Monday, June 24, 2024

ఆంధ్రా ‘యూనివర్సిటీ యువత’ గా మారిన సందర్భం!

ఆకాశవాణిలో నాగసూరీయం  – 3

ఇది కరువు ప్రాంతం… అది విశాఖ సముద్రానికి చెలియలికట్ట! రెండింటి మధ్యన తొమ్మిదివందల కిలోమీటర్ల దూరం!!  ఇది కన్నడ సరిహద్దు… అటు ఓడ్ర ప్రాంతపు పొలిమేర. దక్షిణమధ్య రైల్వే పరిధి అనంతపురం జిల్లా ధర్మవరంతో ఆగిపోయేది. హిందూపురం తొలుత దక్షిణ రైల్వేలో ఉండి, పిమ్మట నైరుతి (సౌత్ వెస్టర్న్) జోన్ కు మారింది. అలాగే  దక్షిణ మధ్య రైల్వే జోన్ అటు అనకాపల్లితో ఆగిపోయి,  ఇంకో జోన్ మొదలయ్యేది. ఇటు కన్నడ మిత్రులు, అటు ఒరిస్సా సోదరులు చాకచక్యంగా రైల్వే జోనులు చేసుకున్నారు. అయితే విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ జోన్ ఇటీవల ఏర్పడింది.  

అనంతపురం నుంచి విశాఖకు…

ఇవన్నీ ఎందుకంటే ..అనంతపురం నుంచి విశాఖపట్నం బదిలీ గురించి చెప్పాలను కున్నప్పుడు గుర్తుకు వచ్చాయి. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు దాటుకుని వెడితే గాని, హిందూ పురం వారికి విశాఖ జనసముద్రం తారసపడదు. వాతావరణం, పంటలు, ఆహారపదార్థాలు, మాటతీరు, పండుగలు – పబ్బాలు… ఇలా చాలా తేడాలు కొట్టవచ్చినట్టు కనబడతాయి. అంతకు ముందు విజయవాడలో ఐదేళ్ళు ఉన్నందువల్ల ఈ వైవిధ్యం మరింత ప్రస్ఫుటంగా బోధపడింది. 

వైజాగ్ ఆకాశవాణి బృందం

నిజానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తులాభారం తూచినట్టు అటు, ఇటు కనబడతాయి. రెండింటికి సముద్రం పెద్ద తేడా అయితే ఘనమైన సంస్కృతి‌ ఇంకా  లేకి స్వభావం పోలికా! 

శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు) సృజన చేసిన ‘చివరకు మిగిలేది’ నవలలో అనంతపురం జిల్లా ప్రస్తావన ఉంటుంది.  వారు కొంతకాలం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో పనిచేశారు. గోదావరి జిల్లా వ్యక్తి అనంతపురం ఎందుకు రావడం ? ఈ ప్రశ్నకు జవాబు చాలా కాలం దొరకలేదు.  2015లో నేను మద్రాసు ఆకాశవాణి లో ఉన్నప్పుడు బుచ్చిబాబు శతజయంతి సంవత్సర సందర్భంగా బుచ్చిబాబు సతీమణి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మిని టెలిఫోన్ లో రికార్డు చేశాం. అందులో ఆవిడ చేప్పారు – ఏమిటంటే,  అనంతపురంలో యూనివర్సిటీ వస్తోందని అక్కడికి వచ్చారని.  అది శ్రీబాగ్ ఒప్పందం తాలూకు కలిగించిన అభిప్రాయం. చివరకు యూనివర్సిటి అనంతపురంలో కాకుండా విశాఖపట్నం తరలి వెళ్ళింది.  అదీ మరో రకంగా అనంతపురం-  విశాఖపట్నం అనుబంధం. బుచ్చిబాబు పిహెచ్.డి గురించి వదిలివేసి, మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా చేరిపోయారు.

Also read: రాయదుర్గానికి కథాతోరణం 

కరువుకూ, సముద్రానికీ సంబంధం

నిజానికి  నాకు సంబంధించి కరువుకూ, సముద్రానికి తొలి ముడి వేసింది ఆకాశవాణిలోని గోవా ఉద్యోగం. అయితే, విశాఖపట్నంలో ఊర్లోనే సముద్రం!  హాయిగా ఏ సమయంలో అయినా సముద్రం వైపు వెళ్ళవచ్చు. మద్రాసులోని మెరీనా బీచ్ లాగా లోపలికి పెద్దగా నడవక్కర లేదు, అంతేకాదు శుభ్రంగా లేదని తిట్టుకుంటూ సాగనక్కరలేదు!! విశాఖ రామకృష్ణా బీచ్ చాలా హాయిగా ఉంటుంది. కుడివైపున యారాడ కొండ,  అదే డాల్ఫిన్ నోస్ సగర్వంగా మనలను పలకరిస్తూ ఉంటుంది. 

ఢిల్లీలో, బొంబాయిలో, హైదరాబాదులో ఆకాశవాణి భవనాలు రిజర్వ్ బ్యాంకు దగ్గర్లో ఉంటాయి!  రెండో ప్రపంచయుద్ధం తర్వాత కూడా ఆంధ్ర  విశ్వ విద్యాలయం విజయవాడలో కొనసాగి ఉండిఉంటే – ఆకాశవాణి చేరువలో విశ్వవిద్యాలయం ఉండి ఉండేది. అయితే, 1963లో మొదలైన విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఆంధ్రా యూనివర్సిటీకి ఎంతో దగ్గరని 2004  లో జాయిన్ అయ్యాక బోధపడింది. విశాఖపట్నం  ఆకాశవాణి గేటు ముందు జాయింట్ కలెక్టర్ క్యాంప్ ఆఫీసు కాగా, ఎడమవైపు సముద్ర తీరంగా దాకా ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యాపించి ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో 12 ఆకాశవాణి కేంద్రాలున్నాయి.  వీటిలో ఒక్క విశాఖపట్నానికే ఈ ప్రత్యేకత.

Also read: అనంత వారసత్వ కళా విజ్ఞాన వాహిని!

ఆకాశవాణి నుంచి విశ్వవిద్యాలయంవైపు దృష్టి

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకునే 1984 కాలంలో నేను కడప ఆకాశవాణి వైపు దృష్టి సారించి ఒక ప్రసంగం రాసి పరిశీలన కోసం పంపాను. ఈ ప్రసంగ ప్రతి ఏమైందోగాని, 1988లో నాకు ఆకాశవాణిలోనే ఉద్యోగం వచ్చింది. 2004లో విశాఖపట్నం బదిలీ అయినపుడు మళ్ళీ ఆకాశవాణి నుంచి ఆంధ్రవిశ్వవిద్యాలయం వైపు చూశాను!  

నిజానికి, ఆకాశవాణి అనేది సకుటుంబ స్థాయిలో ప్రభావం చూపే మహా గొప్ప విశ్వవిద్యాలయం!  ఇంటింట పనికొచ్చే ప్రతి విషయానికి సంబంధించి సమాచారాన్ని గంభీరంగా,  వినోదంతో కలిపి ఇచ్చేది ఆకాశవాణి విధానం! వ్యవసాయం, కుటుంబ నియంత్రణ, ఆరోగ్యం వంటి ఎన్నో విషయాలలో ఆకాశవాణి అప్పటి కాలంలో సాధించిన ప్రగతి చాలా విశేషమైంది. ఈ తరం వారు ఊహించినా ఆ విషయాలు అందుకోలేకపోవచ్చు! అది అంత గొప్ప హెరిటేజ్.

ప్రభుత్వ కార్యాలయాల పెద్ద పెద్ద గేట్లు, వాటి కాపలాదార్లు చూసి నాకు భయం కలుగుతుండేది. మామూలు మనుషులు చొరవగా వెళ్ళడానికి అవి ఆటంకాలని నాకు అనిపిస్తూ ఉంటుంది.  కనుక ఎంతోమంది యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు ఆకాశవాణి లోపలికి వచ్చే సాహసం చేయకపోవచ్చు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువతకు బెరుకు ఉంటుంది కనుక.  ప్రజల వద్దకు పాలన లాగా మనమే యూనివర్సిటీ క్యాంపస్ కు ఎందుకు వెళ్ళకూడదు – అనిపించింది!  

పనాజీలో ‘క్యాంపస్ ఫోకస్’

 దానికి దశాబ్దన్నర క్రితం గోవా యూనివర్సిటీ పనాజి ఆకాశవాణి లో ‘క్యాంపస్ ఫోకస్’ అనే అరగంట ఆంగ్ల కార్యక్రమం నెలకోసారి చేసిన అనుభవం ఉంది. 2005 లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ సింహాద్రి అనే చండశాసనుడు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అన్నప్రాసనలోనే ఆవకాయ పెట్టినట్లు నాకు తొలి నుంచి స్పోకన్ వర్డ్స్ విభాగం ఇచ్చారు. అనంతపురం లో కొన్ని వారాలు  నేను  ‘యువవాణి’ పర్యవేక్షించినా, యవ్వన మిత్రుడు కళాకృష్ణ రాగానే వారికి  బదిలి అయ్యింది ఆ శాఖ. కనుక విశాఖపట్నం ఆకాశవాణి లోనే ఒకే ఒక్క సారి ‘యువవాణి’ విభాగాన్ని కొంతకాలం నిర్వహించాను. కనుక విభిన్నంగా చేయాలని,  రెండు మహాసంస్థలకు మధ్య కార్యక్రమాల వారధి కట్టాలని తలంచాను. అలోచన రాగానే చెబితే డైరెక్టర్ కె.వి.హనుమంతరావు ‘చేసెయ్’ అన్నారు;  యూనివర్సిటీ జర్నలిజం విభాగం మిత్రులు పి. బాబీవర్ధన్ ‘చేద్దాం’ అన్నారు. 

వైస్ ఛాన్సలర్ చాలా ఆదరణీయంగా స్పందించి, అన్ని శాఖల హెడ్లతో మీటింగ్ పెట్టారు. యాభై, అరవై మంది ఆడియన్సుగా కూచోవడం గుర్తుంది. వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపల్స్, ఆకాశవాణి డైరెక్టరు, జర్నలిజం విభాగం పి. బాబివర్ధన్, నేనూ వేదిక మీద ఉండగా ‘యూనివర్సిటీ యువత’ లాంఛనప్రాయంగా మొదలైంది. 

ప్రతిశనివారం యూనివర్శిటీ క్యాంపస్ లో…

సుమారు 2005 ఆగస్టులో మొదలై ఒక సంవత్సరంపాటు సాగింది. ప్రతి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సహాయకుడు రాజేష్ తో కలసి బృందంగా నేను యూనివర్సిటి క్యాంపస్ కు రికార్డింగుకు వెళ్ళేవాడిని.  జర్నలిజం శాఖ విభాగంలో 5 గం. దాకా విద్యార్థినీ విద్యార్థుల ఫర్ ఫార్మెన్స్ ను రికార్డు చేసేవారం. దీనికి ముందుగా ఆకాశవాణిలో ఈ  ప్రకటనతోబాటు,  యూనివర్సిటీ క్యాంపస్ లో నోటీసులు సర్క్యులేట్ అయ్యేవి.  కవిత, కథ, ప్రసంగం, మిమిక్రి  ఏకపాత్ర, పాట, నాటిక, వాయిద్య సంగీతం – ఇలా విద్యార్థులు ఎవరికి ఏది ఆసక్తి ఉండేది వారు అది ప్రదర్శిస్తే, మేము రికార్డు చేసేవాళ్ళం. 

అలా రికార్డు చేసిన అంశాలలో నాణ్యమైన వాటిని ప్రతి ఆదివారం సాయంత్రం ఐదున్నరకు  యువవాణిలో ప్రసారం చేసేవారం. రికార్డింగులో పాల్గొన్నవారు, పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు మా కార్యక్రమం తప్పక వినేవారు. రికార్డింగులోని వరుస క్రమాన్ని కాకుండా, వినోదం, సమాచారం, విద్య – అనే నియమం ప్రకారం ప్రణాళిక చేసి కార్యక్రమం రూపొందించేవారం. సరంజామా సిద్ధం అయ్యాక, పద్మిని తన ప్రజంటేషన్ తో నేరేషన్ రికార్డు చేసి, సాపు చేసి కార్యక్రమాన్ని సిద్ధం చేసేవారు.  రాజేష్ ఓబి స్పాట్ లో తోడు  ఉండగా, తర్వాతి దశలో పద్మిని సాయంతో ‘యూనివర్సిటీ యువత’ రూపుదిద్దుకునేది.

సంవత్సరం పొడవునా ఓబీ 

ఇలా క్రమం తప్పకుండా యూనివర్సిటీలో ఓబీ (అవుట్ సైడ్ బ్రాడ్ కాస్ట్) స్పాట్ లో ఒక సంవత్సరం మించి రికార్డు చేసి,  కార్యక్రమం రూపొందించిన సందర్భం తెలుగు ఆకాశవాణి చరిత్రలో ఇదే తొలి ప్రయత్నం కావచ్చు. మెరికల్లాంటి ఎంతోమంది పిల్లలు ప్రతిభా నైపుణ్యాలు చూపారు.  వీరు  తర్వాత వివిధ రంగాలలో స్థిరపడ్డారు.  ప్రతి శనివారం (సెలవు వదులుకొని )  యూనివర్సిటీ క్యాంపస్ కు వెళ్ళాడం వల్ల అక్కడి యువతను దగ్గరగా చూసే అవకాశం, కలిసే సందర్భం, పరిశీలించే వెసులుబాటు కలిగాయి. వీటివల్ల మరిన్ని ఆలోచనలూ, మరికొన్ని కార్యక్రమాలకు కొత్త ఆలోచనలు,  సూచనలు దొరికే వీలయ్యింది.  ఆమేరకు ఎంతో తృప్తి కల్గింది ‘యూనివర్సిటీ యువత’. 

అలాంటి ప్రయోగం చేయటానికి మరెక్కడా అవకాశం దొరకలేదు. కనుక నా ఈ ప్రయత్నానికి నేను ఆనందపడుతున్నాను. అయితే ఫోటోలు డాక్యుమెంట్ చేయాలని ఆలోచన రాలేదు.  ఈ మొత్తం ప్రయత్నంలో మిత్రులు బాబీవర్ధన్ తోడ్పాటు విశేషమైంది. ఎంతోమంది యూనివర్సిటీ సిబ్బంది మిత్రులు అయ్యారు. ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ దినపత్రిక సిటీ సంచికలో ఒక అరపేజీ ఈ ప్రయత్నం గురించి రంగుల ఫోటోలతో ప్రచురించింది. ఈ వార్తా విశ్లేషణను రాసింది అనుపమా చక్రవర్తి అనే బెంగాలీ అమ్మాయి. ఆమె ఇప్పుడు హైదరాబాదులో ‘తెలంగాణ టుడే’  పత్రికలో పనిచేస్తున్నారు!

అదీ నేను ఆంధ్రా ‘యూనివర్సిటీ యువత’గా మారిన సందర్భం, నేపథ్యం! ! !

డా. నాగసూరి వేణుగోపాల్, హైదరాబాద్

(విశ్రాంత ఆకాశవాణి తిరుపతి, ప్రసార భారతి రీజనల్ అకాడమీ హైదరాబాద్ నిర్దేశకులు)

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

1 COMMENT

  1. చాలా మంచి జ్జ్ఞాపకం మాది విశాఖపట్నమే. నేనూ ఆంధ్ర విశ్వావిద్యాలయం లోనే చదువుకున్నాను. అత్తిలి కృష్ణారావు గారూ. NSD నుంచి అనురాధ కపూర్ నాయకం మీద రేడియో టాక్ చేసాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles