Thursday, April 25, 2024

తెలివి లేమిగల మా గొల్లలందు నీవు బుట్టుటే మా భాగ్యమోయి

28. గోదాగోవిందగీతం

కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్ద్ ఉణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱున్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నోడు
ఉఱవేల్ నమక్కు ఇంగొజిక్క వొజియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

అడవులందు మేతపశువులకు నేతలము మేము

ఆలమందల వెంట దిరుగు అల్పజీవులమేము

పసులు పక్షులతోడనేమెసలెదము, మెసవెదము,

తెలివి లేమిగల గొల్లలనీవు బుట్టుటే మాభాగ్యమోయి

లోపమేమిలేని లోకాలనాథుడే మాకన్నయ్య అయిన

ఎన్నడెడతెగని కృష్ణ బంధమే మాకెనలేనివరము

మర్యాదలెరుగక ఇన్నాళ్లు చులకనగ పిలిచినాము

అలగక కృష్ణయ్య, ఆశయాల దీర్పఆదరించవయ్య

అర్థం

కఱవైగళ్ పిన్ శెన్ఱు = పశువుల వెంట నడిచి, కానమ్ శేర్ న్ద్ ‌ అడవిలో కలుసుకుని, ఉణ్బోమ్ ‌= తిని తిరుగుతూ ఉంటాం,అఱివొన్ఱు మిల్లాద =తెలవేమీలేని పిల్లలం, వాయ్-క్కులత్తు = యాదవకులంలో, ఉన్ఱన్నై = నిన్ను, ప్పిఱవి పిఱున్దనై = మా వంశంలో పుట్టిన, పుణ్ణియమ్ = పుణ్యాన్ని, యాముడయోమ్ =మేం పొందియున్నాము, కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా = లోపమనేదేలేని గోవిందా, ఉందన్నోడు ఉఱవు = నీతో మా సంబంధం, వేల్ నమక్కు ఇంగు=ఇక్కడ మనకు,ఒజిక్క ఒజియాదు = పోగొట్టుకుందామన్నా పోయేది కాదు, అఱియాద పిళ్ళైగళోమ్ = లోకజ్ఞానం లేని పిల్లలం, అంబినాల్ =ప్రేమతో, ఉన్ఱన్నై=నిన్ను, చ్చిఱు పేర్అళైత్తనవుం= = చిన్నపేరుతోపిలిచినందుకు, శీఱి యరుళాదే = కోపించి అనుగ్రహించకుండా వదలకు, ఇఱైవా! నీ తారాయ్ పఱై- = ఓదేవా మేం ఆశించిన ప్రయోజనాన్నిమ్ము, ఏలోర్-ఎంబావాయ్= అదే మా వ్రతము.

యాదవులు అమాయకులు, ప్రకృతితోనూ, సహజ సిద్ధమైన పశుపక్ష్యాదులతోనూ నిష్కల్మష స్నేహం చేసేవారు, నోరులేని జీవులు, మనను పాలిచ్చి పోషించే తల్లుల వంటి పశువులే సంపద, పశువులే స్నేహితులు. అమ్మ తరువాత మనకు తమ శరీరంలో భాగమైన పాలను పంచుకునేది పశువులే కదా. అవి పశువులా? తల్లులనుకోవలసిందే కదా. ఆ పశువులను మనుషులతో సమానంగా ప్రేమించే అమాయత్వాన్ని మించిన దైవత్వం లేదు. పాడిపశువులను బంధువులగా భావించి సేవించే గొల్లవారికి శారీరక శుచి శుభ్రత తక్కువ అని అనుకుంటారేమో. మాకు ప్రకృతితో సమాగమమే దైవ సన్నిధానం అని పైకి చెప్పడం కూడా రాదు. వారి జీవనంలో అదొక భాగం, అంతే. పశువులకు గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని అక్కడికి పశువులను తోలుకుపోవడం వారి పని, వాటితోనే ఉంటారు వాటితోనే కలిసి తెచ్చుకున్న సద్ధిమూట తింటారు. ఇన్ని లోపాలున్న మాతో ఏ లోపంలేని గోవిందుడు కలిసి తిరుగాడినాడంటే ఎంత ఆనందం, ఎంత అదృష్టం. యాదవ కులం మొత్తం పరమ పావనమైపోయింది. యుగయుగాల దాకా. కృష్ణుడు యోగులకు కూడా అందనంత ఎత్తున ఉన్నాడని వారికి తెలియదు. తమకు అందుబాటులో తమతో ఉన్న సులభుడనీ తెలియదు. కనుక చిన్ననాటి మిత్రుడిని పిలిచినట్టు, రారా పోరా అని చిన్న చిన్న మాటలతో పిలుచుకున్నాం అంటున్నారు. లౌక్యం తెలియని చిన్న వారమయ్యా, కోపం రాలేదు కదా. చిన్నబుచ్చుకోలేదు కదా. నీతో సహవాసమే, నీతో చెరగని స్నేహమే మాకు తరగని పెన్నిది కన్నయ్యా అంటున్నారు గోల్లవారు గోపికలు, బాలికలు, గోవులు, ఆబాల గోపాలం, అదేమాట, ఇదే ఈ రోజు పాట, గోదమ్మనోట. 

Also read: గోవిందా నీతో నిత్య సాంగత్యమే మాసౌభాగ్యం

అజ్ఞానులం, దోష పూరితులం, కనుక మనం శ్రీమన్నారాయణుని పొందగలమా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, వాటిని పటాపంచలు చేయడానికి ఈ పాశురాన్ని రచించారు గోదమ్మ. మన దోషాలు పోగొట్టగల పరిపూర్ణుడు గోవిందుడు. సులభంగా దొరకడమే అతని లక్షణం. గోవిందుడన్నది ఎంత పెద్ద బిరుదు? దాని ముందు నారాయణ అన్న దెంత చిన్న పేరు? ఆయనతో ఉన్న బంధుత్వం పోయేదేనా?కుటుంబ సభ్యులతో, బంధువులతో తగాదాలు పెట్టుకుని బాంధవ్యాలు తెంచుకోవచ్చునేమో కాని భగవంతుడితో బాంధవ్యం తెంచుకోగలరా ఎవరైనా? సంబంధ జ్ఞానమే అన్ని జ్ఞానాలకన్న గొప్పబంధం. నీ తిరు చరణాలే ఉపాయము ఉపేయమూ. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతమని గోదాదేవి ఈ పాశురంలో పాడారు. గోదాదేవిలో మనకు జగద్గురువు కనిపిస్తారు.

జీయర్ స్వామి చెప్పినఅంతరార్థం

ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళు కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం “హే గోవిందా” నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.

Also read: గోదమ్మ మొక్కు తీర్చిన రామానుజస్వామి

అవి ఏమిటంటే

1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.

2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.

3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.

4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.

5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.

6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!

గోపికలు ఈ విధంగా అంటున్నారు. మాకై మేం కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమీ ఆర్జించుకోలేదు. ఇవి కావాలంటే అంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట వెళ్ళితే కదా అవి ప్రాప్తిస్తాయి.మరి మేమేమో“కఱవైగళ్ పిన్ శెన్ఱు”పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం. లేకుంటే లేదు.

Also read: పరికరాలు కాదు పరమాత్ముడే కావాలి

ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి.కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్”అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానంలేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేంఅఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు”ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా.మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటేఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్”మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నీవు.

కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా”కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా.ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు”నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు.అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్”ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా.ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం”చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం.శీఱియరుళాదే”కోపించక అనుగ్రహించు.ఇఱైవా! నీ తారాయ్ పఱై”మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించమని గోపికలు వేడుకున్నారని జీయర్ స్వామి వారు వివరించారు.

1. సత్కర్మాభావవిజ్ఞాపనము (భగవంతుని చేరడానికి సాధనంగా నేనే మంచి కర్మా చేయలేదు అని చెప్పుకోవడం)

2. స్వనికర్షానుసంధానము (అయోగ్యుడనని, తప్పులుచేసానని, అల్సుడనని చెప్పుకోవడం),

3. ఈశ్వరగుణ పూర్తి (తనకేదయినా పుణ్యం ఉంటే అది భగవంతుడి అనంత కల్యాణ గుణ పరిపూర్ణుడి కరుణే అని నమ్మడం),

4. సంబంధ జ్ఞానము (మాకే వేరే తెలివేదీ లేదు, శ్రీకృష్ణుడితో విడదీయరాదని సంబంధం తప్ప),

5. పూర్వాపరాధక్షమాపణము (చేసిన అపచారములకు, ఉపచారభావంతోచేసిన అపచారములకు నీ ఘనత తెలియక నీపట్ల చేసిన తప్పులను మన్నించు),

6. భగవదేకోపాయత్వ స్వీకారము (నీవు తప్ప మాకు మరొక దారి లేదనినమ్మడం), అనే ఆరు లక్షణాలు మనను భగవంతుడిదరిచేర్చుతాయని గోదమ్మ వివరించారని శ్రీ భాష్యం గారు పేర్కొన్నారు.

Also read: శ్రీకృష్ణుడంటే కొంగు బంగారమే కదా

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles