Tuesday, April 23, 2024

హెడ్డు ఎప్పుడు మారతాడు?

మనకి స్వాతంత్ర్యం వస్తే హెడ్డు మారతాడా? అని కన్యాశుల్కం నాటకంలో ఒక సామాన్యుడు సౌజన్యారావు పంతుల్ని అడుగుతాడు.

స్వాతంత్ర్యం సిద్ధించడమంటే దారిద్ర్యాన్నించి బయటపడ్డం. చెరపడ్డ భూమి భూస్వాముల కబంధహస్తాల్నించి బయటపడ్డం, ఆకలి నుంచీ, దారిద్ర్యాన్నించీ, దాష్టీకాన్నించీ బయటపడ్డం. ఇలాగ బయటపడ్డమే స్వాతంత్ర్యమంటేనని సామాన్యులు తమ అంతరాంతరాల్లో విశ్వసిస్తున్నారు. అయితే వాళ్ళు కదిల్నా, మెదిల్నా వాళ్ళ మీద బూతుల వర్షం కురిపించి, లాఠీలు ఝలిపించి, గుళ్ళవర్షం కురిపించి, కోర్టుల చట్టూ తిప్పించి, జైళ్ళపాటు చేసే పోలీసుల భయంలో జీవచ్ఛవాల్లా, ఎవరి మదిలో వాళ్ళు ఖైదీల్లా బతుకుతున్నారు. వాళ్ళెరిగిన పోలీసులంటే ఎస్ పీలూ, డీఐజీలూ, ఐజీలూ,  డీజీలూ కాదు. రోజూ కనిపించి బెదిరించే కానిస్టేబులు, హెడ్డులు. అందుచేత హెడ్డు ట్రాన్స్ ఫరైతే ప్రతిపక్షం వాళ్ళు అధికారపక్షం అధినాయకుడు మారినప్పుడు ఎంతగా సంతోషిస్తారో అంతగా సంతోషిస్తారు వాళ్ళు. అధికారపక్షం నాయకుడు మారితే, కొండొకచో ప్రతిపక్షం వారే అధికారంలోకి రావచ్చు.

కానైతే హెడ్డు మారినంతమాత్రాన మన బ్రతుకుల్లో పర్మనెంటుగా, పెద్దగా మార్పురాదు. వస్తే గిస్తే మన పరిస్థితి పెనం మీంచి పోయ్యిలో పడ్డట్టు కావచ్చు.

అలనాడు ఒక పాలేరు దొరగారి కాళ్ళ మీద పడి ‘‘అయ్యా నన్ను తిట్టకు దొరా’’ అని బతిమాలాడు.

అప్పుడు దొరగారు తొడగొట్టుకొని తొడనొప్పి తెచ్చుకోవడం తప్పినందుకు సంతోషించి, మీసం మీద చెయ్యవేసి ‘తిట్టను పోరా లంజకొడుకా’ అని వరమిచ్చాడు. పాపం మన పాలేరు పొంగిపోయి దొరగారి పాదాలకి దండాలు పెట్టాడు.

దొరగారి ధోరణిలోమార్పు రానట్టుగానే హెడ్డు మారినా పోలీసుల్లో మార్పు రాదు.

ప్రభుత్వాలు మారినప్పుడు జాతీయ జండా మారుస్తే బాగుండదు కనుక పోలీసుల్ని ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ చేస్తే అంతా ప్రభుత్వం మారిన సంగతి గ్రహిస్తారని డ్రస్ కోడ్ మార్చి పోలీస్ స్టేషన్లని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇది చూసినవాళ్ళెవరైనా పోలీసులు హింసిస్తారంటే నమ్మరు. పైగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ఎవర్నీ తిట్టకుండా, నోరుమెదిపినా మెదపకపోయినా ఫైన్ లు వేసి, కేసులు కడుతున్నారు పోలీసులు. ఇదన్యాయం అని ఎవరైనా అంటే, అన్యాయానికయ్యే ఖర్చు కంటే న్యాయానికయ్యే ఖర్చు, జీవితకాలంలో సగాన్ని తల్చుకొని ప్రెండ్లీ  పోలీసే బెటరు అన్న నిర్ణయానికి వచ్చేసి, పాపంపుణ్యం ప్రపంచమార్గం అని ఒక ఉట్టూర్పు ఊర్చి ఊరుకొంటున్నారు.

ఇంత ఫ్రెండ్లీ పోలీసులు ఎన్ కౌంటర్లు ఎందుకు చేస్తున్నారని మా వెధవకొక సందేహం వచ్చింది. వాడి డౌట్ ఆ నోటా ఈ నోటా, ఆ పోనులోనూ, ఈ ఫోన్లోనూ, సోషల్ మీడియాలోనూ పాకి పోలీసుల కళ్ళల్లో, చెవినా పడ్డాయి. మా వెధవ భార్యని తీసుకొని షికారుకెళ్ళడం చూసి, పట్టుకొని, వ్యభిచారం చేస్తున్నారని కేసు పెట్టారు.

భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని సంసారం అంటారు. మరలాంటప్పుడు నాకూ, నా భార్యకున్న సంబంధం వ్యభిచారం ఎలాగౌతుంది అని జనాంతికంగా హాశ్చర్యపోయాడు మన వెధవ.

‘‘ముందు మీరిద్దరూ భార్యాభర్తలేనా, కాదా అన్నది తేలాలి,’’ అన్నారు కోర్టువారు.

తేలినా, డబ్బు ఖర్చుపెట్టి తిండిపెట్టడం, డబ్బెట్టి ఒంటిమీదికి బట్టలు కొనిపెట్టడం, డబ్బెట్టి ఇల్లు అద్దెకు తీసుకొనో, కొనిచ్చో, కట్టించో కాపురం చెయ్యడం వ్యభిచారమేనని వాదించింది ప్రాసిక్యూషన్. ఫ్రెండ్లీ పోలీసింగ్ ని అర్థం చేసుకున్న మా వెధవ కళ్ళలో నీళ్లు తిరిగాయి.

పోలీసుల్లో ఇంత చెడ్డ మార్పు వొచ్చినా, స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై అయిదు వసంతాలు గడిచినా, ఇంకా మా హెడ్డు ఎప్పుడు మారతాడన్న సందేహం పోలేదు. అలాంటిదే ఒక సందేహం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చిందనుకొని, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే తాను రాజకీయాల్లో ఉన్నందుకు గాను చెపంలేసుకోకుండా బడిపంతుల్లా, ‘‘నేను అక్కడుంటే చెంపమీద చరిచేవాణ్ణి’’ అన్నారట.

తాముండగా తమ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండగా అతి సామాన్యుడికి వచ్చిన సందేహం మంత్రికి రానందుకుగానూ, కన్నెర్ర జేసిన పోలీసులు, కేంద్రమంత్రిమీద కేసుపెట్టి అరెస్ట్ చేశారు.

హెడ్డెప్పుడు మారతాడన్న అభియోగానికి కోర్టులో కేంద్రమంత్రి ఏం సమాధానం చెబుతాడో తెలిస్తే కానీ సామన్యుడు అడిగిన ప్రశ్నకి గురజాడ సమాధానం చెప్పలేడు.

Krishna Rao Nandigam
Krishna Rao Nandigam
నందిగం కృష్ణారావు ప్రముఖ నవలా రచయిత, కథకుడు. ప్రఖ్యాత న్యాయవాది. మొబైల్: 93930 33345

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles