Sunday, May 26, 2024

అమలాపురం విధ్వంసంపైన అధికార, ప్రతిపక్షాల ఆరోపణల వెల్లువ

కోనసీమ అకస్మాత్తుగా అగ్నిగుండంగా మారింది. కోనసీమ జిల్లా పేరుకు అంబేడ్కర్ పేరు కలపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కోనసీమ ప్రజలు ఆగ్రహోదగ్రులైనారు. ‘ఛలో అమలాపురం’ అని జాయంట్ యాక్షన్ కమిటీ పిలుపిచ్చింది. వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. అమలాపురం గడియారం సెంటర్ లో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అయిదు వేల మంది జనం గుమిగూడారు. నినాదాలు చేశారు. వారు ఊరేగింపుగా వెళ్ళి కలెక్టర్ కు మహజరు ఇవ్వాలని అనుకున్నారు. అడ్డుతగిలిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. పోలీసులు విజృంభించి లాఠీలకు పని చెప్పారు. గాలిలో కాల్పులు జరిపారు. ఎస్పీ, డిఎస్పీ సహా అనేకమంది పోలీసు ఉద్యోగులకు రాళ్ళ దెబ్బలు తగిలాయి. పోలీసులు చేసిన లాఠీచార్జీలో చాలామంది నిరసనకారులు గాయపడ్డారు.

అమలాపురం జిల్లాను ఏర్పాటు చేసినప్పుడే అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్ టి రామారావు పేర్లు ప్రకటించిన సమయంలోనే డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ పేరు కూడా ప్రకటించి ఉంటే ఎట్లా ఉండేదో. మొదట పేర్కొన్న మూడు పేర్లు పెట్టే ముందు ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోలేదు. కానీ అంబేడ్కర్ పేరు ప్రకటించే ముందు ప్రతిపక్షాల అభిప్రాయం అడిగారు. అందుకు ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఆ తర్వాతనే కోనసీమ జిల్లాను ఇకమీదట బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పిలుస్తామనీ, ఇందుకు ఎవరికైనా ఎటువంటి అభ్యంతరం ఉన్నా ఆ సంగతి నెలరోజలలోగా ప్రభుత్వానికి తెలియజేయాలనీ ప్రభుత్వం కోరింది. జీవో జారీ అయిన మరుక్షణం నుంచే కుతకుతలు మొదలైనాయనీ, వ్యతిరేకత ప్రబలిందనీ అంటున్నారు. కోనసీమ జిల్లా సాధనకోసం ఒక సంయుక్త కార్యాచరణ సంస్థ (జాయంట్ యాక్షన్ కమిటీ-జేఏసీ)పని చేస్తోంది. జేఏసీ పిలుపు మేరకు మంగళవారంనాడు (మే 24, 2022) ప్రజలు వీధులలోకి వచ్చారు. ఊరేగింపు తీశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మెమోరాండం సమర్పించాలని అనుకున్నారు. ఇంతలో పోలీసులు అడ్డుతగలడంతో రెచ్చిపోయారు. దళితుడైన రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ సొంత ఇంటినీ, అద్దె ఇంటినీ తగులపెట్టారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడూ, శాసనసభ్యుడూ (ఈయన మత్యకారుడు) అయిన పి. సతీష్ ఇంటికి కూడా నిప్పుపెట్టారు. పోలీసుల సాయంతో మంత్రి కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటకు వెళ్ళగలిగారు. సతీష్ ఆ సమయంలో అక్కడే ఉండి పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులను రాజమండ్రికి పంపించారు. నిరసనకారులు రెండు ఆర్టీసీ బస్సులను దగ్థం చేశారు. ఒక ప్రైవేటు ఇంజీనీరింగ్ కాలేజీకి చెందిన బస్సును కాల్చివేశారు. కార్లు, ఆటోలు అగ్నికి ఆహుతైనాయి. సాయంత్రం ఎనిమిది గంటల వరకూ నిరసనకారులకూ, పోలీసులకూ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.

రాత్రికి ఏలూరు నుంచి డీఐజీ పాల్ రాజు చేరుకున్నారు. చుట్టుపక్కల జిల్లాల ఎస్పీలు అమలాపురంల్ మకాం పెట్టి శాంతిభద్రతల పరిస్థితిని పునరుద్ధరించారు.

సుమారు అరవై మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తన్నారు.

కోనసీమ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ జిల్లాలో కాపులు, శెట్టిబలిజలు, దళితులు ఎక్కువ. వారి జనాభా దాదాపు సమానంగా ఉంటుంది. మూడు కులాలవారూ ఆవేశపరులే. కాపులకూ, శెట్టిబలిజలకూ మధ్య చాలా ఏళ్ళుగా వైరం ఉండేది. 1990ల ప్రథమార్ధంలో కుడిపూడి ప్రభాకరరావు, తదితరుల చొరవతో రెండు కులాల పెద్దల మధ్య రాజీ కుదిర్చారు. ఆ సయోధ్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దళితులకు కాపులతోనూ, శెట్టిబలిజలతోనూ పడదు. దళితులను వ్యతిరేకిస్తున్నారు కనుక అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తున్నారు. దళితులను వ్యతిరేకించేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. అమలాపురం దళితులకు అడ్డా వంటిది. ఇక్కడి నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి ఎన్నికైనారు. కోనసీమ జిల్లాలలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో మూడు దళితులకు రిజర్వేషన్ చేశారు. ఉన్న ఒకే ఒక లోక్ సభ సీటు (అమలాపురం) దళితులకే ప్రత్యేకించారు. అమలాపురం ఎంపీగా వైఎస్ఆర్ సీపీకి చెందిన చింతా అనూరాథ ఎన్నికైనారు. జనాభాలో దళితులు ఇరవై శాతం దాకా ఉంటారు. మరే జిల్లాలలోనూ ఇంతశాతం  మంది దళితులు ఉండరు. పైగా రాజకీయాధికారంలో దళితులకు ఎక్కువ వాటా. పి విశ్వరూప్ దళితుడు, మంత్రి, వైఎస్ కుటుంబానికి బాగా దగ్గరవాడని పేరు. ఆయన తన కుమారుడికి కృష్ణారెడ్డి అని పేరు పెట్టుకున్నారు. దళితులు ఇతర కులాలవారిలాగానే ఆత్మవిశ్వాసంతో మెలుగుతున్న జిల్లాగా కోనసీమను చెప్పుకోవచ్చు. ఈ సారి అంబేడ్కర్ పేరు పెట్టడంపైన జరిగిన గొడవలో దళితులకూ, దళితేతరులకూ మధ్య జరిగిన ఘర్షణగా పోలీసులు భావిస్తున్నారు.

రాజకీయ పార్టీలూ, నాయకులూ యథావిధిగా ఆరోపణలు చేసుకుంటున్నారు. పోలీసుల అసమర్థత అనీ, ఇంటెలిజెన్స్ వైఫల్యమనీ టీడీపీ, జనసేన నాయకులు ఆరోపించారు. ఇదంతా జనసేన, టీడీపీ నాయకులు కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే చేయించారని అధికార వైఎస్ ఆర్ సీపీ నాయకులు ఆరోపించారు. అల్లర్ల వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉన్నదనీ, ఉత్తర ప్రదేశ్ లో లాగానే కులాలమధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ సీపీ లబ్ధిపొందాలన్నది ఆయన సిద్ధాతమనీ ప్రతిపక్షాలతో పాటు జమీన్ రైతు వంటి పత్రిక కూడా ఆరోపించింది.

ఈ ఘటన వెనుక ఆనందబాబు అనే శాసనమండలి సభ్యుడు ఉన్నాడనీ, అతను తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇరుక్కున్నాడనీ, ఆయనను అరెస్టు చేసినప్పటికీ కేసును నీరు గార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అమలాపురం ఘటనకు వైఎస్ఆర్ సీపీ పూర్తి బాధ్యత వహించాలనీ, జెఏసీలోని సభ్యులందరూ వైఎస్ఆర్ సీపీ నాయకులేననీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. కాపులను అవమానపర్చుతూ సామాజిక మాధ్యమాలలో మితిమీరిన రాతలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకున్నదనే ఆరోపణ కూడా ఉంది.

అనంతబాబు విషయంలో ఏ మాత్ర మినహాయింపు లేకుండా చట్టప్రకారం వ్యవహరించాలని దావోస్ కు వెడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు.

అమలాపురంలో ఊరేగింపుగా వచ్చిన ప్రజలను కలెక్టర్ ను కలిసి మహాజరు ఇచ్చేందుకు పోలీసులు అనుమతించి ఉంటే ఈ హింసాకాండ జరిగి ఉండేది కాదని ప్రతిపక్ష నాయకులూ, పరిశీలకులూ అంటున్నారు. గడియారం సెంటర్ లో అంతమంది గుమికూడబోతున్నారని పోలీసులు తెలుసుకోలేకపోవడం వారి ఇంటలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనం.

కోనసీమ విధ్వంసాన్నిఊహించలేదనీ, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ జనసేన నాయకుడు బెదిరించింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. పోలీసు వాహనాలపైన రాళ్ళు రువ్విన కేసులో 46మందిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అమలాపురం విధ్వంసంపైన స్పందించిన వివిధ పార్టీల నాయకులు రకరకాల విమర్శలు చేశారు. వైసీపీ నేతల ఇళ్ళను వైసీపీ వారే తగులపెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వం చేస్తున్న చర్యలకు చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. కావాలంటే నవరత్నాల పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టుకోవచ్చు కదా అంటూ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు తీసేసి అంబేడ్కర్ పేరు పెట్టుకోవచ్చుకదా అని ఒక నాయకుడు అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అంబేడ్కర్ పైన అంత ప్రేమ ఉంటే పులివెందుల కేంద్రంలో ఒక జిల్లా ఏర్పాటు చేసి దానికి బీమ్ రావ్ జిల్లా అని పేరు పెట్టాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ వ్యాఖ్యానించారు. కడప జిల్లానే భీంరావ్ జిల్లాగా మార్చాలని ఆ జిల్లా దళితులు కోరుకుంటున్నారనీ, అట్లా చేయడం కుదరకపోతే పులివెందుల జిల్లా ఏర్పాటు చేసుకోవాలనీ ఆమె అన్నారు.  అంబేడ్కర్ మహాత్ముడనీ, ఆయనను జిల్లా స్థాయికి కుదించడం పొరబాటని కూడా అన్నారు. అంబేడ్కర్ పైన అభిమానం ఉన్నవారు జిల్లాకి ఆయన పేరు పెట్టుకుంటే ఆయనను జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయికి కుదించినట్టు అవుతుందా? హైదరాబాద్ లో విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ లేదా ఇందిరాగాంధీ పేరు పెడితే వారిని విమానాశ్రయం స్థాయికి కుదించినట్టు అవుతుందా? అర్థంపర్థం లేని విమర్శలూ, ఆరోపణలూ చేయడం పరిపాటిగా మారిందని పరిశీలకులు అంటున్నారు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles