Friday, June 9, 2023

ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’

తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీ   రెండు ప్రధాన పార్టీలు భుజాలు తడుముకునే పరిస్థితిని కల్పిస్తోంది.  ఆమె ప్రయత్నాలకు కారకులు మీరంటే మీరని  ఆరోపణలు చేసుకుంటున్నాయి. సమైక్యవాదానికి మద్దతు తెలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చెందిన  వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ముందుకు రావడం అంటే  అక్కడి పార్టీల  పెద్దల ఆశీస్సులు ఉండకపోవని  చెప్పుకుంటున్నారు. ఆమె `సాహసాని`కి  ఊతమిస్తోంది మీరంటే మీరని భారతీయ జనతా పార్టీ,  తెలంగాణ రాష్ట్ర సమితి పరస్పరం ఆరోపించుకుంటున్నాయి.

టీఆర్ఎస్ వ్యూహమే..?

ఒక బలమైన సామాజిక వర్గం ఓట్లు చీల్చే ప్రయత్నంలో  భాగంగానే  తెరాస అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు  ఇలా తెరవెనుక కథ నడిపిస్తున్నారని  అంటున్నారు.  ఏపీలో  వైసీపీకి బేజేపీతో  పరోక్ష సంబంధాలు ఉన్నాయన్న  ప్రచారం నేపథ్యంలో  ఆ బంధానికి విఘాతం కలుగకుండా షర్మిల `సాయం` తీసుకుంటున్నారనే వదంతులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ఎన్నికల్లో టీఆర్ఎస్ కు  వైసీపీ సహకరించిందంటూ బీజేపీ ఆగ్రహించిందనే వార్తలు కూడా వచ్చాయి. వైఎస్ `ఆత్మ`గా చెప్పే కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు కేసీఆర్ ఆంతరంగిల్లో ఒకరయ్యారనీ, షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా బలమైన ఒక సామాజిక వర్గం ఓట్లను మళ్లించుకునే ప్రయత్నమనీ అంటున్నారు. షర్మిల రాజకీయరంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోందని  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మామూలు పరిస్థితులలో అయితే రాష్ట్రంలో  వైఎస్ కుటుంబసభ్యుల రాజకీయ ప్రవేశాన్ని, ప్రమేయాన్ని కేసీఆర్ అంగీకరించేవారు కాదనీ, అనూహ్యంగా బలపడుతున్న బీజేపీని నిలువరించాలంటే `ప్రమాదరహిత శత్రువు`ను చేరదీయాలనే సూత్రాన్ని పాటిస్తున్నారని  బీజేపీ నాయకులు సహా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Also Read : కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?

‘కారు’కు బ్రేకులు వేయగలం: బీజేపీ

మరోవంక, ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్సార్ పార్టీ బీజేపీతో రహస్య దోస్తీ కొనసాగుతోందనీ, దానిని పురస్కరించుకొని బీజేపీ షర్మిల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందనీ  మరో ప్రచారం ఉంది.  అయితే బీజేపీ  దానిని తోసిపుచ్చుతోంది. తెరాసను  కట్టడిచేసేందుకు తమ శక్తి  సరిపోతుందనీ, ఇతర  రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదనీ  ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ పార్టీ నాయకులు టీవీ చర్చల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా షర్మిల నాయకత్వంలో  పార్టీ వస్తే ఇక్కడా మతమార్పిళ్లకు ఆస్కారం ఉంటుందనీ, మతమార్పిళ్లను తీవ్రంగా వ్యతిరేకించే తాము ఆ ప్రమాదాన్ని ఎందుకు కొనితెచ్చుకుంటామనీ ప్రశ్నిస్తోంది.  తెలంగాణలో` రాజన్న పాలన` తేవాలన్న  ఆలోచన ఇన్నేళ్లకు వచ్చిందా?అని ప్రశ్నిస్తున్నారు.`మాకు కావలసింది రామరాజ్యం కానీ రాజన్నరాజ్యం కాదని`  అని బీజేపీ వ్యాఖ్యినిస్తోంది.

మా బలగమే చాలు: టీఆర్ఎస్

తెలంగాణలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశం  ప్రయత్నం వెనుక  కేసీఆర్ ఉన్నారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. `పార్టీ అంటే పాన్ షాపు పెట్టడం, పాటలు పాడడం కాదు. పార్టీకి బలమైన పునాది  కావాలి. అది మా పార్టీకి ఉంది. రాష్ట్రంలో  90 శాతానికి పైగా  ప్రజాప్రతినిధులు   తెరాస వారే. ఇరవయ్యేళ్లలో పద్నాలుగు పార్టీలు వచ్చిపోయాయి` అన్న కేసీఆర్ మాటలను గుర్తు చేస్తున్నారు. అంతటి బలం, బలగం ఉన్న తమకు ఇతరుల సహాయం ఎందుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read : షర్మిలకు తెలంగాణలో బ్రహ్మరథం- కొండా రాఘవ రెడ్డి

అది కేసీఆర్ బాణమే…

`జగనన్న` వదిలిన బాణాన్ని  కేసీఆర్ అందిపుచ్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తమ పార్టీని దెబ్బతీయడానికే ఆయన ఈ వ్యూహం పన్నారని, తన వ్యతిరేక ఓట్లను చీల్చి మూడోసారి అధికారానికి రావడానికి కేసీఆర్ వేసిన ఎత్తుగడ అని  టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు , ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయినా, పార్టీకి  అంకితభావంతో పనిచేసే వారు కొత్తపార్టీ వైవు వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు.దివంగత రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ సొత్తని, ఆయన పేరుతో  విభజించే రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదని అన్నారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించడం ద్వారా దక్షిణ తెలంగాణను ఎడారిలో మార్చేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రాష్ట్రాన్ని అన్ని విధాల దెబ్బతీసేందుకు ఆయన సోదరి కొత్త పార్టీతో వస్తున్నారని  విమర్శించారు. తమ పార్టీ నుంచి  ఎవరు అటు తొంగిచూడరని  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు  అన్నారు. షర్మిలకు అంత ఆసక్తి  ఉంటే ఆంధ్రప్రదేశ్ లోనే  పార్టీ పెట్టి నేరుగా పోరాడాలని సూచించారు.

రాజన్నరాజ్యం అంటే…?

అసలు రాజన్నరాజ్యం అంటే  ఏమిటన్నది స్పష్టం కావాలని  వివిధ పక్షాల నాయకులు అంటున్నారు. వైఎస్  ఏలుబడిలో సంక్షేమ  కార్యక్రమాలతో పాటు  అవినీతి ఆరోపణలు ఉన్నాయనీ, నీటి  పథకాల విషయంలో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందనీ అంటున్నారు. 2009 ఎన్నికల తొలి విడత పోలింగ్ తరవాత  ఆంధ్ర్రప్రాంతంలో  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, `తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకోవలసి ఉంటుంద`న్న వైఎస్ వ్యాఖ్యలను గుర్తు చేసున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు `అడ్డు`గా ఉన్నారని కూడా గుర్తు చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అడ్డంగా ఉన్నారనీ తెలంగాణవాదులు విమర్శిస్తే, అడ్డం కాదూ, నిలువు కాదూ, ఈ విషయం నూటా ముప్పయ్ కోట్లమంది భారతీయులు నిర్ణయించాలి’ అంటూ వైఎస్ వ్యాఖ్యానించేవారని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ మాదిరిగా ఇక్కడ వైసీపీ లేదు కనుక జగన్ మోహన్ రెడ్డికి  కేసీఆర్ స్నేహ హస్తం చాచారనీ, రాజకీయ వైరం ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనీ అంటున్నారు.  ఏపీలో  వైసీపీకి బేజేపీతో  పరోక్ష సంబంధాలు ఉన్నాయన్న  ప్రచారం నేపథ్యంలో ఆ బంధానికి విఘాతం కలుగకుండా షర్మిల `సాయం` తీసుకుంటున్నారనే వదంతులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ కు  వైసీపీ సహకరించిందంటూ బీజేపీ ఆగ్రహించిందనే వార్తలు కూడా వచ్చాయి.

Also Read : అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాల్లేవు – సజ్జల

అవగాహన రాహిత్యం…

రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు  సరిగా అమలుకావడంలేదనీ,  కనుక రాజన్న రాజ్యం రావాలన్న  వైసీపీ తెలంగాణ అధికార ప్రతినిధి  కొండా రాఘవరెడ్డి ప్రకటన అవగాహన రాహిత్యమని, విభజిత రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వ విధానాలు అమలు కావాలని ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంప ప్రవేవపెట్టిన పథకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా? అసలు,  రాజశేఖరరెడ్డి పథకాలన్నిటినీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందా?  అని ప్రశ్నిస్తున్నారు. ఆ మాటకొస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ తెలంగాణలో అమలవుతున్నాయా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Also Read : దూసుకుపోతున్న జగనన్న విడిచిన బాణం

`అన్న`అనుమతితోనే…

తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టాలనుకోవడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రమేయం ఎంత మాత్రం లేదనీ, పైగా పార్టీ  పెట్టవద్దని నచ్చజెప్పచూశారనీ   వైసీపీ కీలకనేతలు  చెబుతున్నా…`అవి నమ్మశక్యంగా లేవు. అన్న గెలుపుకోసం అహరహరం శ్రమించిన సోదరి అంతలా ఎదిరించగలరని భావించలేం. ఒకవేళ ఆయన మాటను ఖాతరు  చేయకపోతే స్వరాష్ట్రంలోనే పార్టీ పెట్టి సత్తా చాటి పోయినచోటనే వెదుక్కోవాలనే మాటను నిజం చేయాల్సింది` అని  విశ్లేషకులు, సామాజిక మాధ్యమాలు అంటున్నాయి. ఆమె  పార్టీ పెట్టబోతున్నారని ఒక పత్రికలో వచ్చిన  కథనాన్ని సొంత పత్రికలో ఖండించడం ఎంత నిజమో, తాజా ప్రకటనలు కూడా అలాంటివేనని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. `జగన్ మోహన్ రెడ్డి తోడబుట్టిన అన్న. ఆయన ఆశీస్సులు ఉన్నాయనే  నేను నమ్ముతున్నాను`అని షర్మిల హైదరాబాద్ లో మంగళవారం నాడు   విలేకరులతో అన్నమాటలను ప్రస్తావిస్తున్నారు.

Also Read : తెలంగాణలో రాజన్న రాజ్యం

Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles