Thursday, September 19, 2024

కరోనా మళ్ళీ కాటేస్తుందా?

  • దిల్లీ, ఉత్తరప్రదేశ్ లో హడావిడి
  • ఒమిక్రాన్ కంటే వేగంగా విస్తరించే లక్షణం
  • ‘ఎక్స్ ఈ’ వేరియంట్ అవునో కాదో తేల్చవలసిన ప్రభుత్వం

దిల్లీలో 24 గంటల వ్యవధిలోనే 50 శాతం అధికంగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోనూ కేసుల బెడద హడావిడి చేస్తోంది. దిల్లీ, ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. దిల్లీలో ఒక టీచర్,  విద్యార్థికి కరోనా సోకగా, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా స్కూల్ లో 23మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. ఘజియాబాద్ లోనూ ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో, అక్కడ సెలవులు ప్రకటించారు. ఇదంతా  ‘ఎక్స్ ఈ’  వేరియంట్ ప్రభావమనే చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ వేరియంట్ ముంబయిలో ప్రవేశించింది. ఆ వార్త హల్ చల్ చేయడంతో మహారాష్ట్రతో పాటు తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో, ఎయిర్ పోర్ట్స్ ప్రాంతాలను మరింతగా అప్రమత్తం చేశారు. ముంబయిలో ‘ఎక్స్ ఈ’ వేరియంట్ ప్రవేశించిందనే వార్తను అప్పుడు కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పుడు దిల్లీ, ఉత్తరప్రదేశ్ లో పరిణామాలను బట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,  ప్రజలు కూడా మరింత జాగ్రత్తగా ఉండితీరాలి.

Also read: జీ 7 సదస్సుకు మోదీజీకి ఆహ్వానం ఖాయం

చైనాలో వేలమంది మరణం

చైనాలో ప్రజల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. ఇప్పటికే కొన్ని వేల మరణాలు నమోదయ్యాయి. కొన్ని రోజుల నుంచి భారత్ లో కరోనా అదుపులోనే ఉంది. కొన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ‘ఎక్స్ ఈ’ వేరియంట్ వ్యాప్తి వార్తలు చికాకు తెప్పిస్తున్నాయి. చైనాలో విజృంభణలో ఉన్న వైరస్  ‘ఎక్స్ ఈ’ వేరియంట్ గా అక్కడ ప్రభుత్వాలు ధృవీకరించడం లేదు. ఈ వేరియంట్ ఇండియాలో ప్రవేశించిందా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. అధికారిక ప్రకటనలు కూడా వెలువడాల్సి ఉంది. మన దేశంలో చాలా చోట్ల విద్యాలయాలు నడుస్తున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి సందర్భంలో, కొత్త కేసుల వార్త సంచలనంగా మారింది.   కేసులు తగ్గి, ఒకప్పటి సాధారణ వాతావరణం ఏర్పడుతున్న క్రమంలో, కరోనా జాగ్రత్తలను ఎక్కువమంది పాటించడంలేదనే చెప్పాలి. రద్దీ ప్రదేశాలలోనూ నిబంధనలను కొందరు గాలికి వదిలేస్తున్నారు. కరోనా పూర్తిగా కట్టడిలోకి వచ్చేంత వరకూ అప్రమత్తంగా ఉండి తీరాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నా, ఆ మాటలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. వివిధ కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం శుభపరిణామం. బూస్టర్ డోసులు, ప్రీకాషస్ డోసులు కూడా సిద్ధమై ఉండడం మరో అనందకరమైన విషయం.

Also read: అ‘ద్వితీయ’ విద్యా విధానం

భారత్ లో ఉత్పత్తి చేసిన టీకాలే రక్ష

మనదేశ పౌరులకు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లే ఎక్కువ రక్షణ కల్పిస్తాయని వ్యాక్సిన్ల తయారీదారులతో పాటు, కొందరు నిపుణులు కూడా అంటున్నారు. భారత్ లో మొదటి, రెండు దశల్లో కరోనా ఉధృతి ఎక్కువగా జరిగింది. మూడో దశలో స్వల్ప ప్రభావాన్నే చూపించిందని అనుకోవాలి. ‘ఎక్స్ఈ’ వేరియంట్ లో,  వ్యాపించే వేగలక్షణం ఒమిక్రాన్ కంటే 10శాతం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ, నిశ్శబ్దంగా ప్రజల్లో  ప్రభావాన్ని చూపించింది. గతంలో కరోనా సోకినవారు కొందరు ఇప్పటికీ కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. ‘ఎక్స్ ఈ’ వేరియంట్ ఎటువంటి ప్రభావాలను చూపిస్తుందో ఇంకా తెలియాల్సి వుంది. ఏదిఏమైనా, కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో, జీవితకాలం పనిచేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకూ అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందే.

Also read: మరో మాయదారి వేరియంట్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles