Thursday, March 28, 2024

మాది ఆకలి రాజ్యం అంటారా? పాకిస్తాన్ కన్నా దిగువన ఉన్నామంటారా? హన్నా…!

ఏమిటీ.. మీరు ప్రపంచంలో ఆకలి లెక్కలు వేసి మాకు చెబుతారా? త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి… ఆకలి రాజ్యమా. ఏం లెక్కలివి? ఎవరి లెక్కలివి? అయిదేళ్లు నిండని పాపలకు మేం సరిగా అన్నంపెట్టడం లేదా? ఆర్నెల్ల పసికందుల నుంచి రెండేళ్ల పాపలలో 84 శాతం మందికి మేం కనీస తిండి కూడా పెట్టడం లేదా? అద్భుతంగా వెలిగిపోతున్న మా దేశాన్ని అంతర్జాతీయంగా పరువు దీయడానికేనా ఈ మాటలు. మొత్తం 119 దేశాలలో మాదేశం 102 రెండవస్థానంలో ఉందన్నా ఫరవాలేదు. దక్షిణాఫ్రికా కన్నా హీనంగా ఉన్నామన్నా సర్దుకుంటాం. కానీ బాంగ్లాదేశ్‌ కన్నా, చిన్నిచిట్టి దేశం నేపాల్‌ కన్నా మేం తీసిపోయామా? 2015లో మా దేశానికి కింద పాకిస్తాన్‌ ఉందని మీరే చెప్పారు. మాకు 93వ ర్యాంకు ఇచ్చి పాక్‌కు 106 ఇచ్చారు. అది న్యాయం. ఆకలి మంటల్లో మేం ఎక్కడున్నా సరే పాకిస్తాన్‌ కన్నా ముందున్నాం అని అప్పటినుంచి మేం సంతోషిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మాకు ఆ అపరిమితానందం కరువుచేస్తారా? మా దాయాది, మా శత్రువు, వారి పేరు చెబితే చాలు మాకు ఓట్లు కుప్పలు తెప్పలుగా పడతాయి. మావాళ్లే ప్రతిసారీ గెలిచినా సరే మేం వారితో క్రికెట్‌ ఆడనే ఆడం. అటువంటి పాకిస్తాన్‌ కన్నా మాదేశాన్ని 8 అడుగుల కిందకు తోస్తారా? 2016లో మాకు 97, పాక్‌కు 107 ఇచ్చారు, 2017లో మాకు 100, మా దాయాదికి 106 ఇచ్చారు. ఫరవాలేదు. చివరకు పోయినేడాది 2018లో పాక్‌కు 106 ఇచ్చి మాకు 103వ ర్యాంకు ఇచ్చారు. అదే కరెక్టు. ఈసారి మా ర్యాంక్‌ను 103 నుంచి 102 చేశారు. మాకది పెద్ద ప్రమోషనే కదా అని సంతోషిద్దామనుకున్నాం. కాని పాక్‌కు 93వ ర్యాంక్‌ ఇచ్చి మమ్మల్ని అవ మానించారు. కనీసం పాక్‌కన్నా ముందున్నాం అని చెప్పినా మిమ్మల్ని క్షమించే వాళ్లం. మీరు టెర్ర రిస్టుల్లో కలిసిపోయారా లేక మా దేశంలో అర్బన్‌ నక్సలైట్లు మీమీద ఏమైనా మత్తుమందు జల్లారా? మాకు చెత్త ర్యాంకు ఇస్తే ఇచ్చారని సరిపెట్టుకుందామనుకుంటే, బంగ్లాదేశ్‌ను తెగ మెచ్చుకుంటారా? బాలబాలికలకు పోషకాహారం ఇచ్చే బుద్ధి వారికి ఎక్కువగా ఉందా, పరిశుభ్రత కల్పించడంలో, ప్రచారంలో, ఆరోగ్యం రక్షించడంలో బంగ్లాదేశ్‌కు అన్ని మార్కులు, పక్కనే ఉన్న మా దేశానికి మరీ అంత తక్కువ మార్కులు? వేస్తారా?

మాకన్నా చిన్న దేశం నేపాల్‌ను అంతగా పొగి డారు. సరే అది మా హిందూ రాజ్యం గనుక ఫరవాలేదు. కాని మరీ అన్ని ప్రశంసలా? 2000 సంవత్సరం తరువాత నేపాల్‌ వారు ఆకలి మీద యుద్ధంలో చాలా ముందుకు వెళ్లారంటారా? మేమేమీ చేయలేదంటారు. మా దేశంలో చాలామంది పిల్లలు పురిట్లోనే పోయారంటారా? పిల్ల లకు ఎత్తుకు తగిన బరువు, వయసుకు సరిపోయే ఎత్తు లేదంటారా? ఏం మా పిల్లల్ని ఎప్పుడైనా ఎత్తుకున్నారా? లేకపోతే మీకెలా తెలుస్తుందో? మేం స్వచ్ఛభారత్‌ ద్వారా పారిశుధ్యం చాట డం లేదా, బహిర్భూమిలో విసర్జన మీద యుధ్దం ప్రకటించి, బోలెడు మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం కదా, అంతర్జాలం డాష్‌బోర్డులో క్లిక్‌ కొడితేచాలు ఏ ఊళ్లో ఎన్ని మరుగుదొడ్లు కట్టామో లెక్క చూసుకునే అద్భుతమైన, అదిరిపోయే పారదర్శక పాలనా విధానాన్ని తీసుకువచ్చాం. మేం ఎంత పారదర్శకంగా ఉన్నామంటే అసలు మాకు ఆర్టీఐతో పనే లేదు తెలుసా? అందుకే మేం మా సమాచార కమిషనర్లకు అంత పెద్ద ర్యాంకు ఎందు కని తగ్గించి పడేశాం. మీరు మా ఆకలి ర్యాంకు పెంచుతారా? మా దేశంలో ప్రతి శుక్రవారం వందల సినిమాలు విడుదల అవుతాయి. వాటిలో బోలెడు సినిమాలు వందల కోట్లు సంపాయిస్తున్నాయి. అయినా మా దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని తప్పుడు ప్రచారం చేసి ఫేక్‌ న్యూస్‌ పంచుతున్నారని మేం జనానికి నచ్చజెప్పుకుంటున్నాం. కొత్తగా ఈ ఆకలి అంకెల పంచాయతీ ఏమిటి? ఆకలిమంటలు పెరిగాయనే అనుకుందాం. దానికి మేమా కారణం? పర్యావరణ వాతావరణ మార్పులు, భూమి వేడెక్కడం కావచ్చు, పాక్‌– చైనా సమష్టి కుట్ర కావచ్చు. కమ్యూనిస్టులు తెచ్చిన విదేశీ హస్తం కావచ్చు. పటేల్‌ను పక్కన బెట్టి ప్రధాని అయిన నెహ్రూ రాజకీయ కుట్ర కావచ్చు. మేం మాత్రం కాదు. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికల సమయంలో ఇదేదో కొత్త కుట్ర అయి ఉంటుంది. మీ ఆకలి లెక్కలు, మా డబ్బుల లెక్కలు చెప్పి మా జనాన్ని భయపెట్టాలని చూడకండి. 370 మాకు చాలు. ఆకలట ఆకలి!

మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,

కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

[email protected]

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles