Tuesday, December 5, 2023

ఏపీ ఎన్నికలలో ఎవరి పంతం నెగ్గుతుంది?

  • ప్రభుత్వానిదా, ఎన్నికల కమిషన్ దా?

రాజ‌కీయ నాయకుల‌కు రెండు నాల్క‌లు ఉండ‌డం స‌హ‌జం. ఎప్ప‌టికెయ్యది ప్ర‌స్తుత‌మో అనే వైఖ‌రిని అనుస‌రించ‌డ‌మూ కామ‌నే. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు విచిత్రంగా మారాయి. అవునండీ ఏపీ గురించే మాట్లాడుతున్న‌ది. అప్పుడు కాద‌న్న వారే ఇప్పుడు కావాలంటున్నారు. అప్పుడు కావాల‌న్న‌వారు ఇప్పుడు వ‌ద్దంటున్నారు. ఇదీ ఎల‌క్ష‌న్స్ క‌మిష‌న్‌కూ, ఏపీ ప్ర‌భుత్వానికీ మ‌ధ్య తాజా ప‌రిణామం. స్థానిక ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని భావించి, ప్ర‌క్రియ‌ను ప్రారంభించిందీ ఏపీ ప్ర‌భుత్వం. కొంత‌మంది ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు కూడా. మ‌ధ్య‌లో క‌రోనా బూచిని చూపి ఎస్ఇసి వాటికి బ్రేక్ వేశారు. ప్ర‌భుత్వం కోర్టుకెళ్ళింది. స్థానికంగా తేల్చుకోవాల‌ని సుప్రీం తీర్పు చెప్పింది. హైకోర్టు ఎస్ఈసీకి అనుకూలంగానే ఓటేసింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌లు నిలిచిపోయాయి. క‌ట్ చేస్తే ఎనిమిది నెల‌ల త‌ర‌వాత ఎస్ఈసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఉద్యుక్తుల‌వుతున్నారు. అధికార పార్టీని మినహాయించి ఇతర రాజ‌కీయ పార్టీల నేత‌లతో స‌మావేశ‌మై ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌క్రియ ముగించాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడు క‌రోనా తీవ్ర‌త అంత లేదు కాబ‌ట్టి ప్ర‌మాదం అట్టే లేదంటున్నారు. ఇక్క‌డే ఏపీ ప్ర‌భుత్వం వ్య‌తిరేక వైఖ‌రిని తీసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో నిర్వ‌హ‌ణ కుద‌ర‌దంటోంది. మంత్రి కొడాలి నాని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ రమేష్ కుమార్ పై నిప్పులు కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న‌ట్లు ఎస్ఈసీ ఆడుతున్నార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌.

ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ నీలం సాహ్నీ సైతం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఇప్పుడు కుద‌రదంటున్నారు. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోతే, రావాల్సిన నిధులు రావ‌నేది ఎస్ఈసీ వాద‌న‌. స‌రిగ్గా ఎస్ఈసీ చెప్పిన అంశాన్నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల‌లో చెప్పారు. అయినా ఎస్ఈసీ ప‌ట్టించుకోకుండా ఎన్నిక‌ల‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప‌రిపాల‌న‌-శాస‌న వ్య‌వ‌స్థ‌ల న‌డుమ ఘ‌ర్ష‌ణపూరిత వాతావ‌ర‌ణం ప్ర‌జాస్వామ్యానికి ఎంత‌మాత్ర‌మూ మంచిది కాదు. ప‌రిపాల‌న స‌జావుగా న‌డ‌వ‌డానికి అదెంత‌మాత్ర‌మూ స‌హ‌క‌రించ‌దు. క‌రోనా కాటుతో దేశంలోని అన్ని రాష్ట్రాల‌లో దాదాపుగా రాబ‌డి త‌గ్గిపోయింది. అలాగ‌ని బీహార్ ఎన్నిక‌ల‌ను ఆపేశారా? లేదే? అగ్ర‌రాజ్యం అమెరికాలో కంటే తీవ్ర‌మైన క‌రోనా ప్ర‌భావం ఏపీలో ఉందా? లేదే? మ‌రి ఎస్ఈసీ అప్పుడు ఎందుకు వ‌ద్ద‌న్నారు? ఇప్పుడు ప్ర‌భుత్వం ఎందుకు నిరాక‌రిస్తోంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు కార‌ణం కేవ‌లం రాజ‌కీయం. అధికార-ప్ర‌తిప‌క్షాల న‌డుమ సాగుతున్న ప్రేమాయ‌ణం.

Also Read: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ కీలక నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం

2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి అధికారాన్ని నిరాక‌రించినా.. ఆ పార్టీ వ్య‌వ‌స్థ‌లో ఉన్న ప‌ట్టుతో కొన్ని విభాగాల్లో ఇప్ప‌టికీ ఆధిప‌త్యాన్ని నెరపుతోందనేది ప‌రిశీల‌కుల అభిప్రాయం. గ‌త శాస‌న స‌భ‌లో ఏం జ‌రిగిందో ఒక‌సారి గుర్తుచేసుకుంటే ప్ర‌తిప‌క్షానికి తీగ దొర‌క‌వ‌చ్చు. ప‌దేప‌దే త‌మ‌కు అడ్డుత‌గులుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌పై వేసిన సస్పెన్ష‌న్ వేటును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివ‌రి వ‌ర‌కూ స‌భ‌కే వెళ్ళ‌లేదు. త‌ద్వారా టీడీపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టింది. ప్ర‌స్తుతం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా కొన్ని విష‌యాల్లో త‌మ మాట‌ను నెగ్గించుకోలేక‌పోతోంది. దీనికి కార‌ణం కోర్టుల‌నేది ఆ పార్టీ ఆరోప‌ణ‌. స్థానిక ఎన్నిక‌ల అంశంలోనూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

ఏ అధికారి అయినా త‌న వారు త‌న బృందంలో ఉండాల‌ని కోరుకుంటారు. మ‌రి ప్ర‌భుత్వ పెద్ద అలా అనుకోవ‌డంలో త‌ప్పేముంది? వ‌రుస‌గా ప్ర‌క్షాళ‌న చేసుకుంటూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రికి ఎస్ఈసీ అంశంలో త‌న మాట చెల్ల‌లేదు. మిగిలిన విష‌యాల్లో చెల్లిన మాట ఇక్క‌డెందుకు పొల్లుపోయింద‌నేది సింహావ‌లోక‌నం చేసుకోవాలి. ప్ర‌జాసంక్షేమంపై దృష్టి పెట్టి, క‌ష్ట‌మైనా హామీల‌ను నెర‌వేర్చుకుంటూ వ‌స్తున్న ప్ర‌భుత్వం వ్య‌వ‌హార‌శైలి అభినంద‌నీయ‌మే. ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారంలో అధికార రాజ‌కీయానిదే పైచేయి అవుతూ వ‌స్తోంది. తాజా ఉదంతంలో ఎన్నిక‌ల నిర్వ‌హించాల‌న్న ఎస్ఈసీ పంతం నెగ్గుతుందా? వ‌ద్దంటున్న ప్ర‌భుత్వ వాద‌న నిల‌బ‌డుతుందా? వేచి చూడాల్సిందే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles