Sunday, September 15, 2024

నేరగ్రస్థ‌ రాజకీయాలపై అంకుశం ఎప్పుడు?

నీరుకొండ ప్ర‌సాద్‌

దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులపై ఉన్నఅవినీతి కేసులను నిర్దిష్ట కాలవ్యవధిలో తేల్చివేసేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇవ్వడం, అందుకు అనుగుణంగా సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రయత్నాలు ప్రారంభించడం అభినందనీయం. అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఏకైక ఏజెండాగా సాగుతున్న నేటి రాజకీయం గల్లీ నుండి డిల్లీ దాకా నేర స్వామ్యమే, ప్రజాస్వామ్యమనే అమృతఫల వృక్షాన్ని నేరగ్ర‌స్థ రాజకీయం అనే పురుగు ధ్వంసం చేస్తున్నది. నేరగ్రస్థ రాజకీయాల విషకౌగిలి నుండి దేశాన్ని, చట్టసభలను రక్షించడానికి న్యాయ వ్యవస్థ  ప్రగతిశీల తీర్పు ఇవ్వడం అభినందనీయం.

రాజకీయ పార్టీలూ, ప్రజలూ పూనుకోవాలి

నేరగ్రస్థ‌ రాజకీయాలపై న్యాయ పాలిక చేస్తున్నది ఒంటరి పోరు కాకుండా దీటైన దిద్దుబాటుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూనుకోవాలి. నేర రాజకీయ నిర్మూలనకు అనువైన శాసన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చెయ్యాలి.  నేరగాళ్లే రాజకీయ పార్టీలు స్థాపించి శాసన నిర్మాతలై చక్రం తిప్పుతున్నారు. ప్రజాధనాన్ని ఆబగా భోంచేయ్యడం రాజకీయనేతాగణం విశిష్టాధికార పరిథిలోని అంశం అయినట్లు దర్యాప్తు సంస్థలు కూడా తేలిగ్గా తీసుకోవడం, ఆయా కేసులు దశాబ్దాల బాటు తెమలకపోవడం ఇండియా విలక్షత గా మారింది. ఎన్నిదారుణాలకు పాల్పడినా తిమ్మిని, బమ్మిని చేసి దర్జాగా తిరగగలిగే వెసులుబాటు ఇప్పటివరకు  ఇండియాలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు. నేరగాళ్లను  ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు తాజా ఆదేశాల అంకుశం సరిపోతుందా లేదా అన్న సందేహం కూడా వెంటాడుతోంది.

అవినీతి నేరాలపై సరైన పంధాలో సమర్ధ పోరు సాగించినప్పుడే సార్ధకత చేకూరుతుంది. భారతదేశానికి అవినీతే అసలు జబ్బు. కొందరికి జీవన విధానంగా మారిన అవినీతి దేశాన్ని నాశనం చేస్తున్నది. దేశవ్యాప్తంగా ఊడలు దిగిన అవినీతి విష వృక్షాన్ని కూకటి వేళ్ళతో కూల్చివేయ్యడానికి ప్రజలందరూ పోరుసాగించాలి.

స‌భ్యుల గుణ‌గ‌ణాలే దేశ ముఖ‌చిత్రం కావాలి

అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు చట్ట సభల్లో కొలువుతీరే సభ్యుల గుణ గణాలే దేశ ముఖ చిత్రంగా చెప్పాలి. కొందరి కేసులు పరిస్కారానికి రెండు దశాబ్దాలు నిరీక్షించాల్సి వస్తుందని, నేరాలు ఎదుర్కొనే వ్యక్తులు ఈ లోగా నాలుగుసార్లు ప్రజా ప్ర‌తినిదులుగా వెలిగిపోయే అవకాశం ఉంటుందని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయి గతంలోనే ఎత్తి చూపి ఆవేదన చెందారు. బయట  మనం తలెత్తి చూడటానికి కూడా సిగ్గుపడే వాళ్ళతో చట్ట సభల్లో భుజ,భుజాలు రాసుకొంటూ తిరగాల్సి వస్తుందని దివంగత  మాజీ ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్ ఆవేదన చెందారు. క్రిమినల్ కేసులు వున్నవారే  అధికంగా గెలుస్తున్నారు. అభ్యర్ధులకు ఎంత హేయమైన నేర చరిత్ర వుంటే విజయావకాశాలు కూడా అంత పెరుగుతున్నాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ప్రస్తుత లోక్ సభలో హత్యలు, హత్యాచారాలు వంటి హేయమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య 29 శాతం నమోదు కావడం భారత ప్రజాస్వామ్యం బహుముఖ ప్రబల సంకేతం కూడా.

ఊడలు దిగిన నేరస్వామ్యం

ఊడలు దిగిన నేరస్వామ్యానికి తెరపడాలి అంటే న్యాయవ్యవస్థ ఒక్కటే కాదు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు కూడా కన్నెర్ర చెయ్యాలి. వేల కోట్ల  ప్రజాధనం దోపిడీ చేసినా ఇప్పటివరకు అడిగేవారు, స్పందించే వారు లేకుండా పోయారు. ఎవరెంత దోచుకున్నాఎన్నికల్లో గెలిచి అధికారం చెలాయిస్తున్నారు. జేబు దొంగలకు జైల్లో పెట్టే చట్టాలున్నాయి. కానీ దేశాన్ని,రాష్ట్రాన్ని దోచుకొన్న వారికి శిక్షలు లేవు మనదేశంలో. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చజరగాలి. ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు పెంచే ప్రయత్నం అన్నీ వైపులనుండి జరగాలి. నేరగాళ్ల వెన్ను విరిచేలా చర్యలుండాలి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లే ఇండియాలో ఎన్నికల  వేళ నాట్యమాడుతున్నది ధనస్వామ్యమే. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పటిష్టమైన ఎన్నికల సంస్కరణలు కూడా అత్యవసరం.

సంచ‌ల‌నం రేపుతున్న న్యాయ‌వ్య‌వ‌స్థ య‌త్నాలు                                                                                                                                                                                  నేరస్తులుగా మచ్చపడ్డవారిని అసలు ఎన్నికల్లో పోటీచేయ్యనియ్యకుండా, చట్టసభల్లో ప్రవేశించనివ్వకుండా అడ్డుకొని నిష్కళంక పాలనకు శ్రీకారం చుట్టాలన్న న్యాయ వ్యవస్థ ప్రయత్నాలు సంచలనం రేపుతున్నాయి. ఆ మేరకు సుప్రీం కోర్టు తీసుకొన్న చొరవతో వివిధ రాజకీయ పక్షాలు సునామీ చుట్టుముట్టినంతగా భయపడుతున్నారు. అంతులేని అవినీతికి పాల్పడిన వారి కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లుగా ఆందోళన పడుతున్నారు, ఈ ప్రమాదం నుండి బయటపడకపోతే బతుకులేదన్న విధంగా న్యాయవ్యవస్థపై నిందారోపణలు ఎక్కుపెట్టారు. నేరగాళ్లతో లుక,లుకలాడుతున్న రాజకీయ పార్టీలు వారులేని రాజకీయాలు నడపడం ఎలాగో దిక్కుతోచడం లేదు. ఇప్పుడు హఠాత్తుగా సచ్చీల రాజకీయాలు అనేసరికి కంగారు  పడుతున్నారు. నేరస్తులే వారికి నారు, నీరు కనుక ప్రజా ప్రయోజనాలకన్నా నేరస్తుల హక్కులు కాపాడటమే వారికి ప్రధానం.

దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు

దివాళా తీసినవాడు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని రాజ్యాంగం ప్రకటిస్తే పచ్చిదోపిడితో రాష్ట్రాన్ని, దేశాన్ని దివాళా తీయించినవారు పల్లకీలు ఎక్కి ఊరేగుతున్నారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేసి శిక్షపడ్డ నాయకులను జీవితాంతం ఎన్నికల్లో పోటీనుంచి బహిష్కరించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో న్యాయవాది అమికస్ క్యూరీ హన్సారీయా వెల్లడించిన వాస్తవాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మాజీలు కానీ, ప్రస్తుత ఎంపీలు, శాసన సభ్యులు మొత్తం 4,442 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండగావారిలో 2,556 మంది ప్రస్తుత ప్రజాప్రతినిధులే. జీవిత ఖైదు పడగల కేసులు 413 వుంటే వాటిలో 174 ప్రస్తుత ఎంపీలు,ఎమ్మెల్యేలేనని  వెల్లడైంది. దేశవ్యాప్తంగా నేర చరిత్ర క‌లిగిన ఎంపీల సంఖ్య 14వ లోక్ సభలో 24 శాతం వుండగా 15 వ లోక్ సభలో 30 శాతానికి,16 వ లోక్ సభలో 34 శాతానికి,17 వ లోక్ స్థానానికి 43 శాతానికి పెరిగింది. బిజెపి పార్లమెంటు సభ్యులు 155 మంది పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

అవిభ‌క్త క‌వ‌ల‌లుగా నేరం-రాజ‌కీయం

నేరంకోసం రాజకీయం అన్న చందంగా నేరం, రాజకీయం అవిభక్త కవలుగా మారిన ప్రస్తుత దుస్తితి. ఒకప్పుడు తలలు పండిన మేధావుల వేదికగా రాణించిన రాజ్యసభ సైతం క్రిమినల్, హేయనేరాలున్నసభ్యులతో అలరారడం ఆలోచనా పరులకు ఆవేదన కలిగిస్తుంది. మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 54మంది సభ్యులలో అంటే 24 శాతం మందిపై క్రిమినల్ కేసులు  ఉన్నాయి. 77మంది బిజెపి రాజ్యసభ సభ్యుల్లో 14మంది పైనా, 40మంది కాంగ్రెస్ సభ్యులలో 8మందిపైనా క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎడిఆర్ నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో ఎన్నికైన 62 మంది రాజ్యసభ సభ్యుల్లో 44 శాతం మందిపై క్రిమినల్ కేసులుండగా వీరిలో 12 మంది పై తీవ్రమైన కేసులులున్నాయి.

చట్టసభల సాక్షిగా వమ్ము అయిన కృషి

నేరమయ రాజకీయాలను ప్రక్షాళించే దిశగా ఎన్నో వ్యవస్థలు, సంస్థలు చొరవ తీసుకొన్నప్పటికి ఇన్నాళ్ళు అది చట్టసభల సాక్షిగా వమ్ముఅయింది. 2015 మార్చిలో న్యాయకమీషన్ ఇచ్చిన 255 నివేదికలోను డబ్బు, నేరగాళ్ల ప్రభావాన్ని అరికట్టే అనేక మార్గాలు చూపారు. ఆ సూచనలు, సిఫార్సులు అమలు చెయ్యాల్సిన సమయమిది. నేరాభియోగాలు రుజువు అయ్యేవరకు ముద్దాయిని దోషిగా పరిగణించరాదన్నది నిజమే. కానీ  రాజకీయాల్లో జొరబడి శాసన నిర్మాణంలో పాలు పంచుకొనేవారు తీవ్ర నేర ఆరోపణలు అన్నింటికి అతీతులై వుండాలని భారత ప్రధాన న్యాయమూర్తి గా జస్టీస్ దీపక్ మిశ్రా రెండేళ్లనాడే స్పష్టం చేశారు. నేరస్తులను  చట్టసభల్లోకి రాకుండా అడ్డుకొనేందుకు ఎన్నికల సంఘం తాను చెయ్యాల్సిన కసరత్తు చేసింది. సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  

నేరస్థులను అడ్డుకునేందుకు బలమైన చట్టం చేయాలని సుప్రీంకోర్టు సూచన

నేరస్తులను చట్టసభల్లోకి రానీయకుండా నిరోధించేందుకు బలమైన చట్టం చేయాలని 2018 సెప్టెంబర్లో పార్లమెంటును ఆదేశించింది. ఆ ఆదేశాలను లెక్కచెయ్యకపోవడంతో 2020 పిబ్రవరిలో ఈ విషయంపై మరింత గట్టిగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. క్రిమినల్ కేసులున్నవ్యక్తులు ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు అందుకు దారితీసిన కారణాలను నామినేషన్ వేసిన 48 గంటల్లో తమ వెబ్ సైట్ లో ఉంచాలని, పార్టీలకు అనుబంధంగా వుండే సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని ప్రింట్ మీడియా ద్వారా ప్రకటనలు చేయాలని  సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. నేర నేతల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఉండాల్సిందే అని. జాతి ప్రయోజనాల రక్షణకిది అత్యావసరం అని సుప్రీం కోర్టు అభిప్రాయపడుతోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవ్యవ‌స్థ‌ను  నిర్మూలించడమే లక్ష్యంగా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు ఒకెత్తు అయితే వాటి పనితీరు సజావుగా సాగేలా చూడటం మరో  భాధ్యతగా తీసుకోవాలి. ఇప్పటికైనా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్య ఫలం అవినీతి పరుల పరంకాకుండా పరిరక్షించాలి.

80ల‌క్ష‌ల కోట్లు అవినీతిప‌రుల బొక్క‌సంలోకి

అవినీతి నిర్మూలన పై పటిష్ట మైన చర్యలు  లేని కారణంగా ఇండియాలో అవినీతి నేతాగణం  బొక్కినది రూ 80 లక్షల కోట్లని అని తెలుస్తుంది.అయినా దొషులెవ్వరికీ శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. నేరాభియోగాలు, నేరచరిత్ర గల ఎంపీలు మూడోవంతు  వున్నారు. వారంతా చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు. ఆ గలీజును ప్రక్షాళిస్తానని హామీ ఇచ్చి మోడీ  అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటింది. ఆ దిశగా అడుగులు పడలేదు. నిబద్దతతో నిజాయితీగా సేవచెయ్యాలి అనుకొనే సామాన్యులకు రాజకీయాల్లో ప్రవేశం లేకుండా పోయింది. కోట్లుగుమ్మరించి ఓట్లు కొనుగోలు చేసి నాయకులు తాము పేట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్లు అధికంగా సంపాదిస్తున్నారు. ఏది ఏమైనా ఆర్ధిక నేరగాళ్లను ఏరేస్తే తప్ప మనం నిర్మించుకొన్న ప్రజాస్వామ్య వ్యవస్థ  పరిఢ‌విల్లదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నఈ దుష్ట సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడైనా పకడ్బ‌దీ చర్యలు చేపడతారని, ఈ సారైనా నేరగాళ్ల పునాదులు కదులుతాయెమో వేచిచూడాలి.

విషకౌగిలి నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ

నేరగ్రస్థ‌ రాజకీయాల విషకౌగిలి నుండి దేశాన్ని, చట్టసభలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత  ఏర్పడింది. ప్రజలు కూడా నేరమయ రాజకీయాలపై సమరం సాగించాల్సిన సమయం ఆసన్నమైంది. నేరగ్రస్థ‌ రాజకీయాలపై న్యాయపాలిక చేస్తున్నది ఒంటరి పోరు కాకూడదు. అనువైన శాసన నిర్మాణానికి కేంద్రప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నించి దానిపై అంకుశం మోపి  జాతి ప్రయోజనాలు పరిరక్షించాలి. నేర రాజకీయాలనుండి చట్ట సభల్ని విముక్తం చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల రూపేణా  న్యాయస్థానాల్లో సాగుతున్న పోరాటాలకు చరిత్ర వుంది. ఈ పోరాటాలకు ఈ సారైనా న్యాయం జరుగుతుందని,చట్టసభలు సచ్చీలురతో కొత్త శోభను సంతరించుకోంటాయని ఆశిద్దాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles