Thursday, April 25, 2024

సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తి చేస్తారా?

  • డీకే సమర్థుడే, కానీ కేసులు ఉన్నాయి
  • సిద్ధరామయ్యకు జనామోదం ఉంది
  • ఇద్దరినీ కలుపుకొని పోవడం అధిష్ఠానం బాధ్యత

కర్ణాటక ఎన్నికల్లో చాన్నాళ్ల తర్వాత గొప్ప గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్ కు ఆ ఆనందం ఎక్కువ కాలం మిగులుతుందా అనే సందేహాలు చుట్టుముట్టుతూనే ఉన్నాయి. ముఖ్య నేతలు సిద్ధరామయ్య – డికె శివకుమార్ ఇద్దరూ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.వీరిద్దరిలో డీకేకే నాలుగు మార్కులు ఎక్కువ పడతాయి.ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీకి వీరవిధేయుడుగా ఉన్నారు. వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ఏజెన్సీల నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఆర్ధికంగానూ, హార్థికంగానూ పార్టీకి ఎంతో అండగా ఉన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మినబంటుగానూ పేరు తెచ్చుకున్నారు. పార్టీకి ట్రబుల్ షూటర్ గానూ తన దక్షత చాటుకున్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ సైనికుడుగానే ఉన్నారు. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. చివరి వరకూ పట్టుబట్టినా, పార్టీ పెద్దల మాటకు తలవంచక తప్పలేదు. ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంటూ, ముఖ్యమంత్రిగా సింహాసనాన్ని అధిరోహించడానికి సిద్ధరామయ్యకు మార్గం సుగమం చేసి పెట్టారు. నేడు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండోసారి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. నిజానికి ఉపముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగం పరంగా ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. మామూలుగా కాబినెట్ మంత్రికి ఉండే అధికారాలు, సదుపాయాలే ఉంటాయి. మామూలు మంత్రి బదులు ఉపముఖ్యమంత్రి.. అని పిలిపించుకోవడం తప్ప ఒనకూరేది ఏమీ ఉండదు. ఈ పదవితో పాటు మంత్రిగా కొన్ని కీలక శాఖలు కేటాయించే అవకాశాలు మాత్రం డీకే శివకుమార్ కు దక్కుతాయి.

Also read: సరికొత్త సంసద్  సౌధం

అధికార పంపిణీపై అప్పుడే వదంతులు

ఈ నేపథ్యంలోనూ, సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పదిరోజులు కాకమునుపే అధికార పంపిణీపై చర్చలు, వదంతులు మొదలయ్యాయి. ఎంబీ పాటిల్ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్యలు రచ్చకు అవకాశాన్ని ఇచ్చాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ నేతలకు తాను ఏ మాట ఇచ్చానో దానికే కట్టుబడి వుంటాను తప్ప, అధికార పంపిణీ వంటి విషయాల్లో తాను జోక్యం చేసుకోనని డీకే శివకుమార్ వివరణ కూడా ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగాల్సి వుంది. ఇదే అంశంపై అధిష్టానంతో చర్చించేందుకు సిద్ధరామయ్య, డీకే నేడు దిల్లీకి వెళ్తున్నారు. ఈలోపే దుమారం మొదలైంది. నిజానికి ఇద్దరు నేతలకు వారి వారి స్థాయిలో బలాలు ఉన్నాయి. ఆర్ధికంగా బలమైన నేతగా, పార్టీ విధేయుడుగా డీకేకు ఎంత బలముందో, పరిపాలనా అనుభవం, చతురతలో సిద్ధూకు అంతే బలం వుంది. దేవరాజు అరసు తర్వాత ఐదేళ్ల పూర్తికాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర కూడా సిద్ధరామయ్యకు వుంది. అవినీతి ముద్ర,కేసులు కూడా ఈయనపై లేవు. డీకేపై చాలా కేసులే ఉన్నాయి. బిజెపి పెద్దల హిట్ లిస్ట్ లో డీకే ఉన్నారు.

Also read: సెమీఫైనల్స్ కు రంగం సిద్ధం

ప్రాముఖ్యం సంతరించుకున్న డీకే వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు ముందు జరిగిన పార్టీ సమావేశాల్లో డీకే చేసిన వ్యాఖ్యలను అంత తేలికగా కొట్టిపారేయలేం. 135 సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితులు వచ్చినా, సంతృప్తిగా లేదని కార్యకర్తల సమావేశంలో ఆయన మాటలను నేడు గుర్తుచేసుకుంటున్నారు. మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 25 స్థానాల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ ఒక్కసీటును మాత్రమే తెచ్చుకోగలిగింది. రేపటి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను రాబట్టుకోలేకపోతే, అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఇచ్చిన ఆనందం ఆవిరైపోతుంది. లింగాయత్, వెనుకబడిన వర్గాలు (అహిందా), మైనారిటీ ఓట్లు అధికశాతం తమకే పడతాయనే అతి విశ్వాసంలో కాంగ్రెస్ వుంది. కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్, వక్కళిగ సామాజిక వర్గాల ప్రభావం చాలా ఎక్కువ. కర్ణాటక ముఖ్యమంత్రులుగా పనిచేసిన 23మందిలో 16మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. వీరు ప్రధానంగా బిజెపికి అనుకూలురు.

Also read: అమ్మకు ఒకరోజు!

లింగాయత్ లు బీజేపీపైన అలిగారా?

యడియూరప్పను పక్కనపెట్టిన నేపథ్యంలో వీరంతా బిజెపి నుంచి కొంత దూరమయ్యారని వినపడింది. వక్కళిగలు సాధారణంగా జేడీస్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు. కాంగ్రెస్ వైపు కూడా అప్పుడప్పుడూ అభిమానం కురిపిస్తుంటారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమీకరణలు కాంగ్రెస్ కు లాభాన్ని, బిజెపికి నష్టాన్ని తెచ్చిపెట్టాయి.రేపటి సార్వత్రిక ఎన్నికల లోపు సిద్ధూ -డీకే మధ్య వైరుధ్యాలు పెరిగితే పార్టీ అధికారం ప్రశ్నార్దకమవుతుందనే వాదనలను కొందరు మొదలుపెట్టారు. 8సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మూడుసార్లు మంత్రిగా పనిచేసి, సిద్ధరామయ్య కంటే యువకుడైన డీకే విషయంలో అన్యాయం జరిగిందనే గాయం ఎంతకాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని స్థానిక రాజకీయాల పరిశీలకులు అంటున్నారు. గెలిచిన అభ్యర్థులలో ఎక్కువమంది సిద్ధరామయ్య వర్గానికే చెందినవారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యూహ, ప్రతివ్యూహ రచనలోనూ సిద్ధరామయ్యకు సిద్ధహస్తుడనే పేరుంది. అంత పోటీ మధ్య, ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడంలోనే ఆ చతురత కనిపిస్తోంది. ఈ ఇద్దరు నాయకులను విడదీసే పెద్ద ఆట జరిగితే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిద్ధరామయ్య ఐదేళ్ల అధికారానికి ఢోకా ఉండదని చెప్పవచ్చు. రేపు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రాబట్టడంలో వీరి బాధ్యత, భవిష్యత్తు దాగివున్నాయి.

Also read: కర్ణాటక ఫలితాలు దేనికి సంకేతం?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles