Tuesday, April 23, 2024

ఆకాశవర్ణునికి ఆరాధనలు జేసి మంగళమ్ములు పాడ

14. తిరుప్పావై 

మాడభూషి శ్రీధర్

29 డిసెంబర్ 2023

ఉజ్ఞళ్పురైక్కడైత్తోట్టత్తువావియుళ్
శెజ్ఞరునీర్వాయ్నెగిర్అంద్ఆమ్బల్వాయ్కుమ్బినకాణ్
శెజ్ఞల్పొడిక్కూరైవెణ్బల్తవత్తవర్
తజ్ఞళ్తిరుక్కోయిల్శంగిడువాన్పోగిన్ఱార్
ఎజ్ఞళైమున్నంఎరుప్పువాన్వాయ్పేశుమ్
నజ్ఞాయ్! ఎరుందిరాయ్నాణాదాయ్! నావుడైయాయ్
శజ్ఞొడుచక్కరంఏందుంతడక్కైయం
పజ్ఞయక్కణ్ణానైప్పాడ-ఏలోర్ఎంబావాయ్

తెలుగుభావార్థగీతిక

పెరటి మడుగులోన చెందమ్మి కమలాలు కలిసి విరిసె

నల్లకల్వలు నీవు రావని ముకుళించి మూతిముడిచె

ధవళదంతుల మునులెల్ల తలుపు తెరువ బీగాలతో

కాషాయధారులు శంఖమ్ములూదగుడుల కరిగినారు

మమ్మె లేపదమన్న మాట మరిచి నిద్రపోయెదవేల

కెందామర నేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు

ఆకాశవర్ణునికిఆరాధనలుజేసిమంగళమ్ములుపాడ

కదలి రావమ్మ కమలాక్షి కలిసి కృష్ణ వ్రతముజేయ

అర్థం

ఉజ్ఞళ్ = మీయొక్క, పురైక్కడైత్తోట్టత్తు = పెరటితోటలో, వావియుళ్ =కొలనులో,
శెజ్ఞరునీర్వాయ్నెగిర్అంద్ = ఎర్రతామరలువికసించి, ఆమ్బల్వాయ్కుమ్బిన =నల్లకలువలుముకుళించుకునిఉన్నాయి. కాణ్= చూడు, శెజ్ఞల్పొడిక్కూరై = కాషాయవస్త్రాలుధరించినవారు, వెణ్బల్ =తెల్లనిపలువరసగలవారు, తవత్తవర్ =తపసులు, తజ్ఞళ్తిరుక్కోయిల్ = తమదైవసన్నిధిలో, శంగిడువాన్ =శంఖంమోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు. ఎజ్ఞళై =మమ్మల్ని, మున్నంఎరుప్పువాన్ = ముందుగానేవచ్చిలేపుతానని, వాయ్పేశుమ్= నోటితోచెప్పిన, నజ్ఞాయ్! =ఓపరిపూర్ణురాలా, ఎరుందిరాయ్ = లేచిరమ్ము, నాణాదాయ్! =సిగ్గులేనిదానా, నావుడైయాయ్= తీయనిమాటలుగుప్పించేనాలుకగలదానా, శజ్ఞొడుచక్కరం = శంఖచక్రాలనుఏందుం = ధరించిన, తడక్కైయం = దీర్ఘబాహువులుగలవాడునూ, పజ్ఞయక్కణ్ణానై = ఎర్రతామరలనుపోలినకన్నులుగలవాడుఅయినసర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.

చెలికత్తెలమైన మమ్ములని ముందుగానే లేపుతానని మీనోటితోనే చెప్పిన పరిపూర్ణురాలా, సిగ్గులేనిదానా, తీయని మాటలు చెప్పే నాలికగలదానా, మీ ఇంటిపెరటిలోని తోటలో బావిలోన ఎర్రతామరలు విరిసినవి. నల్ల కలువలు ముకుళించినవి. ఎర్రని జేగురు రాళ్లపొడితో రంగు అద్దబడిన కాషాయవస్త్రములను దాల్చి, తెల్లి పలువరుసలు గల సన్యాసులు తమ దేవాలయములకు కుంచె కోల పట్టుకుని ఆరాధనకై వెళ్తున్నారు. మాకొరత తీర్చుము. లెమ్ము. శంఖచక్రములను ధరించిన విశాలబాహువక్షముకలిగిన పుండరీకాక్షుని కీర్తించుటకు రమ్ము.

Also read: పదితలలు గిల్లివేసె రామమూర్తి

భావార్థము
బయట ఉన్న గోపికలు: నీ గుమ్మం ముందు నిలబడిఉన్నాం మేము. నీవు ఇంకా బయలుదేరి బయటకు రావడంలేదేమి?

లోనిగోపిక: తెల్లవారిపోయిందా?

బ.గో: ఎర్ర తామరలు విరిసినాయి, నల్ల కలువలు ముకుళించాయి కనిపించడం లేదా?
లోని గోపిక: మీరు నా భవనానికి వచ్చిన ఆనందంతో మీ కన్నులు వికసించాయి. నేను ఏమీ మాట్లాడకపోవడం వల్ల కోపంతో మీ నోళ్లు మూసుకు పోయినాయి. ఇవే మీరు వికసించిన తామరలు, ముకుళించిన నల్ల కలువలు అంటున్నారు.
బ.గో: బయట ఉన్న పూవులే కాదు లోపల తోటలో కూడా పుష్పాలు వికసిస్తున్నాయి. మరికొన్ని ముడుచుకుంటున్నాయి.

లో.గో: మీరు తోటంతా తిరుగుతూ వికసించే వాటిని వికసింపజేస్తున్నారు. ముడుచుకునే వాటిని ముడుచుకునేట్లుచేస్తున్నారు.

బ.గో: మేము దిగడానికి వీలు కానంత లోతున్న కొలనులో ఉన్న పుష్పాలను మేమెలా వికసింపజేస్తాం? మరి కొన్నిటిని ముడుచుకునేలా చేయగలమా? వాటంతట అవే జరుగుతున్నాయి.
లో.గో: మీ కళ్లు నోళ్లు ప్రతిఫలించే కాంతులే అవి, నిజమైన పూలుకావు.
బ.గో: సరే నీవే వెళ్లిచూడు.

లో.గో. పూలు వికసించినా ముకుళించినా అవి మీవల్లనే. మీరు ఘటనాఘటన సమర్థులైన భగవంతుని సంబంధీకులు కనుక మీరు చేయలేనిదేమీ లేదు.

బ.గో: సూర్యరశ్మి పడక పోయినా కొన్ని పూలు కొలనులో వికసిస్తున్నాయి. కొన్ని ముడుచుకుంటున్నాయి. అచేతనములైన వేయ థానుసారంగా విధులు నిర్వర్తిస్తుంటే చేతనమైన నీవు ఊరకే పడుకోవడం ధర్మంకాదు.

అంతరార్థం:

ఈ శరీరమే ఒకతోట. నాడీమండలము చైతన్య ప్రసరణ మార్గము. నాడీమండలము వెన్నుపూసలో ఉంటుంది. ఇది దిగుడు బావి. తామరపూవులంటే నాడీచక్రములు. మూలాధారము, స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. కలువలని అంటే ఇంద్రియములు. ఇంద్రియములు ముడుచుకున్నాయి. తోట అంటే అష్టాక్షరీమంత్రం. మధ్యలో గల బావినమః అనేది. తామర పూవు అంటే పారతంత్ర్యము. కలువపూవు అంటే స్వాతంత్ర్యము. జేగురు రాయి అంటే విషయములందు ఆసక్తిగల మనసు. విషయరాగమే ఎరుపు. పొడిచేయడమంటే భగవత్పారతంత్ర్యమునుతెలియజేయడమే. భగవత్సంబంధము గల పదార్థములను కలుపుట నీటిలో కలపడం, భగవత్పారతంత్ర్యము భగవత్ప్రీతి విభూతి యందు ప్రతిగల మనసు గలిగియుండుట కాషాయ వస్త్రధారణ. తెల్లని పలువరుస ఆహారశుద్ధిని వాక్శుద్ధినీ సూచిస్తుంది. సన్యాసులంటే ప్రపన్నులు. తనకు కలిగిన భగవదనుభవమును దాచుకొనకుండా చెప్పడమే సిగ్గులేకుండా ఉండడం. పరిపూర్ణత సాధించి శిష్యులకు మనోరంజకంగా చెప్పడమే మాట నేర్పు. శంఖం అంటే ప్రణవం, చక్రమంటే సుదర్శనము, భగవంతుడిని చక్కగా చూపేది. కుంచెకోల అంటే ఆచార్యజ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే చూపుడు వేలు బొటనవేలుతో చేర్చి, మూడు వేళ్లు దూరముగా ఉంచడం. బొటనవేలు భగవంతుడు. చూపుడు వేలు అంటే జీవుడు. మూడు వేళ్లు అంటే గుణత్రయం. మూడు గుణాలు దూరమైతేనే జీవుడు భగవంతుడు చేరును అనడమే జ్ఞానముద్రలోని సందేశం. శంఖచక్రములను భుజాలపైన దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించ దగినవారు అని కందాడైరామానుజాచార్య వివరించారు.

తిరుప్పాణియాళ్వార్

తిరుప్పాణియాళ్వార్ను మేలుకొలిపే పాశురం ఇది. భక్తాంఘ్రరేణుయోగి జన్మస్థలంని చుళాపురమే తిరుప్పాణాళ్వారులకు కూడాపుట్టిన రోజు. మొదటి ముగ్గురు ఆళ్వార్ల వలె ఈయన కూడా ధాన్యపు గుత్తి కారణంతో అవతరించారు. తాంబూరాతో రంగని గానం పాడేవాడు. వారికి శ్రీమన్నారాయణుని వక్షఃస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ అంశతో తిరుప్పాణర్వచ్చారు. ఆయనను అంతిమ కులం వాడనేవారు. ద్రావిడంలో పాణన్అం అంటే అంటరానివారని దూరం చేసేవారు. కాని ఆయన పట్టించుకోకుండా తిరునామాలు ధరించి, తులసీ మాలలు వేసుకునేవారు. భాగవత లక్షణాలుఉండేవి. నిరంతర హరిదా సవృత్తితోగడిపేవారు. ఉచ్ఛనీచాలు అనేవి ఆయన లెక్కించలేదు. భగవంతుడిదృష్టిలో ముందు అందరూ ఒకటే అని నమ్మేవారు. ఆయన జ్జానం భక్తివైరాగ్యాలు నమ్మి పాటించేవాడు. భగవంతుడి విష్వక్సేనుడు స్వయంగా వచ్చి ఉపనయనం వంటి పంచసంస్కారాలు చేయించారు. కుక్క మాంసం తినేవాడైనా శ్రీవైష్ణవుడు బాధించడానికి వీల్లేదు. దొంగలను కూడా చంపకూడదు. పశువుని కూడా హింసించదు. శ్రీరంగంలో కావేరి ఒడ్డున పాడుకుంటూ ఉండేవాడు. ఇసుకతో శ్రీరంగం నిర్మించుకునేవాడు. దగ్గరికి రానివ్వడుకనుక దూరంగా ఉండి భగవంతుడి గురించి స్మరించుకుంటూ పా డుకుంటూఉండేవాడు. సారంకముని అనే వైష్ణవుడు దగ్గరికి వచ్చినందుకు గద్దించి వెళ్లిపొమ్మన్నాడు. ఆయన భగవాన్స్మరించంలో ఉండి ఈయన మాట వినలేదు, చూడలేదు. ఆబ్రాహ్మలందరు రాళ్లు విసిరికొట్టేసారు. అయినా భగవంతుని స్మరణంలో పారవశ్యంగా ఉన్నాడు. కౌశికగానం పాడుతూనే ఉన్నాడు. ఆయనకు కోపమూ తాపమూ లేదు. శ్రీరంగనాథుడి కోవెలలో భగవంతుని వంటి నిండా నెత్తురు కారుతూ ఉంటూ పూజారి సారంగముని ఆశ్చర్యపోయాడు. అర్చకులు, పాచకులు పరిచారకులు జనం, చివరకు ప్రభువు కూడా చూసాడు. రంగని రక్తంకారుతూనే ఉంది. సారంగమునికి కలలో రంగడు అతనికి కనిపించి ఆభక్తుడు పాణన్దెబ్బలు నాకు తగిలాయి. ఆయనకు కాదు. పాణన్పరమ ప్రహ్లాదుడు. అసృశ్య భావన వదిలి ఆయనను ఎత్తుకుని నా దగ్గరికి తీసుకొమ్మని రంగడు ఆజ్జాపించారు.  నెత్తిన ఎత్తుకుని రంగనాథుడిస్వామికి ముందుకు తీసుకు వెళ్లారు. శ్రీపాణకులమహోదరయా క్షమించండి అని నమస్కరించారు. మునిని మోసి తీసుకునివెళ్లినందున తిరుప్పాణి ఆళ్వార్ముని వాహనుడని పేరుతో ప్రముఖుడైనాడు. శ్రీరంగని కళ్లు తీరగా చూసి వర్ణించి ‘అమలనాదిపిరాన్’ అనే పది పాశురాలను పాడినారు. అదొక గొప్ప దివ్య ప్రబంధమైనది. గోదాదేవి వలె ఆయన కూడా సాయుజ్యం సాధించారు. తిరుప్పాణాళ్వార్ అనే పేరు సాధించారు. అగస్త్యముని తపఃఫలితంగా ఆయన అంశంతో వీరు అవతరించారు. కులాలు, అస్పృర్శత ఎవరికీ ఉండదని ప్రభోధించారు.

Also read: సీతను విడదీసిన రావణుని దునిమాడిన దాశరథి

         తిరుప్పాణియాళ్వార్నుఅను సంధించడం ఈపాశురంలో సాగుతుంది. నంగాయ్గుణ పరిపూర్తి, నాణాదాయ్అ హంకారం లేకుండా ఉండడం. పది పాశురాలలో అన్ని వేదాలను ప్రతిపాదించిన గంభీరార్థములు వివరించిన వేదాంత దేశికులు ప్రస్తుతించారు గనుక వీరు నాలుకగలవారు కనుక ‘నావుడయాయ్’ అనీ అనవచ్చు. ఈపాశురంలోశ్రీమన్నాథమునయేనమఃఅని అనుసంధానం చేసుకోవాలి. మనసులో లేని దానికి నోటితో చెప్పకూడదు. చెప్పిన వాటిని చేయకుండా ఉండరాదు. జ్ఞానం అనుష్టానం రెండూ ఒకటి కావాలి.

(తిరుప్పాణి ఆళ్వార్పుట్టినస్థలంలో అళగియమణవాళపెరుమాళ్గుడి ఇది)

శ్రీమన్నాథమునయేనమః

శ్రీమన్నాథమునయేనమః ఈ రోజు గురు మంత్రం.

నాథముని (సా.శ. 823 – సా.శ. 951) శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించిన మతాచార్యుడు. నాథముని ఆళ్వారులు రచించిన 4000 పాశురాలను సేకరించి, తమిళ భాషలో నాలాయిర దివ్యప్రబంధముగా క్రోడీకరించాడు. శ్రీవైష్ణవ ఆచార్యులలో నాథముని మొదటి వ్యక్తి అంటారు. యోగ రహస్య, న్యాయ త్వత్వాన్నిఈ కావ్యాలు రచించాడు. అతని అసలు పేరు రంగనాథన్, అయితే అతన్నినాథముని అని పిలుస్తారు. నాథముని ఉత్తర భారతదేశంలో చాలాకాలం ప్రయాణాలు చేసారు. ఆయన నాలాయిరం దివ్యప్రభావం గురించి అర్థమైంది. కాని కేవలం అందులో 10 శ్లోకాలుమాత్రమే విన్నాడు. నమ్మాళ్వార్రచనలు ఇవన్నీ. కాని మిగిలిన నాలాయిరం అంటే నాలుగు వేల పాశురాలు తెలియదు. ఆ సమయంలో నాథముని తన రచయిత నమ్మాళ్వారుని ప్రార్థన చేసి ఆయన తమకు దొరికిన 10 శ్లోకాలనే జపంద్వారా తపస్సు చేసారు. అది 12వేల సార్లు పఠించారు. ఆ తపస్సు మెచ్చి నమ్మాళ్వార్ ప్రత్యక్షమై 4వేలపాశురాలను (శ్లోకాలు) వారికిసమర్పించారు. ఆ పాశులాలను శ్రీరంగంలో తన ఇద్దరు మేనల్లుళ్ళకు శ్లోకాలు నేర్పించడం ద్వారా ఎంతో కీలకమైన ద్రావిడ వేదాలయిన 4 వేలపాశులాలను రక్షించేవారు. వారు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలోని శ్రీరంగస్వామి సేవచేస్తూ, ఆలయ నిర్వాహకుడిగా పనిచేసేవారు.

ఇందులో మాట నేర్పరితనం, ప్రమాణాల ద్వారా జ్ఞానం సంపాదించడం ప్రస్తావనకు వస్తాయి. యథార్థం తెలుసుకోవడానికి సాధనాలను ప్రమాణములు అంటారు. అవి మూడు రకాలు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఇంద్రియముల చేత విషయములను అనుభవించడం ద్వారా తెలుసు కోవడం ప్రత్యక్షం. కంటితో ఒక వస్తువును చూడడం, చెవితో వినడం,  ముక్కుతో వాసన చూడడం. తాకి తెలుసుకోవడం, నాలుకతో రుచి చూడడం వంటివి. కార్యమును చూసి కారణాన్ని తెలుసుకోవడం అనుమానం. పొగ నిప్పు ఉంటేనే వస్తుంది. పొగను చూచి నిప్పు ఉందనుకోవడం అనుమాన జ్ఞానం.  ఆప్త్డుడైన వ్యక్తి చెప్పిన మాట విని తెలుసుకోవడం శబ్దజ్ఞానం. భ్రమప్రమాదములు లేకుండా మన మేలు కోరి చెప్పేవాడు ఆప్తుడు. అసలు భ్రమ ప్రమాదములు లేని వారు ఉంటారా? సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడి అనుగ్రహముతో జ్ఞానం పొందిన మహాపురుషులే ఆప్తులు. వారి నుంచి వెలువడిన శృతిస్మృతి అనేవి శబ్దప్రమాణాలు. ఈ మూడు ప్రమాణాలతో తెల్లవారినదని తెలుసుకున్నామని అంటున్నారు గోపికలు.

హనుమ ప్రతిభ తెలిసిన రాముడు

రామాయణంలో ఆంజనేయుడిని మొదటిసారి కిష్కిందలో కలిసిన సమయంలో, ఆయన మాట నేర్పరితనాన్ని శ్రీరాముడు గుర్తించి లక్ష్మణుడికి వివరించే సన్నివేశం ఉంటుంది. ఈతడు రుగ్వేదము, యజుర్వేదము, సామవేదమే కాకుండా మొత్తం వ్యాకరణాన్ని తప్పక అధ్యయనం చేసినవాడని అనిపిస్తున్నది. లేకపోతే ఇంత ఔచిత్యంతో మాట్లాడలేడు కదా అంటాడు శ్రీరాముడు. ఆంజనేయుడి నేర్పరితనం మరొక సారి లంకలోని అశోకవనంలో వ్యక్తమవుతుంది. సీతమ్మకు మాత్రమే వినిపించేట్లు, అదీ ఆమెను అలరించే ధోరణిలో రామకథను హనుమ సంక్షిప్తంగా కావలసినంతమేరకు మాత్రమే చెప్తారు. ఆమె చెవికి ఇంపుగా ఉంటుంది. ఇతరులకు వినిపించదు.

తను శ్రీరామునితో ఉన్నంత వరకు తెలిసిన కథను ముందు వినిపించి, అవుననిపించుకున్న తరువాత, ఆమె అపహరింపబడిన తరువాత సంగతులను వివరించి ఆమెకు తాను మిత్రుడినని నిరూపిస్తాడు హనుమ. అందుకు పాండిత్యము, మాధుర్యము కూడాఉండాలి. గోపికలు కూడా అదే విధమైన పాండిత్యం మాధుర్యంతో సంభాషిస్తున్నారు.

Also read: నిరంతరం యవ్వనంలో ఉన్న గోకులంలో గోవులన్నీ

శంఖ చక్ర ధరుడైన శ్రీకృష్ణుడిని గోపికలు కీర్తిస్తున్నారు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ అని అన్నమయ్య వర్ణిస్తాడు. శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో శంఖచక్రాలతో జన్మిస్తే ఆశ్చర్య పోయి చూసిన దేవకీవసుదేవులు, శత్రువులు ఎక్కడ గమనిస్తారో అని ఆందోళనపడితే, వాటిని మరుగు పరుస్తాడు. అయితే ఆ తరువాత యశోదకు, ప్రియమైన గోపికలకు కూడా ఆయన చతుర్భుజాలతో కనిపిస్తాడట. శంఖ మంటే గోపికలకు చాలా ఇష్టం. శంఖం ఎప్పుడూ శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అధరాలను తాకుతూ ఉంటుంది. అతను ఊదే గాలితో పలుకుతూ ఉంటుంది. అదే విధంగా గోపికలు కూడా శ్రీకృష్ణహస్త, అధర సంస్పర్శనము కోరుకుంటూ ఉంటారట. శంఖము ప్రణవ స్వరూపము. దూరంగా ఉన్న వారికి కూడా శంఖనాదంతో తాను అక్కడ ఉన్నట్టు తెలియజేస్తాడు. ఆవుల మంద వదిలి దూరంగా పోయిన ఆవులను శంఖనాదంతో పిలుస్తాడు. దూరమైన జీవులను దరి చేర్చేది శంఖమే. విరోధులకు గుండెలదిరేట్టు చేసి దూరం చేసేదీ శంఖమే.

విష్ణోర్ముఖోత్థానిలపూరితస్యయస్యధ్వనిర్దానవదర్పహంతాం, తం

పాంచజన్యంశశికోటిశుభ్రంశంఖంసదాహంశరణంప్రపద్యే

అని వేదాంత దేశికులు కీర్తిస్తారు. ఇక పరమాత్ముడిని బాగుగా దర్శనము చేయించేది  సుదర్శన చక్రం. ఆయన సంకల్పిస్తే చాలు దూరంగా వెళ్లి శత్రువులను దునుమాడి తిరిగి వస్తుంది. దూరం ఉన్న ఆప్తులను దరికి రప్పించే శంఖాన్ని, దూరానఉన్న శత్రువులను తరిమి కొట్టే చక్రాన్ని, ఆ శంఖచక్రాలను ధరించిన బాహుయుగళం గలవాడిని ప్రేమిస్తున్నారు గోపికలు. దూరం నుంచే దరిజేర్చి ఉద్ధరించి, ఆలింగనం చేసుకునే దీర్ఘబాహువులు కలిగిన ఆజానుబాహుడిని, చూడగానే కన్నులతో కనికరించి ఊరట కలిగించే ప్రసన్న నేత్రుడైన పుండరీకాక్షుడిని కీర్తిస్తున్నారు.

మేలుకొలుపుల వెనుక వేద రహస్యాలు

          జీయర్ స్వామి వివరణ: మనఆండాళ్తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేదరహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టిరహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం, వేదం (లేకశబ్దంలేకఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు.

ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పే వాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేదమర్గాన్ని విశ్వసిస్తాం. వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహాభారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోపబాలికను కూడా లేపడం ప్రారంభించింది.

Also read: హాయిగా శయనించు మామ కూతురా లేవవమ్మ

గోదమ్మచరణాలకుశరణు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles