Saturday, April 20, 2024

వరుణ్ గాంధీ పయనం ఎటు?

దేశం యావత్తూ రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ ఉత్థానపతనాలను గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఉన్నదే కానీ సంజయ్ గాంధీ తనయుడు వరుణ్ గాంధీ బాగోగులను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి వంశపారంపర్యంగా దక్కిన అధికారమైతే భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం కోసం పదిహేడేళ్ళపాటు పోరాడుతూ వస్తున్నాడు వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీకి తల్లి మేనకాగాంధీ అండదండలు ఉన్నాయి. అవి పరిమితమైనవి. ఆమె బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. జంతువుల హక్కుల గురించి ఎక్కువగా మాట్లాడే మేనక రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ వరుణ్ గాంధీ తండ్రి లాగే  దూకుడు స్వభావం కలిగినవారు. రాజకీయ పోరాటాలలో నిగ్గు తేలారు. 2017 ఎన్నికలకంటే ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఆశావహుల జాబితాలో ఉన్న వరుణ్ తాజాగా జాతీయ కార్యవర్గంలో స్థానం దక్కించుకోలేకపోయారు. తనతో పాటు తల్లికి కూడా కార్యవర్గంలో స్థానం పోయింది. ఇందుకు ఇటీవల రైతులకు అనుకూలంగా, యోగీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ట్వీట్లు పెట్టడం మాత్రమే కాదు 2013లో చేసిన పొరబాట్లు అతడిని వెంటాడాయి. బలితీసుకున్నాయి.

రాజకీయంగా పొరబాటు వైఖరి

వాజపేయి, అడ్వాణీ హయాంకు చరమగీతం పాడిన సందర్భంలో, నరేంద్రమోదీ ప్రధాని అభ్యర్థిగా తెరమీదికి రాబోతున్న సమయంలో వరుణ్ తప్పుడు లెక్కలు వేసుకొని అప్పటి పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ప్రధాని అభ్యర్థిగా ఆకాశానికి ఎత్తారు. పార్టీలో పరిస్థితులనూ, నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ నేతల ఆలోచనావిధానాన్ని సవ్యంగా అర్థం చేసుకోకపోవడం వల్ల పనికట్టుకొని రాజ్ నాథ్ సింగ్ ను పొగడటంతో తన చెల్లు చీటీపై స్వయంగా తానే సంతకం చేసుకున్నారు. నెహ్రూను అదేపనిగా ద్వేషించే బీజేపీ భారత తొలి ప్రధాని మునిమనుమడికి ప్రాధాన్యం ఇవ్వడం మోదీ-షా హయాంలో అసాధ్యమని అందరికీ తెలుసు. రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉంటూ నరేంద్రమోదీ, అమిత్ షాలు గుజరాత్ కే పరిమితమైన రోజుల్లో వరుణ్ హవా నడిచింది. మొదటిసారిగా 2009లో ఫిల్ బిట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన వరుణ్ గాంధీ ఫిల్ బిట్ లో జరిగిన సభలో చేసిన మతసంబంధమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యాలకు మాయావతి ప్రభుత్వం కేసు పెట్టింది. వరుణ్ గాంధీ పోలీసులకు లొంగిపోయాడు. కోర్టు అతడిని జుడీషియల్ కస్టడీకి పంపింది. అప్పుడు జాతీయ భద్రతాచట్టం (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్-నాసా) కింద కేసు నమోదు చేశారు. ఇటాహ్  జైలుకు పంపించారు.

వరుణ్ గాంధీ, రాహుల్ గాంధీ

వరుణ్ కి సుప్రీం సానుకూల తీర్పు

సుప్రీంకోర్టులో వరుణ్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. నాసా కింద కేసు కొట్టివేయాలనీ, వరుణ్ ని బెయిల్ పైన విడుదల చేయాలనీ సుప్రీంకోర్టు 2009 మేలో ఆదేశించింది. మొత్తం మీద 19 రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో హిందూత్వ నాయకుడుగా వరుణ్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో అందరూ భావించారు. 1989 నుంచీ మేనకాగాంధీ ఫిల్ బిట్ లో గెలుస్తూ వచ్చారు. 2009లో ఈ నియోజకవర్గం నుంచి వరుణ్ నెగ్గాడు. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి 2014లోనూ, తిరిగి ఫిల్ బిట్ నుంచి 2019లోనూ వరుణ్ విజయం సాధించాడు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినట్టే మేనకాగాంధీ, వరుణ్ గాంధీ ఫిల్ బిట్, సుల్తాన్ పూర్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు.

అన్నా హజారే ఉద్యమానికి మద్దతు

మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2011లో అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్నివరుణ్ గాంధీ మనస్ఫూర్తిగా బలపరిచారు. అరవింద్ కేజ్రీవాల్ తో కలసి పని చేశారు. కేజ్రీవాల్ తన సొంత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టుకొని ఎన్నికలలో విజయదుంధుభి మోగించి దిల్లీ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. అన్నా హజారే ప్రతిపాదించిన  జన్ లోక్ పాల్ బిల్లుకు గట్టి మద్దతుదారుగా వరుణ్ నిలిచారు. మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదన మేరకు విడుదలైన ఆర్డినెన్స్ ప్రతిని రాహుల్ గాంధీ దిల్లీ ప్రెస్ క్లబ్ లో బరబరా చించివేయడాన్ని వరుణ్ గట్టిగా విమర్శించారు. దీంతో బీజేపీలో ఎదుగుదల సులువైంది.

రాజ్ నాథ్ సింగ్ హయాంలో రాజయోగం

రాజ్ నాథ్ సింగ్ హయాంలో వరుణ్ గాంధీకి ఉన్నత పదవులు దక్కాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2013లో రాజ్ నాథ్ సింగ్ వరుణ్ ని నియమించారు. అదే సంవత్సరం పశ్చిమబెంగాల్ లో పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా పని చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా అడ్వాణీ స్థానంలో ఎవరిని ప్రతిపాదించాలనే చర్చ బీజేపీలో కొనసాగుతున్న తరుణంలో వరుణ్ గాంధీ రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రతిపాదించారు. మాజీ ప్రధాని వాజపేయీ, రాజ్ నాథ్ సింగ్ లు హాజరైన బహిరంగ సభలో వరుణ్  గాంధీ రాజ్ నాథ్ సింగ్ ను ప్రధాని అభ్యర్థిగా అభివర్ణించారు. 2014 ఫిబ్రవరిలో నరేంద్రమోదీ కోల్ కతాలో బహిరంగసభలో ప్రసంగించారు. ఆ సభకు రెండు లక్షలకు పైగా జనం హాజరైనారంటూ మీడియా వార్తలు వెలువడితే అంతమంది రాలేదనీ, సభికుల సంఖ్య 45-50 వేల మధ్య ఉంటుందనీ వరుణ్ వ్యాఖ్యానించారు. వీటన్నిటినీ మరచిపోయి క్షమించే నాయకుడు కాదు నరేంద్రమోదీ. గుర్తుపెట్టుకుంటారు. గుణపాఠం చెబుతారు.

వరుణ్ గాంధీ, భార్య యామినీ రాయ్

మూడు దశాబ్దాలలో మొదటిసారి స్వయంగా మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ పార్లమెంటులో 2014 ఎన్నికల తర్వాత నిలబడింది. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అత్యంత ఆప్తుడైన అమిత్ షా పార్టీ పగ్గాలు చేపట్టారు. అంతటితో వరుణ్ గాంధీ పతనం ఆరంభమైంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి 2014 ఆగస్టులో వరుణ్ కి ఉద్వాసన పలికారు అమిత్ షా. పశ్చిమబెంగాల్ లో పార్టీ పర్యవేక్షణ బాధ్యత నుంచి కూడా తప్పించారు. 2016లో అలహాబాద్ లో జరిగిన జాతీయ కార్యవర్గం సమావేశంలో వరుణ్ గాంధీకి మద్దతుగా కొందరు నినాదాలు చేయడం, హడావుడి చేయడం బీజేపీ నాయకత్వానికి కానీ ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి కానీ బొత్తిగా నచ్చలేదు. అటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ సహిస్తుంది కానీ బీజేపీలో ఒక నాయకుడికి మద్దతుగా ప్రదర్శనలు చేయడాన్ని ఏ మాత్రం ఉపేక్షించరు. ఈ సంగతి గ్రహించకుండా వరుణ్ మద్దతుదారులు హంగామా చేయడం ఆయనకే నష్టం కలిగించింది.

వరుణ్ గాంధీ 2011లో డిజైనర్ యామినీ రాయ్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె అనసూయా గాంధీ. 13 మార్చి 1980లో దిల్లీలో జన్మించిన వరుణ్ లండన్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. కవిగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. వార్తాపత్రికలలో వ్యాసాలు రాస్తారు. 2004లో తల్లి మేనకతో కలసి బీజేపీలో చేరారు. ఆ సంవత్సరమే 40 నియోజకవర్గాలలో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. బీజేపీ టిక్కెట్టుపైన 2009లో ఫిల్ బిట్ (తల్లి మేనక వరుసగా అయిదు విడతల గెలుచుకున్న నియోజకవర్గం)నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో మతపరమైన వ్యాఖ్యలు చేసి కష్టాలు కొనితెచ్చుకున్న వరుణ్ ఇప్పుడు బీజేపీ లఖింపూర్ లో సిక్కులకూ, హిందువులకూ మధ్య మతపరమైన చీలిక తేవడానికి ప్రయత్నిస్తున్నదంటూ విమర్శిస్తున్నారు.

కింకర్తవ్యం?

చివరికి మొన్న గురువారంనాడు జాతీయ కార్యవర్గం నుంచి తల్లికీ, తనయుడికీ ఉద్వాసన చెప్పడం తెలిసిందే. తాను అయిదేళ్ళుగా ఒక్క సారి కూడా కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేదనీ, తాను అందులో ఉన్నట్టు కూడా తనకు తెలియదనీ వరుణ్ వ్యాఖ్యానించారు. అమిత్ షా తల్లీకొడుకులను జాతీయ కార్యవర్గంలో కొనసాగనిచ్చారు కానీ జేపీ నడ్డా సారథ్యంలో అక్కడి నుంచి సైతం ఉద్వాసన చెప్పారు. తల్లీకొడుకులను పార్టీ నుంచి పంపించి వేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించుకున్నట్టు భావించవచ్చు. ఇప్పుడు 41 సంవత్సరాలు ఉన్న వరుణ్ గాంధీ ఇందిరాగాంధీ మనుమలూ, మనుమరాలూ బృందంలో అతి  పిన్నవయస్కుడు. సోనియాగాంధీకి రాజకీయాలు వంటబట్టడానికి సమయం పట్టింది కానీ సంజయ్ సతీమణిది మొదటి నుంచీ రాజకీయ నైజం. రాజీవ్ హత్య తర్వాత వెంటనే రాజకీయ పదవిని అధిష్టించడం ఇష్టం లేక సోనియాగాంధీ పీవీ నరసింహారావును ప్రదానిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. కానీ సంజయ్ విమానప్రమాదంలో మరణించిన తర్వాత కొద్ది రోజులకే మేనక ఇందిరాగాంధీతో విభేదించి, ప్రధాని నివాసం నుంచి బయటకు వెళ్ళిపోయి ‘సంజయ్ విచార్ మంచ్’ ను ప్రారంభించారు. కొంతకాలం పాటు నడిపారు.

‘తెలుగుదేశం పార్టీ’ తో పొత్తు పెట్టుకొని 1983 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో అయిదు స్థానాలకు పోటీ చేశారు. ఘనవిజయం సాధించారు. కమ్యూనిస్టులతో, జనతా పార్టీతో కూడా పొత్తుపెట్టుకోవడానికి నిరాకరించిన ఎన్ టి రామారావు సంజయ్ విచార్ మంచ్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇందిర కోడలి చేత ఇందిరను తిట్టించవచ్చుననేది ఒక్కటే ఈ నిర్ణయానికి కారణం. జాతీయ స్థాయిలో కానీ యూపీలో కానీ మేనక ప్రభావం అంతగా లేదు. తర్వాత కొంతకాలానికి మేనకాగాంధీ 2004లో బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీని వారసత్వ సంపదగా సోనియా వినియోగించుకుంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలలో మేనక వర్థిల్లారు.

కాంగ్రెస్ లో చేరుతారా?

 ఇప్పుడు మోదీ-అమిత్ షా నాయకత్వంలో బీజేపీలో వరుణ్ కి భవిష్యత్తు లేదు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దశలో వరుణ్ గాంధీ అన్నగారితో సయోధ్య కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి అక్క ప్రియాంకకు అండగా నిలబడి యూపీ ఎన్నికలలో తన ప్రతాపం చూపిస్తారా లేక మరేదైనా మార్గం చూసుకుంటారా అన్నది వేచి చూడాలి. తోడికోడలు కొడుకు కాంగ్రెస్ లో చేరడాన్ని సోనియాగాంధీ ఎట్లా పరిగణిస్తారనేది కూడా ముఖ్యం. మేనక వైఖరి  ఏమిటో కూడా తెలియదు. మొత్తంమీద నెహ్రూ-గాంధీ పరివారం అంతా ఒకే పక్షంలో ఉంటే రాజకీయపరంగా ప్రజలకు స్పష్టత ఉంటుంది.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles