Wednesday, April 24, 2024

పరమపదంఎందుకు, నీతో బంధుత్వం ఉంటే

29 తిరుప్పావై గోదా గోవింద గీతం

శిత్తమ్ శిఱుకాలే వంద్ ఉన్నై శేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోట్రుం పొరుళ్ కేళాయ్
పెత్తం మేయ్ త్తుణ్ణుం కులత్తిల్ పిఱందు, నీ
కుత్తేవల్ ఎంగలై క్కోళ్ళామల్ పోగాదు
ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!
ఎత్తెక్కుం ఏరేర్ పిఱవిక్కుం ఉన్ తన్నోడ్
ఉత్తోమేయావోం ఉనక్కే నాం ఆట్చెయ్ వోం
మత్తై నం కామంగళ్ మాత్త్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగుభావార్థ గీతిక

తామరవోలె మృదువుగా గుబాళించు నీ పసిడి పాదాల

వ్రాల, తెలతెలవారు ఝామునే నీ కోవెలకు జేరినాము

పశువులమేపువారలకు పఱైలు పఱములేలనయ్య

మా గొల్లలకు నీ తోడినేస్తమే సమస్త సిరిసంపదలయ్య

మాకులాన జనించిన నీవు మాసేవలు కాదనరాదు

ఏడేడు జన్మల నిన్నెడబాయని సాపత్యమీయవయ్య

ఇతర వాంఛలెల్ల తుడిచివేసి నిన్నుమాత్రమే ధ్యావించి

నిన్నె సేవించి పూజించు బుద్ధి వరముగా నీయవయ్య

శిత్తమ్ శిఱుకాలే = తెల్లవారుఝాముకన్నా ముందువచ్చే బ్రాహ్మీ ముహూర్తంల,  వంద్ = వచ్చి, ఉన్నై శేవిత్తు ఉన్ =నిన్ను సేవించి, ఉన్ పొన్ తామరై అడి=నీ అందమైన పాదకమలాలకు, పొట్రుమ్ పొరుళ్= మంగళాశాసనం చేయడానికి గల ప్రయోజనాన్ని
కేళాయ్ = వినాలి, పెత్తం మేయ్ త్తు =పశువులను మేపి,ఉణ్ణుం=జీవించే, కులత్తిల్ పిఱందు, నీకుత్తేవల్ = యాదవకులంలో, ఎంగలై =మాచే,క్కోళ్ళామల్ పోగాదు=స్వీకరించకుండా ఉండడం తగదు, ఇత్తై =ఈ రోజు,పఱై కోళ్వాన్అన్ఱు కాణ్ =నీవు కరుణించి ప్రసాదిస్తున్న పఱైని తీసుకొనడానికి వచ్చిన వారిమి కాము=గోవిందా! = ఓ గోవిందా, ఎత్తెక్కుం =ఈ కాలమున్నంతవరకు, ఏరేర్ పిఱవిక్కుం =ఏడేడు జన్మలకు,ఉన్ తన్నోడ్=నీతోనే, ఉత్తోమేయావోం =సంబంధం కలిగిన వారై ఉంటాము, ఉనక్కే=నీకు మాత్రమే,  నాం=మేము, ఆట్చెయ్ వోం= దాస్యం చేయాలని కోరుకుంటున్నాము,
మత్తై నం =మాయొక్కకామంగళ్ = తదితర కోరికలు, మాత్త్= పోగొట్టాలి, ఏలోర్ ఎంబావాయ్= అదే మావ్రతము.

ప్రాతః ేళలు మూడు కాలై, చిరుకాలై, శిత్తం శిరుకాలై తామసులు లేచే వేళ కాలై, గోపస్త్రీలు చేరుకుని చల్ల చిలికే వేళ చిరుకాలై, దానికన్న ముందుగా గోపబాలికలు లేచిన వేళ శిత్తం శిరుకాలే. శ్రీకృష్ణుడివియోగ దుఃఖం అనే చీకటి పోగొట్టడానికి ఉదయించే సూర్యబింబం పోలిన ముఖం కలిగిన శ్రీకృష్ణుడిని చూడడానికి పోతున్నందున ఇదే ఉదయమైపోయింది. ‘‘ఆవిర్భూతమ్ మహాత్మానా’’ అంటే భగవంతుడు ఆవిర్భవించిన అర్ధరాత్రి కూడా ఉదయకాలమే అవుతుంది.

‘‘మీ పాదాలే మాకు ధనం. మాకే ఇతర ప్రయోజనాలూ లేవు. నీ పాదసేవే మా పరమలక్ష్యం. పశువులనుమేపుకుని తినే మా కులంలో ఎందుకు పుట్టావు? దీనులైన మమ్మల్ని ఉద్ధరించడానికే కదా? కైంకర్య చేయకుండా మేముండలేము. మా సేవలను స్వీకరించకుండా నీవూ ఉండలేవు. మా సేవలు వద్దనుకుంటే మరి నీవెందుకు జన్మించావు. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది పొందాలి కదా. మాలో ఒకరిని పొందడానికి నీవు వచ్చావు. పశువులను రక్షించడానికి వేరెందరో ఉన్నారు’’ అన్నారు గోపికలు.

Also read: గోవిందా నీతో నిత్య సాంగత్యమే మాసౌభాగ్యం

‘‘నేను స్వీకరించదలచిన అంతరంగ కైంకర్యాలను నాకు కావలసినపుడు నేను స్వీకరిస్తాను. మీరు వ్రతం చేసిందే పఱై కోసం కదా అదిస్తాను తీసుకువెళ్లండి’’ అని శ్రీ కృష్ణుడు అన్నాడు.

‘‘పఱై కావాలని అన్నాం. కాని అది నిజంగా ఉళ్లో వాళ్ల కోసం చెప్పిన నెపం మాత్రమే. మాకు నీవు తప్ప మరేదీ అవసరం లేదు’’ అన్నారు.

‘‘మరి పఱై అంటే ఏమిటని మీ ఉద్దేశం. ఆ పేరుతో మీరు అడుగుతున్నదేమిటి’’ అని శ్రీ కృష్ణుడు అడిగాడు.

Also read: పరికరాలు కాదు పరమాత్ముడే కావాలి

‘‘నీవు ఎన్ని అవతారాలెత్తినా నిన్ను సేవించి కైంకర్యంచేసే భాగ్యం మాకు కావాలి. నీవు దేవుడివైతే దేవతగానూ మానవుడివైతే మానవిగానూ జనించే శ్రీదేవి వలె మేమూ కైంకర్యం చేయాలని కోరుకుంటున్నాం’’ నీవు ఎక్కడ పుడితే అక్కడ మేముండాలి. నీకు తల్లిగా, భర్తగా తండ్రిగా,తమ్ముడిగా బంధువులుగా మేమే ఉండాలి మాకు అన్ని బంధుత్వాలు నీవే కావాలి. సీత భరతుడు నిన్ను కొన్నాళ్లు విడిపోయారు. కాని లక్ష్మణుడి వలె నిన్ను ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే భాగ్యం మాకుండాలి. మా ఆనందం కోసం కాదు. మన ఇద్దరి ఆనందం కోసం కూడా కాదు. కేవలం నీ ముఖం ఆనందంతో వికసించడం కోసం నీకే దాస్యం చేస్తామని అంటున్నాం’’ అని గోపికలు అంటున్నారు.

‘‘ఇదికాకుండా మాలో పొడిచూపగల ఇతర కామభావనలన్నీ నీవే పోగొట్టాలి. భోగంలో ఇద్దరూ కలిసి మెలిసి ఉండడంలోఇద్దరికీ ఆనందం సమానంగా ఉంటుంది. కాని భోక్తవైన నీవు మాసేవలతో ఆనందించడాన్ని చూసి మేము సంతోషించాలి’’.

“ఇత్తై పఱై కోళ్వాన్ అన్ఱు కాణ్ గోవిందా!” మేం ఏదో ఒకటి అడగాలని అది అడిగాం, మేం కోరేవి ఇవికాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా, మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అని అన్నాడు శ్రీకృష్ణుడు.

Also read: అహంకారాన్ని లోనుంచే కాల్చే నిప్పు శ్రీకృష్ణుడు

“ఎత్తెక్కుం” ఎల్లప్పటికీ, ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వ దేశముల యందు, సర్వ అవస్థల యందు, “ఏరేర్ పిఱవిక్కుం” ఏడేడు జన్మలలో కూడా ‘‘ఉన్ తన్నోడుత్తోమేయావోమ్’’ నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమపదం లో ఉన్నామాకు నీ సంబంధమే ఉండాలి “ఉనక్కే నాం అట్చెయ్ వోం మత్తై నం కామంగళ్ మాత్త్” కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైన లోపం ఉంటే నీవే సరి దిద్దాలి, మాపై భారం వెయ్యవద్దు.నీవే కావాలని నీతో సంబంధబాంధవ్యమే కావాలని గోదాదేవి నిర్ద్వంద్వంగా చెప్పడంతో అందరికీ వ్రతఫలితం దక్కింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది. ఈ రోజు పురుషార్థం పొందిన రోజు. ఈ రోజు స్వామి గోదాదేవిని రప్పించుకొని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహరూపంలోనే శ్రీకృష్ణుడు వివాహమాడిన రోజు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనక ఈ రోజు”భోగి” అని శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వివరించారు.

Also read: ఈ లోకాలు కొలిచి నీ పాదాలెంత నొచ్చుకున్నాయో

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles