Monday, May 27, 2024

“కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు” దధిమధన

మాడభూషి శ్రీధర్ – తిరుప్పావై 7

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్

తెలుగు మాడభూషి శ్రీధర్ భావార్థ గీతిక

అదిగోవినలేదా కీచుకీచు పిట్టల కిలకిలారావములు

భారద్వాజ పక్షుల మధుర సంభాషణలా నిక్వణాలు

కుండలలో చిక్కగా నిండిన మజ్జిగల చర్రు చర్రున

నిలువెత్తు కవ్వాల యవ్వనులు చిలుకు సవ్వడులు

ఊగెడు గోపికల కేశాల రాలిన పూలవాసనాలు తాకలేద

 వగలు నగలు నగవులు కలిసి దీపించు వెల్గులు చేరలేద

పీతాంబరుని వేడక ఈ పిచ్చినిదురేలనే పిచ్చిపిల్ల

మనము తెరచి మాధవుడినె తలచెదము తనివిదీర

అర్థం
కీశు కీశెన్ఱు= కీచుకీచుమని, ఎంగుం = అంతటనూ, ఆనైచ్చాత్తన్ = భారద్వాజ పక్షులు, కలందు = ఒకొరకరు కలిసి, పేశిన =మాట్లాడిన, పేచ్చు అరవం = మాటల ధ్వని, కేట్టిలైయో = వినలేదూ, పేయ్ ప్పెణ్ణే = ఓసి పిచ్చిదానా, కాశుం=బొట్టు, పిఱప్పుం=మంగళ సూత్రం, కలకలప్ప=గలగలమని చప్పుడు చేస్తూ, క్కై పేర్ త్తు= చేతులు కదిలిస్తూ, వాశం= వీచుచున్న, నఱుం = మంచి పరిమళం, కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్ = కవ్వముతో, ఓ శై పడుత్త = ధ్వనివచ్చేట్టుగా చిలుకుతుంటే, తయిర్ అరవం = పెరుగు ధ్వనిని, కేట్టిలైయో= వినడం లేదూ, నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!= ఓ నాయకురాలా, నారాయణన్ =ఆశ్రయించిన వారిని కాపాడాలనే ప్రేమతో అంతగా వ్యాపించిన వాడు, మూర్ త్తి = కృష్ణరూపంలో మనముందున్నవాడు, కేశవనై= కేశవుడనే రాక్షసుని చంపిన వాడు, ప్పాడవుం= కీర్తిస్తూ ఉంటే, నీ =నీవు, కేట్టే కిడత్తియో = వినికూడా పరున్నావా, తేశం ఉడైయాయ్!= ఓ తేజశ్శాలీ తిఱ= తలుపు తెఱువు తల్లీ, లోర్ ఎమ్బావాయ్.

ఆరోపాశురం నుంచి పదిమంది గోపికలను పదిమంది వైష్ణవ ఆళ్వారులకు ప్రతీకగా నిదుర లేపుతూ ఆ ఆళ్వారులను అనుష్ఠానం చేయమని ఉద్బోధిస్తుంటారు గోదమ్మ. నిన్న పుళ్లుమ్ పాశురంలో తన తండ్రి పెరియాళ్వార్ ను మేల్కొలిపి ఈ రోజు కులశేఖరాళ్వారుకు సుప్రభాతం పాడుతున్నారు.  నిన్న అస్మద్గురుభ్యోన్నమః, ఈ రోజు అస్మత్పరమ గురుభ్యోన్నమః  అని ఎవరికి వారు తమ గురువులను సంస్మరించుకోవాలి.

కులశేఖరాళ్వార్ సూచిక

ఈ పాశురంలో కులశేఖర ఆళ్వారులను మేల్కొలుపుతున్నారు. నాయకప్పెంబిళాయ్ అనే పదంతో కులశేఖరుల ప్రస్తావన వచ్చింది. ఆళ్వారుల రత్నమాలలో కులశేఖరులు మధ్య నాయకమణి వంటి వారు. తేశముడైయాయ్ అనే పదం కూడా క్షత్రియుడైన కులశేఖరుడి తేజస్సును సూచిస్తూ ఉన్నది. ఆయన మలయాళుడైనందున మలయాళ పదం ఆనైచ్చాత్తు అని గోదాదేవి ఉపయోగించారు. నాయకప్పెణ్పిళ్లాయ్ అంటే గురువునకు గురువైన పరమాచార్యుడని అర్థం. కనుక అస్మత్పరమ గురుభ్యోన్నమః అని ఈ పాశురంరోజున స్మరించుకోవాలి.

Also read: కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు

అందమైన తమిళ భాష

శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి  ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయం తో  అలరించడం ఎవరికి సాధ్యం.

గోదా దేవి మహాకవయిత్రి. శెన్ తమిళ్ అంటే అందమైన తమిళ భాషలో భక్తి, భగవత్కీర్తన, ఆచార్య వైశిష్ఠ్యం, భాగవత కథలు, రామాయణ ప్రస్తావన కలగలిపి  ఓ ఎనిమిది పంక్తులలో కుదించి, గేయం తో  అలరించడం ఎవరికి సాధ్యం. కేశవుని కీర్తన విని మనసు తెరవమని బోధిస్తున్నది.

తెల్లవారిందనడానికి మూడు గుర్తులు చూపుతారు గోపికలు నిన్నటి పాశురంలో. శ్రవణం ప్రధానం. శ్రవణభక్తి ప్రథమం. జ్ఞాన సముపార్జన శ్రవణంతో మొదలవుతుంది. శబ్దం వినడంతో కావలసిన స్ఫూర్తి లభిస్తుంది. మొదటి గుర్తు పక్షుల కిలకిలారావములు, రెండోది శంఖనాదము, మూడు-లేవగానే మునులు యోగులు పలికే హరి హరిహరీ అనే మాటలు. పక్షుల ధ్వనులు కేవలం ధ్వనులే. అర్థాలు ఉన్నాయో లేదో తెలియదు.  కాని తెల్లవారిందనే సందేశం ఇచ్చి నిద్రలేపడానికి ఉపకరిస్తాయి. మనకన్న ముందే లేచి మనకు లేచే వేళయిందని చెప్పి మనను లేపే మహోపకారం చేస్తున్నాయి పక్షులు. అవి ఉద్దేశ పూర్వక పిలుపులూ కాదు మేలుకొలుపులూ కాదు. అయినా ఉపయోగపడుతున్నాయి.

Also read: యశోద గోరుముద్దలగోరు నవనీతచోరు విష్ణుమూర్తి

శంఖ ధ్వని నాద ప్రధానమైనది దాని ప్రయోజనం భగవత్సేవ మొదలయింది రమ్మని చెప్పడం. ఓం అనే ప్రణవధ్వని. ఓంకారం జీవిని పరమాత్మకు చేర్చే అనుసంధాన నాదం. అర్థం తెలియకపోయినా ఉపాసించి నాదించే వీలున్న శబ్దం – ప్రణవం. పక్షులది శబ్ద శక్తి అయితే శంఖానిది ప్రణవనాద శక్తి. మనస్సును సత్వగుణ ప్రధానంచేసి మనిషిని అంతర్ముఖుని చేసేది శంఖనాదం. మూడో ధ్వని మునులుయోగులు నిద్రలేచేప్పుడు తమ అనుభవం కోసం అనుకునే హరి హరి హరీ అనే స్మరణ. అర్థవంతమైన, ప్రయోజన కరమైన ప్రయత్నపూర్వక ధ్వని మూడోది. విన్నవారికి తెల్లవారినదని తెలిసి, తాపముచల్లార్చే భగవత్ గుణానుభవ మాటలు. లేదు లేదనే ప్రతికూల భావాలు పోయి ఉంది ఉందనే అనుకూల ఆలోచన కలిగించే మాటలు.

తిరుప్పావై భాగవత కథం 7

‘పాలు పెరుగూ’ బదులు ‘గోవింద దామోదర మాధవా’ అని గోపిక అమ్ముతున్నదట. గోపికలు నిరంతరం శ్రీ కృష్ణ ధ్యానంలో ఉండే పరమ భక్తులు. ఎంత భక్తులైనా నిత్యకృత్యములు చేయాల్సిందే కదా. కనుక వారు పెరుగు చిలుకుతూనే ఉంటారు. వాచిక (మాట) కాయిక (చేత) మానసిక (మనసుతో) వ్యాపారము (పను)లనన్నింటిని శ్రీకృష్ణునికే అర్పిస్తున్నారు. భక్తి వారికి జ్ఞానం వల్ల వచ్చింది కాదు. వారి పల్లె లో కృష్ణుడే అవతరించడం వల్ల వారితో కలిసి జీవించడం వల్ల భక్తి వచ్చింది. మేము కృష్ణునికే చెందినవాళ్లం అనీ, మేం చేసేవన్నీ ఆయనకే అని అనుకుంటూ చేస్తారు. ఒక గోపికకు పిచ్చెక్కినట్టు కృష్ణభక్తి పెరిగితే వీరి పనిపెట్టాలని ఒక అత్త పాలూ పెరుగు తట్టలు నెత్తిన పెట్టి అమ్ముకు రమ్మని పంపిందట. ఆ ‘గోపిక పాలు పెరుగూ’ అని అరవడానికి బదులు ‘గోవింద దామోదర మాధవా’ అని అమ్ముతున్నదట. అదీ వారి తన్మయత్వం. చల్ల చేసేప్పుడుకూడా కృష్ణనామమే. దీపపు నీడలో నిలబడి కనబడకుండా కృష్ణుడు కవ్వాన్ని పట్టుకుంటే బరువెక్కింది ఎందుకు అని ఆలోచించకుండా ఎక్కువ బలం ఉపయోగించి కవ్వం తిప్పి చెమటలు చిందించి అలసిపోతారు. అప్పుడు తాను చరచరా కవ్వం తిప్పి వెన్నరాగానే తిని వెళ్లిపోతాడట. ఈ దధిమధన వృత్తాంతం క్షీరసాగర మథన మంత విశిష్ఠమయింది. ఆ కవ్వం చిలికిన చప్పుడు వినబడలేదా అని గోపికలుఅడుగుతున్నారు. కవ్వము చిలుకు సవ్వడులు గోపికలు వెన్న చిలుకుతూ ఉంటే చేతుల గాజులు గలగల మంటున్నాయి. వారి జడల్లోని పుష్పాలు రేపల్లె అంతటా గుబాళిస్తున్నాయి. కవ్వముతో పెరుగు చిలికే శబ్దం వినబడలేడా. ఓ పెద్ద నాయకురాలా! నీవు ముందుండి మమ్మల్ని వెంట తీసుకెళ్లవలసింది పోయి హాయిగా నిద్ర పోతున్నావా అంటున్నారు. గోపికలు స్మరించే శ్రీకృష్ణ నామాలను మేం పాడుతుంటే నీవు నిద్రపోతున్నావేమి అని అడుగుతున్నారు. చిన్ని రూపంలో వచ్చాడు మనకోసం, అందుకే ఆయన “మూర్తి” మన కోసం ఒకరూపు దాల్చి మన కోసం వచ్చినవాడు. జ్ఞాన తేజస్సు భగవత్ నామ సంకీర్తనచే తేజస్సు కల్గిన దానా “తిఱవ్” రావమ్మా, నీ తేజస్సును మాకూ పంచి ఇవ్వు అంటూ మనలోని భగవత్ జ్ఞానమే మనకు తేజస్సును కలగ జేస్తుందని గోదమ్మ వివరిస్తున్నారు. భగవంతుడే సముద్రం. పాలంటే భగవంతుని స్వరూపగుణ విభూతులు. వాటిని మననం చేయడమే మథించడం. భగవంతుడి యందు బుద్ధి నిలపాలనే పట్టుదలే మందర పర్వతం. మథనంలో దైవశక్తులు అసురశక్తులు కూడా సాయ పడతాయి. దైవ శక్తులు జయించి భగవత్కటాక్షంచేత అమృతత్వాన్ని పొందుతారు, అసుర శక్తులు నశిస్తాయి. గోవులంటే వాక్కులు, వేదములు, ఆ గోవులిచ్చే పాలు భగవత్ స్వరూప గుణ విభూతులు. గురువుద్వారా తెలుసుకుని మనసులో దృఢముగా నాటుకొనేట్టు గుర్తుచేసుకోవడం పెరుగు. ఆ అనుభవరూపమగు పెరుగును, భగవత్ సంబంధమనే కవ్వానికి, భగవత్ ఫ్రీతి అనే త్రాడు గట్టి చిలికితే అవి పనులు. ఫలితాలు – ప్రేమతో భగవంతుడికే అర్పించే మనస్సు ఏర్పడుతుంది అది వెన్న వంటిది. భగవంతుడి ఎడబాటు అనే వేడి సోకితే ఆ వెన్న కరిగిపోతుంది. సముద్రమధనం చేసినప్పుడు మూడు ధ్వనులు వచ్చాయి. సముద్రంలో మందరము పెట్టినపుడు, సముద్రం ఎత్తు కావడం వల్ల సముద్రంలోకి వెళ్లక నదుల నీళ్లు వెనక్కితిరిగిపోతున్న ధ్వని ఒకటి, వాసుకి అనే పామును మందరపర్వతానికి కట్టి లాగుతున్నప్పుడు రాపిడికి వచ్చే ధ్వని మరొకటి, కొండ తిరుగుతున్నప్పుడు సముద్రంలో సుడులుసుడులుగా తిరిగే చప్పుడు మూడోది. గోపికలుచిలికేప్పుడు వారి పాట, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు ధ్వని మూడు వస్తూ ఉంటాయి. మనచుట్టూ లోకంలో ఉండే విషయాలనుంచి విషయవాసనలు మనలోకి ప్రవహిస్తూ ఉంటాయి. భగవంతుని యందు బుద్ధి నిలిపినపుడు ఈ వాసనలు లోపలికి రాలేక వెనక్కి పోతుంటాయి అప్పుడొక ధ్వని. శ్రధ్ద అనే వాసుకితో కట్టి భగవత్ప్రాప్తి కామన అనే అధ్యవసాయముతో మనలోని దైవాసుర శక్తులు అటూ ఇటూ లాగితే ఒక ధ్వని వస్తుంది. మనం మననం చేయడం వల్ల భగవత్ స్వరూప గుణ విభూతులు పొంగి పొరలుతాయి. అది మూడో ధ్వని. పరమాత్మ ప్రాప్తికోసం శ్రవణ మనన నిధి ధ్యానములే మథనము అని క్షీరసాగర మథనం వంటి రెండు మూడు ప్రతీకలను గోదమ్మ ఈ పాశురంలో చూపారు. దధిమథనం ఒక యజ్ఞం వంటి పవిత్ర కార్యం. గోపికలు తెల్లవారుజామున లేచి స్నానం ముగించి కురులు అలంకరించుకుని పూలు ముడిచి, బొట్టు పెట్టుకుని పాడికుండను పట్టుకుంటారు. చిలకడం మొదలు పెడతారు. వారి ధ్యానము తపస్సు అదే. వెన్నతీసే పని ఇది అని శ్రీ భాష్యం అప్పలా చార్యుల వారు వివరించారు. ఈ పాశురంలో రెండో గోపికను నిద్రలేపారు.గోదమ్మకు నమస్కారాలు, ఆమె పాదాలకు వందనాలు.
Also read: మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు
పెద్ద భక్తులు ఇద్దరు పెద్దనానలు హైదరాబాద్ కేశవగిరి చంద్రాయణ గుట్టలో ఆనాటి ప్రథానార్చకులు మా పెదనాన జగన్నాధాచార్యులు ‘రంగ రంగా శ్రీరంగా’ అంటూ నిద్ర లేవడం నాకు తెలుసు. ఆదిలాబాద్ మంచిరాల వేంకటేశ్వరాలయంలో తాంబూర శృతి చేసుకుని మైకు సరిచేసుకుని అస్మత్ గురువుగారు వేంకట నరసింహాచార్య పెదనానగారు తాను రచించిన సుప్రభాత పద్యాలను ఎలుగెత్తి పాడుతూ భగవంతుడినే కాదు, అందరినీ నిద్రలేపే వారు. డిల్లీ పండారా పార్క్ లోని ఇంట్లో చుట్టూ పక్షుల ధ్వనులు లేపేవి. పక్షులు పలకరిస్తాయి, పూవులు పులకరింపచేస్తాయి. గుడి గంటలు, శంఖనాదాలు నిద్ర లేపుతాయి.

తిరుప్పావై రామాయణ కథ 7

విలవిలా విలపించిన భరతుడు

తిరుప్పావై 7వ పాశురంలో ప్రస్తావించిన ముఖ్య అంశం భారద్వాజ ముని, భారద్వాజ పక్షులు, భరతుడు, దానికి సంబంధించిన కథ. ఈ పక్షుల విశిష్ఠత గురించి జీయర్ స్వామి వారు వివరించారు. కేరళ తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉండే ఈ పక్షులు చిలుకలవలె మాట్లాడతాయి. రాముడు వనవాసకాలంలో ఒక రాత్రి భరద్వాజ ఆశ్రయంలో నిద్రిస్తాడు. భరతుడు రాముణ్ణి వెదుకుతూ ఆ ఆశ్రమానికి వస్తాడు. భరద్వాజుడు భరతుని రామభక్తి ని పరీక్షిస్తూ ఏపాపమూ చేయని రాముణ్ణి ఏంచేయాలని బయలుదేరావని ప్రశ్నించాడు. ‘‘త్రికాలజ్ఞుడివి నీకు కూడా తెలియదా నా అంతర్యం’’ అని విలవిలా ఏడిచాడు భరతుడు. భరద్వాజుడు తన తపో సంపద అంతా పెట్టి అన్ని విలాసాలున్న ఒక సుందర నగరాన్ని సృష్టించాడు. అందులో ఒక సభ ఏర్పాటు చేసాడు. భరతుణ్ణి రాజు సింహాసనంపై కూర్చోమన్నాడు. రాముడు కూర్చోవాల్సిన రాజ సింహాసనం వైపు వింజామరం ఊపుతూ, భరతుడు వెళ్ళి మంత్రి కూర్చునే ఆసనం పై కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజునికి భరతునిపై నమ్మకం కల్గింది. ‘‘నాకున్న తపస్సంపద అంతా ఈ విధంగా నిన్ను పరీక్షించడానికి వినియోగించాను భరతా, అది సార్థకమైంది’’ అన్నాడు భరద్వాజుడు.

ఇక చదివింది చాలు గానీ దాన్ని ఆచరించు

భరద్వాజుడు మహాతపస్వి, తాను ఒక్క పురుష ఆయుషము అంటే 300 సంవత్సరాలు వేదాధ్యయనం చేస్తాడు. కాని ఏకదేశమనే ఒక్క భాగాన్ని కూడా పూర్తిచేయలేకపోతాడు. మరొక పురుష ఆయుష్షు కావాలని కోరుతూ తపస్సు చేస్తాడు. ప్రజాపతి ప్రత్యక్షమై మరోపురుష ఆయుష్షు ఇచ్చాడు. మళ్లీ మొత్తం వేదాధ్యయనానికే అంకితం చేస్తాడు. కాని పూర్తి కాలేదు. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. మూడు పురుష ఆయుష్షులు పూర్తయ్యాక కూడా సరిపోనట్లు అనిపించి చింతించసాగాడు, ఈ సారి ప్రజాపతి తానంతటతానే వచ్చి, అసలు నీకేం కావాలి అని అడిగాడు. మరొక్క పురుష ఆయుష్షు కావాలన్నాడు అని అడిగాడు. అయితే ప్రజాపతి ఆయనకు ఒక్క సారి మూడు పర్వతాలు ఆ పై మూడు పిడికిళ్ల మట్టి కనిపింపజేసాడు. అంటే నీవు చదివింది ఆ వేదంలోని కేవలం మూడు పిడికెడులు మాత్రమే, ఇక చదివింది చాలు గానీ ఆచదివిన దాన్ని ఆచరించు అని చెప్పాడు. భగవంతుణ్ణి సేవించటం కంటే భగవత్ భక్తి నిండి ఉన్న మహనీయుడిని సేవించటమే ఉత్తమము అని భరద్వాజ సంహితలో ఒక సూక్తిని ఆయన రాసి పెట్టాడు. అందుకే భరద్వాజుడు మూడు పురుషాయుష్షులలో సంపాదించిన తపస్సంపద అంతా భగవత్ భక్తి కల్గిన మహనీయునికై వినియోగించాడు. ఆ భారద్వాజుని పేరున్న పక్షిని “ఆనైచ్చాత్తన్” అని గోదాదేవి తన పాశురంలో ప్రస్తావించడంలో అంతర్యం నీవు భగవతుణ్ణి మాత్రమే తలుస్తున్నావు, భగవత్ భక్తులతో కలవడంలేదు అని చెప్పడమే.

Also read: సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము

జ్ఞానం-అనుష్ఠానం: పక్షి రెక్కలు

చెట్ల నుంచి ఆహారం కోసం వేటకు బయలుదేరే పక్షులు ఒకరొకరితో మాట్లాడుతూ ఉన్నాయి. అవి ఆ అరుపులు. జ్ఞానము అనుష్టానము అనే రెక్కలు ఉంటే పక్షి ఆకాశంలో విహరించగలిగినట్టు పరమాత్మయందు విహరించడానికి సాయపడుతాయి. అధ్యయనం లో నిమగ్నులై కొంత సేపుండి బయటకు వచ్చిమిగిలిన రుషులతో చర్చించి మళ్లీ భగవద్గుణానుభవం అధ్యయనంలోకి వెళ్లి మళ్లీ చర్చిస్తారట. ఆ చర్చలే పక్షుల మధ్యమాటలు.

Also read: తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

తెలుగు సేత మాడభూషి శ్రీధర్
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles