Tuesday, April 23, 2024

అ త డు

వేల శతాబ్దుల వ్రేగుల వల్ల వంగిపోయి

విశేష భూమి భారం క్రింద

క్రుంగి పోయి

అణగిపోయి

అణగిపోయి

అహరహమూ నేలవైపే అదేపనిగా చూస్తూ

నాగలిపైన బరువుగా ఒరిగో

గొడ్డలి బుజాన వేసుకునో

నిలబడతాడతడు.

యుగయుగాల శూన్యమేదో అతని

మొగంలో స్ఫురిస్తుంది

ఆనందమూ, నిస్పృహ అన్నవి

అసలేమీ ఎరుగని జడుడాతడు

ఏడవలేడు, కన్నీరోడవలేడు

ఆశ పడలేడు, ఆహ్లాదపడలేడు

కొయ్య, రాయి, ఎద్దు

వీటికి తోబుట్టువా అనిపించేటట్టు.

వాని ఫాలం అంతా అర్థరహితమయ్యేటట్టు

వేని చేయి తుడిచివేసింది?

వాని మనస్సులో వెలుగు

వేని ఊర్పు ఆర్పింది?

వానికి చేతగాదు చుక్కలవైపు చూపుల్ని పరపించడం.

అమృత గానంలో ఆరోహణావరోహణాలు

అతనికి అపరిచితాలు.

ఉషః కాంతి రేఖ, సంధ్యాసమయారుణిమ

ఏమీ పట్టించుకోడాతడు.

బాధామయ శతాబ్దులు వాని

భయదమూర్తిలో తొంగి చూస్తాయి.

వంగిన వాని బుజంలో

కాలపురుషుడు రచించిన దుఃఖాంత నాటకం

కనబడుతుంది.

వానిని మనం దగా చేసినట్లు, దోచుకున్నట్లు, మలిన పరచినట్లు

వాని వారసత్వం పోగొట్టినట్లు

అనిపిస్తుంది నాకు.

అయ్యా! అధికారులూ! ప్రభువులూ! పాలకులూ!

ఆ భగవంతుని కిదా మన మర్పించుకునే ఉపద?

ఆ వంగిన నడుమును ఏలాగున సరిజేస్తారు మీరు?

ఆ క్రుంగిన బుజం ఏలాగున నిలబెడతారు మీరు?

వేరు నేర్పుతారు వానికి వెలుగు కోసం పైకి చూడడం?

ఇది ఒక ఆంగ్లపద్యం సారాంశం

తెనుగుసేత దేవులపల్లి కృష్ణశాస్త్రి

 “నేను, స్వేచ్ఛా కుమారుడను, ఏను, గగన పథ విహార విహంగమపతిని,

ఏను, మోహన వినీల జలథర మూర్తిని,

ఏను, ప్రళయ ఝంఝా ప్రభంజనస్వామిని! ”

అంటూ తన  కృష్ణపక్ష కావ్యంలో  ఒకప్పుడు చాటుకున్న వారు కృష్ఢశాస్త్రిగారు. ఆ భావకవి సున్నిత స్వాంతంలో, సకల  చరాచరాలపై, దగాపడిన సాటి మానవులపై, అపారమైన  జాలి, కరుణ, రానురాను గాఢంగా పాతుకొని పోవడం, ఆయనచే మానవతాకోణం గల కవితలు రచింపజేయడం ఆసక్తికరమైన పరిణామం.

Also read: కృపజూడు భారతీ

నేటి తన కవిత ఒకానొక ఆంగ్లకవితా “సారాంశం” అంటున్నాడు కవి, అంతే గాని అనువాదం అనడం లేదు. అట్లే ఆ ఆంగ్లకవి ఎవరో కూడా చెప్పడం లేదు. అది అవసరమని బహుశా ఆయన భావించడం లేదు.

తరతరాల సృష్టిలో పెనవేసుకున్న నిమ్న మానవుల విషాదం  అభ్యుదయ కవితాయుగానికి ప్రాణవాయువు. పొలాలు దున్నే రైతుకూలీలు, యంత్రభూతాల కోరలు తోమే కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రిక్షా తొక్కేవారు, మానవ కశ్మలాన్ని మోసే వారు.

యుగయుగాల బ్రతుకు భారంతో ఈ నిమ్నజీవులెంత మొద్దుబారినారో  హృదయభారంతో విన్నవించే కవిత యిది.

కృష్ణశాస్త్రిగారి  వ్యాస సంకలనాల్లో ఒకదాని పేరు “బహుకాల దర్శనం”. దీనిలో  “బూట్ పాలిష్” అనే మకుటం గల వ్యాసమొకటి వుంది. ఆ వ్యాసం లోనిదీ కవిత.

Also read: శాంతి యాత్ర

ఈ వ్యాసంలో రచయిత పేదల్లో తనకు తెలిసిన  మనుషులను కొందరిని  జ్ఞాపకం చేసుకుంటాడు. అందులో ఒకడు నారయ్య. రచయిత అంటాడు: “నారయ్య బుజాలు, కాదు, నడుము కాస్త వంగి వుంటుంది. ఆ వంగడం బరువు మోతవల్ల కాదు. రోలరు లాగుతూ రోడ్లు బాగు చేస్తారే వాళ్ళ కాళ్ళు కంకర మీద ఏడుస్తాయి కూడా”.

“నారయ్యది నడుం వంగిన వాళ్ళ జాతి. ముసలి ఎద్దుకీ గొడ్డు గోవుకీ చుట్టాలు లేరు. నారయ్యకు పెళ్ళాం పిల్లలూ వుండడం వింతగా వుంటుంది” అంటాడు రచయిత.

ఇంతకూ నారయ్య ఒక చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టే మరొక కుఱ్ఱవాడు ఆలీ. వీరి దైనందిన జీవితాలలోకి తొంగిచూసేదే ఈ వ్యాసం.

Also read: నా తెలంగాణా

ఈ వ్యాసంలో రచయిత రాయ్ దాస్ అనే చెప్పులు కుట్టే భక్తుని కవితను కూడా మనకు పరిచయం చేస్తాడు:

భగవంతుడు జోళ్ళు కుట్టేవాడు

గొప్పగా కుడతాడు

పగలూ రాత్రీ కుడతాడు

సూర్యుడు బంగారు పాదరక్ష

వెండి పాదరక్ష చంద్రుడు

నీలాల గదిలో, స్వర్గంలో

నిశ్శబ్దంగా కూర్చుని

నిశాదివాలు చెప్పులు కుడతాడు

ఈ లోకం పాతబడి పోయిన అతని పాదరక్ష

అయితే అతని అడుగు

అతి తేలికగా పడుతుంది దానిమీద”

ఆధునికాంధ్ర సాహిత్యం దృష్టిలో మతము, సాహిత్యము, వేరువేరు పదార్థాలు. ఆధునిక సాహిత్యం మతప్రసక్తికి స్వస్తి చెప్పి, మానవతావాదానికే పట్టం కట్టింది.

Also read: ఉత్తరాభిమన్యుల వివాహంలో తెలుగుదనం

ఈ అభ్యుదయానికి ప్రేరణ ఆధునిక యుగంలో పాశ్చాత్య ఖండాల నిండా ప్రబలిన మానవతావాదం. మరొక ప్రేరణ ఉత్తరభారతాన్ని మధ్యయుగాలలో ప్రభావితం చేసిన చైతన్యప్రభు భక్తి మార్గం.

19వ శతాబ్దం బెంగాల్లో మొదలైన సంస్కరణో ద్యమాలు, ఆంధ్రదేశంలో ఊపందుకున్న వీరేశలింగం పంతులు గారి విధవా వివాహాలు, స్వామి వివేకానంద వాడవాడలా పూరించిన సామాజిక చైతన్యశంఖం, రష్యాలో కార్మికాభ్యుదయానికి పెద్దపీట వేసిన బోల్షివిక్ విప్లవం, దేశ రాజకీయ రంగంలో గాంధీజీ ప్రవేశం, మానవతకే పట్టం గట్టిన టాగూర్ రచనలు, ఇవన్నీ ఆధునిక కవిత్వాన్ని మానవతావాదం వైపు నడిపించినవే.

గాంధీయుగానికన్నా ముందే తన రచనల ద్వారా మానవతా వాదాన్ని ఆంధ్రావనిలో వ్యాపింపజేసినవాడు మహాకవి గురజాడ అప్పారావు. ఆయన ప్రభావం కృష్ఢశాస్త్రిగారి రచనలపై కూడా పడింది. గురజాడ గూర్చి కృష్ఢశాస్త్రి:

 “గుత్తునా యని జాతి ముత్యాల్

గుచ్చినాడే  మేలి సరముల!

ఇత్తునా యని తెలుగు తల్లికి

ఇచ్చినాడే భక్తితో!”

అంటారు.

మనిషి చేసిన రాయి రప్పకి

మహిమ కలదని సాగి మొక్కుతు మనుషుడంటే రాయిరప్పల కన్న కనిష్టంగాను చూస్తావేల

బేలా!

దేవుడెకడో దాగెనంటూ

కొండకోనలు వెదుకులాడే

వేలా?

కన్ను తెరచిన కానబడడో

మనిషి మాత్రుని యందు లేడో

ఎరగి కోరిన కరగి ఈడో

ముక్తి”

అని తెలుగుజాతిని ప్రబోధించిన వాడు గురజాడ.

ఈ మానవతావాదం గాంధీగారి జాతీయోద్యమంలో ప్రధానమైన అంతర్భాగం. ఆ గాంధీ యుగాన్ని వేనోళ్ళా పొగిడిన వారిలో తుమ్మల, బసవరాజు అప్పారావు, కరుణశ్రీలతో బాటు కృష్ణశాస్త్రి గారు కూడా వున్నారు.

 కృష్ణశాస్త్రిగారి హృదయంలోని “విశ్వవైశాల్యానికి” ఆయన గురుదేవుడు బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నంగారి బోధనల ప్రభావం వున్నది.

Also read: మనుచరిత్ర అవతారిక – కృష్ణరాయల పరిచయం

హరిజనోద్ధరణ బాపూజీ స్వరాజ్యోద్యమంలో భాగం. దళితులతో సహపంక్తి భోజనం చేసిన కారణంగా ఆ రోజుల్లో తన కులస్థులచే వెలివేయబడ్డ సంఘటన కూడా కృష్ణశాస్త్రి గారి జీవితంలో ఒక భాగం.

“శిథిలాలయమ్ములో శివుడు లేడోయి” అన్న శాస్త్రి గారి ప్రసిద్ధ గేయం సైతం “బూట్ పాలిష్” వ్యాసంలో చోటు చేసుకున్నది.

శిధిలాలయమ్ములో శివుడు లేడోయి

ప్రాంగణమ్మున గంట పలుకలేదోయి

దివ్యశంఖము గొంతు తెరవలేదోయి

పూజారి గుడినుండి పోవలేదోయి

చిత్రచిత్రపు పూలు, చైత్రమాసపు పూలు

ఊరూర, ఇంటింట ఊరకే పూచేయి

శిధిలాలయమ్ములో శిలకెదురుగా కునుకు

పూజారి కొకటేని పువ్వు లేదోయి

వాడ వాడల వాడె, జాడలన్నిట వాడె

వీడు వాడున వాడె, వీటి ముంగిట వాడె

శిధిలాలయమ్ములో శిలకెదురుగా కునుకు

పూజారి వానికై పొంచి వున్నాడోయి”

“నారాయణ! నారాయణ! అల్లా ఓ అల్లా! మా పాలిటి తండ్రీ! నీ పిల్లలమేమెల్లా” అంటూ సర్వమత సమధర్మాన్ని ప్రబోధించడం కృష్ణశాస్త్రి లేఖినికి చక్కగా  తెలుసు.

“నేను స్వేచ్ఛా కుమారుడనని” నిండు జవ్వనంలో ప్రకటించుకున్న కవి;  “దిగిరాను, దిగిరాను, దివినుండి భువికి” అని తెగేసి చెప్పిన కవి, భువిలోని బడుగు జీవుల దైనందిన జీవితంలోనే “సత్యసౌందర్యాలు”న్నాయని కాలక్రమంలో గ్రహించడం విశేషం.

వ్యక్తిగత స్వేచ్ఛా దృక్పథంతో నిండు పరువంలో రచింపబడ్డ శాస్త్రి గారి భావకవితలొక ఎత్తు.

“తన కంఠమున దాచి హాలాహలం, తల నుండి కురిపించు గంగాజలం, మనిషి శివుడవడమే గాంధీమతం” అనే పరిణత మానవీయ దృక్పథంతో శాస్త్రి గారి లేఖిని నుండి వెలువడిన కవితలు, గేయాలు, వ్యాసాలు, మరొక ఎత్తు.

ఏవీ ఒకదానికొకటి తీసిపోవు.

మానవుడు, మళ్ళా, నీ మతం, నా మతం, అని చర్చించుకుంటున్నాడు. ఇట్టి పరిస్థితిలో కృష్ణశాస్త్రి గారి జ్ఞాపకం మనిషిలోని మానవత్వానికి రెక్కలను తొడిగి, భవిష్యత్తుపై ఆశలను పెంచుతుంది.

ఖలీల్ జీబ్రాన్ అంటాడు:

ఎవడయ్యా స్వేచ్ఛాపరుడు?”

బానిసల బరువులను ఓపికగా మోసుకొని పోయేవాడు!”

(“శిఖరాలు – లోయలు” జీబ్రాన్ రచనకు సినారే అనువాదం)

Also read: తుం గ భ ద్రా న ది

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles