Wednesday, November 6, 2024

శరీరం, మనసు కలిసిన యోగవిద్య

“ఒంటికి యోగా మంచిదేగా…. సుమారు 30 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా పాటలో ఈ పదాలు దొర్లాయి. ఆ పాట కూడా బాగా హిట్ అయ్యింది. అందులో దృశ్యాలు, హీరోయిన్ వయ్యారాలు అలా ఉంచుదాం. బాగా యోగా చెయ్యండి, ఆరోగ్యం చాలా బాగుంటుందని దాని సారాంశం. యోగా వల్ల కేవలం ఒంటికే కాదు, మనసుకు కూడా చాలా మంచిది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం. దాన్ని సాధించాలంటే, ఒళ్ళు, మనసు ఒంచి యోగ సాధన చెయ్యాల్సిందే. యోగాభ్యాసం భారతీయులకు కొత్త విషయం కాకపోయినా, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక యోగాకు ప్రత్యేకమైన ప్రచారం పెరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవడం ఒక ఆచారమైంది. 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.

Also read: ‘సత్య’మేవ జయతే!

నరేంద్రమోదీ ప్రతిపాదన

ప్రతి ఏటా  ఒకరోజు, ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకుందామని మన ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 మంది ఐ రా స ప్రతినిధుల్లో 175 మంది మద్దతు ఇచ్చారు. దీనికి ఆమోదం లభించింది. 2015, జూన్ 21 వ తేదీన, మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ వేడుక ఆగకుండా జరుగుతూనే వుంది. ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. గతంలో ఎట్లా ఉన్నా కరోనా వైరస్ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత దీని విలువ మరింత పెరిగింది. మానసిక, శారీరక బలానికి దీని అవసరం చాలా ఉందనే ప్రచారం విరివిగా జరిగింది. శరీరానికి ఆక్సిజన్ బాగా అందడం, రక్తప్రసారం బాగా జరగడం చాలా ముఖ్యమని డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. మెదడు, మనసు ఒత్తిడికి గురికాకుండా ఉండడం ఇంకా ముఖ్యం. మొన్నటి వరకూ గుండెపోట్లు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోకులు బాగా పెరుగుతున్నాయి. కొందరికి ఏకకాలంలో రెండూ వస్తున్నాయి. ఈ కారణాలతో మరణాలు పెరుగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా రోగాలు పెరుగుతున్నాయి, కొత్త కొత్త రోగాలు వచ్చి చేరుతున్నాయి. ఏవో కొన్ని దేశాల్లో తప్ప, అన్ని చోట్లా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ మాత్రం డబ్బు ఖర్చులేకుండా, గొప్ప ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే  యోగసాధనకు మించింది ఇంకొకటి లేనేలేదు. జీవనశైలి (లైఫ్ స్టైల్ ) సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రస్తుతం కాలంలో  ఎక్కువ రోగాలకు జనం గురవుతున్నారు. జీవించే విధానాన్ని మార్చుకుంటే తిరిగి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని డాక్టర్లు చెబుతూనే వున్నారు. చిన్న వయస్సు నుంచే యోగ సాధన చేస్తూ, మంచి జీవనశైలిని అలవాటు చేసుకుంటే 90 శాతం జబ్బులు దగ్గరకి కూడా రావని యోగశాస్త్రం చెబుతోంది. దాన్ని పాటించే పనిచేద్దాం. సమయాన్ని తెలుసుకునే గడియారం లాగా, జీవగడియారం (బయోలాజికల్ క్లాక్ ) కూడా ఉంటుంది. జీవ రసాయన వ్యవస్థ మొత్తాన్ని అదే శాసిస్తుంది. దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఇందులో భాగంగా నిద్ర, ఆహారం, వ్యాయామం ఈ మూడింటినీ సరిచేసుకుంటే సరిపోతుంది.

Also read: దేశమంతటా రాజకీయాలాట!

పతంజలి యోగశాస్త్రం

పతంజలి మహర్షి అద్భుతమైన యోగశాస్త్రాన్ని మనకు అందించాడు. ఒక్కొక్కరి వయస్సు, ఆరోగ్యం, వృత్తి, ప్రవృత్తికి అనుకూలంగా యోగ సాధన చెయ్యవచ్చు. ప్రారంభంలో గురువు ద్వారా నేర్చుకోవడం మంచిది. తర్వాత సొంతంగా సాధన చెయ్యవచ్చు. అప్పటి దాకా, పద్మాసనం మొదలైన ప్రాధమికమైన ఆసనాలను సులువుగా వేసుకోవచ్చు. కూర్చోటం, నిల్చోడం, నడవడం, పడుకోడం మొదలైన పనులకు కూడా కొన్ని భంగిమలు (పోశ్చర్స్)  ఉంటాయి. వాటిని సక్రమంగా పాటించడం వల్ల కూడా కొన్ని శారీరక ఇబ్బందులు దగ్గరకు రావు. ఇవన్నీ చాలా సులభంగా పాటించే అంశాలు. యోగ సాధనలో అనేక అంగాలు ఉన్నాయి. యోగాసనాలు,సూర్య నమస్కారాలు,ప్రాణాయామం,ధ్యానం మొదలైనవి ప్రధానమైనవి. ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయి. ధ్యానంలోనూ అనేక స్థాయిలు, విధానాలు వున్నాయి. సూర్యనమస్కారాలు వేయడంలోనూ అనేక రూపాలు ఉన్నాయి. ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ఆన్నీ వేయడం అందరికీ సాధ్యమవ్వదు. వారి శారీరక ఆకృతి, వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి కొన్ని ఆసనాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రాణాయామం కూడా అంతే. ఇవ్వన్నీ మంచి శిక్షణ, నైపుణ్యం కలిగిన గురువుల దగ్గర నేరుగా నేర్చుకొని, అప్పుడు మాత్రమే సాధన చేయడం సరియైన విధానం. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత నుంచి క్రమంగా యోగసాధన చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. పొద్దున్నే లేవడంతోనే కొంత ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా యోగ శాస్త్రం చెబుతోంది. పొద్దున్నే లేవాలంటే, ముందురోజు రాత్రి తొందరగా నిద్రపోవాలి. ప్రస్తుతం ఉన్న వృత్తుల వాతావరణం నేపథ్యంలో అందరికీ కుదరకపోయినా, వారికి అనుకూలంగా ఉండే సమయాలను బట్టి ప్రణాళిక వేసుకుంటే సరిపోతుంది. మన విద్యా విధానంలో యోగవిద్యకు ప్రాముఖ్యత బాగా పెరగాలి. చిన్న వయస్సులో శరీరం బాగా ఒంగుతుంది, మనసు నిర్మలంగా ఉంటుంది, మెదడు చురుకుగా ఉంటుంది. “మొక్కై ఒంగనిది మానై ఒంగునా” అనే సామెత చాలామందికి తెలిసిందే. ఈ వాక్యాలు యోగాసనాలు, సూర్య నమస్కారాల విషయంలో బాగా సరిపోతుంది. సంగీతం వినడం, పాడడం, లలిత కళలను అభ్యాసం చేయడం కూడా యోగసాధనలో భాగమే. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తి, చురుకుగా మెదడు కదలికలు మొదలైనవి ప్రధాన సూత్రాలుగా కలిగినవే మన  అవధానాలు. ఇది భారతీయులకు మాత్రమే దక్కిన సాహిత్య,ఆరోగ్య ప్రక్రియ. కేవలం తెలుగుభాషలోనే గొప్పగా వికసించిన గొప్ప విద్య. పద్యాలను, శ్లోకాలను, సామెతలను, పలుకుబళ్ళను వల్లె వేయడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. పద్యాలు, శ్లోకాలు చదవడం వల్ల ప్రాణాయామం చాలా సహజంగా జరుగుతుంది.

Also read: ఆచరణలో చూపించాలి ఆదర్శాలు

అవధాన విద్య

అవధాన విద్య కూడా యోగశాస్త్రంలో భాగమే. ప్రస్తుతం యోగా కేంద్రాలు బాగా పెరుగుతున్నా, నిపుణులు చాలా తక్కువమంది మాత్రమే ఉంటున్నారు. ఈ విద్యలో నిపుణుల సంఖ్య బాగా పెరగాలి. ఆ బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇంజనీరింగ్, లా, సాహిత్యం మొదలైనవాటికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నట్లుగా యోగవిద్యకు కూడా ఏర్పాటు చెయ్యాలి. విద్యావిధానంలో యోగశాస్త్రం తప్పనిసరి అంశంగా చేర్చాలి. ఆ గురువులకు మిగిలిన టీచర్లకు సమానంగా జీత భత్యాలు కల్పించాలి. యోగాసనాలు, సూర్య నమస్కారాలకు- మిగిలిన వ్యాయామాల మధ్య చాలా తేడా ఉంది. కొన్ని యోగా కేంద్రాలలో కొందరు చాలా కఠినంగా శిక్షణ ఇస్తున్నారు. అది అస్సలు సరియైన విధానం కాదు. చాలా తేలికగా శరీరాన్ని వంచాలి. యోగాసనాల వల్ల కండలు తిరగవు, కానీ బాగా కరుగుతాయి. శరీరం, మనసుకు సంబంధించిన ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ ( లోపలి ప్రయాణం, నిర్మాణం ) తెలుస్తుంది. తెలుసుకోవాలి కూడా. యోగా అనేది పోటీపరీక్షల మాదిరి క్రాష్ కోర్సు కాదు. నిదానంగా, నెమ్మదిగా నేర్చుకొని అభ్యాసం చేయవలసిన విద్య. ‘యోగ’ ప్రతిమనిషికీ, ప్రతిరోజూ జీవితంలో భాగమైన నాడు, ఆ దేశం ‘యోగభూమి’ అవుతుంది. ఒకప్పుడు మనదేశం అటువంటిదే. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా ప్రయాణం మొదలవ్వడం మంచి పరిణామం. ధ్యాన, జ్ఞాన యోగాలకు ఒకప్పుడు నెలవైన ఈ పవిత్ర భారతం, మళ్ళీ ఆ రూపాన్ని త్వరలో సంతరించుకోవాలని బలంగా కోరుకుందాం. కరోనా వాతావరణం, నిబంధనల నేపథ్యంలో, ఈ సంవత్సరం  “అంతర్జాతీయ యోగా దినోత్సవం” ప్రత్యేకమైన జాగ్రత్తలతో నిర్వహించుకుంటున్నారు. ‘యోగసాధన’ సంవత్సరానికి ఒకరోజు మాత్రమే జరుపుకోనే వేడుక కాదు. ప్రదర్శక కళ కాదు. అది మన జీవనంలో, జీవితంలో ముఖ్యమైన భాగం. శరీరం, మనసు కలిసి సాగే ఈ విశిష్ట ప్రక్రియను కలకాలం ఆచరిస్తూ, కాపాడుకుందాం.

Also read: పవార్-పీకే భేటీపై ఊహలకు రెక్కలు

(జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles