Sunday, May 26, 2024

జగన్ కేలండర్ @ 2021

ఏ.పి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి డైరీ పేజీల్లో ‘సర్పరైజ్’ లు ఇంకా ఎన్ని వున్నాయోగాని, కొంచెం దగ్గరగా గమనిస్తే మాత్రం అవి ఆసక్తికరంగా మాత్రం ఉంటున్నాయి. వచ్చే జూన్ నాటికి మూడవ ఏటికి చేరువవుతూ, ఆయన ఆఫీస్ 2020లో వొక ‘కేలండర్ ఇయర్’ ను పూర్తి చేసుకుంది. దాంతో కొత్త దశకం పరిపాలనలోకి చప్పుడు లేకుండా ఆయన కొత్త తలుపులను తెరుస్తున్నారు. అయితే వారం వారం అవి సమాచార శాఖ విడుదల చేసే పత్రికల ముఖచిత్ర ప్రకటనల్లో కనిపించేవి కాదు. వాటికోసం మనం వెతకాలి.

లోపలి పేజీ వార్తలు:

ఒక్కోసారి అవి, దినపత్రికల బ్యూరోలు తమకు తాము సేకరించిన సమాచారంతో రాసుకునే లోపల పేజీ వార్తలుగా ఉంటున్నాయి. అయినా ఈయనకు ఇప్పుడు కొత్త అడుగులు ఎలా కుదురుతున్నాయి? ఇది మనకు కలిగే అనుమానం. అందరూ ‘పెండమిక్’ 2020 ని కష్టాల ఏడాదిగా చూస్తుంటే, జగన్ మాత్రం రాజకీయ అవరోధాల నుంచి గట్టెక్కిన ఏడాదిగా దీన్ని మలుచుకున్నారు. ఆ ‘డ్రైవ్’ వల్ల ఇప్పుడాయన కొత్తతరం ‘లీడర్’ గా జాతీయ స్థాయిలో చెలామణి లోకి వచ్చేసారు! దేనికైనా ‘టైమింగ్’ తెలిసిన వాళ్ళే ఇటువంటివి చేయగలరు.

ఇది చదవండి: సీఎం జగన్ బర్త్ డే- అభినందనల వెల్లువ

కొత్త అడుగులు ఎటు?

కొత్త అడుగులు ఎటు? ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తావించవలసి వచ్చినప్పుడు, ఉత్తరాదివారు దాన్ని ‘ఆంధ్ర’ అనడం తెలిసిందే. మొదటినుంచి అందుకున్న కారణాలు ఇప్పుడు మళ్ళీ మనం వల్లె వేసుకునే అవసరం ఏమీలేదు. అయితే, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ‘ఏ.పి.’ విషయంలో ఈ ‘ఆంధ్ర’ దృష్టి కానీ… ‘ఆంధ్ర’ పిలుపులో కానీ మార్పు ఇంకా మొదలు కాలేదు. వొక పేరుతో పిలవడం అలవాటు అయ్యాక, ఆ ‘పేర్లు’ సాధారణంగా మారవు, అవి అలాగే వుంటాయి. అయినా వాటికి అతి ప్రాధాన్యత ఇచ్చి కూడా చూడనక్కరలేదు. అయితే, అయాచితమైన ఆ పేరును కొందరు ‘ప్రివిలేజ్’ గా చెప్పుకోవడం, పరపతిగా దాన్ని ‘మార్కెటింగ్’ చేయడం సమస్య అవుతుంది. మన జాతీయ బ్యాంకులకు కూడా ఈ విషయం ఆలస్యంగా తెలుస్తున్నది. అయినా నీళ్ళలో వున్న గేదెను కొమ్ములు చూపించి బేరం పెట్టడం, అనే సామెత ఊరూరా చెరువులు వున్న ప్రాంతంలోదే! ఇటువంటి ‘హెరిటేజ్’ మనకు మొదటి నుంచి ఉన్నప్పటికీ, ఎటొచ్చీ విభజన తర్వాత చెరువులో నీళ్ళు తగ్గడమే సమస్య అయింది!

సరైన టైమింగ్:

పాలకునికి సున్నితమైన అంశాల్ని గమనించే దృష్టి వున్నప్పుడు, ఇటువంటివి ‘అడ్రెస్’ చేయబడతాయి. అయితే, అది ఏ నిర్ణయం, దాన్ని తీసుకుంటున్న ‘టైమింగ్’ ఏమిటి …కారణంగా జగన్ ‘కేలండర్’ ఇప్పుడు ప్రత్యేక ప్రస్తావన అవుతున్నది. దీని నేపధ్యం కోసం వొకసారి వెనక్కి చూస్తే, మెడ్రాస్ నుంచి 1956 లో మనం విడిపోయాక, తొలుత కర్నూలు రాజధాని అయినా, అప్పటికీ ఇంకా రాష్ట్రం ‘బరువు’ తూర్పు వైపుకే వొడ్డిగిలి వుండేది. దాన్నే కొందరు కృష్ణా-గుంటూరు ‘డామినేషన్’ అని ఇప్పటికీ అంటుంటారు.

ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వేకి సీఎం శ్రీకారం

దళిత చైతన్యం పదిలం:

కావాలంటే చూడండి, చివరిలో అయినా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనే ఆశతో, ఏడాది తర్వాత కూడా మొదటి నుంచి వున్న ‘ప్రివిలేజ్’ పోకూడదని, ‘అమరావతి పరిరక్షణ ఉద్యమం’ పేరుతో, కొనసాగుతున్న ఆందోళన తీరు! ఇటువంటివి ఇక్కడ ఎలా సాధ్యం అవుతున్నది అంటే, ఆ పక్కనే వెలగపూడిలో ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డుకు పెట్టే ‘ఆర్చి’ పైన ఎవరి నాయకుడి పేరు ఉండాలి? అని తలలు పగల కొట్టుకునే దళిత చైతన్యం ఇంకా ఇక్కడ పదిలంగా వుంది కనుక! అన్ని రకాల ‘షోకేసింగ్’ లు పక్కపక్కనే నడుస్తూ వుంటాయి!

మూడవ ఏడాది డైరీ:

సరిగ్గా ఈ సమయంలో, జగన్ మూసి ఉంచిన తన ‘మూడవ ఏడాది డైరీ’ పేజీలు తెరవడం మొదలు పెట్టాడు. కొత్త ‘క్యాలెండర్’ మీద కాలిక లక్ష్యాలు ‘మార్క్’ చేస్తూ, పూర్తిగా తూర్పు వైపుకు వొడ్డిగిల్లిన రాష్ట్రం ‘బరువు’ ను దశల వారీగా సరిచేస్తున్నాడు. అందుకోసం, మొదటి నుంచి తేలిపోయిన పడమర వైపున వొక్కటొక్కటిగా బరువులు పెంచుతూ, చారిత్రిక తేడాలను సమం చేస్తున్నాడు. అందుకు రెండు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ సరిహద్దును పంచుకొంటున్న కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎంపిక చేసుకొని కొత్త పెట్టుబడులను అటు తరలిస్తూ, పూర్తిగా వొక వైపుకు వొడ్డిగిల్లిన రాష్ట్రాన్ని ‘బ్యాలెన్స్’ చేసే పని మొదలుపెట్టాడు. ఇప్పటికే స్థిరపడిన బెంగుళూరు హైదరాబాద్ నగరాల ‘వృద్ది’ ద్వారా మనవద్ద రెవెన్యూ పెంచే విధంగా ఈ ‘ప్లానింగ్’ కనిపిస్తున్నది.

ఇది చదవండి: కార్పొరేషన్ల వ్యవస్థ ప్రక్షాళన అవసరం : సీఎం జగన్

చంద్రబాబుకు థాంక్స్ చెప్పాలి:

రాజకీయాల్లోకి రాకముందు, జగన్ – మొదటి ఫేజ్ ఆర్ధిక సంస్కరణల కాలంలో వాణిజ్య రంగంలో చురుగ్గా వున్నవాడు. ఆ నేపధ్యంతోనే మొదటి రెండేళ్ళు కాలాన్ని వొకందుకు, ఆ తర్వాతి కాలాన్ని మరొకందుకు ముందుగానే ‘ప్లాన్’ చేసినట్టుగా ఉంది. అయితే వొక విషయం ఇక్కడ విధిగా ప్రస్తావించాలి. జగన్ కానీ అంతకు ముందు ఆయన తండ్రి గానీ ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది – చెంద్రబాబుకు. ఆయన ‘డ్వాక్రా’ మహిళల్ని ‘గ్రూప్ ఓటర్స్’ గా సంఘటితం చేసి, వీరి చేతికి అప్పగించాడు. అది – యూ.ఎన్.డి.పి. మన దేశంలో మొదలుపెట్టిన గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం. అప్పుడే సి.ఎం. అయిన బాబుకు అది కలిసి వచ్చింది. అయితే, 2004 నాటికి ఈ ‘గ్రూప్ ఓటర్స్’ కు పెద్ద వై.ఎస్. ‘ఇందిరమ్మ’ సెంటిమెంట్ జోడిస్తే, పదేళ్ళలోనే చిన్న వై.ఎస్. నేరుగా వాళ్ళను నా ‘ఫ్యామిలీ’ అంటున్నాడు! పైగా జగన్ కొత్త జెనరేషన్ లీడర్ కావడంతో, తన ప్రభుత్వంలో మున్ముందు విస్తరించే ‘వృద్ది రంగం’ కోసం అవసరమైన మానవ వనరును ఇప్పటి నుంచే ‘డ్వాక్రా’ మహిళల పిల్లల్లో వెతుకుతున్నాడు. వారూ అతన్ని ‘మావయ్య’ అంటున్నారు.

బ్యాలెన్సింగ్ యాక్ట్:

అయితే అదొక పార్శ్వం, అందుకు ప్రచారం అవసరం, దాని వల్ల నాయకుడి పట్ల సానుకూలత ఏర్పడుతుంది, అయినా ఇవేవీ కొత్తవి కావు. కానీ, జగన్ కొత్తగా ‘బ్యాలెన్సింగ్’ కోసం ఇప్పటి వరకు ఎటువంటి ‘బిగ్ మనీ’ పెట్టుబడులకు నోచుకోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, ‘ప్రైవేట్ ప్లేయర్స్’ తో కొత్త ప్రాజెక్టులు ‘ప్లాన్’ చేస్తున్నాడు. చేస్తున్న వీటిలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ‘ప్రాంతీయ’ ‘సామాజిక’ రంగులు వుండవు. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, వీటిలో క్రియాశీలంగా వుండే ‘బిజినెస్ ప్లేయర్స్’ కు కులాలు వుండవు! అందుకని ఇప్పటికే, ఈ యువ సి.ఎం. మూడవ ఏడాది కల్లా తన ‘జెనరేషన్ ఇన్వెస్టర్లు’ ను రంగంలోకి దించుతూ, ఇకముందు కొత్త పెట్టుబడులు, ‘నెక్స్ట్ జెన్ ఏరియాస్’ అన్నట్టుగా కొత్త రంగాల వైపుగా అడుగులు వేస్తున్నాడు.

ఇది చదవండి: ‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’ ప్రారంభించిన సీఎం జగన్

చంద్రబాబు శైలికి రిఫైన్డ్ వర్షన్:

జగన్ పని శైలి పొరలను తొలగించి దాని లోతుల్ని గమనిస్తే అక్కడ మనకు చెంద్రబాబు ఛాయలు కనిపించక మానవు. అయితే, జగన్ శైలి అందుకు పూర్తిగా ‘రిఫైన్డ్ వెర్షన్’. ఐదేళ్ళ క్రితం మన సరిహద్దుల్లో వున్న బెంగుళూరు వంటి నగరాలను బాబు ‘గ్రోత్ ఇంజన్లు’ గా గుర్తించి, వాటికి సమీపాన అనంతపురం జిల్లాలో ‘కియా’ కార్ల కంపెనీకి ప్రభుత్వం అన్ని వసతులు ఇవ్వడం దీనికి మొదటి దశ. జగన్ ఇప్పుడు దానికి అనుబంధ ‘సర్వీసులు’ ప్రతిపాదించి, వాటిని పక్కనున్న కర్నూలు జిల్లా వరకు విస్తరించడం రెండవ దశ. అయినా చంద్రబాబువి ఇంకా పాత పరిమితులు. వొక దశ దాటి అవి ‘టేకాఫ్’ తీసుకోలేవు. జగన్ విషయంలో ‘కియా’ దగ్గరగా గమనిస్తే, వొక్క ‘అమరావతి’ని మూడుగా చేయడం అనే ‘ఫార్ములా’ ఇక్కడా కనిపిస్తుంది!

కార్ రేస్ ట్రాక్ నిర్మాణం:

అయినా అది రాజకీయం కనుక అది పెద్ద పంచాయతీ అయింది. కానీ, ఇది ‘బిగ్ మనీ’ వ్యవహారం. ఇటువంటివి పత్రికల్లో కనీసం మొదటి పేజి వార్త కూడా కావు! ఇప్పుడు ‘ఎఫ్-త్రీ’ కార్ రేస్ ట్రాక్ నిర్మాణ పనులు అనంతపురం జిల్లాలోని కదిరి వద్ద 220 ఎకరాల్లో శరవేగంగా జరుగుతున్నాయి. ఇది గత ప్రభుత్వంలో కాయితాల్లో ఆగిపోయిన ప్రాజెక్టు. డిల్లీ వద్ద నోయిడా, చెన్నై, తర్వాత మనదేశంలో ఇది మూడవది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు 110 కి.మీ. దూరంలో వున్న ఈ కార్ రేస్ ట్రాక్ పక్కన ఇక ముందు గోల్ఫ్ కోర్ట్స్, ఎమ్యూజ్మెంట్ పార్క్స్, రెస్టారెంట్స్, గెస్ట్ హవుస్, హాస్పటల్, అటో టెస్టింగ్ ఫెసిలిటి, రాబోయే 18 నెలల్లో 40 గదుల ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ సిద్దం కాబోతున్నది.

ఇది చదవండి: చంద్రబాబు సవాల్ కు వైసీపీ ప్రతిసవాల్

అర్థవంతమైన అభివృద్ధి:

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, హైదరాబాద్-బెంగుళూరు; చెన్నై-బెంగుళూరు; ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మన రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలలో నుంచి ఉత్తర దక్షణాలుగా ప్రవేశించి అనంతపురం మీదుగా పశ్చిమాన వున్న బెంగుళూరు వైపుకు వెళుతున్నాయి. రేపు ఈ రెండు సర్క్యూట్స్ మీద – కొప్పర్తి ఎలక్ట్రానిక్ హబ్ (కడప) జమ్మలమడుగు స్టీల్స్ (కడప) వోర్వకల్లు విమానాశ్రయం (కర్నూలు) ట్రక్ టెర్మినల్ (అనంతపురం) మీద వీటి ప్రభావం ఉంటుంది. ఇప్పటికే వీటి పక్కన ప్రభుత్వం టూరిజం సర్క్యూట్స్ నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టింది, పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ బాబు హయాంలో అనంతపురంలో విస్తరించిన పండ్ల తోటల దిగుబడికి, ఇప్పుడు కొత్తగా ‘కిసాన్ రైల్’ సదుపాయం జోడించి; మన పండ్లు, కూరగాయలు డిల్లీ మార్కెట్ కోసం నిజాముద్దీన్ స్టేషన్ కు ఎగుమతి చేసిన వైనం చూసే, బాబుకు జగన్ – ‘2021 ఎడ్వాన్స్డ్ వెర్షన్’ అంటున్నది.

నిశ్శబ్ద వికేంద్రీకరణ:

‘బ్యాలెన్సింగ్’ అన్నందుకు అనంతపురం-బెంగుళూరు జాతీయ రహదారి నెంబర్ 44, పక్కన 25 ఎకరాల్లో ఏ.పి.ఐ.ఐ.సి. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ విధానంలో రూ.100 కోట్లతో ట్రక్ టెర్మినల్ నిర్మాణాన్ని చేపట్టింది. జనవరి మొదటి వారం టెండర్ ప్రక్రియ మొదలు అవుతుంది. ఇంత ముమ్మరంగా మొదలయిన ఈ రాయలసీమ ప్రాజెక్టుల వద్దకు రేపు పెట్టుబడులతో వెళ్ళేది ఎవరు? ఇది నిశబ్ద వికేంద్రీకరణ కాదా! వికేంద్రీకరణకు వున్న పార్శ్వాలు అన్నీ వాస్తవ దృష్టితో చూసినప్పుడు మనకు ఇవి కనిపిస్తాయి. వికేంద్రీకరణను ఇప్పుడు రాజకీయంగా తప్పుపట్టినా, దాని వాణిజ్య ప్రయోజనాలు వద్దకు వచ్చేసరికి, మళ్ళీ రేపు ముందు వరసలో ఉండేది ఇప్పుడు దాన్ని తప్పుపడుతున్నవాళ్ళే! ‘జగన్ కేలండర్@2021’ అతని విమర్శకులకు వాగ్దాన పూరితంగా ఉంటే, అది – ‘నీరు పల్లమెరుగు…’ వంటి పాత నానుడి తప్ప అందులో కొత్తదనం ఏమీ లేదు.

ఇది చదవండి: సుప్రీంలో జగన్ సర్కార్ కు ఊరట

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

1 COMMENT

  1. కర్నూలు ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు, అనంతపురం నుంచి ‘కియా’ విస్తరణ అంటే కార్ల అమ్మకాల షోరూం తెరుస్తారా? కార్లను దాచే గోడౌన్లు ఏర్పాటు చేస్తారా? ఆల్రెడీ NH44 మీద వెల్దుర్థి సమీపంలో ఒక కియా షోరూం ఓపెన్ అయ్యింది. ఇక ఎయిర్ పోర్టు పాతవిషయమే… మీరు ప్రస్తావించిన అంశాలను బట్టికొత్త క్యాలెండర్ లో కర్నూలు పేజీలు పాతవే సార్..👏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles