Friday, April 19, 2024

బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?

Ashoka Biography - Childhood, Life Achievements & Timeline

ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్నీ మార్కెట్ రాజ్యాలుగా, మిలటరీ రాజ్యాలుగా మారుతున్న సందర్భం ఇది! అందుకే, బుద్ధుని ప్రేమజ్ఞాన ధమ్మాన్ని తన రాజ్య విధానంగా చేసుకున్న ప్రపంచ ప్రఖ్యాత రాజ్యాధినేత సమ్రాట్ అశోకుని గూర్చి మాట్లాడుకోవలసిన సందర్భం మళ్ళీ ఇప్పుడు వచ్చింది – రాజ్యనిర్వహణలో, పరిపాలనలో ధమ్మాన్ని పాటించి ‘ధమ్మాధిపతేయ’- అంటే సత్యం, రుజువర్తన – సూత్రాన్ని అనుసరించి రాజ్యపాలన చేసిన పాలకుడు అశోకుడు. ఆయన తన పాలనలో ఈ కింది సూత్రాలను అనుసరించాడు. 1. మంచి పాలకుడిగా ఉండడం. 2. చెడు నుంచి ప్రజలను రక్షించడం. 3. పేదలకు భౌతిక వనరులు పంపిణీ చేయడం. 4. ప్రజల కష్టాలను తీరుస్తూ ఉండడం. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడే, ఆ రాజ్యం గణతంత్ర రాజ్యంగా భాసిస్తుందన్నది – బుద్ధుని ధమ్మసారాంశం!

ఆ స్ఫూర్తిని స్వీకరించి, ధమ్మ సమతా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన ఘనత బహుశా ప్రపంచంలో అప్పటకీ, ఇప్పటికీ బహుజనుడైన సమ్రాట్ అశోకునిదే అవుతుంది. మానవీయ విలువలకు మహోన్నత స్థానాన్నందించిన ఆ పరిపాలన తర్వాత కాలంలో పాలకులు మారుతూ ఎలా దిగజారుతూ వచ్చిందో గమనించాలి!

బుద్ధుని హేతువాదం, నైతికతలకు  సంబంధించిన బోధలు నాటి భారత దేశంలో ఒక సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చాయి. అటువంటి ధమ్మాన్ని రాజ్య విధానంగా మార్చుకోవడం ద్వారా అశోక చక్రవర్తి, రాజ్యానికీ – పౌర సమాజానికీ ఉన్న పెద్ద అడ్డుగోడను బద్దలు కొట్టాడు. రాజ్యానికి ఉండే అణచివేత స్వభావాన్ని తుడిచివేసి, హేతుబద్ధమైన నైతిక సమతా సంక్షేమ మార్గానికి రూపకల్పన చేశాడు.

బుద్ధుని ఆరాధనకు పూనుకోలేదు

దొరికిన పద్నాలుగు అతి పెద్ద రాతి శాసన స్తంభాల్లోనూ, అనేక చిన్న రాతి శాసన  స్తంభాల్లోనూ, గుహశాసనాల్లోనూ అశోకుడు తన రాజ్య ధమ్మాన్ని సవివరంగా ఆనాటి ప్రజల భాషలో తెలియజేయడం కనిపిస్తుంది. అయితే, ఆయన ఎక్కడా బుద్ధుడి ఆరాధనకు పూనుకోలేదు. అష్టాంగ మార్గం, నిర్వాణ, శూన్యత, ప్రతీత్య సముత్పాదం, త్వాదశ నిదాన చక్రం వంటి బౌద్ధసత్యాల్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకే ఒక్కసారి  మాత్రం బుద్ధుణ్ణి ప్రస్తావించి, త్రిశరణాల గురించి – బుద్ధం, సంఘం, ధమ్మాలకకు అధిక ప్రాధాన్యమిచ్చాడు. ‘సత్యమేవ జయతే’ అని ప్రకటించి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి ప్రచారం చేశాడు. పుట్టుక ఆధారంగా వివక్ష లేకుండా, ప్రజలందరికీ న్యాయం సమానంగా అదేందుకు యంత్రాంగాన్ని సమకూర్చాడు. న్యాయం ఒక హక్కుగా ప్రజలందరికీ అందేట్లు శ్రమించాడు. యుద్ధ విజయం ద్వారా తన పాలన కొనసాగించకుండా, ధమ్మవిజయం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు కృషి చేశాడు. ఆనాటికీ, ఈ నాటికీ అశోకుడు ప్రతిపాదించి అనుసరించిన ‘వ్యవహార సమత’ – అంటే హక్కులు బాధ్యతల్లో సమానత్వం, ‘దండ సమత’ – అంటే శిక్షలో సమానత్వం, చట్టబద్ధమైన పాలన – అదీ సుపరిపాలన – దర్మబద్ధమైన పాలన! ఇవీ ఏ కాలంలోనైనా, ఏ ప్రభుత్వాలైనా ఆచరించాల్సినవి!  అదే అశోకుడి గొప్పతనం – అందుకే భారత దేశ చరిత్రలో మౌర్య చక్రవర్తి అశోకుడి పరిపాలనా కాలం చిరస్థాయిగా, అదర్శంగా నిలిచిపోయింది. అందుకే అశోకుడు గ్రేట్!

లౌకికవాది

వ్యక్తిగతంగా తను బుద్ధధమ్మాన్ని అనుసరించినా, పరిపాలనలో గొప్ప లౌకికవాదిగా వ్యవహరించాడు. ఏ మతభావననీ, ఏ దేవుడినీ తన పాలనలోకి రానివ్వలేదు. బౌద్ధ, జైన, అజీవక, చార్వాక సిద్ధాంతాల పట్ల సమదృష్టితో వ్యవహరించాడు. బుద్ధుడు తన మొదటి దమ్మచక్ర పరివర్తనా సిద్ధాంతాన్ని బోధించిన సారనాథ్ లో- అశోకుడు ఒక రాతి స్తంభ శాసనం వేయించాడు. అందులో బుద్ధ-ధమ్మ-సంఘ : త్రిశరణాలపై మాత్రమే విశ్వాసం ప్రకటించాడు. తన కాలంలో ఉన్న హేతువాద, నైతిక ధర్మాలు – అంటే చార్వాకం, అజీవకం, సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, జైనం, బౌద్ధం వంటి వాటిని అన్నింటికీ క్రోడీకరించి అశోకుడు తన రాజ్యధమ్మాన్ని రూపొందించుకున్నాడు. నిరంతర హేతువాద – నైతిక విలువల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయాడు.

Ashoka the Great - Kings of India | History for Kids | Educational Videos  by Mocomi - YouTube
Ashoka during Kalinga war

అందుకోసం తన రాజ్యంలో ‘ధమ్మ మహామాత్ర’ అధికారులను కూడా నియమించాడు. తరువాతి కాలంలో ఇలా అన్ని తాత్విక విలువల్ని స్వీకరించి, అందరికీ ఆమోదయోగ్యమైన పాలన చేసిన మరో చక్రవర్తి కేవలం అక్బర్ మాత్రమే! తన రెండో రాతి స్తంభ శాసనంలో అశోకుడు ధమ్మాన్ని ఇలా నిర్వచించాడు : ‘‘ధమ్మం అంటే తప్పులేనిది. దానం, దాతృత్వం, సత్యసంధత, మంచి ఆలోచన గల పరిశుద్ధత’’ – అని. పదో రాతి స్తంభం మీద ‘‘చెడు నుంచి విముక్తి’’ అని.. అలాగే పన్నెండో రాతి స్తంభం శాసనంలో – ‘‘ఇతర ధమ్మాల పట్ల సహనం, బహుశ్రుత – అంటే ఇతర మతాల వాదన వినే సహనం – ఉండడమే ధమ్మం’’- అని నిర్వచించాడు. ఆయన చర్యలు సర్వజనహితంగా ఉండేవి.

పురోహిత బ్రాహ్మణవర్గం ఆధిక్య భావన

అయితే, పుట్టుకతో తామే అధికులమని భావించే పూజారి, పురోహిత బ్రాహ్మణ వర్గానికి అశోకుని చర్యలు నచ్చలేదు. విద్య కేవలం బ్రాహ్మణవర్గ హక్కుగా భావించిన వీరికి ‘అందరికీ విద్య’ – అనే చర్య నచ్చలేదు. వేర్వేరు వృత్తులు చేసుకునే శూద్రులకు పెద్ద ఎత్తున దానాలు, ధర్మాలు చేయడం, నిధులు సమకూర్చడం నచ్చలేదు. అగ్రహారాలు, దేవాలయ భూములు తమకే కావాలనుకునేవారికి ఈ చర్య కోపాన్ని తెప్పించింది. అంతే గాక, ప్రభుత్వ అధికారుల నియామకానికి కులాల/వర్ణాల తేడా చూడకపోవడం…మత గ్రంథాల ఆధారంగా కాక, ధమ్మం పునాదిగా చట్టబద్ధమైన పరిపాలన సాగించడం… వంటివన్నీ ప్రత్యేక హోదా కోరుకునే పురోహిత వర్గానికి  ఏ మాత్రమూ నచ్చలేదు. అవన్నీ వారికి ఎదురుదెబ్బలయ్యాయి. మతక్రతువుల్లో జంతు బలుల్నిఅశోకుడు నిషేధించాడు. కారణమేమంటే, వ్యవసాయానికి ఉపయోగపడే ఆవుల్ని, కోడెల్ని, గేదల్ని మూర్ఖంగా యజ్ఞయాగాల పేరుతో బలి ఇస్తున్నారని దాని వల్ల సమాజానికి నష్టం జరుగుతూ ఉందని, ఒనగూడే మేలు ఏమీ లేదని అహంసావాది అయిన చక్రవర్తి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ చర్య తమ వైదిక ధర్మానికీ, తమ ఆచారవ్యవహారాలకూ పెద్ద విఘాతం కలిగించిందని బ్రహ్మణ వర్గం కుతకుతమని ఉడికిపోయింది. మౌర్య సామ్రాజ్యంపై కత్తికట్టింది. లోలోన కుట్రలు ప్రారంభించింది.

దానికి తోడు, భూదేవతలమని తమ గురించి తాము ప్రచారం చేసుకునే వర్గాన్ని అశోకుడు ‘‘అబద్ధపు దేవతల’’ని అన్నాడు. పైగా అదే విషయం తన సహస్రం రాతి శాసనంలో ప్రకటించాడు కూడా! అప్పటి వరకు బ్రాహ్మణ, పురోహిత వర్గం – ‘‘దేవుళ్ళే పరోక్ష దేవుళ్ళని, తామే ప్రత్యక్ష దేవుళ్ళమని – ఈ లోకంలో తమని సంతృప్తిపరిస్తే – పైలోకంలో ఉన్న దేవుళ్ళు సంతృప్తి పడతారని’’ ప్రచారం చేసుకునేవారు.

దైవాధీనం జగత్ సర్వం

మంత్రాధీనం తదైవతం

తన్మంత్రా బ్రాహ్మణాధీనం

బ్రాహ్మణో మమదేవతా

ఈ లోకమంతా దేవుడి అధీనంలో ఉంది.

దేవుడు మంత్ర అధీనంలో ఉన్నాడు

మంత్రం బ్రాహ్మణుడి అధీనంలో ఉంది

అందువల్ల బ్రాహ్మణుడే మా దేవుడు – అని పై శ్లోకానికి అర్థం! అది ఎవరో చెప్పింది కాదు. తమ గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఆ వర్గం ప్రచారం చేసుకున్నదే – అలాంటప్పుడు వారిని ‘అబద్ధపు దేవుళ్ళు’ అని అశోకుడు అధికారికంగా ప్రకటించడంతో – ఆ వర్గం కోపం పట్టలేక రగిలిపోయింది. అశోకుడు వాస్తవం చెప్పాడే గాని,  ఆ వర్గాన్ని ఎప్పుడూ ఎక్కడా ద్వేషించలేదు, హింసించలేదు. ఇతర జాతులవారి వలెనే వారిని ప్రేమించాడు. మనుషులందరికీ సమాన హక్కులుంటాయని చెప్పాడు. తమను కూడా ఇతరులతో సమానంగా చూడడం పురోహిత బ్రాహ్మణ వర్గానికి నచ్చలేదు. సంస్కారులెవరో సంస్కారహీనులెవరో మనమిప్పుడు బేరీజు వేసుకోవచ్చు.

The Pillars of Ashoka (article) | South Asia | Khan Academy

మౌర్య సామ్రాజ్య పతనం

మరో వైపు అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం, భూమి వంటి వ్యవహారాలలో బ్రాహ్మణుల ప్రత్యేక హోదా/స్థాయి/గుర్తింపు – తగ్గుముఖం పట్టింది. అందువల్ల ఆ వర్గం అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చింది. విప్లవాత్మకమైన మౌర్యుల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తూ వచ్చింది. కుట్రలు పన్నుతూ వచ్చింది. చివరకు ఆరు తరాల తర్వాత, చివరి మౌర్య చక్రవర్తి బృహద్రత (187-185 బీసీఈ) పరిపాలా కాలంలో అతని సేనాని పుష్యమిత్ర శృంగుని ద్వారా వారు తమ పగ తీర్చుకున్నారు. తమ వర్గానికి చెందిన బ్రాహ్మణ సేనాని పుష్యమిత్ర శృంగునితో బృహద్రత మౌర్యను హత్య చేయించారు. బౌద్ధ భిక్షువుల తలలు నరికించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, నైతికత పునాదిగా ఉన్న మౌర్య సామ్రాజ్యాన్ని అన్యాయంగా కూల్చేశారు. ఈ విషయాలన్నీ మహామహోపాధ్యాయ హరిప్రసాద్ శాస్త్రి రచనల్లో విపులంగా ఉన్నాయి. బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ కూడా ఈ విషయాలను గూర్చి రాశారు. ఆసక్తి ఉన్నవారు వెతుక్కోవచ్చు. మహామహోపాధ్యాయ హరిప్రసాద్ భట్టాచార్య – హరిప్రసాద్ శాస్త్రిగా ప్రసిద్ధులు. ఢాకా విశ్వవిద్యాలయంలో డిపార్టుమెంట్ ఆఫ్ బెంగాలి మరియు సంస్కృతం శాఖకు అధిపతి. సంస్కృతంలో ఆచార్యుడైనా, చరిత్రకారుడిగా కూడా ప్రసిద్ధులు. 6 డిసెంబర్ 1853-17వనంబర్ 1931 మధ్య కాలంలో జీవించారు. ‘మగధన్ లిటరేచర్,’ ‘డిస్కవరీ ఆఫ్ లివింగ్ బుద్ధిజం ఇన్ బెంగాల్’ – పుస్తకాలలో ఆయన పై విషయాలు నమోదు చేశారు.  స్వయంగా నేపాల్ దర్శించి, బౌద్ధ ధమ్మానికి సంబంధించి అనేక గ్రంథాలు అధ్యయనం చేసి వచ్చారు.

మౌర్య సామ్రాజ్యాన్ని కూల్చిన తర్వాత పుష్యమిత్ర శృంగుని నేతృత్వంలో బ్రాహ్మణ పురోహిత వర్గం రెచ్చిపోయింది. బౌద్ధ భిక్కువుల్ని నాస్తికులుగా గుర్తించి ఎక్కడికక్కడ చంపేయాలని ప్రకటించింది. ప్రజల ఆలోచనల్లో నుంచి బుద్ధుడి ముద్రను చెరిపేయడానికి రాముణ్ణి దేవుడుగా సృష్టించింది. బౌద్ధారామాలు, చైత్యాలు కూల్చి, వాటిపై వారి మతానుసారం ఆలయాలు కట్టుకుంది. మనుస్మృతితో సహా అనేకానేక స్మృతులు, పురాణాలు ప్రకటించి జనజీవితాన్ని కట్టుదిట్టం చేసింది. బౌద్ధం స్వీకరించిన శూద్రుల్ని, వృత్తిపనివారిని, మహిళల్ని – మానవ హక్కులు లేకుండా కట్టిపడేసింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని  అంటరానితనాన్ని ప్రవేశపెట్టింది. వర్ణవ్యవస్థను,కులవ్యవస్థను విస్తృతంగా ప్రచారం చేసి, జనాన్ని విడగొట్టింది. వృత్తుల్ని వంశపారంపర్యం చేసి, నిచ్చెనమెట్ల అసమానత్వాన్ని భారతీయ సమాయంలో స్థిరపచ్చింది. వీటన్నింటికీ చారిత్రక, పురాతత్వ, సామాజిక శాస్త్ర ఆధారాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనసుకున్న కళ్ళు తెరచి, మెదుడతో ఆలోచిస్తే నిజంగానే నిజాలన్నీ బయటపడతాయి.

మౌర్య సామ్రాజ్య పతనం అంటే – అది బహుజనుల పతనం! బౌద్ధధమ్మాన్ని కాలదన్నుకుని ఈ దేశం తన ఆత్మను కోల్పోయింది. బుద్ధుని జ్ఞానమార్గం వదిలిపెట్టి పరాయీకారణకు గురై  చీకటి యుగంలోకి దిగజారి పోయింది. పాలకులకు, పాలితులకు మధ్య ఉన్న అంతరాల్ని చెరిపేసి మళ్ళీ అశోకుని ధమ్మపాలన స్థాపించుకోవలసిన చారిత్రక అవసరం వచ్చేసింది. నిచ్చెనమెట్ల సంస్కృతిని త్యజించి, భారత దేశాన్ని నిజమైన గణతంత్ర రాజ్యంగా, సోషలిస్ట్ రాజ్యంగా, మానవీయ విలువలతో నడిచే వైభవోజ్వల రాజ్యంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత – ఇప్పుడు ఇక ఈ దేశ పౌరులదే!

(ఈ వ్యాసాన్ని ‘సకలం’ లో 15 అక్టోబర్ 2021నాడు ప్రచురించాం. కొత్త పార్లమెంటు శిఖరంపై ఉండే అశోకుడి సింహాలను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన తర్వాత ఈ వ్యాసాన్ని తిరిగి ప్రచురిస్తున్నాం. అశోకుడి సింహాలు ప్రశాంతంగా, మౌనంగా, నిర్మాణాత్మకంగా కనిపిస్తుంటే మోదీ మార్చిన (‘మోడిఫై’ చేసిన) సింహాలు ఉగ్రరూపంలో గర్జిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. దీనికి దేశంలోని ప్రతిపక్షాలు తీవ్రఅభ్యంతరం తెలిపాయి. అశోక చక్రాన్ని ఎంపిక చేసుకోవడంలో ఉద్దేశం గురించి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ నిర్మాణసభలో చేసిన ప్రసంగ స్ఫూర్తికి మోదీ సింహాలు విరుద్ధంగా ఉన్నాయన్నది మేధావుల అభిప్రాయం.)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles