Thursday, April 25, 2024

యోగపురుషుడు యడ్లపాటి

  • అనారోగ్యం దరిచేరకుండా నిండు జీవితం జీవించిన ధన్యుడు
  • అవినీతికీ, బంధుప్రీతికీ, ఆశ్రితపక్షపాతానికీ ఆమడ దూరం
  • రైతులూ, భూములూ, వ్యవసాయం అంటే ప్రాణం

102 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించి 103 వ ఏట హేలగా శరీరాన్ని వదిలిపెట్టిన యోగపురుషుడు యడ్లపాటి వెంకటరావు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం వసించినా, రవ్వంత చెడ్డపేరు మూటకట్టుకోని అదృష్టవంతుడు. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడుగా శరీరాన్ని, మెదడును ఎంత కష్టపెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా షుగర్, బీపీ వంటి ఏ వ్యాధీ అంటని ఆరోగ్యవంతుడు. జీవితంలో అనారోగ్యం,మందులు, అసుపత్రుల జాడ కూడా తెలియని ఉక్కుమనిషి. మనిషిగా మానవత్వం నింపుకొన్న నిండుమనిషి.

Also read: ఉక్రేన్ కీ, నాటోకీ రష్యా బలప్రదర్శన

ఎందరో మహానుభావుల ఎదలో నిలిచిన వ్యక్తి

Facebook
తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ ను ఆశీర్వదిస్తున్నయడ్లపాటి వెంకటరావు

మహాత్మాగాంధీ, ఆచార్య ఎన్ జి రంగా వంటి మహనీయుల మార్గంలో నడిచి విజయవంతుడైన ఆదర్శవంతుడు. స్వతంత్ర, కాంగ్రెస్, తెలుగుదేశం మూడు పార్టీల్లో నడిచినా స్వతంత్రంగానే మెలిగిన ఆత్మగౌరవ సంపన్నుడు. పల్లెలు, రైతులు,వ్యవసాయం..నిరంతరం వాటి చుట్టూనే ఆలోచనలు పెనవేసుకొన్న అచ్చమైన పల్లె మనిషి. వేదమంత్రాలను వల్లె వేస్తూ, మహాకవుల శ్లోకాలు, పద్యాలు, గీతాలు, కవితలను కంఠోపాఠం చేస్తూ కమనీయతను, రమణీయతను రంగరించుకొని హృదయాన్ని పండించుకున్న సారస్వత మనస్వి. చెప్పే నీతులు -చేసే రీతులు ఒకటిగానే గడిపిన ఆచరణశీలి. గాంధీ ప్రేరణతో స్వాతంత్ర్య ఉద్యమంలో అడుగు పెట్టి, రాజాజీ, ఆచార్య రంగా ప్రభావంతో రాజకీయాల్లో కాలుమోపి కడవరకూ వారి పేరు నిలిపిన ధీశాలి. పూర్వరంగంలో న్యాయవాదిగానూ ఎంతో రాణించిన ప్రతిభాశాలి. జైనసిద్ధాంతాల ప్రభావం కలిగిన గ్రామాల్లో జన్మించి, జీవించి, జీవితాంతం శాకాహారిగానే మనగలిగి, తన ఆరోగ్యరహస్యం కూడా అదేనని చెప్పుకున్న సాధకుడు. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా 102 ఏళ్ళు జీవించడమంటే మాటలా? అటువంటి వ్యక్తి ఈరోజు వరకూ మన మధ్యనే సంచరించి వెళ్లిపోయాడు. తెలుగుభాష మీద, భారతీయ సంస్కృతిపైన ఎంతటి మమతానురాగాలు ఉన్నాయో, ఇంగ్లిష్ సాహిత్యంపట్లా అంతటి మక్కువ కలిగిన వ్యక్తి. పోతన్న ‘గజేంద్రమోక్షం’ లోని పద్యాలను ఎంత అవలీలగా అప్పజెప్పగలడో,వర్డ్స్ వర్త్ ఇంగ్లీష్ పంక్తులను అదే తీరున ఉటంకించగలడు. అంతే కాదు, రాజాజీ, స్వామి వివేకానంద మాటలను మక్కీకి మక్కీ వల్లె వేయగలడు. ఆదిశంకరాచార్యుల స్తోత్రాలు మొదలు శ్రీశ్రీ మహాప్రస్థానం వరకూ ఆయన రసనాగ్రంలో నర్తన చేస్తూ ఉంటాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి, తుమ్మల సీతారామమూర్తి, ఏటుకూరి వెంకటనరసయ్య, నార్ల వెంకటేశ్వరరావు నుంచి గుఱ్ఱం జాషువా వరకూ అందరి సాహిత్యాన్ని విరివిగా చదివిన వ్యక్తి. వీరంతా ఆయనకు ఎంతో ఇష్టమైన కవులు.

Also read: ప్రాతఃస్మరణీయుడు అన్నమయ్య

విజయరహస్యం ఏమిటి?

TDP: Yadlapati Venkata Rao కన్నుమూత - Telugu Oneindia
తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు యడ్లపాటి వెంకటరావుకు నమస్కారం చేస్తున్నప్పటి చిత్రం

‘సుందరకాండ’ నిత్య పారాయణ గ్రంథం. ఎవరి దగ్గర పనిచేసినా, ఏ పార్టీలో ఉన్నా, ఆ సిద్ధాంతాలను అమలుచెయ్యడం, అధినాయకులు ఏ పని అప్పజెప్పినా, దానిని విజయవంతంగా పరిపూర్ణం చెయ్యడమే రాజకీయాల్లో ఆయన విజయరహస్యం. అదే సమయంలో.. తనకు నచ్చనవి, ప్రజలకు హితముకానివి సున్నితంగా తిరస్కరించేవారు. తన అభిప్రాయాలను, అభ్యంతరాలను సూటిగా, స్ఫుటంగా చెప్పి అధినేతలను ఒప్పించేవారు. అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి ఆమడదూరంగానే నిలిచారు. రైతులు, రైతుకూలీలకు ఎల్లవేళలా దగ్గరగానే నడిచారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపి (రాజ్యసభ), మంత్రిగా అనేక ఉన్నత పదవుల్లో ఉత్తమంగా, ఉన్నతంగా రాణించారు. ఏ పదవి కోసం ఎన్నడూ వెంపర్లాడలేదు, పైరవీలు చెయ్యాలేదు. ప్రతి పదవీ తనకు తానుగా వలచి వచ్చినదే. వరించి వచ్చిన ప్రతిపదవినీ రమించి, శ్రమించి రాణకెక్కాడు. ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు భిన్నమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. తన వ్యవహారశైలితో వారందరినీ ముచ్చటగొలిపారు. వారందరూ వీరిని అంతే మురిపంగా చూసుకున్నారు. మితాహారం, ఆహార, వ్యవహార, నిద్రాదులలో నిత్య క్రమశిక్షణ, నిరంతర జ్ఞాన సముపార్జన, పుస్తక పఠనం,సత్ సాంగత్యం, సహనం, శాంతి, నిగ్రహం, సమాజశ్రేయస్సు, ఆత్మతృప్తి మొదలైన సద్గుణాలు యడ్లపాటి వెంకటరావును నిండునూరేళ్లకు మించి జీవింపచేశాయి. చివరి వరకూ జ్ఞాపకశక్తిని, ప్రజానురక్తిని నిలిచేట్టు చేశాయి. “తల్లి కౌగిలి కదా పల్లెటూరు” అని ‘తెనుగులెంక’ తుమ్మల సీతారామమూర్తి అన్నట్లు.. “నేను ఎక్కడ ఉన్నా, నా హృదయం పల్లెల్లోనే ఉంటుంది” అని చెప్పుకొనే నిండైన తెలుగుమనిషి, నిక్కమైన గాంధేయవాది యడ్లపాటి జీవితం ఎప్పటికీ ఎల్లరకూ ఆదర్శం.

Also read: ఉక్రెయిన్ పై ‘తగ్గేదే లే’ అంటున్న రష్యా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles