంఖ్యాకులకు దూరంగా ఉంచారు. పొరపాటున ఎవరైనా చదవడానికి ప్రయత్నిస్తే – వారి నాలుకలు కోసేవారు. దేశంలోని అధిక సంఖ్యాకులు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిపోవడానికి అగ్రవర్ణాల కుట్రే కారణం! దేవుణ్ణీ, భక్తినీ, పునర్జన్మల్నీ అలాగే సంస్కృత భాషనీ కాపాడే కర్తవ్యం కేవలం తమదేనని మిగతావారిమీద ఆదిపత్యం సాగించారు. ఇంకా సాగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

సంస్కృతం అదృశ్యం కావడానికీ వారే కారకులు

బ్రిటీషు కాలంలో విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్ల, పవిత్ర గ్రంథాల కుట్ర బయటపడుతూ వచ్చింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే బౌద్ధాన్ని, బౌద్ధగ్రంథాల్నీ, పాళీ భాషను నాశనం చేసి – వైదిక ధర్మాన్ని, సంస్కృతాన్ని నిలబెట్టాలనుకున్న హిందూ అగ్రవర్ణంవారు, దేశంలో సంస్కృతం వినిపించకుండా పోవడానికి కారకులయ్యారు. ‘పామరులు’ నేర్చకుని ఎక్కడ తెలివిమీరుతారోనని విద్యను దాచిపెట్టుకున్నారు. మరో పక్క  దేశంలో మొగలు, బ్రిటీష్ పరిపాలన సాగడంతో ఉరుదూ, ఫారసీ, హిందీ, అరబిక్, ఇంగ్లీషు భాషలు వ్యాప్తి చెందాయి. వారి మతాలు కూడా వ్యాపించాయి. సంస్కృతం బ్రాహ్మణుల మంత్రాల్లో తప్ప ఎక్కడా వినిపించకకుండా పోయింది. ప్రజాస్వామ్య భావన లేకపోవడం వల్ల భాషలు కూడా నాశనం అవుతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ! ఇప్పుడు మళ్ళీ సంస్కృతాన్ని బతికించడానికి మనువాద పాలకులు వ్యర్థప్రయత్నాలు చేస్తూ ఉండటం హాస్యాస్పదం.

అవి ఆకాశం నుంచి ఊడి పడలేదు

‘‘దేవుని వాక్కులుగా ప్రచారం పొందుతున్న గ్రంథాలు ఆకాశం నుంచి ఊడిపడలేదు. అవి మన పూర్వీకుల అసమగ్ర జ్ఞానఫలితం,’’ అని అన్నారు రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ – స్వేచ్ఛాలోచన కోసం కృషి చేసిన అమెరికన్ రచయిత. తులసీదాసా, సూర్ దాసా ఎవరైనా కావొచ్చు. ప్రగతిశీల భావాలతో ఉన్నవారినే ఈ తరం స్వీకరిస్తుంది. వదిలేయాల్సివస్తే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంది. అంతే!!

(ఏప్రిల్ 21 శ్రీరామనవమి)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles