Monday, November 28, 2022

గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు

ఒక మృతదేహం వేళ్ళాడుతుండగా అమెరికా హెలికాప్టర్ తో తాలిబాన్ రాక్షస విన్యాసం

ఇరవై ఏళ్ళ సుదీర్ఘ యుద్ధానికి అమెరికా ముగింపు పలికింది. అఫ్ఘాన్ నుంచి తన సైన్యాన్ని పూర్తిగా వెనక్కు తీసుకుంది. చివరి సైనికుడు కూడా అమెరికా చెక్కేశాడు. ఆగష్టు 31వ తేదీ ఉపసంహరణ గడువును తూచా తప్పకుండా పాటించింది.

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

నరమేధం సాగిస్తున్న ఉగ్రవాదులకు వెన్నుచూపి, తనను తాను పూర్తిగా తగ్గించుకుంది. ఈ చర్యతో ఈ వైఖరితో అమెరికా ప్రతాపం అంతరించిపోయిందనే మాటలు వినపడుతున్నా ఏమీ ఎరగనట్లు కొత్త నాటకానికి తెర ఎత్తుతోంది.  ప్రపంచ దేశాలకు పెద్దన్నగా పెద్ద పాత్రను పోషించాలన్నది అమెరికా నిరంతర కాంక్ష. అగ్రరాజ్యంగానే శాశ్వతంగా మిగిలిపోవాలన్నది ఆ దేశపు ఆశయం. అఫ్ఘాన్ విషయంలో వ్యవహరించిన తీరుకు దేశాలు తలంటుతున్నా, ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అమెరికా సేనల ఉపసంహరణ ముగిసిన వెనువెంటనే  తాలిబాన్ రాకాసి మూక పండుగ చేసుకుంది. తమకు ఇక ఎదురేలేదంటూ వారు వీర విహారం చేస్తున్నారు. వారి ఊచకోతల పర్వం రెట్టింపు ఉత్సాహంతో సాగుతోంది. రాజధాని కాబూల్ విమానాశ్రయాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. అంతే కాదు.  కాందహార్ లో ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్ కు తాడుతో కట్టి వేలాడదీస్తూ  ఆ మూక వికటాట్టహాసంతో విహరిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తాలిబాన్ అమానుష చర్యలకు ఇది పరాకాష్ట.

Also read: అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం

క్షమార్హం కాని అమెరికా వైఖరి

ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఉన్న అమెరికా తీరు క్షమార్హం కాదు. నేడు  అఫ్ఘాన్ లో ఈ దుస్థితి రావడానికి మూటికి ముమ్మాటికీ బాధ్యురాలు అమెరికా. తాలిబాన్ దుండగులు విహరించిన హెలీకాప్టర్ కూడా అమెరికాదే కావడం మరో సిగ్గుచేటు అంశం. అమెరికా సైన్యం పోతూ పోతూ కొన్ని ఆయుధాలను అక్కడే వదిలేసింది. మనిషిని చంపి తాడు కట్టి హెలీకాప్టర్ కు వేలాడతీయడం రాక్షసత్వానికి ప్రతీక. ఆ ఉగ్రమూకను అలాగే వదిలేస్తే  ఏమవుతుందో చెప్పడానికి అఫ్ఘాన్ లో జరిగే ప్రతిదృశ్యం అద్దం పడుతోంది. రేపటి పరిణామాలు ఏ విధంగా మారబోతాయో అనే భయం గుప్పిట్లో ప్రపంచ మానవాళి ఉంది. కొంతకాలం యుద్ధం చేయడం, ఆ తర్వాత వెనుదిరగడం, కొంతకాలం స్నేహం చేయడం, తదనంతరం తిలోదకాలు ఇవ్వడం అమెరికాకు కొత్త ఏమీ కాదు. అమెరికా నిజస్వరూపాన్ని అర్ధం చేసుకోడానికి అఫ్ఘాన్ పరిణామాలు సరిపోతాయి. ఇటువంటి దేశాలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని  ఇప్పటికైనా మన ఏలినవాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడు సోవియట్ యూనియన్ అధిపత్యానికి అడ్డుగోడ కట్టడానికి, పాకిస్తాన్ తో చేతులు కలిపింది అమెరికానే. ఇప్పుడు తాలిబాన్ తో రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని తోక ముడిచింది ఈ అగ్రరాజ్యమే. తనదాకా వస్తే చూసుకుందామనే వైఖరి అన్ని వేళలా అందరితో చెల్లదు.

ట్రంప్, బైడెన్

తనపై దండెత్తిన బిన్ లాడెన్ ను అంతం చేయాలనుకుంది. అఫ్ఘాన్ అధికారులు,పాకిస్తాన్ సహకారంతో ఆ పని పూర్తి చేసుకుంది. అంతమైంది బిన్ లాడెన్ మాత్రమే. అల్ ఖైదా పూర్తిగా అంతం కాలేదు. ఏదో ఒక స్థాయిలో అది ఉనికిలోనే ఉందని ప్రపంచ దేశాలకు తెలుసు.  అమెరికాకు కూడా తెలుసు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడో పైకి లేస్తారు. ఇరవైఏళ్ళ యుద్ధంలో అటు అమెరికా – ఇటు ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరకలిని మర్చిపోవడం, మర్చిపోయినట్లు నటించడం అమెరికాకే చెల్లింది. ఇప్పుడు  ఐ ఎస్ -ఖారసోనా ఆత్మాహుతి దళ సభ్యులు మరణమృదంగం మోగిస్తున్నారు. మొన్న ఆగష్టు 15 వ తేదీన కాబూల్ విమానాశ్రయం వెలుపుల గేట్ దగ్గర నానా భీభత్సం సృష్టించారు. వందమందికి పైగా అఫ్ఘాన్ సామాన్య పౌరులు, 13మంది అమెరికా సైనికులు బలి అయ్యారు. వీరి నుంచి ముందు ముందు ఎటువంటి దారుణాలను చూడాల్సి వస్తుందో?  అమెరికా వీరిని కూడా ఇలాగే గాలికి ఒదిలేస్తుందా.. అన్నది ప్రశ్న.

Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!

అమెరికా అధ్యక్షుడి కంట కన్నీరు

అఫ్ఘాన్ లో దమనకాండకు భయపడి లక్షలాది మంది ప్రజలు ఇతర దేశాలకు పారిపోయారు.తాజా శతృవుగా మారిన ఐ ఎస్ -కె ( ఇస్లామిక్ స్టేట్ -ఖారసోనా) ఉగ్రవాదుల దాడిలో మొన్న సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు అమెరికా అధ్యక్షుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. గద్గద స్వరంతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ భావోద్వేగం నిజమేనా, అవి మొసలి కన్నీళ్లు కావు కదా అనిపిస్తోంది. అంతగా ప్రపంచ దేశాల దృష్టిలో అమెరికా నమ్మకాన్ని కోల్పోయింది. తాలిబాన్ అధినేతతో అమెరికా ఇంటలిజెన్స్ శాఖ అధిపతి రహస్య మంతనాలు జరిపాడని తెలిసినప్పుడే, అగ్రరాజ్యంపై సగం నమ్మకం పోయింది. ఇప్పటి చర్యలతో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది. మిత్రభేదం -మిత్రలాభం సిద్ధాంతాలతో సాగుతున్న అగ్రరాజ్యపు విదేశాంగ విధానం ఎల్ల మానవాళికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పటికే తాలిబాన్ కు చైనా నిరంతర సహాయ సహకారాలు అందిస్తోంది. రష్యా కూడా ఇంచుమించుగా అదే బాటలో నడుస్తోంది. ఇక పాకిస్తాన్ గురించి చెప్పక్కర్లేదు. దానికి కొత్త రెక్కలు వచ్చాయి. భారతదేశంతో ఆడుకోడానికి, వాడుకోడానికి ప్రతి దేశం తనదైన శైలిలో నడుచుకుంటోంది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలతో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన తరుణం వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని, అమెరికాను నమ్ముకొని ఇప్పటికే మనం చాలా నష్టపోయాం.  ప్రతి దేశం మనకు కొత్త గుణపాఠాలు నేర్పుతోంది.ఇస్లామిక్ ఉగ్రవాదంతో మన దేశానికి ఎప్పటికైనా పెద్దముప్పు తప్పదని గ్రహించి, మనం ముందుకు అడుగులు ముందుకు వెయ్యాలి. తాలిబాన్ విషయంలో మనదేశం ఆచితూచి నడవాలి. అమెరికా అలిసిపోయిందా, అలిసిపోయినట్లు నటిస్తోందా అన్నది కాలంలో తేటతెల్లమవుతుంది.

Also read: తాజా అఫ్ఘాన్ రణక్షేత్రం పాంజ్ షీర్!

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles