Tuesday, April 30, 2024

జంతు సంరక్షణ సామాజిక బాధ్యత

భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జంతువులూ ఉన్నాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ చెబుతోంది. జీవం నుండి జీవం రావడం మాత్రమే కాదు. ఒక జీవ జాతి అదే జీవ జాతి నుండి మాత్రమే ఉత్పన్నం అవుతుంది. కుక్కలకి కుక్క పిల్లలే పుడతాయి. పిల్లులకు  పిల్లి కూనలే పుడతాయి. అలా పెంపుడు కుక్కల జాతి ప్రపంచంలోనే పురాతనమైన జాతిగా, క్రీ.పూ 329 నాటిదని,  జాతి  సంవత్సరాల నాటిదని, పెంపుడు పిల్లుల జాతి, 9,500 సంవత్సరాల నాటిదని రుజువు పరచడం సామాన్య మైన విషయమేమీ కాదు…ప్రసుతం భూమి వయసు 4.6 బిలియన్ల (4,600,000,000) సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. భూమి మీద జీవావిర్భావం 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగిందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అత్యంత పురాతనమైన శిలాజాలు 60 కోట్ల ఏళ్ళ నాటివని, కాని అత్యంత పురాతనమైన శిలాజాల వయసు కన్నా భూమి వయసు ఏడు రెట్లు పైగా ఉంటుంద ని పరిశోధనలు తేల్చి చెపుతున్నాయి.  కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన బృహత్తర జీవాలకి చెందిన శిలాజాలు కూడా  ఉన్నాయి. అవి సరీసృపాలు (నేల మీద పాకే జంతువులు). మనకు తెలిసిన మొసళ్సు, బల్లులు మొదలైనవి ఈ కోవకి చెందినవే. కాని అంతకన్నా పెద్దవి, అంతకన్నా పెద్దవైన అతి ప్రాచీన యుగాలలో జీవించిన బృహత్తర సరీసృపాలే నేడు మనం అంతగా చెప్పుకునే డైనోసార స్ లు.

కనుమరుగవుతున్న జంతుజాతులు

అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు క్రమేపీ కనుమరుగు అవుతున్నాయి. చాలా జాతులు  ఇప్పుడు లేవు. ఆధునిక యుగంలోనూ మనకు తెలిసిన ఎన్నో జంతు జాతులు చూస్తుండగానే భూమికి దూరం అవుతున్నాయి. ఇలా జంతువుల జాతులు అంతరించి పోకుండా, వాటిని పరిరక్షించడమే ‘ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం’ ముఖ్యోద్దేశం. జంతు సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసిన సాధు టి.ఎల్‌.వాస్వాని జయంతిని పురస్కరించుకొని వివిధ జంతు సంక్షేమ సంస్థలు ప్రతి సంవత్సరం నవంబర్‌ 25న జంతు సంక్షేమ దినం జరుపు కుంటాయి.

జంతువుల ఆవాసాలను ధ్వంసం చేస్తున్న మనిషి

వాస్తవానికి మనం జంతువుల ఆవాసాలను నాశనం చేస్తున్నాం. విచక్షణారహితంగా అడవులు నరుకుతూ వాటి తావులను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. అందుకే అడవి జంతువులు గ్రామాల్లొకీ, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు కూడా  చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు సంక్షేమ దినోత్సవం లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం ప్రధానం.

అటవీ ప్రాంతాలను అన్యాక్రాంతం చేస్తుండడంతో స్వేచ్ఛగా తిరుగాడే జంతు జాలానికి రక్షణ కరువైంది. శతాబ్దాల నుంచి మనుషుల దాడులు, వేటల నుంచి తప్పించుకుంటూ అడవులలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని జీవించిన జంతు జాలానికి నేడు తమ ఉనికిని కాపాడు కోవడమే కష్టమవుతున్నది. మాంసం కోసం, వినోదం కోసం మానవులు అనేక రకాలుగా జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. తమ వృత్తులకు, అవసరాలకు జంతువులను ఉపయోగించుకుంటూ వాటిని హింసిస్తున్నారు. ఆవు, మేక, గేదె మొదలైన జంతువులు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం రసాయనాల ఇంజెక్షన్లు ఇస్తూ వాటిని హింసించడం సర్వ సాధారణం అయిపోయింది.

వన్యప్రాణుల సంరక్షణ చట్టం

వాస్తవంగా ఇందుకు సంబంధించి పార్లమెంటులో చట్టం రూపొందింది. ఈ చట్టం ప్రకారం జంతువులను ఉద్దేశ పూర్వకంగా గానీ, నిర్లక్ష్యంగా గానీ బంధించినా, ఇబ్బంది కలిగించినా శిక్షార్హులు అవుతారు. 1960 డిసెంబర్‌ 26 నుంచి ఈ చట్టం అమలులో ఉంది. భారత ప్రభుత్వం 1972లో వన్య ప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించింది.వన్యప్రాణుల అక్రమ విక్రయాలు, వీధి జంతువులపట్ల నిర్లక్ష్యం, కిరాతకంగా, క్షేత్ర జంతువుల పట్ల అమానుష ప్రవర్తన వంటివన్నీ భారత చట్టాల ప్రకారం శిక్షార్హం.

భారత పార్లమెంటు రూపొందించిన  జంతువులపట్ల క్రూరత్వం నివారణ చట్టం సెక్షన్ 11 (1) నుండి (ఓ), ప్రకారం జంతువులను వేటాడటం, స్వాధీనం లేదా పట్టుకోవడం, ఏ జంతువునైనా  అవయవమును తొలగించడం లేదా చంపడంవంటి అనేక ఇతర క్రూర చర్యలకు బాధ్యులైన వారిని చట్టం ద్వారా శిక్షిసారు. జంతు రవాణాలో అనవసర హింసకు పాల్పడే వారికి, జంతువులను కిక్కిరిసినట్టుగా వాహనాల్లో నింపేవారికి, జంతువుల కాళ్ళు కట్టేసి వాహనాలపై తీసుకువెళ్ళే వారికి రూ 100 లేదా  మూడు నెలల కారాగార శిక్ష లేదా రెండు శిక్షలూ కలిపి విధించవచ్చు. భారత శిక్షా స్మృతి సెక్షను 428 మరియు 429  కింద జంతువులను భయపెట్టడం గాయ పరచడం చట్టవిరుధ్ధం. జంతువులను లేదా జంతు సం‌రక్షకులను భయ కంపితులను చేయడాన్ని 1860 భారత శిక్షాస్మృతి సెక్షన్ 503 ప్రకారం  తెలిసి లేదా స్ఫృహతో చేస్తున్న నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి వారిని ఎటువంటి వారంటు లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు.

జంతువుల పట్ల కరుణ ప్రాథమిక బాధ్యత

జంతువులపట్ల జాలి, పరితాపములను చూపాలని భారత రాజ్యాంగం‌ 51 ఎ అధికరణం పౌరుల ప్రాధమిక బాధ్యతలను నిర్వచిస్తున్నది. భారత రాజ్యాంగపు 21వ అధికరణం వ్యక్తిగత స్వేచ్చ, జీవన హక్కులను ధృవపరుస్తున్నది.  భారత పౌరులకు జంతువులను పెంచి పోషించే హక్కును ఈ అధికరణం దృవపరుస్తున్నది. జంతు సంక్షేమ దినోత్సవం రోజున జంతు సంక్షేమ ప్రచారంతోపాటుగా జంతు పరిరక్షక శిబిరాలను నిర్వహించడం, జంతు సం‌రక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృధ్ధిచేయడం, జంతువులకూ తగిన గౌరవాన్ని అందజేయడం అందరి బాధ్యత. జంతువులపట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం, ఈ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం అవసరం, అనివార్యం…

(నవంబర్ 25 జాతీయ జంతు సంక్షేమ దినం)

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles