Thursday, March 28, 2024

వారు బయటకొస్తారా?

మనం బస్సులోనో రైలులోనో ప్రయాణిస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలో, వృద్ధులో కూర్చోవడానికి సీటు లేక నిలబడినప్పుడు అక్కడ ఉన్న వారందరూ వెంటనే లేచి వారికి కూర్చోమని సీటు ఇస్తారు. అలా ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తులను మిగిలిన ప్రయాణీకులంతా అసహ్యంగా పురుగుల మాదిరిగా చూస్తారు. మానవీయత లేని అలాంటి మనుష్యులపట్ల మనకు తెలియకుండానే విముఖత పెరుగుతుంది. మరి ఎనభై నాలుగేళ్ల వృద్ధుడు స్టాన్ స్వామి తనకు బెయిల్ ఇప్పించమని కోరినప్పుడు నిరాకరించిన జడ్జిలను చూసినప్పుడు మనకెలాంటి భావం కలగాలి? తన జీవితాన్నంతా జార్ఖండ్ గిరిజనం అభ్యున్నతి కోసం అర్పించిన చర్చి ఫాదర్ స్టాన్ స్వామి చేయని నేరానికి జైలులో మగ్గుతున్నానని, బెయిల్ ఇచ్చి కూడా తనపై మోపిన నేరాలకు విచారణ తప్పక జరిపించుకోవచ్చని ఆయన చేసుకున్న విన్నపాలను మన గౌరవ కోర్టులు, విశ్వసనీయ జడ్జిలు పట్టించుకోకుండా మిన్నకున్నప్పుడు వారిలో అమానవీయ హృదయాలను చూసినప్పుడు మనకెలాంటి భావం కలగాలి? తనకు పార్కిన్సన్ వ్యాధి ఉన్నందున చేతివేళ్లు వణుకుతున్నాయని, దేనినీ నిలకడగా పట్టుకోలేక పోతున్నానని, తనకు మంచినీరు, కాఫీ తాగడానికి సిప్పర్, స్ట్రా అందించాలని కోర్టులను దీనంగా వేడుకున్నప్పుడు మన ప్రభుత్వాల మీద మనకెలాంటి భావం కలగాలి? అదే భావం ఇప్పుడు దేశ ప్రజలందరిలోనూ కలుగుతోంది. ఆ సంగతి కోర్టులకు తెలుస్తోంది. ప్రభుత్వానికి తెలియడం లేదు. తెలిసినా తెలియనట్టు నటిస్తోంది.

Also read: జల జగడం

వెల్లువెత్తుతున్న వ్యతిరేకత జైలులో అనారోగ్యం పాలైన స్టాన్ స్వామి జులై ఐదో తేదీన ఆస్పత్రిలో సరైన చికిత్స అందక మరణించారు. నిన్న(సోమవారం) ముంబయి కోర్టులో ఆయన బెయిల్ మీద విచారణ నడిచింది. ఆయన మరణం తమకు బాధ కలిగించిందని జడ్జిలు చెప్పిన మాటలు మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రజలందరికీ మొసలికన్నీరులా కనిపించాయి. బెయిల్ ఇవ్వకుండా తొమ్మిది నెలలు ఆయనను అకారణంగా నిర్బంధించిన కోర్టులు ఈ రోజు మూతి మూడు వంకరలు తిప్పుతూ త్వరితగతిన విచారణ జరగడం మన ప్రాథమిక హక్కు అనడం నంగనాచితనంగా ప్రజలు భావిస్తున్నారు. కోర్టులకు ఈ అకాల జ్ఞానోదయం కలగడానికి కారణం, కోర్టుల నిర్దాక్షిణ్యతకు, అమానవీయతకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, న్యాయమూర్తులు, ఉద్యమకారులు గళమెత్తడమే. తమ జీవితపర్యంతం ప్రజల సంక్షేమం కోసం, మెరుగైన సమాజం కోసం పాటుపడిన వ్యక్తులను పాలకుల పట్ల వ్యతిరేకత ఉందన్న కారణంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని ప్రశ్నిస్తూ వందలాది గొంతులు ఏకమై ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తుండడం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎన్ ఐ ఏ గా పిలవబడే నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ 2017లో బీమా కోరేగావ్ లో కేంద్రప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేలా కుట్ర పూరితంగా ప్రసంగించారన్న కారణంతో ఉపా చట్టాన్ని ప్రయోగించి దాదాపు పదహారుమందిని అక్టోబర్ 2020లో అరెస్టు చేసింది.

Also read: సిక్కోలు రైతుకు బాసట

వరవరరావు, స్టాన్ స్వామి, సుధా భరధ్వాజ్ లాంటి వృద్ధులను జైల్లో నిర్బంధించి వారికి బెయిల్ మంజారు కాకుండా అనేక కుంటిసాకులు చెప్తోన్న ఎన్ ఐ ఏ ఆగడాలకు ఈ దేశంలో అడ్డులేకుండా పోతోంది. దానికి కారణం కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రభువుల పల్లకీలు మోసే బోయీలుగా మన విచారణ సంస్థలు తయారైనప్పుడు దేశంలో పరిస్థితులు ఇలానే తగలడతాయన్న ఉదంతాలు ఇంతకుముందు చాలా దేశాలలో చూశాం. ప్రభుత్వం ఊదే నాదస్వరాలకు తలలూపే డూడూ బసవన్నలుగా మన విచారణ సంస్థలు తయారైన తీరును ఈ అక్రమ నిర్బంధాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలో పెరుగుతోన్న నియంతృత్వ పోకడలకు సజీవ ఉదాహరణలుగా ఈ సంఘటనలు సంకేతమవుతున్నాయి. సోవియట్ రష్యాలో స్టాలిన్ నాయకత్వంలో ఇదే మాదిరిగా ప్రభుత్వానికి ఇరుకున పెట్టే భావజాలం కలిగిన వ్యక్తులను ఏ విధంగా నిర్బంధించి, హింసించిందీ 1940లో ఆర్డర్ కోస్టలర్ నవల “డార్క్ నెస్ ఎట్ నూన్” వర్ణించింది. ఆ నవలలో సన్నివేశాలే మన దేశంలో ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నట్టు కనిపిస్తోంది.

Also read: స్వదేశీ అంటే..?

ఆత్మ పరిశీలన మొదలవుతుందా? ఖైదీల హక్కుల ఉద్యమకారుడు రోనా విల్సన్ తన కంప్యూటర్లో విచారణ సంస్థ కొన్ని ఫైళ్లను చొప్పించిందని ఫిర్యాదు చేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యులు హనీ బాబు కంటి చూపు కోల్పోయే పరిస్థితి కొచ్చింది. కొన్ని మాసాలపాటు ఆయనకు మెరుగైన వైద్యాన్ని సైతం కోర్టులు నిరాకరించాయి. గౌతమ్ నవలఖా, సోమా సేన్, ఆనంద్ తేల్ తుమ్బడే, సురేంద్ర గాద్లింగ్, సుధీర్ ధావలె, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంజాల్వెస్ ఇంకా ఇతరులు విచారణ లేకుండా, బెయిల్ రాకుండా జైలులోనే మగ్గుతున్నారు. జాతీయ పరిశోధన సంస్థ అరెస్టు చేసిన తరువాత కూడా వారిపై సరైన ఆధారాలు చూపకుండా కేవలం దేశానికి ప్రమాదమన్న ధోరణిలోనే కోర్టులను మభ్యపెట్టి వారి అరెస్టులను సాగదీస్తున్నాయి. స్టాన్ స్వామి మరణించిన తరువాత ఈ సోమవారం ఆయన బెయిల్ విచారణ జరిపిన జడ్జిలు ఎస్ఎస్ షిండే, ఎన్ జె జమాదార్ లు మాత్రం ఎన్ ఐ ఏ అధికారుల మీద చిరాకు పడడం విచిత్రం. ఇది కేవలం ప్రసూతి వైరాగ్యంలాగా, స్మశాన వైరాగ్యంలాగా కనిపిస్తోంది. స్టాన్ స్వామి మరణం తర్వాత పెల్లుబికిన ప్రజాగ్రహానికి తక్షణ ప్రతిస్పందనగా కోర్టులు ఈ మాటలు అంటున్నాయా లేదంటే నిజంగానే తమ నిర్లక్ష్యం వల్లనే స్టాన్ స్వామి మరణించారనే ఆత్మపరిశీలన మొదలైందా అన్నది కోర్టుల తరువాతి తీర్పులను బట్టి మనకు అర్థమవుతుంది. దాదాపుగా దేశంలోని అన్ని ఇంగ్లీషు పత్రికలు స్టాన్ స్వామిని మన ప్రభుత్వమూ, విచారణ సంస్థలే హత్య చేశాయని సంపాదకీయాలు, సంపాదకీయ వ్యాఖ్యలు రాశాయి. అనేకమంది న్యాయవాదులు, విశ్రాంత న్యాయమూర్తులు జరిగిన దుర్ఘటనలో కోర్టుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నారు.

Also read: మూతపడనున్న ఇంటర్ బోర్డు?

ముందు నుయ్యి వెనక గొయ్యి ఒక వైపు మనదేశంలో జ్యాడిషియల్ ఏక్టివిజం పెరిగిపోయి ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేస్తున్నాయని భావిస్తుంటే, మరోవైపు తీసుకోవలసిన నిర్ణయం తీసుకోకుండా ఎన్ ఐ ఏ లాంటి విచారణ ఏజెన్సీలు చెప్పే కల్లబొల్లి కబుర్లు వింటూ న్యాయం ప్రసాదించడంలో తీవ్రమైన తాత్సారం చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది సాధారణ ప్రజలను, మేధావులను, జర్నలిస్టులను జైళ్లలోనే మగ్గబెడుతుండడం విడ్డూరంగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రమంగా అసంతృప్తిగా మారి ప్రజాగ్రహంగా పెల్లుబికే ప్రమాదముందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిఏఏ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోరాడుతున్న వందలాది మంది కార్యకర్తల్ని ప్రభుత్వం అరెస్టులతో వేధిస్తోంది. రైతు చట్టాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న అనేకమంది దేశసమగ్రతకు భంగం కలిగిస్తున్నారని ప్రభుత్వం భావించి కేసులు పెడుతోంది. ఇటీవల ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులకు బెయిల్ ఇచ్చిన తీర్పు పట్ల యావద్దేశమూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి. మరీ అల్పసంతోషులుగా మారిన మన లిబరల్ మేధావులు, తెలుగు పత్రికా రచయితలు ఈ తీర్పు మీద వ్యాసాలు, సంపాదకీయాలు కూడా రాసేశారు. వారం తిరక్కుండానే సుప్రీంకోర్టు ఈ నిర్దిష్ట తీర్పును తప్పుపట్టింది. ఇలాంటి తీర్పులు ఇచ్చేముందు సుప్రీం కోర్టు ఇస్తోన్న తీర్పులను గమనించాలని కూడా కోరింది. దాంతో మనవారి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తాము ఇస్తోన్న బానిసత్వ తీర్పులను గమనించాలని కోరడం అత్యంత విచారకరం.
Also read: పలుకే బంగారమాయే!  
రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles