Friday, March 29, 2024

జాతీయ హోదా ఎలా?

  • పదేళ్ళలో ఆప్ సాధించిన ఘనకార్యం
  • గుజరాత్ ఓట్లతో దక్కిన గౌరవం

ఆమ్ ఆద్మీ పార్టీకి తాజాగా జాతీయ హోదా లభించింది. గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి ఈ గుర్తింపును తెచ్చాయి. ఆ పార్టీ సంగతి అలా ఉంచగా, ఇప్పుడు జాతీయ హోదా అంశంపై కొన్ని వర్గాల్లో దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. జాతీయ హోదా రావాలంటే పార్టీలు ఉండాల్సిన పరిస్థితులు, ప్రయోజనాలు తెలుసుకొనే ప్రయత్నంలో  కొందరు ఉన్నారు. ఈ సందర్భంలో, ఇప్పటి వరకూ విజయవంతమైన ప్రస్థానం చేసిన ఆప్ కు మంచి గుర్తింపు వచ్చింది. పదేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఆప్ దేశ రాజధానిలో రెండు సార్లు గెలిచి తిష్ఠ వేసుకొని కూర్చుంది. స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 15 ఏళ్ళ నుంచి సాగుతున్న బిజెపి పాలనకు చరమగీతం పాడడం ప్రతిష్ఠాత్మకమైన గెలుపు. గుజరాత్ ఎన్నికల్లో సుమారు 13శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదాను కైవసం చేసుకున్న వైనం పలు పార్టీలను అలోచింప చేస్తోంది. పెద్ద పార్టీలను సైతం ఆలోచనలో పడేసింది. ఇదంతా ఒక కేస్ స్టడీ లాంటిది. కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం మేరకు ఏదైనా పార్టీకి జాతీయ హోదా రావాలంటే సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున ఓట్లు పొందాలి. లేదా ఎవైనా మూడు వేర్వేరు రాష్ట్రల నుంచి 11 లోక్ సభ సీట్లు సాధించాలి. లేనిచో నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపుయైనా ఉండాలి. ప్రస్తుతం దిల్లీ, పంజాబ్ లో ఆప్ అధికారంలో ఉన్నట్లు తెలిసిందే. మొన్న గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాలు,6% ఓట్లు దక్కించుకుంది.

Also read: దిల్లీలో కేజ్రీవాల్ హవా

9వ జాతీయ పార్టీ

నిన్నటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోవడమే కాక, దాదాపు 12 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఇది అరుదైన అంశం. ప్రస్తుతం దేశంలో వున్న జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిది. వీటన్నిటికీ జాతీయ హోదా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో సాధించిన ఓట్లు, సీట్లు ద్వారా నేషనల్ పీపుల్స్ పార్టీకి కూడా 2019లో జాతీయ హోదా వచ్చింది. తాజాగా ఆప్ తొమ్మిదవ పార్టీగా అవతరించింది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలన్నా కొన్ని షరతులు ఉంటాయి. జాతీయ పార్టీ హోదాను పొందడం వల్ల దేశ వ్యాప్తంగా ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారాలకు వీలు లభిస్తుంది. 40 మంది వరకూ స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకోవచ్చు. పార్టీ ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి భూమిని పొందవచ్చు. ఇలా ఆ పార్టీలకు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తమ టీ ఆర్ ఎస్ ను బీఆర్ ఎస్ గా మారుస్తూ,  పార్టీగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ రెండు పార్టీలకు జాతీయ హోదా రావాలంటే ఆషామాషీ కాదు. పటిష్ఠమైన ప్రణాళిక, పకడ్బందీ వ్యూహం, ప్రజాదరణ, శ్రేణుల్లో విశ్వాసం, స్వరాష్ట్రం కాకుండా పొరుగు రాష్ట్రాల్లో తమ సత్తాను చాటగలిగిన శక్తియుక్తులు కావాలి. చంద్రబాబు, కెసీఆర్ మొదలు చాలామంది నాయకులతో పోల్చుకుంటే అరవింద్ కేజ్రీవాల్ వయసులో చిన్నవాడు. అనుభవం, ఆర్ధిక దన్ను మొదలైన విషయాల్లోనూ పిన్నవాడు.

Also read: చెలరేగుతున్న సరిహద్దు వివాదం

విశిష్ఠ భావనలూ, వరిష్ఠ నాయకులూ ముఖ్యం

పార్టీకి అతీతంగా నరేంద్రమోదీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీయే తాను, తానే పార్టీగా ఎదుగుతున్నారు. ఈ పదేళ్ల కాలంలో ఈ ఇరువురు నేతలు ప్రత్యేకమైన ప్రతిష్ఠను తెచ్చుకున్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఇదొక అధ్యాయం. వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను ఆక్రమించిన నరేంద్రమోదీ, కేజ్రీవాల్ వార్తల్లో వ్యక్తులుగా వెలుగొందుతున్నారు. పార్టీలకు జాతీయ హోదా దక్కడం ఎలా ఉన్నప్పటికీ, విశిష్టమైన భావనలు ఉండితీరాలి. ప్రాంతీయ పార్టీలకు జాతీయ భావం, జాతీయ పార్టీలకు ప్రాంతీయ ప్రేమ, రాష్ట్రీయ భావనలు ఉండడం ఆదర్శప్రాయం, అవసరం. ఏ పార్టీ ఎప్పుడు జాతీయ స్థాయిలో అధికారంలోకి వస్తుందో ఎవ్వరూ జోశ్యం చెప్పలేరు. పార్టీని నడిపే నాయకులకు విలక్షణమైన లక్షణాలు ఉంటే  ఆ గుర్తింపు ఏదో ఒక రూపంలో ప్రస్ఫుటం అవుతుంది. జాతీయ హోదా లభించడం వల్ల ఆ యా పార్టీలకు వచ్చే ప్రయోజనాల కంటే దేశ ప్రజలకు ఆ పార్టీల వల్ల ఒనగూరే ప్రయోజనాలు ముఖ్యం.

Also read: వర్థిల్లుతున్న జర్మనీ – భారత్ సంబంధాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles