Wednesday, February 1, 2023

చైనా దేనికైనా తెగిస్తుందా, ఆచితూచి అడుగేస్తుందా?

చైనాలో కమ్యూనిస్టుల పాలన ప్రారంభమై 2049 నాటికి వందేళ్ళు పూర్తవుతుంది. అప్పటికల్లా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిమంతమైన రాజ్యంగా వెలుస్తుంది. ప్రస్తుతానికి రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనా కమ్యూనిస్టు పాలన శతవార్షికోత్సవానికి అమెరికాను అధిగమించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుంది.

ఈ తరుణంలో చైనా అధినేత షీ జిన్ పింగ్ మూడవ టరమ్ ప్రారంభించి మావో తర్వాత అంతటి  శక్తిమంతమైన నాయకుడుగా ఎదిగారు. మధ్యలో డెంగ్ వచ్చి 1978లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి నేడు కానవస్తున్న అద్భుత ప్రగతికి బీజాలు వేసినప్పటికీ ఆయన తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం పాశ్చాత్య దేశాల ఆధిక్యాన్ని అంగీకరించే ప్రపంచ వ్యవస్థను చైనా ఎప్పుడూ అంగీకరించలేదు. డెంగ్ చెప్పిన ’24 కారెట్ల వ్యూహం’ ప్రకారం శక్తిని పెంచుకున్నప్పటికీ ప్రదర్శించరాదనీ, అదను కోసం వేచి ఉండాలనే సలహాను షీ పెడచెవిన పెట్టాడు. చైనా ఎప్పుడూ తన అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తుందనీ, సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదనీ చైనా మిత్రులు చేసే వాదనలో పసలేదు. యథాతథ స్థితిని చైనా అంగీకరించడం లేదు. సరిహద్దు దేశాలతో ఘర్షణకు దిగుతున్నది. సామ్రాజ్య విస్తరణకోసం ప్రయత్నాలు చేస్తున్నది. యుద్ధాలకు వెరవడం లేదు.

ముఖ్యంగా ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో తనకు తిరుగులేకుండా చూసుకోవాలన్నద చైనా ఆకాంక్షలాగా కనిపిస్తోంది. వచ్చే పదేళ్ళలో ఈ దిశగా చైనా ఎటువంటి అడుగులు వేస్తుందో జాగ్రత్తగా గమనించాలి. అంతర్జాతీయ వ్యవస్థ సజావుగా నడవడానికి పాశ్చాత్య దేశాలు రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ఏర్పాటు చేసిన నిబంధనలను తోసిరాజంటూ కండబలం ప్రదర్శించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఇటీవల చైనా ఆర్థికాభివృద్ది మందగించింది. చైనీయులలో వృద్దుల సంఖ్య పెరుగుతోంది. యువకుల సంఖ్య తగ్గుతోంది. దీని ప్రభావం కార్ఖానాలలో ఉత్తత్తిపైన పడుతుంది. మానవ శ్రమ బదులు యంత్రాలను వినియోగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ యాంత్రిక శక్తి మానవశక్తికి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కాజాలదు. పైగా అక్కడ నియంతృత్వ పాలన నడుస్తోంది. ఒకే పార్టీ శాసిస్తున్నది. ఆ పార్టీ పట్ల లేదా ప్రభుత్వం పట్ల అసమ్మతి రాజుకుంటే చైనా సామ్రాజ్వవాదానిక బ్రేకులు పడవచ్చు. అప్పుడప్పుడు అసమ్మతి రాజుకోవడం, చైనా ప్రభుత్వం దానిని అణచివేయడం చూస్తున్నాం. అదే అసమ్మతి అవధులు దాటితే అసలుకే మోసం రావచ్చు.

ఇండో-పెసిఫిక్ ప్రాంతంలో తన ఆధిక్యాన్ని కొనసాగించేందుకు అమెరికా ఎంతవరకూ పాటుపడుతుందో చూడాలి. ప్రస్తుతానికి అమెరికా పేరుకు అగ్రరాజ్యమే అయినా అఫ్ఘానిస్తాన్ నుంచి తోకముడిచిన తర్వాత, ఉక్రెయిన్ లో రష్యా యద్దాన్ని నిలువరించలేకపోయిన అనంతరం బలహీనంగా కనిపిస్తున్నది. నాయకత్వలోపం అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి. యూరప్ పైన దృష్టి కేంద్రీకరించవలసి రావడం మరొకటి. ఈ కారణాల వల్ల అమెరికా ఎంతవరకూ ఇండో-పెసిఫిక్ ప్రాంతాన్ని పట్టించుకుంటుందో చెప్పడం కష్టం. ఆస్ట్రేలియా, బ్రిటన్ తో కలిసి ఒక కూటమినీ (ఆకస్), జపాన్, ఇండియా(క్వాడ్)తో కలిసి మరో కూటమినీ ఏర్పాటు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఆ రెండు కూటములూ చైనాను ఎదుర్కోవడానికి అవసరమైన సాధనసంపత్తి అమెరికా నుంచే రావాలి. ప్రధానంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం, ఆర్థికంగా, సైనికంగా ఎదుగుతున్న దేశం ఎంతమేరకు అమెరికా పక్షాన నిలుస్తుందో చూడాలి. భారత్ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో చైనా ఒక వైపు సైనికంగా రెచ్చగొడుతోంది. 1962లో ఆక్రమించిన ప్రదేశం కాకుండా 2020లో మరికొంత ప్రదేశాన్ని అదనంగా ఆక్రమించుకున్నది. మోదీ ప్రభుత్వం అవునన్నా, కాదన్నా ఇది తిరుగులేని నిజం.  చైనాతో సైనికంగా తలబడటానికి భారత్ సిద్ధంగా లేదు. చైనాపైన సర్జికల్ స్ట్రయిక్ చేసే అవకాశం లేదు. రష్యాను కలుపుకొని చైనాతో మైత్రీసంబంధాలు మెరుగుపరచుకొని శత్రుత్వాన్ని తగ్గించుకునే అవకాశాలు వినియోగించుకొనే బాట ఒకటి. మరో బాట ఏమంటే చైనాను వ్యతిరేకించడం, ఆ క్రమంలో అమెరికాకు పూర్తిగా దగ్గరకావడం, క్వాద్ కూటమిలో చురుకుగా పాల్గొనడం, అమెరికాతో, అమెరికా మిత్రదేశాలతో పూర్తిగా మమేకం కావడం. ఇది ఎంతవరకూ అభిలషణీయం? మధ్యస్థంగా నడుస్తున్న ఇండియా ఏ దారి అయినా తొక్కవచ్చు.  అయితే, సప్త సముద్రాల ఆవల ఉన్న అమెరికాను నమ్ముకొని పొరుగునే ఉన్న బలమైన చైనాతో రగడ పెట్టుకోవడం నరేంద్రమోదీకి సైతం పూర్తిగా ఇష్టం లేదు. సైనికంగానే కాకుండా ఆర్థికంగా సూపర్ పవర్ గా ఎదిగిన చైనాతో కయ్యం మనకు నష్టదాయకమనే అభిప్రాయం మోదీకి ఉన్నట్టు కనిపిస్తోంది. అమెరికా సహకారం కావాలి. కానీ చైనాను శత్రువుగా పరిగణించకూడదనేది భారత విదేశాంగ విధానం. జనాభాలో త్వరలో చైనాను భారత్ అధిగమించ బోతున్నది. భారత్ లాగానే మూడవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ కూడా చైనాతో తెగతెంపులు చేసుకునే పరిస్థితులు లేవు. అమెరికా, దాని ఐరోపా మిత్రదేశాలు అన్నీ కూడా చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో చైనాతో ఇండియా సున్నం వేసుకోవడం అవివేకం అవుతుంది. కానీ ఈ అధికార సమతుల్యత కొనసాగించడం సాధ్యామా, కాదా అన్నది అనేక అంశాలపైన ఆధారపడి ఉన్నది. ఉదాహరణకు భారత్-చైనా సరిహద్దులో మరోసారి యుద్ధం రావచ్చు. ఉత్తరకొరియా అణ్వస్త్రాన్ని బాధ్యతారహితంగా వినియోగించవచ్చు. అమెరికా విసుగుపుట్టి ఇండో-పెసిఫిక్ ప్రాంతం నుంచి నిష్క్రమించవచ్చు. షీ హెచ్చరిస్తున్నట్టు తైవాన్ ను కైవసం చేసుకోవడానికి చైనా ప్రయత్నించవచ్చు. దానిని అమెరికా నిరోధిస్తుందా, ఎంతవరకూ తైవాన్ తో అమెరికా నిలబడుతుందనే సమస్య ఉండనే ఉన్నది. ఇటువంటి పరిణామాలు సంభవించవచ్చును, సంభవించకపోవచ్చును.

భారత్, జపాన్ ఆలోచించిన విధంగానే అమెరికా కూడా ఆలోచించవచ్చు. చైనా కూడా తన వైఖరిలో సామరస్యంతో కూడిన మార్పులు తీసుకురావచ్చు. ప్రధానంగా అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పరస్పర వినాశకరంగా కాకుండా, ఎవరో ఒకరు పూర్తిగా ఓడాలి లేదా పూర్తిగా గెలుపొందాలి అనే పద్దతిలో కాకుండా ఉభయతారకంగా పరస్పరం సహకరించుకునే విధంగా ఉండవచ్చు. ఈ ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల సహజీవనం  కొత్తకాదు. పరోక్ష ఘర్షణలు అనివార్యం. పూర్వపు సోవియెట్ యూనియన్ కంటే ప్రస్తుత చైనాతో అమెరికాకు ఆర్థిక, సాంఘిక సంబంధాలు ఎక్కువ. కనుక పరస్పరం సహకరించుకుంటూ, ‘బతుకూ, బతకనివ్వు’ అనే సూత్రం పాటించినట్లయితే అమెరికా, చైనాలు ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన రెండు ముఠాలకు నాయకత్వం వహించకుండా ప్రపంచ శాంతికి దోహదం చేయవచ్చు. అప్పుడు ఇండియా, జపాన్, వియత్నాం వంటి దేశాలు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకొని ఇటు చైనాతో అటు అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించవచ్చు.

ఈ దిశగా షీ జిన్ పింగ్ ఆలోచించే అవకాశం ఉన్నదా? లేదా? మొత్తం చర్చ చైనా వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది.

షీ జిన్ పింగ్ మూడవ ఇన్నింగ్స్ లో సాధించాలని పెట్టుకున్న లక్ష్యాలలో  తైవాన్ ను సొంతం చేసుకోవడం ఒకటి. ఆర్థికంగా అమెరికాను మించిపోయే మార్గంలో వేగంగా ప్రయాణం చేయాలన్నది మరొకటి. మొదటిదానిపైన రెండవ అంశం ఆధారపడి ఉంటుంది. తైవాన్ జోలికి వెడితే, అందులో అమెరికా జోక్యం ఉంటే ఆర్థికంగా చైనా దెబ్బతింటుంది. తైవాన్ తో పెట్టుకోకుండా ఇప్పటి స్థితినే కొనసాగిస్తే ఆర్థిక రథం నిరాఘాటంగా కొనసాగుతుంది. షీ జిన్ పింగ్ ఆలోచనా విధానం అన్ని విషయాలలో నిర్ణాయకాంశం అవుతుంది.    

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles