Saturday, July 13, 2024

ముందుమాటలు… ముందుచూపు పెంచాలి!

‘ముందుమాట’ – అంటే కవులని, రచయితలని ప్రశంసిస్తూ రాసే వ్యాసం కాదు. అట్లని విశ్లేషిస్తూ రాసే విమర్శా కాదు. గ్రంథ రచయిత(అతను/ఆమె)కృషిని అర్థం చేసుకుని, ప్రతిభని, బలహీనతల్ని సమతూకం వేసి వ్యాఖ్యానించే వాస్తవం. పదమూడు పీజీల కవిత్వానికి యాభైఆరు పేజీల ముందుమాట రాసిచ్చిన ప్రముఖుడు నాకు తెలుసు.  ఏ పుస్తకానికి ముందుమాట రాస్తున్నారో దాని గూర్చి కనీసంగానైనా ఉటంకించకుండా తమ స్వీయ ప్రతిభాపాటవాల్ని పాఠకులకు ఏకరవు పెట్టుకునేవాళ్ళనీ చదివాను. మహామహా ఘనత వహించిన కొందరు పెద్దలు వందల వేల సంఖ్యలోముందుమాటలు గిలుకుతుంటారు. మనందరికీ తెలసు. పుస్తకం లోని రెండు వాక్యాలో, నాలుగు పదాలో కాదు. ఏవీ దొరకకపోతే రెండు కామాలు, నాలుగు ఫుల్ స్టాప్ ల నైనా ఎత్తి చూపి ప్రశంసాపత్రం ఇచ్చేస్తుంటారు. పైగా ‘‘ఇవి మచ్చుతునకలు నా మెచ్చుతునకలు’’ అని ప్రశంసిస్తుంటారు. మరి ఇంకొందరు ఊళ్ళు తిరుగుతూ యువ కవుల్ని, యువ రచయితల్ని పుస్తకాలు అచ్చేయండని ప్రోత్సహిస్తూ ఉంటారు. ముందుమాట రాసే బాధ్యత వాళ్ళు తమకే అప్పగిస్తారని ఆశ. చాలా సార్లు వాళ్ళ ఆశ నెరవేరుతుంది కూడా!  ముందు మాటల అవకాశవాదులు ఇలా రకరకాలుగా ఉంటారు. వీరందరిలో మరి నేనెక్కడున్నానూ అని బేరీజు వేసుకుంటే…చాలా వెనకబడి ఉన్నాను. అందుకు సంతోషిస్తున్నాను కూడా! మొహమాటాలకు, మెహర్బానీలకు పోయి, ప్రశంసాపత్రాలు గుప్పించే పని నేనెప్పుడూ పెట్టుకోలేదు.

Also read: మానవ సంబంధాల్ని బలపరుస్తున్న టెక్నాలజీ

ఎప్పుడైనా, ఎక్కడైనా ముందుమాట కోసం లబ్దప్రతిష్టులయినవారి దగ్గరికే వర్ధమానులు వెళుతుంటారు. ముందు మాట రాయడం వల్ల లబ్ధప్రతిష్టులకు వచ్చే లాభం కానీ, కొత్తగా వచ్చే పేరు ప్రతిష్టలు కానీ ఏమీ ఉండవు. బలం లేక పడిపోతున్న తీగకు పందిరి వేసి, ఊత కర్రలు పెట్టి నిలబెట్టినట్టు-స్వతహాగా గ్రంథరచయితలో ‘‘విషయమేమీ’’ లేకపోతే, ఈ లబ్ధప్రతిష్టులు తమ ముందు మాటల ఊతకర్రలు పెట్టి నిలబెట్టడం కుదరదు. ‘‘పీఠాధిపతి’’ది ఒక ప్రెసెంటర్ ఉద్యోగం. అందమైన ఉపోద్ఘాతం ఇచ్చి, ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచి తెరచాటుకు కదలిపోయేవాడు. ప్రయోక్త-ప్రెసెంటర్-పీఠికారచయిత అని ఏ పేరుతో పిలిచినా అతను పరచయ వాక్యాలు పలికి వెనక్కివెళ్ళిపోయేవాడే.

Also read: ‘‘భరతమాత ముద్దుబిడ్డ నెహ్రూ:’’ అటల్ బిహారీ వాజపేయి

కళాకారుడు ప్రదర్శన చెడగొడితే ప్రయోక్త ఏం చేస్తాడూ? ఒక లబ్ధప్రతిష్టుడు తన పీఠికలో ఆశించిన స్థాయిని గ్రంథరచయిత అందుకోకపోతే అది గ్రంథ రచయిత తప్పే అవుతుంది. కానీ పీఠిక రాసినవారిది కాదు. అతను ఆశించింది అతను రాస్తాడు. దాన్ని నిలుపుకోవాల్సింది గ్రంథరచయితే కదా? అయితే, ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. నీళ్ళు లేని బావిని నీళ్ళున్నట్టు పరిచయం చేస్తే ఆ ‘పీఠాధిపతి’ తక్షణం ఆ ఆసనం నుండి దిగి వెళ్ళిపోవలసిందే- అందుకు అతడు అనర్హుడన్నమాట!

Also read: ప్రకృతి శరణం గచ్ఛామి

ఒక అనామకుడిని లేదా సాహిత్యరంగంలో కొద్దిపాటి గుర్తింపే ఉన్నవాడిని ఒక లబ్ధప్రతిష్టుడు గుర్తించి, నాలుగు మంచి మాటలు చెప్పి, అతని స్థాయిని పెంచి, ఇక ముందు ఈ రంగంలో మరింత బాధ్యతగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు. ముందుమాట రాయించుకోవడమంటే ప్రముఖడితో కలసి సెల్ఫీ తీయించుకోవడమన్నమాట! ఆ సెల్ఫీ లాంటి ముందుమాటను అడ్డం పెట్టుకొని అప్రయోజనకరమైన రచనలు ఉత్పత్త చేస్తూ పోతే ఆ వర్థమాన రచయిత తనను తాను కించపరుచుకున్నట్టు. తనను ప్రోత్సహించిన పెద్దల్ని అవమాన పరిచినట్టు. అంతేకాదు, తన సమాజానికీ తలవంపులు తెచ్చినట్టు. కాలం  మారిపోయింది. సమాజంలో మార్పులొచ్చాయి. నీతికి, నిజాయితీకి, విలువలకు దక్కాల్సిన స్థానం దక్కటం లేదు. రెండు చొప్పదంటు రచనలు చేసి, నాలుగు సన్మానాలు కొనుక్కుని, ప్రయత్నించి మరో మూడు అవార్డుల్ని చేజిక్కించుకుని, సిగ్గువదిలేసి తన గురించి తనే బాహాటంగా వ్యాసాలు రాసుకుంటూ, తనను తాను ప్రమోట్ చేసుకుంటూ హీనంగా బతుకుతున్నవాళ్ళున్న ఈ రోజుల్లో నా లాంటి వాడు చెప్పేమాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే. వాస్తవం వాస్తవమే కదా? ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఇక పీఠికల, ముందుమాటల పనేముంటుందీ? – ఆలోచించాల్సిన విషయం! ప్రముఖుల్ని బుట్టలో వేసుకుని అమోఘమైన ప్రశంసాపత్రాలు రాయించుకోవడంలో ఫలితం ఉంటుందనుకుంటారు కొందరు. కానీ, తెలివైన పాఠకుల ముందు తేలిపోతుంటారు. గ్రంథరచయితా, పీఠిక రాసిన ప్రముఖుడు ఇద్దరూ అజ్ఞానులుగా కాలంముందు, సాహిత్యాభిమానుల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.

Also read: కరోనా నేర్పిన కొత్త పాఠాలు

అందువల్ల ముందుమాట రాయడమంటే ఎంతో బాధ్యతతో చేయాల్సిన పని అని గుర్తుంచుకోవాలి. కత్తిఅంచు మీద జాగ్రత్తగా కలం నడపడంలాంటిది. రాసే కలం పాడవకూడదు. ఎవరి గురించి రాస్తున్నామో వారికి కొంత మేలు జరగాలి! భూతద్దాలు పట్టుకొని ప్రచండ విమర్శకాగ్రేసరులు వచ్చినా ఎవరికి ఏ తప్పూ దొరకకూడదు. అందుకు సులభమైన మార్గం ఒక్కటే! నిజాయితీగా వాస్తవ దృక్కోణం లోంచి విషయం చెప్పడం!! దాని వల్ల తప్పకుండా విలువలు ప్రతిష్టాపించబడతాయి. గ్రంథ రచయిత/కవి వేసే కుప్పిగంతులు, వికృత చేష్టలూ నిరసిస్తూ బెత్తం తెచ్చి దండించకుండా పీఠికరాసే ప్రముఖుడు మెల్లగా తెలివిగా ముందుమాట అనే అద్దం తెచ్చి గ్రంథ రచయిత ముందు పెడతాడన్నమాట. అంతే- దాంతో ఎవరి విషయం వారికే అర్థమవుతుంది. ముందు మాటంటే ఆత్మీయంగా స్పర్శంచడం, ఒక్కోసారి స్నేహపూర్వకమైన మందలింపు. బలాన్ని, మనోధైర్యాన్నీ పెంచుతూనే అజ్ఞానాన్ని, అహంకారాన్ని లాగేయడం. గ్రంథ రచయితలో ఉన్న ఎనర్జీ లెవల్స్ ని అంచనా వేసి చూపడం. భవిష్యత్తు కార్యాచరణకు సంసిద్ధుణ్ణి చేయడం. ముందుమాట రాయడమంటే గ్రంథరచయితకు తోడుగా ఉన్నానని భరోసా ఇవ్వడం. మందుమాటంటే ఫార్మాలిటీ కాదు. ఎస్సెసింగ్ ద ఎబిలిటీ!  ముందుమాటంటే ఉట్టి మాట కాదు. అదొక ముందుచూపు! ఒక పరీక్షాధికారికి, ఒక న్యాయాధికారికీ, ఒక పరిపాలకుడికీ, ఒక మంచి మనిషికీ ఉండే ఔదార్యం, సహనశీలత ఉంటేనే ఎవరైనా పీఠిక రాయడానికి పూనుకోవాలి.

Also read: దయ చేసి దిగిపోండి: అరుంధతీరాయ్

కొందరి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. పుస్తకంలో సగభాగం పీఠికలు, అభిప్రాయాలు, సందేశాలు, అభినందనలతో నింపేస్తారు. పాఠకులు వాటిని పక్కకు నెట్టేసి ముందుకు పోయి, అసలు గ్రంథ రచయితలో ఏమైనా ‘సరుకు’ ఉందా లేదా అని చూస్తారు. అలాంటప్పుడు ముప్పయి పేజీల ముందుమాటల రచయితకు ఏ మాత్రం ఉపయోగపడనట్లే కదా? సరిగా రాయగలవాళ్ళు ఏ ఒక్కరు రాసినా బావుండేదే అని తర్వాత తెలుసుకుంటారు. మాందుమాటంటే పాఠకులకు అందుబాటు. అది ఒక స్క్రీనింగ్ టెస్ట్ – ఒక స్కానింగ్ ఫీస్ట్! ముందుమాట పుస్తకానికి ముఖచిత్రంగా నిలవాలి. దాంతో పాఠకులు పుస్తకం వెనకపడి వచ్చేట్లుండాలి. అల్లాటప్పాగా తీసుకునేవారికి దాని విషయం తెలియకపోవచ్చు. కానీ, సాహిత్యాన్ని సీరియస్ గా తీసుకునేవారికి అదొక సీరియస్ విషయం!

Also read: ‘రే’ ను గూర్చి రేఖామాత్రంగా

పుస్తకంలోకి అంటే రచయిత ఆలోచనల్లోకి అంటే సృజనకర్త మేధస్సులోకి దారి చూపే సైన్ బోర్డు ముందుమాట. పుస్తకాన్నంతా క్రోడీకరించే సారాంశపు చుక్క. పుస్తకం గుమ్మం ముందు నిలిచిన ఒక మహావృక్షపు బోన్సాయ్ మొక్క, అంటే ఒక పరిధిలో ఒదిగి ఉంది. పుస్తకంపై సృజనకారుడి ‘స్పాట్ లైట్’ వేసి ప్రదర్శించేదిగా ఉండాలి. అంతేకాని, పుస్తకాన్ని మరుగున పడేసే దుష్టసంప్రదాయం కాకూడదు. కళ్ళు చెదరగొట్టే ఫ్లడ్ లైట్ కాకూడదు. దానివల్ల అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. స్వంతడబ్బా కొటుకునేవారితో ఏ గ్రంథ రచయిత అయినా ముందుమాట రాయించుకుంటే – ఇక గ్రంథ రచయిత తనకు తాను అగ్నికి ఆహుతి ఇచ్చుకున్నట్లే. అనుబంధాలు, పరిచయాలు పక్కన పెట్టి విషయ పరిజ్ఞానం ఉన్నవారితో ముందుమాట రాయించుకుంటే కొంతలో కొంత ఫలితం ఉంటుంది. సరైన వైద్యుడి దగ్గరికి వెళితేనే లోపాలు తెలుస్తాయి.  సరైన వైద్యం అందుతుంది. అలాగే సరైన సాహితీ ప్రముఖుడి దగ్గరికి వెళితేనే గ్రంథ రచయితకు న్యాయం జరుగుతుంది.  

Also read: భారత్ లో మిగిలింది మనువాద మార్క్సిజమా?

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

1 COMMENT

  1. నమస్కారం సార్.వ్యాసం మొత్తం చదివాను..మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను..సన్మానాలు,పురస్కారాలు అంగడి సరుకైన ఈ రోజుల్లో ఈ వ్యాసం రావడం బాగుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles