Thursday, December 8, 2022

కశ్మీర్ మంచు కరిగేనా?

జమ్మూ-కశ్మీర్ కు చెందిన వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం మంచి పరిణామామే. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మోదీ సానుకూలంగా ఉన్నారని ఈ భేటీ అనంతరం విపక్షాలు చెబుతున్నాయి. సమావేశానికి ముందు కూడా ఇటువంటి మాటలు వినవచ్చాయి. వీరందరితో సమావేశం ముగిసిన తర్వాత, ట్విట్టర్, పేస్ బుక్ వేదికగా ప్రధానమంత్రి స్పందించారు. ఆ వ్యాఖ్యల్లో పునరుద్ధరణ అంశం ప్రస్తావనకు రాలేదు. జమ్మూ-కశ్మీర్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.

Also read: రాజకీయం కాదంటే కుదురుతుందా?

ప్రజాస్వామ్య పునరుద్ధరణ అగత్యం

అక్కడ అభివృద్ధి జరగాలంటే, ప్రగతిని సాధించాలంటే ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం అవసరమని తెలిపారు. ఇందులో భాగంగా, త్వరితగతిన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం బలపడాలని, రాజకీయాల్లో యువ నాయకత్వం పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ వెలిబుచ్చిన ఆకాంక్షలన్నీ మంచివే. రాష్ట్ర హోదా పునరుద్ధరణలో నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు మైలురాళ్ళని హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈయన మాటలను బట్టి చూస్తే ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరించే అవకాశం ఉందని భావించవచ్చు. జమ్మూ & కశ్మీర్ అంశంలో ఇది చాలా కీలకం. ఆ రాష్ట్రంలో శాంతి, ప్రజాస్వామ్య స్థాపనల విషయంలో అంతర్జాతీయంగానూ ఒత్తిడి ఉంది. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అభిప్రాయం కూడా అదే. 370 ఆర్టికల్ రద్దు జరిగి, స్వయం ప్రతిపత్తి కోల్పోయి వచ్చే ఆగస్టుకు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా ఈ అంశం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. కానీ ఈ నిర్ణయం ఆ రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని, గొప్ప అభివృద్ధి జరుగుతుందని, ఒకప్పటి సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడతాయని బిజెపి పెద్దస్థాయిలో ప్రచారం చేసింది. ఏ రాష్ట్రానికి చెందినవారైనా అక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చని, వ్యాపారాలను విస్తరించుకోవచ్చని, వివాహ సంబంధాలు పెంచుకోవచ్చని, సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పరచుకోవచ్చని విస్తృతంగా ఆశలు కల్పించారు. వాస్తవానికి అవ్వేమీ జరుగలేదు. ఉద్రిక్తతలు ఇంకా చల్లబడలేదు. అభివృద్ధి పెరగలేదు.

Also read: ‘సత్య’మేవ జయతే!

కరోనా కష్టాలే అభివృద్ధికి అవరోధం

ఈలోపు,దాదాపు 15 నెలల నుంచి కరోనా కల్పిత కష్టాలు, లాక్ డౌన్, కర్ఫ్యూలు మొదలైనవి ఆశించిన అభివృద్ధి జరగకపోవడానికి ఒక కారణం కావచ్చు. అక్కడ స్వేచ్ఛా వాతావరణం ఏర్పడడం అత్యంత కీలకం. శాంతి స్థాపన జరగడం ముఖ్యం. ప్రజాస్వామ్య వాతావరణం క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా ఉండడం అన్నింటికంటే ముఖ్యం. ఇవేమీ కుదటపడకుండా అభివృద్ధి, ప్రగతిని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అమెరికా మొదలు అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడి నేపథ్యంలో, కీలకమైన సరిహద్దు రాష్ట్రంగా ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాల పునరుద్ధరణ తప్పేట్లు లేదు. బిజెపికి ఎన్నికల్లో గెలుపు అత్యంత కీలకం. అందులో భాగంగానే నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంలో, వ్యతిరేకతలు ఎట్లా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. 2020 డిసెంబర్ లో ఆ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి 74 స్థానాలు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫారూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ మొదలైనవారి సారథ్యంలో ఏడు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి. ఈ కూటమికి ‘ గుప్కార్’ అనే పేరు పెట్టుకున్నారు. ఈ కూటమి 100 స్థానాలను కైవసం చేసుకొని, బిజెపి కంటే బలంగా ఉంది. అక్కడ  తన బలాన్ని గణనీయంగా పెంచుకోవడం కోసం బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Also read: దేశమంతటా రాజకీయాలాట!

రాష్ట్ర హోదా పునరుద్ధరణ సంభవం

ఈ వ్యూహంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ ఆజాద్ కు బిజెపి గాలం వేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ముగిసింది. బలమైన నేత, వ్యూహప్రతివ్యూహాలు, స్థానిక అంశాలు బాగా తెలిసినవాడు. నిజంగా గులాంనబీ ఆజాద్ బిజెపిలోకి వస్తే, ఆ పార్టీకి లాభమే. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్ పండిట్లకు పునరావాసం మొదలైన డిమాండ్లను ప్రధానితో జరిగిన సమావేశంలో ముందుంచినట్లు కాంగ్రెస్ నేత ఆజాద్ చెబుతున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లన్నింటినీ అంగీకరించి ఆచరించకపోయినా, రాష్ట్ర హోదాను పునరుద్ధరణ చేసే అవకాశం ఉంది.ఈరోజు బిజెపి ప్రభుత్వం తీసుకోనే నిర్ణయాలు రేపటిభారతానికి గుడిబండలు కాకూడదు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని ఇస్తూ, వారి అభిప్రాయాలను వినడం మంచి పరిణామామే. ఈ సంస్కృతి ఇంకా పెరగాలని ఆశిద్దాం. జమ్మూ&కశ్మీర్ లో శాంతి, ప్రగతి, ప్రజాస్వామ్యం వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

Also read: ఆచరణలో చూపించాలి ఆదర్శాలు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles