Tuesday, April 30, 2024

బాలసాహిత్యంలో ధృవతార అవసరాల రామకృష్ణారావు

ప్రముఖ సాహితీవేత్త, నవలా రచయిత. తెలుగు సాహిత్యం బతికి బట్ట కట్టినంత కాలం గుర్తుంచుకునే కథాకురు పితామహుడు ఆయన. 1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామ కృష్ణారావు కు బాల సాహిత్యంలో అజరామరంగా నిలిచిన చందమామతో ఆయనకు గల బంధం, అనుబంధం విడదీయరానిది.ఏడు పదుల ఏళ్ళ కిందట తన 15 సంవత్సరాల  తొలి సంధ్య లో చందమామ 1947 జూలై – సంచికలో ”పొట్టిపిచిక కథ’’ తో  ప్రారంభించింది మొదలు మలి సంధ్యలో 80 ఏళ్ళ వయసు వరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన విశిష్ట కథా రచయిత .

పొట్టి పిచిక కథ

పొట్టి పిచిక కథ ప్రారంభ, ముగింపులు ఇలా ఉంటాయి. అనగా అనగా ఓ వూర్లో ఒక పొట్టి పిచిక వుండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది. చేసుకుని, చింత చెట్టుమీద కూర్చుని, ఆపిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ, తింటూ ఉంటే, చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు ఈగ ఏం చేసింది? వెంటనే వెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని  కొట్టాడు. అవ్వకు ఒళ్లు మండి పిల్లి మీద వేడి పాలోసింది, పిల్లి కోపం కొద్దీ ఎలక వెంటపడింది. ఎలక భరించలేక బోయ చెప్పులు కొరికింది. బోయనకోపం  తీర్చుకోడానికి లేళ్ల కాళ్లను విరగకొట్టేడు. లేళ్లు కోపంతో   రాజుగారి తోటను పొడుచేశాయి. రాజు ఆగ్రహం కలిగి వడ్రంగిని శిక్షించేడు.  వడ్రంగి చచ్చినట్టు చెట్టును నరికి, తొర్ర తవ్వి చీమ తలకాయంత రొట్టె ముక్కను చేతిలో పెట్టాడు. పిచిక మళ్లీ ఎగవేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.

అద్భుతమైన సందేశం

ఒక చిన్న ప్రాణి, తాను కష్టపడి సంపాదించుకున్న చిన్న రొట్టె ముక్కను పోగొట్టుకుని, ఎవరి సాయం పొందక పోయినా, పట్టిన పట్టు విడువని చిన్ని జీవి నైజం, చివరకు అనుకున్నది సాధించిన వైనంకు సంబంధించిన కథ ఇది. ‘పొట్టి పిచిక కథ’ రచనే తన విజయసూత్రం అవుతుందని ఆనాడు, ఏనాడూ అనుకోలేదని  చెప్పేవారు. పదిహేనేళ్ల ప్రాయంలో రాసిన ఈ కథ ఇచ్చే సందేశం నిజంగా అద్భుతం.

వెయ్యికి పైగా రచనలు చేసి,  తల వంచక, కలం దించక తెలుగు కథకుడిగా కొనసాగిన సుదీర్ఘ సాహితీ వ్యాసంగంలో  పక్షులతో జంతువులతో మనుషుల్ని కలిపి సామాజికాంశాల్ని అలవోకగా కథా వస్తువులుగా చేసు కోవడానికి చందమామ పత్రికనే భూమిక అని చెప్పేవారు.

ఇంగ్లీషు బోధన, తెలుగు రచన

చందమామ కథ ఇచ్చిన ఊపుతో తాను రాసిన సుప్రసిద్ధ పిల్లల రచనల్లో ‘కేటూ డూప్లికేటూ,’ ‘మేథమేట్రిక్స్,’ మూడు భాగాలూ, ‘ఆంగ్రేజీ మేడీజీ,’ ‘ఆంగ్రేజీ యమఈజీ’ వంటి అరడజను రచనలు భాగమని కూడా ఆయన ఘనంగా చెప్పుకున్నారు. తెలుగులో నవలలు, కథలు వెయ్యికి పైగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించారు. ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పని చేశారు. విశాఖ పట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు. వృత్తి జీవితమంతా ఆంగ్ల భాష బోధించినా, తెలుగు భాష పై ఉన్న  మమకారంతో దశాబ్దాల  కాలంలో వెయ్యికి పైగా రచనలు మాతృ భాష లోనే చేశారు.

ఆధునిక సమాజం తెస్తున్న మార్పుల్లో కొన్నింటికి దూరంగానే ఉన్నానని అంగీకరించారు. తను పాటించే నీతికి  విరుద్ధమని తోచిన సందర్భాలలో, ప్రచురణకు పంపకుండా ఎన్నో రచనలను ఆయన ఆముద్రితంగా ఉంచుకున్నారు. “మనం మనుష్యులం,  సహజీవన సౌభాగ్యం, ఇంకానా అంతరాలు?,  అడుగో మావయ్య, ఆ వెనకే మేరీ,  సంపెంగలూ, సన్న జాజులూ,  మేం చేసిన తప్పు మీరూ చేస్తారా?, అది ప్రశ్న, ఇది జవాబు, హెడ్మిస్ట్రెస్ హేమలత, పేక ముక్కలు, కథావాహిని, గణిత విశారద, కేటూ, డూప్లికేటూ, అర్ధమున్న కథలు, రామచిలుక, మోహనరాగం, మేథమే ట్రిక్స్-1, మేథ మేట్రిక్స్-2,  మేథమే ట్రిక్స్-3,  అంగ్రేజీ మేడీజీ” తదితర రచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం (1969),  తెలుగు విశ్వ విద్యాలయం హాస్య రచయిత పురస్కారం (1994),  జ్యేష్ఠ లిటరరీ అవార్డు ( 1998), కొలసాని చక్రపాణి అవార్డు (1999), ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం (2000), ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం (2004) తదితర అవార్డులు, పురస్కారాలు ఆయనకు లభించాయి. చందమామకు తన చివరి కధలు పంపి, బాల సాహిత్యానికి తన అవసరం తీరిందనుకున్నారేమో,  అవసరాల 2011, నవంబర్ 28 న హైదరాబాదులో  తుది శ్వాస విడిచి, ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

(డిసెంబర్ 21…అవసరాల రామకృష్ణారావు జయంతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles