Thursday, March 28, 2024

బిజెపి దూకుడుకు కేసీఆర్ కళ్ళెం వేస్తారా?

భారత దేశ రాజకీయాల్లో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తున్నదని జగమంతటికీ తెలుసు.  నైతిక విలువలు పతనమైన ఈ స్థితిలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియని పరిస్థితి. బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు అధికారానికి దూరమవడం, పశ్చిమ బెంగాల్ లో మమత ప్రధాన అనుచరులను బిజెపి లాక్కోవడంతో దేశ రాజకీయాల్లో అగ్రశ్రేణి జాతీయ నాయకులుగా పేరుపడ్డ వారిద్దరూ ఇప్పుడు సొంత ఇంటిని చక్క దిద్దుకునే పరిస్థితుల్లో పడ్డారు.

ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలను శాసిస్తాను అంటూ నడుంబిగించిన కేసీఆర్ కు రెండు ఎన్నికల్లో దెబ్బపడడంతో ఆయన కూడా తన పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ తిరిగి అధ్యక్ష పీఠం తీసుకుంటానని మాట ఇవ్వడం ఆశలు కల్పిస్తున్న పరిణామం. దేశ రాజకీయాల్లో బిజెపి నెగిటివ్ ఓటు బ్యాంక్ ఏదైనా ఉంది అంటే దాన్ని క్యాష్ చేసుకునే సత్తా కాంగ్రెస్ కు ఉన్నదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇపుడు కేసీఆర్ బిజెపితో సఖ్యతగా ఉండేది కేవలం నిధుల కోసమే. భవిష్యత్ ఎన్నికల రంగంలో కేసీఆర్ మొత్తం పార్లమెంట్ సీట్లు గెలుచుకునే విధంగా పక్కా ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో అరవింద్ ను ఓడించి తిరిగి తన సత్తా చాటుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. నిజామాబాద్ లో అన్ని చెరువుల్లో నీరు నింపడం, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ రైతుల వర ప్రదాయినిగా మార్చే పనితో పాటు, అక్కడి ఉమ్మడి జిల్లా రెడ్డి వర్గాన్ని దరి చేర్చుకునేలా పావులు కదుపుతున్నారు.  

ప్రశాంత్ రెడ్డికొ తోడుగా సురేష్ రెడ్డినీ  రంగం లోకి దింపి రెడ్డి సామాజికవర్గం సమీకరణలు ముమ్మరం చేశారు. ఇక కరీంనగర్ లో వినోద్ కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఈ సారి  పకడ్బందీగా గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇవన్నీ జమిలి ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వ్యూహాలు. భవిష్యత్ దేశ చిత్ర పటంలో థర్డ్ ఫ్రంట్ అనేది అందని ద్రాక్షే. సోనియాగాంధీకి వయసు మీద పడడం, రాహుల్ కు పరిపక్వత లేకపోవడం, ప్రియాంకా రాజకీయ ఊగిసలాట మధ్య కాంగ్రెస్ కు రాష్ట్ర నాయకులు చేరువయ్యే పరిస్థితి శూన్యం. దక్షిణాది రాష్ట్రాల కూడా కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రమే. 

కర్ణాటకలో యడ్యూరప్ప ఏకపక్ష విధానాలు, కేరళలో దేశరాజకీయాల ఉసెత్తక పోవడం, తమిళనాడులో మూడు ముక్కలాట, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ఉద్యమాల వల్ల వాళ్ళెవరూ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టే పరిస్థితిలో లేరు. ఏకైక మహారాష్ట్ర నాయకుడు శరద్ పవార్ వయోభారం వల్ల ఇప్పట్లో కేంద్రంతో పోటీ పడే స్థితిలో లేరు. గమ్మత్తయిన విషయం ఏమిటంటే అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర రాజకీయాల్లో కేంద్ర బిందువు అయ్యాడు. ఒక్క తెలంగాణ కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ సంపాదించుకొని బిజెపితో మాటల యుద్ధం చేస్తున్న ఓవైసీకి, కేసీఆర్ కు మంచి దోస్తీ ఉంది. అయితే కేసీఆర్ పై కుంభకోణాలు వెలికి తీసే ఆలోచన బిజెపి చేస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్న దశలో కేసీఅర్ కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే వెళ్ళడం కష్టం అంటున్నారు. ఇకపోతే కేటీఆర్ కి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ బిజెపి మంత్రి వర్గంలో చేరి ఏడాది పాటు దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలించి మోదీ హవాను దగ్గరి నుండి చూసే అవకాశాలు ఉన్నాయి.

మందిర్-మసీద్ వివాదం కూడా సద్దుమణిగింది కాబట్టి ఇప్పుడు మోదీకి తిరుగు లేని బలం కనిపిస్తుంది. అయితే పొరుగు దేశాలు అయిన చైనా, పాకిస్థాన్ వేసే యుద్ద రణవ్యూహాలు ఎదుర్కోవడంలో మోదీ బిజీగా ఉన్నారు. అలాగే కోవిడ్ పై కూడా అజాగ్రత్త లేకుండా మోదీ  ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసలకు పాత్రమైనాయి. కేసీఅర్ కూడా దేశ రాజకీయాల్ని నిశితంగా పరిశీలించి బిజెపికి దగ్గరై తన సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles