Thursday, May 16, 2024

తెలుగు – తెలుసుకునే హక్కు

  • తెలుగు అధికార భాష అన్నది శుద్ధఅబద్ధం
  • తెలుగు మాత్రమే వచ్చినవారు ఇంగ్లీషులో  ఫిర్యాదు చేయాలి

పార్లమెంటులో హిందీ ఇంగ్లీషు భాషలు వాడినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులలో ఎందుకు రెండు భాషలు ఉపయోగించడం లేదు అని ఒక నాగరికుడు న్యాయ మంత్రిత్వ శాఖను సమాచార హక్కుకింద అడిగాడు. పార్లమెంట్ మరో విధంగా చట్టం చేసే వరకు ఉన్నత న్యాయస్థానాల్లో ఉభయసభలలో రాష్ట్రాల శాసనసభలలోనూ బిల్లులు, చట్టాల సవరణలు, రాష్ట్రపతి, గవర్నర్ లు జారీ చేసే ఆర్డినెన్సులు, రాజ్యాంగం కింద, పార్లమెంటు శాసనసభలు చేసిన చట్టాల కింద, జారీ చేసే ఉత్తర్వులు కేవలం ఇంగ్లీషులోనే ఉండాలని రాజ్యాంగం ఆర్టికిల్ 348 స్పష్టంగా చెప్పింది.   348(2) కింద రాష్ట్రపతి ముందస్తు అనుమతి తో ఏ రాష్ట్రమైనా తమ హైకోర్టులో హిందీ లేదా తమ భాషను వినియోగించాలని నిర్ణయించవచ్చు. అయితే ఇది న్యాయస్థానాల తీర్పులకు వర్తించదు. (3) ఒకవేళ ఏ రాష్ట్రమైనా ఇంగ్లీషు కాక మరొక భారతీయ భాషను నిర్దేశిస్తే, ఆ రాష్ట్రంలో చేసిన బిల్లులకు చట్టాలకు ఇంగ్లీషు అనువాదాలు అధికారికంగా రాజపత్రాల్లో ప్రచురించాలి. అంటే భారతీయ భాషను అత్యున్నత న్యాయ, శాసన విభాగాల్లో వాడడానికి వీల్లేదు. ఈ ఆర్టికిల్ ప్రకారం వ్యవహరిస్తున్నాం అని జవాబు ఇచ్చారు. భారతీయభాషా ప్రేమికులు ఎంత గింజుకున్నా లాభం లేదు. ఇటీవల విజయవాడలో రెండు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. మన భాషను ఎక్కువగా వాడాలని మంత్రులు, న్యాయమూర్తులు, పెద్దలు, కవులు, పండితులు, నటులు, రచయితలు సముచిత సందేశాలు ఇచ్చారు. ఏ విధంగా అనే సందేహానికి మాత్రం సమాధానం ఏ భాషలోనూ దొరకలేదు.

జీవన హక్కులో తెలుసుకునే హక్కు కూడా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అనేక మార్లు వివరించింది.. ఆ మాట ఇంగ్లీషులో చెప్పింది. తెలుగు హిందీ వంటి భారతీయ భాషలు మాత్రమే తెలిసిన వారికి ఈ హక్కు ఉందని తెలియదు. సర్వోన్నత శాసనం మన రాజ్యాంగం, ఇంకా వేలాది చట్టాలు ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఇప్పుడు రెండు రాష్ట్రాలకు తెలుగులో చట్టాలు లేవు. తెలుగులో చట్టాలు ఉండాలని చట్టం లేదు. పుట్టి పెరుగుతున్న ప్రతి పౌరుడికి చట్టాలు తెలుసని న్యాయశాస్త్రం భావిస్తుంది. ఇది చట్టపరంగా వమ్ముకాని భావన. తిరుగులేదు.  నాకు ఇంగ్లీషు రాదు, తెలుగే వచ్చు కనక నాకు చట్టం, హక్కులు, బాధ్యతల గురించి తెలియదు అంటే కోర్టులు ఒప్పుకోవు. నీకు తెలిసినా తెలియకపోయినా తెలుసని భావించి తప్పుచేస్తేశిక్ష వేస్తారు. 

రేషన్ కార్డు దరఖాస్తుతో మొదలై మంచి నీటి సరఫరా, పాలకార్డు, మోటారు వాహన లైసెన్సు, బడిలో చేరడానికి దరఖాస్తు, ఓటరు కార్డు, పదోతరగతి పత్రాలు వంటి అనేకానేక వ్యవహారిక పనులన్నీ తెలుగువాడు వచ్చీరాని ఆంగ్లంలో చేయవలసిందే. కవిత్వం, సాహిత్యం నవలలు తప్ప మిగిలిన అన్ని రంగాలలో వాడే భాష ఆంగ్లమో లేక ఆంధ్రాంగ్ల సంకరమో గాని ఆంధ్రం మాత్రం కాదు. తెలుగు అధికార భాష అన్నది అన్నిటికన్న పెద్ద అబద్ధం. అది వ్యవహార భాష కూడా కాదు. సత్యమేవజయతే అనే వేదవాక్యం మన నినాదం. కాని విధానం కాదు. అబద్ధం ఆధారంగా మనుగడ సాగిస్తున్న మనం ఆడే మరొక అబద్ధం తెలుగే అధికార భాష. తెలుగు భాషాభిమానులు, రాజ్యాంగం, శిక్షా స్మృతి వంటి కీలకమైన శాసనాలు తెలుగులో లేకుండా వాటిని తెలుసుకుని పౌరులు ఏ విథంగా అనుసరిస్తారని ఆలోచించవలసి ఉంది. సాధారణ జీవనంలో సమాజంలో అందరితో సంభాషించడానికి, లేఖలు, ఈ మెయిల్స్ పొట్టి ముచ్చట్లు పంపుకోవడానికి తగిన భాషను తయారు చేసి, దాన్ని వినియోగించే సాంకేతిక ప్రజ్ఞను సమకూర్చకుండా తెలుగో తెలుగని గుండెలు బాదుకోవడం వల్ల ఏం ప్రయోజనం?

తనకు అన్యాయం జరిగితే తెలుగు పౌరుడు పోలీసు స్టేషన్ లలో తెలుగులో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందా? దానికి దిక్కూ మొక్కూఉంటుందా? ఆ నేరానికి సంబంధించి ఇచ్చే ప్రకటనలు వాంగ్మూలాలు తెలుగులో నమోదు చేసుకునే వీలు ఎంతవరకు ఉంది? ఆరోపణ పత్రాలు ఆంగ్లంలో ఉంటే తెలుగు నిందితుల గతి ఏమిటి? వారి నేరాన్ని రుజువు చేసే సాక్ష్యాలు ఇంగ్లీషులో వెల్లడిస్తే, తెలుగులొ చెప్పినా వాటిని ఇంగ్లీషులో అనువదిస్తే, అది సరిగ్గా అనువదించారో లేదో ఎవరు వివరిస్తారు? కోట్ల కేసులు గందరగోళంలో పడి, ఊపిరి తీసుకోవడానికి కూడా వీల్లేని న్యాయాధికారులు న్యాయమూర్తులు అనువాదాలు పరిశీలించి సరిగ్గా ఉన్నాయో నిందితుడికి చెప్పడం ఎన్నడయినా జరిగిందా? నిజం చెప్పవలసి వస్తే.. కోర్టులో ఎంత మందికి తెలుగు వచ్చు? అందులో ఎందరికి నిజంగా ఇంగ్లీషు వచ్చు. ఇంగ్లీషు మన భాష కాదు కనుక ఇష్టం వచ్చినన్ని తప్పులు చేసే అధికారం మనకుంది. తెలుగు మనభాషే కనుక రాకపోయినా ఫరవాలేదు అనే ధోరణిలో తెలుగు వాడు కోర్టుల్లో, బడులలో, కళాశాలల్లో తేలిపోతున్నాడు, తేలికైపోతున్నాడు. తెలుగులో న్యాయం దొరకదు, ఇంగ్లీషుతోపాటు చట్టాలు తెలిసీ తెలియని లాయర్లు కొందరు ఏమీ తెలియని న్యాయార్థులను మోసం చేస్తుంటే ఫిర్యాదు ఇంగ్లీషులో చేసుకోవలసిందే. తెలుగు రాని వాడికి తెలుగే వచ్చిన వాడికి ఆంగ్లం తెలియకపోవడం వల్ల తీరని అన్యాయం జరుగితీరుతుంది. ప్రపంచంలో ఎక్కడా జన్మభూమిలో తల్లి భాషకు ఇంత ద్రోహం జరగడం లేదు. ఆంగ్ల భాషా బానిసత్వపు జాడ్యం ఆంధ్రకు పట్టుకుంది. తెలుగు అంతరించే భాషల్లో ఉందంటే అబద్ధమా?

మాడభూషి శ్రీధర్ 16.12.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles