Friday, April 26, 2024

శనీశ్వర పూజతో అంతా శుభమే

శివ కేశవులకు ప్రీతి పాత్రం శని త్రయోదశి

“నీలాంజన సమాభాసం ! రవిపుత్రం యమాగ్రజం; 

ఛాయా మార్తాండ సంభూతం ! తం నమామి శనైశ్చరమ్” !

భారతీయుల జ్యోతిషశాస్త్రం ప్రకారం ‘శనీశ్వరుడు’, నవగ్రహాలలో ఒక గ్రహం. సూర్యుడు, చంద్రుడు, ఛాయా గ్రహాలైన రాహువు,  కేతువులతో కలిపి గ్రహాలు తొమ్మిది. గగన మండలంలో ఉన్నగ్రహాలకు భూమితో సంబంధం ఉంది. కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం భూమి మీద, భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవుల పైన, నిర్జీవ, జడ, నిర్లిప్త వస్తువుల మీద వుంటుంది. నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం ఇందుకు బిన్నం కాదు. శని, శనిగ్రహం, శనేశ్వరుడు, శనీశ్వరుడు, అని పలు నామములతో పిలువబడి, గ్రహ రూపంలో పూజింపబడే ‘శని’ ఒక గ్రహదేవుడు. వారంలో ఏడవవారం శనివారం.

సూర్యుడిని చుట్టడానికి 30 ఏళ్ళు

శనివారానికి అధిపతి శనేశ్వరుడు. శనికి మంద గమనుడు అని కూడా పేరు. శనయే క్రమతి , అనగా అతినెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టి రావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానైస్కర్య, అసిత, సప్తర్చి, క్రూరదృష్ట, క్రూర లోచనుడు, పంగు పాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి.సంఖ్యలలో ‘ఎనిమిది’ శనికి ప్రీతికర మయిన సంఖ్య. ఛాయదేవికి పుట్టిన సంతానం శనిదేవుడు. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించ డానికి ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది.

శనికి విశిష్టమైన స్థానం

దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అన్న. యముడు మరణానంతరం దండనలు విధిస్తే, శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. శనీశ్వరుడు గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మరాశి నుండి లగ్నశని, మూడు, ఏడు, పదవ స్థానాలపై శనిదేవుని ప్రభావం పడితే అనేక ఇబ్బందులను కలిగిస్తాడు.

హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుని కుమారుడైన శని.. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అంతే కాకుండా ఈయన శని గ్రహానికి రాజు. శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడు.కోవడానికి శని దేవున్ని  ప్రసన్నం చేసుకోవాలి. అంటే తైలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి.

వినాయక జన్మవృత్తాంతం

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు, వినాయకుడు జన్మించాడు. సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికి వచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు, మునులు కనులార చూసి, దీవెనలు అందించి, పార్వతీ దేవికి మోదం కలిగించారు. శని భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి, ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శనీశ్వరుడి సదుద్దేశం తెలుసు కోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపు తున్నాయి.

విక్రమాదిత్యుడికి శాపం

శని భగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాస మాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించి నందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయ బడ్డాడు. చివరికి, విసిగి వేసారి పోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు.   హనుమంతుడు శని దేవుడి లోని   ఓంకారాన్ని నాశనం చేసినప్పుడు ఆయన శరీరంపై మచ్చలు గాయాలు అయినాయి. ఆ నొప్పి పోయి, సున్నితంగా తయారవ డానికి, హనుమంతుడు ఇచ్చిన నూనె సాయపడింది. 

నువ్వులనూనెతో అభిషేకం

శని దశ దుష్ప్రభావాలతో బాధపడేవారు, భక్తితో శని దేవునికి నూనె సమర్పిస్తే చెడు ఫలితాలు పోతాయని విశ్వాసం. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయడం. శని దేవతను ప్రతిబింబించే నల్ల వస్తువులను… నల్ల ధాన్యాలు, నల్ల మినప్పప్పు, నల్ల నూనెలు, నల్ల ఆవులు, నల్ల బట్టలు, నల్లని గొడుగు మొదలైనవి దానం చేస్తే చెడు ప్రభావాలు తొలగి పోతాయి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి.  చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇస్తే శని సంతుష్టుడై ఉంటాడు.

చెడు కర్మ ఫలితం తొలిగిపోతుంది

శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో సూర్య దేవుడి కుమారుడైన,  శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. శనివారం  ఉపవాసం ఉండి, శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. శని మనిషి చేసిన చెడు కర్మ ఫలితాన్ని తొలగిస్తాడు. జాతక రీత్యా శని పన్నెండవ ఇంట, ఒకటవ  ఇంట, రెండవ ఇంట సంచరిస్తున్నప్పుడు, దానిని “ఏలినాటి శని” లేదా “సాడే సాతి” అంటారు. అలాగే శని నాలుగవ ఇంట, ఎనిమిదవ యింట సంచరిస్తున్నప్పుడు కూడా చెడు ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ సమయంలో శని ఇచ్చే ఫలితం తాత్కాలికంగా చెడు అనిపించినా,  అది ఆ వ్యక్తి  భవిష్యత్తుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఉదాహరణకు ఏ పని లేకుండా, ఖాళీగా తిరుగుతున్న వ్యక్తికి, ఉద్యోగం వస్తే, అది బద్ధకస్తుడు అయిన వ్యక్తికి మొదట కష్టంగా తోచినా, అది మంచి భవిష్యత్తును ఇస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఆ కష్టం యొక్క విలువ తెలుస్తుంది. మనం పూర్వ జన్మలో చేసిన పాపాల ప్రయత్నాన్ని కష్టాల రూపంలో శని ఈ సమయంలో తొలగిస్తాడు. తద్వారా ఆ వ్యక్తి కి మంచి భవిష్యత్తు కలుగుతుంది.

పరోపకారం శుభదాయకం

మనం ఎంత కష్టం చేస్తే శని అంతా సంతృప్తి చెందుతాడు. కాబట్టి  జాతకంలో కానీ, గోచారంలో కానీ, శని అనుకూలంగా లేని వ్యక్తులు శారీరకంగా కష్ట పడటం, అంటే ఇతరులకు సహాయం చేయడం మొదలైనవి చేస్తే ఆ చెడు ఫలితం తగ్గిపోయి శుభ ఫలితాలను శని ఇస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.  క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలా హలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లబిస్తుంది.  ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles