Tuesday, April 16, 2024

వ్యాపార ప్రయోజనాలకు వాట్సప్ పెద్దపీట

వాట్సప్ ఈ మధ్య కొత్త గోప్యతా విధానాన్ని (ప్రైవసీ పాలసీ) తీసుకు వచ్చింది. ఇది మొన్న ఫిబ్రవరి నుంచే అమలు కావాల్సి వుంది. ఖాతాదార్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో మే 15 వరకూ వాయిదా వేసింది. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళింది. ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో నడుస్తోంది. ఈ సందర్భంగా సోమవారం నాడు  ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారు. కొత్త గోప్యతా విధానాన్ని ఇకమీదట వాయిదా వేసే ప్రసక్తే లేదని, యూజర్లు అంగీకరించకపోతే, నెమ్మదిగా వారి ఖాతాలను తొలగిస్తామని కరాఖండిగా చెప్పేసింది.

Also read: పాలస్తీనా – ఇజ్రాయిల్ ఘర్షణ

ఐటీ చట్టానికి విరుద్ధం అంటున్న కేంద్ర సర్కారు

ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. యధాతధ స్థితిని విధించమని కూడా కేంద్ర ప్రభుత్వ న్యాయ ప్రతినిధి కోర్టును కోరారు. ఈ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. వాట్సాప్ ఖాతాదారులనైనా పోగొట్టుకోడానికి సిద్ధంగా ఉంది కానీ, కొత్త పాలసీ విషయంలో వెనక్కు తగ్గేట్టు లేదు. ఏ యాప్ వాడాలన్నా ప్రైవసీ ఎంతో ముఖ్యం. యూజర్ల సమాచారానికి భద్రత అంతకంటే ముఖ్యం. అది ఆ యాప్ నిర్వాహకుల చేతిలోనే ఉంటుంది. ఈ హక్కులను కాపాడడం వాటి బాధ్యత. వాట్సప్ కొత్తగా తీసుకువచ్చిన గోప్యతా విధానంపై కొంతకాలం నుంచి చర్చ జరుగుతోంది.

Also read: పాకిస్తాన్ కొత్త పాచిక?

సమాచార గోప్యతకు హామీ

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని వాట్సాప్ నుంచి వివరణ కూడా అడిగింది. కొత్త పాలసీ వల్ల సమాచార గోప్యతకు భద్రత కల్పిస్తామని సమాధానం చెప్పింది. కానీ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వచ్చిన అనుమానాలు తీరడం లేదు. యూజర్ల డేటా పేస్ బుక్ కు కూడా అనుసంధానం జరుగుతోంది. వాట్సాప్ లో పెట్టే ఫోటోస్, స్క్రీన్ షాట్స్ మరికొన్ని యూజర్ కు సంబంధం లేకుండానే పేస్ బుక్ లో కూడా కనిపిస్తున్నాయి. వాట్సాప్ లో ఉండే కాంటాక్ట్స్ వేరు, పేస్ బుక్ లో ఉండే ఫ్రెండ్స్ వేరు. పేస్ బుక్ లో కనెక్ట్ అవుతున్నవారికి ఫ్రెండ్స్ అనే పేరుపెట్టినా, వారు ఫ్రెండ్స్ ఎలా అవుతారు? వారిలో చాలామంది కనీసం పరిచయస్తులు కూడా కారు.

Also read: భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

అపరిచితులు స్నేహితులు ఎట్లా అవుతారు?

వాళ్ళు పంపిన రిక్వెస్ట్ లను బట్టి, ప్రొఫైల్ బట్టి ఫ్రెండ్స్ లిస్ట్ లో చేర్చుకోవడం, చేరడం జరుగుతుంది. సమాచారం, అభిప్రాయాలూ, మరి కొన్నింటిని పంచుకోడానికి పేస్ బుక్ మరో అదనపు వేదిక మాత్రమే. వాట్సాప్ లో ఉండేవారు అలా కాదు. మన పర్సనల్ కాంటాక్ట్స్ లో ఉన్నవాళ్లే ఎక్కువమంది వాట్సాప్ కాంటాక్ట్స్ లోనూ ఉంటారు. ఇందులో బ్రాడ్ కాస్ట్ గ్రూపులది వేరే అంశం. ఇది ఒక అదనపు సౌకర్యం మాత్రమే. కొన్నింటిని వాట్సాప్ లో, కొన్నింటిని పేస్ బుక్ లో షేర్ చేస్తూ ఉంటాం. మరికొన్నింటిని మాత్రమే రెండు వేదికల్లో పంచుకుంటాం. ఫోటోస్, స్క్రిన్ షాట్స్ వంటివి అవసరమైనవి తప్ప మిగిలినవి పేస్ బుక్ లో షేర్ చెయ్యము. అందులో లొకేషన్ అడ్రస్ లు, ఆధార్, పాన్ కార్డ్స్, బ్యాంక్ కార్డ్స్ మొదలైనవి కూడా ఉంటాయి. వాట్సాప్ లో వచ్చినవి, పంపినవి మనకు సంబంధంలేకుండానే పేస్ బుక్ లో కూడా కొన్ని కనిపిస్తున్నాయి.

Also read: ఆత్మీయునికి అశ్రునివాళి

ఇది ప్రమాదకరమైన ధోరణి

ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. వాట్సప్, పేస్ బుక్ ఒకప్పుడు వేరే వేరే సంస్థలు. ఆ మధ్య రెండూ కలిసిపోయాయి. వాటాలను కొనుక్కోవడం వల్ల ఇవి రెండూ ప్రస్తుతం ఓకే యాజమాన్యం చేతిలో ఉన్నాయి. ఈ రెండు ఆయుధాలతో మార్కెట్ ను శాసించాలని వారి వ్యూహం. నిజంగానే, ప్రస్తుతం వాళ్ళు శాసిస్తూనే ఉన్నారు. యూజర్ల సమాచారాన్ని, ఐపీ అడ్రస్ లను ఇతర సోర్సులకు కూడా ఇస్తున్నారని అంతర్జాతీయంగానూ ఆందోళనలు చెలరేగాయి. దీనితో ఫిబ్రవరి 8నుంచి అమలవ్వాల్సిన వాట్సప్ కొత్త పాలసీ మే 15కు వాయిదా పడింది. యూజర్ అనుమతి లేకుండా పేస్ బుక్ డేటాను ఎవ్వరికీ షేర్ చేయమని వాట్సాప్ వెల్లడించింది. కొత్తగా తెచ్చిన పాలసీ ఎక్కువగా బిజినెస్ యూజర్ల కోసమేనని వాట్సాప్ అంటోంది. వ్యక్తిగతంగా చేసుకొనే మెసేజెస్, కాల్స్ కు సంబంధించిన వివరాలను ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ సాంకేతికతను వినియోగించడం వల్ల వాట్సాప్ కూడా చూడలేదని చెబుతోంది.ఎందుకోగానీ, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు చాలామంది యూజర్లకు కొత్త ప్రైవసీ పాలసీపై నమ్మకం కుదరడం లేదు. అసలే సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

ఇతర యాప్ లకు ప్రయోజనం

ఇప్పటికే కొంతమంది ప్రత్యామ్నాయ యాప్ ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో, టెలిగ్రామ్ యాప్ కు గిరాకీ పెరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని యాప్ లను రూపొందిస్తోంది. ఇవి ఇంకా సంపూర్ణమైన నిర్మాణ దశలోకి, విస్తృతంగా వాడకంలోకి రాలేదు. బహుశా! భవిష్యత్తులో, ప్రభుత్వ యాప్ లు, వాట్సప్ ప్రత్యామ్నాయ యాప్ ల వైపు యూజర్లు మళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ వాట్సప్ దే అగ్రస్థానంగా ఉంది. 2009లో ప్రారంభమైన ఈ వాట్సప్ వేదిక, ఈ పుష్కరకాలంలో గణనీయమైన ప్రగతి ప్రయాణానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 200కోట్లమంది యూజర్లు ఉన్నారు. రోజుకు వందకోట్ల కాల్స్, నెలకు 10వేల కోట్ల మెసేజ్ లకు వాట్సప్ అతిపెద్ద వేదికగా మారింది. ప్రజలను ఇంకా పెద్దఎత్తున ఆకర్షించి, మార్కెట్ ను కొల్లగొట్టడానికి వాట్సప్ -పేస్ బుక్ కలిసి సరికొత్త ఫీచర్స్ ను చాలా తెస్తున్నారు. ఏది ఏమైనా, వాట్సప్ తెచ్చిన కొత్త గోప్యతా విధానం పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా, యూజర్లకు కొత్త తలనొప్పులు తెచ్చేవిధంగా లేకపోవడమే అందరూ కోరుకునేది. వాట్సప్ పునరాలోచించి, జనరంజకంగా, సమాచార రక్షణకు కవచంలా తన విధానాలను నిర్మాణం చేసుకుంటుందని ఆశిద్దాం. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ అంశంలో కేంద్రం ఎటువంటి వైఖరిని అవలంబిస్తుందో తెలియాల్సి వుంది.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles