Saturday, April 20, 2024

అఫ్ఘానిస్తాన్ లో ఏం జరుగుతోంది?

  • సమాలోచనలకే తాలిబాన్ మొగ్గు
  • అహ్మద్ మసూద్ తో చర్చలు
  • హజారాలపైన ప్రతీకార దాడులు ఉండవని హామీ
  • సాయుధ ముఠా నాయకులు (వార్ లార్డ్స్)తో సయోధ్య
  • అన్ని తెగలనూ కలుపుకొని వెళ్ళేందుకు తాలిబాన్ ప్రయత్నం

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి – 8

తాలిబాన్ దండును పాంజ్ షీర్ కు పంపించారు కానీ వారు అక్కడ పోరాటం మొదలు పెట్టలేదు. పాంజ్ షీర్ అధిపతి అహ్మద్ మసూద్ పోరాటం చేయడానికి తన బలగాలు సిద్ధంగానే ఉన్నాయి కానీ చర్చలకు ప్రాధాన్యం ఇస్తానంటూ మాట్లాడారు. లండన్ లో చదువుకున్న అహ్మద్ వాషింగ్టన్ పోస్టులో ఇటీవల ప్రచురించిన ఒక వ్యాసంలో ఇటువంటి ప్రతిపాదనే చేశారు. తాలిబాన్ ఇరవై ఏళ్ళ కిందట ఏకపక్షంగా, హడావిడిగా చేసినట్టు కాకుండా ఈ సారి ప్రభుత్వం  ఏర్పాటుకు చాలా వ్యవధి తీసుకుంటున్నది. తాలిబాన్ ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శాంతి, సుస్ధిరతలు నెలకొనడం కష్టమని, అఫ్ఘాన్ లో ఉన్న సకల జాతులకూ ప్రాతినిధ్యం కల్పిస్తేనే ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందనీ, ప్రగతి మీద దృష్టి కేంద్రీకరించడానికి వీలు అవుతుందనీ తాలిబాన్ నాయకత్వం గ్రహించింది.

హమీద్ కార్జాయ్, మన్మోహన్ సింగ్

సామరస్య సాధనకోసం తాలిబాన్ ప్రయత్నాలు

అందుకే కాబూల్ లో అడుగుపెట్టగానే హమీద్ కార్జాయ్ తో సమాలోచనలు ప్రారంభించారు. 2001లో తాలిబాన్ ను తరిమివేసి అమెరికా, నాటో సేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తొలి అధ్యక్షుడిగా కార్జాయ్ నే నియమించారు. కార్జాయ్ ని చంపడానికి తాలిబాన్ ప్రయత్నించారు. ఈ సారి తాలిబాన్ కాబూల్ ని స్వాధీనం చేసుకోవడానికి ముందే తన కుమార్తెలతో కలిసి  కార్జాయ్ ఫేస్ బుక్ లో ఒక సందేశం పెట్టారు. తాలిబాన్ వచ్చి కాబూల్ ని ఆక్రమించుకున్నా తాను దేశం వదిలి పోవడం లేదనీ, కాబూల్ లోనే ఉంటాననీ స్పష్టం చేశారు. ఇది తాలిబాన్ కు సకారాత్మక సంకేతం. కార్జాయ్ మాదిరే అబ్దుల్లా అబ్దుల్లా కూడా అమెరికా ఆధిపత్యం కొనసాగిన కాలంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా కాబూల్ వదిలి వెళ్ళిపోకుండా అక్కడే ఉన్నారు. అబ్దుల్లా అబ్దుల్లాతో కూడా తాలిబాన్ చర్చలు జరుపుతున్నారు. తాలిబాన్ రాకమునుపు అధ్యక్షుడుగా ఉన్న అష్రాఫ్ ఘనీ కతార్ పరారైన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన నేతగా అబ్దుల్లా అబ్దుల్లా ఉండేవారు.

తాలిబాన్ కు ఆధిక్యం ఉంది. కావాలనుకుంటే బలప్రయోగం చేసి పాంజ్ షీర్ ను కూడా స్వాధీనం చేసుకొని అహ్మద్ మసూద్ ని లొంగదీసుకోగల శక్తి ఉంది. బలగం ఉన్నారు. ఆయుధాలు దండిగా ఉన్నాయి. వరుస విజయాలు ప్రసాదించిన ఉత్సాహం ఉంది. కానీ అక్కడక్కడ తిరుగుబాటు ధోరణులు కనిపించడం, పాంజ్ షీర్ లో సైతం ప్రతిఘటనకు సిద్ధంగా ఏడెమిదివేల మంది యోధులు సాయుధులై నిలబడం గమనించి తొందర పడకూడదనీ, చర్చలతో సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచన తాలిబాన్ నాయకులకు ఉన్నట్టు కనిపిస్తోంది. స్థానికంగా పాతుకుపోయిన యోధులను (వార్ లార్డ్స్)ను కూడా కలుపుకొని పోవాలని అనుకుంటున్నారు. ఉజ్బెక్ లూ, తజిక్ లూ, హజారాలూ దారికి రాకుండా శాంతి స్థాపన అసాధ్యమని గ్రహించారు.

హజారాపైన దాడులు

ముఖ్యంగా హజారాలకూ తాలిబాన్ కూ మధ్య పచ్చగడ్డి వేస్తే  భగ్గుమంటుంది. హజారాలను తాలిబాన్ చిత్రహింసలకు గురి చేశారు. అవమానాల పాలు చేశారు. వారిని ఊచకోత కోశారు. నరమేథం సాగించారు. ఈ సారి అఫ్ఘానిస్తాన్ లోకి తాలిబాన్ ప్రవేశించిన వెంటనే చేసిన ఘనకార్యం ఏమంటే బామియాన్ లో(బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిన చోటే) హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అబ్దుల్ అలీ మజారీని తాలిబాన్ 1995లో (కాబూల్ హస్తగతం చేసుకోవడానికి ఏడాద ముందే)హత్య చేశారు.

తాలిబాన్ లో అత్యధికులు పష్టూన్లు. వారు ఇస్లాం మతంలో సున్నీలు. హజారాలు షియాలు. మధ్యఅఫ్ఘానిస్తాన్ లో హజారత్ రాష్ట్రంలో హజారాలు ఎక్కువగా ఉంటారు. 13వ శతాబ్దంలో అప్ఘానిస్తాన్ పైన దాడి చేసి భీభత్సం సృష్టించిన మంగోల్ యోధులు చెంగిజ్ ఖాన్ కూ, ఆయన సైనికులకూ వారసులు హజారాలు. 1773లో అహ్మద్ షా దురానీ చక్రవర్తిగా ఉన్న కాలంలో అఫ్ఘానిస్తాన్ సామ్రాజ్యంలో హజారత్ ను విలీనం చేసుకున్నారు. మెజారిటీగా ఉన్న సున్నీలు మైనారిటీ అయిన షియాలను నిత్యం వేధించేవారు. 18వ శతాబ్దం చివరికి వారు తమ సారవంతమైన పొలాలను వదిలి కొండలలో తలదాచుకున్నారు. 19 శతాబ్దంలో వారు కొడ చరియలలో మెరక భూములలో స్థిరపడ్డారు.

అఫ్ఘానిస్తాన్ జనాభా 3.8 కోట్లు. వారిలో పది నుంచి పన్నెండు శాతం మంది హజారాలు. ఇంకా ఎక్కువ శాతం ఉండేవారు. సున్నీల ఆగడాలూ, అణచివేత చర్యల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు లేదా దేశం విడిచి పారిపోయారు. పష్టూన్ రాజు అమీర్ అబ్దుల్ రహ్మాన్ (1880-1901)పాలనలో అప్పుడు ఉండిన హజారా జనాభాలో దాదాపు సగం మందిని చంపివేశారు లేదా దేశం విడిచి పారిపోయే విధంగా వేధించారు. అప్పుడు ఎక్కువ మంది ఇరాన్ కూ, భారత్ కూ (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న భూభాగాలకూ) పారిపోయారు.

తాలిబాన్ 1996లో అధికారంలోకి రాకముందు జరిగిన అంతర్యుద్ధంలో కూడా వేలాది హజారాలను చంపివేశారు. ‘‘హజారాలు ముస్లింలు కాదు. వారిని వధించవచ్చు,’’ అని తాలిబాన్ కమాండర్ మౌల్వాయి మొహమ్మద్ హనీఫ్ అనుమతి మంజూరు చేసినట్టు సమాచారం ఉంది. 1998లో, తాలిబాన్ ఆధ్వర్యంలో, వేల మంది హజారాలను మజారే షరీఫ్ లో కాల్చిచంపారు.

బాంబ్ పేలిన ఘటన తర్వాత హజారా మహిళలు

 

అమెరికా వచ్చినా హజారాల వధ ఆగలేదు

అమెరికా 2001లో తాలిబాన్ పాలనను అంతమొందించిన తర్వాత సైతం తాలిబాన్ హజారాలపైన గెరిల్లా దాడులు చేసి చంపడం మానలేదు. తాలిబాన్ తో ఐఎస్ఐఎస్  కూడా హజారాలపై దాడులలో చేతులు కలిపింది.  కాబూల్ లో హజారాలు అధికంగా నివసించే దస్త ఎ బార్చీ ప్రాంతంలో ఈ సంవత్సరం మేలో బాంబులు పేలి 60 మంది హజారాలు మరణించారు. ఒక పాఠశాల ముందు బాంబు పేల్చారు. ముక్కుపచ్చలారని విద్యార్థినులు మృతి చెందారు. అఫ్ఘాన్ రాజ్యాంగం హజారాలకు ఇతరులతో పాటు సమాన హక్కులు ప్రసాదించింది. వారు పరిపాలనా యంత్రాంగంలో  కూడా బాగానే ఉన్నారు. కానీ హజారాలు ఎక్కువగా ఉండే బామియాన్ వంటి ప్రాంతాలు చాలా వెనుబడి ఉన్నాయి.

ఈ సారి తాలిబాన్ ఇదివరకటిలాగా దూకుడుగా లేరు. చాలా సౌమ్యంగా కనిపిస్తున్నారు. శత్రువులపైనా, తమకు వ్యతిరేకంగా పని చేసినవారిపైనా ప్రతీకార చర్యలు తీసుకోబోమని తాలిబాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. ‘‘షియా మతానికి చెందినవారి పట్ల వివక్ష చూపించరాదనే విధానం ఈ సారి పెట్టుకున్నాం. వారు కూడా అఫ్ఘాన్లే. ఈ దేశంలో వారు ప్రశాతంగా జీవిస్తూ దాని సౌభాగ్య సాధనకూ, ఆర్థికాభివృద్ధికీ శక్తికొలదీ తోడ్పడవచ్చు’’ అని ఎన్ పీ ఆర్ చానల్ కు కతార్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి సుహేల్ షహీన్ హామీ ఇచ్చాడు. నిజంగా ఇదే విధానాన్ని ఇతర మైనారిటీల విషయంలో కూడా తాలిబాన్ అమలు చేస్తే పరిస్థితులు మెరుగుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుల్బుద్దీన్ హెక్మతియార్

గుల్బుద్దీన్ హెక్మతియార్

కొంతమంది ముఖ్యులను తాలిబాన్ తమతో కలుపుకుంటే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. వారిలో ప్రథముడు గుల్బుద్దీన్ హెక్మతియార్. ఆయన అఫ్ఘానిస్తాన్ కు ఒకప్పుడు ప్రధానమంత్రిగా పని చేశారు. హిజ్బ్-ఎ-ఇస్లామీ అనే రాజకీయ పార్టీకి నాయకుడు. అఫ్ఘాన్ రాజకీయాలలో ఒడుదుడుకులను తట్టుకొని చాలాకాలంగా రంగంలో ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో సోవియెట్ యూనియన్ 1979తో అఫ్ఘానిస్తాన్ ని ఆక్రమించిన తర్వాత ఆ అగ్రరాజ్యాన్ని ఎదిరించి అమెరికా, పాకిస్తాన్,చైనా సహకారంతో పోరాడిన ముజాహిదీన్ లో హెక్మతియార్ ముఠా ప్రముఖమైనది. తాలిబాన్ కు ఒకప్పుడు మిత్రుడిగానూ, మరికొన్ని సందర్భాలలో శత్రువుగానూ ఉన్న యోధుడు హెక్మతియార్. అమెరికా మాత్రం ఆయనను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించి తలకు విలువ కట్టింది.

న్యూయార్స్ లోని ట్రేడ్ టవర్స్ పైన 9 సెప్టెంబర్ 2001నాడు అల్ ఖాయిదా దాడులు చేసిన దరిమిలా అమెరికా, నాటో సేనలు అఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించినప్పుడు వాటిని ఎదిరించి తాలిబాన్ తో కలిసి పోరాడిన సంస్థ హెక్మతియార్ ది. పాకిస్తాన్ వేగుల విభాగం అధిపతులతో, సైనికాధికారులతో అంటకాగే హెక్మతియార్ శక్తిమంతుడు. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో తదుపరి అఫ్ఘాన్ పాలకులు ఎవరో నిర్ణయంచేందుకు  సమాలోచనలూ, ఎన్నికలూ జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. వయస్సు 72 సంవత్సరాలు ఉన్నా పోరాటానికి సిద్ధంగా ఉంటారు.

హమీద్ కార్జాయ్ కూడా నేటి అఫ్ఘానిస్తాన్ లో చాలా ముఖ్యమైన నాయకుడు. ఆయన తాలిబాన్ తో చర్చలలో మునిగి ఉన్నారు. ఇండియాలో విద్యాభ్యాసం చేసిన కార్జాయ్  (హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం) పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళారు. అక్కడ  నిధులు సమీకరించి సోవియెట్ యూనియన్ ను వేధించే ముజాహిదీన్ కు పంపించేవారు. కానీ అమెరికా సైనికులు డ్రోన్లు ఉపయోగించడాన్ని కార్జాయ్ వ్యతిరేకించారు. భద్రతా ఒప్పందంపైన సంతకాలు చేయడానికి నిరాకరించారు. అందుకే ఆయన స్థానంలో అష్రాప్ ఘనీ వచ్చారు. అమెరికా సేనల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత దోహాలో కార్జాయ్ నీ, అబ్దుల్లా అబ్దుల్లానీ హెక్మతియార్ కలుసుకొని చర్చలు జరిపారు.  కార్జాయ్ వయస్సు 63 సంవత్సరాలు. ఆయన భారత్ కు అనుకూలుడు. కార్జాయ్ పరిపాలన సమయంలోనే భారత్ అఫ్ఘానిస్తాన్ లో నిధులు ఖర్చు చేయడానికీ, పార్లమెంటు భవనం నిర్మించడానికీ, రాహదారలు నిర్మించడానికి చర్యలు చేపట్టింది. ఆయన ప్రభుత్వంలో చేరే పక్షంలో భారత్ కి తాలిబాన్ మంత్రిమండలిలో ఒక మిత్రుడు ఉంటాడు.

అహ్మద్ మసూద్, అబ్దుల్లా అబ్దుల్లా

అహ్మద్ మసూద్

అందరికంటే ముందుగా శాంతింపజేయవలసిన ప్రత్యర్థి అహ్మద్ మసూద్. తజిక్ తెగకు చెందిన ముజాహిదీన్ నాయకుడు. అమెరికా, నాటో సేనలతో భుజం కలిపి తాలిబాన్ ను గద్దె దింపి దేశం నుంచి వెళ్ళగొట్టిన యోధుడు, నార్త్ అలయెన్స్ అధినేత అహ్మద్ షా మసూద్ కుమారుడు. ఇప్పుడు పాంజ్ షీర్ ను కాపాడుతున్న యోధుడు. తాలిబాన్ ను ప్రతిఘటిస్తున్న వీరుడు. తాలిబాన్ తో చర్చలకు సిద్ధమేనంటున్నవాడు. అధికారం పంచుకుంటే అస్థిరత ఉండదని, శాంతి వెల్లివిరుస్తుందనీ భావించే యువనాయకుడు. ఆయన తాలిబాన్ దువ్వవలసిన వారిలో అతిపిన్న వయస్కుడ. 32 ఏళ్ళవాడు. తాలిబాన్ యోధులను పాంజ్ షీర్ కు పంపినప్పటికీ తాలిబాన్ నాయకులు అహ్మద్ తో చర్చలు జరిపే యోచనలో ఉన్నారు. తాలిబాన్ తో తలబడటానికి తమ యోధులు సిద్ధంగా ఉన్నారనీ, ప్రభుత్వ సైన్యం నుంచి చాలామంది ఆయుధాలతో సహా వచ్చి తమ శిబిరంలో చేరుతున్నారనీ, తాలిబాన్ ను ప్రతిఘటించడానికి పాశ్చాత్య దేశాలు ఆయుధాలు సరఫరా చేయాలనీ అహ్మద్ విజ్ఞప్తి చేశాడు. అహ్మద్ షా మసూద్ కి ఫ్రాన్స్ నాయకులు సన్నిహితం. ఆయన కుమారుడు ఫ్రాన్స్ కీ, బ్రిటన్ కీ అభ్యర్థనలు పంపుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాలు తాలిబాన్ కు కోపం తెప్పించే పని చేయదలచుకోలేదు. వారి వైఖరి ఎట్లా ఉంటుందో తెలుసుకునేందుకు కొంతకాలం వేచి చూడాలని భావిస్తున్నారు. అందువల్ల తాలిబాన్ తో చర్చలకే అహ్మద్ మసూద్ ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

అబ్దుల్లా అబ్దుల్లా

అబ్దుల్లా అబ్దుల్లా విద్యరీత్యా వైద్యుడు. వృత్తిరీత్యా రాజకీయవాది. ఒకానొకప్పుడు అహ్మద్ షా మసూద్ కి సలహాదారుగా ఉండేవారు. మసూద్ నాయకత్వంలోని నార్త్ అలయెన్స్ సోవియెట్ యూనియన్ కు వ్యతిరేకంగానూ, తాలిబాన్ కు వ్యతిరేకంగా పారాడింది. అహ్మద్ లాగానే అబ్దుల్లా అబ్దుల్లా కూడా తజిక్ నాయకుడు. శాంతియుతంగా తాలిబాన్ కు అధికారం అప్పగించే దిశగా చర్చలు జరుపుతున్న సంమనవాది అబ్దుల్లా అబ్దుల్లా. జాతీయ సమాధాన మండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రికన్సిలియేషన్)కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అధ్యక్ష పదవికి అబ్దుల్లా అబ్దుల్లా రెండు విడతల పోటీ చేశారు. వయస్సు ఆరుపదులు.

మరో వార్ లార్డ్, అనుభవజ్ఞుడైన యోధుడు అబ్దుల్ రషీద్ దోస్తుమ్. ఉజ్బెక్ తెగకు చెందిన ఈ నాయకుడు ఎప్పుడు ఎవరితో ఉన్నారో చెప్పలేని విధంగా విధేయతలు మార్చుతూ వచ్చారు. అహ్మద్ షా మసూద్ నాయకత్వంలోని నార్దర్న్ అలయెన్స్ లో ప్రముఖ భాగస్వామి. అంటే అమెరికా, నాటో సేనలతో కలిసి తాలిబాన్ కు వ్యతిరేకంగా 2001లో పోరాడిన యోధులలో ఒకరు. ఘనీ ప్రభుత్వంలో చేరారు. 2013 నుంచి ఆరేళ్ళపాటు దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. యుద్ధ నేరాలు చేశారనీ, చేయించారనీ, ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల మానభంగానికి తన యోధులను పురిగొలిపారనీ ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యం బాగోలేదన్న మిషతో టర్కీలో చాలా సంవత్సరాలు తలదాచుకున్నారు. తాలిబాన్ అఫ్ఘానిస్తాన్ లో ప్రవేశిస్తున్న సమయంలో దోస్తుం అఫ్ఘానిస్తాన్ చేరుకున్నారు. మజారే షరీఫ్ ను తాలిబాన్ చేతుల్లో పడకుండా ప్రతిఘటిస్తాడని అందరూ ఆశించారు. కానీ ఆయన ఊహకు అందకుండా తాలిబాన్ లు శరవేగంగా విజయపరంపర సాగించి అన్ని ప్రాంతాలతో పాటు మజారే షరీఫ్ ను కూడా కైవసం చేసుకున్నారు.

సమ్రుల్లా సాలే

ఘనీ పలాయనం చిత్తగించిన తర్వాత తానే అఫ్ఘానిస్తాన్ కు తాత్కాలిక అధ్యక్షుడినంటూ ప్రకటించుకొని పాంజ్ షీర్ కు వెళ్ళి అహ్మద్ తో చేతులు కలిపిన అమ్రుల్లా సాలే తాలిబాన్ నాయకత్వం చర్చలు జరపవలసిన ప్రముఖులలో ఒకరు. ఘనీ ప్రభుత్వంలో సాలే 2017లో దేశీయాంగమంత్రిగా చేరారు. నిఘా విభాగాలు పర్యవేక్షించేవారు. తాలిబాన్ సాలేను చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. తాజాగా నిరుడు సెప్టెంబర్ లో సాలేపైన హత్యా ప్రయత్నం జరిగింది.  సాలే వయస్సు 48 సంవత్సరాలు.

హజారా నాయకులలో ప్రముఖుడూ, తాలిబాన్ చర్చలు జరపవలసిన వ్యక్తి మొహమ్మద్ కరీం ఖలీలీ. లోగడ దేశ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. తాలిబాన్ ఆగస్టు 15న అఫ్ఘానిస్తాన్ లో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత పాకిస్తాన్ కు వెళ్ళి పాక్ నాయకులతో చర్చలు జరిపి వచ్చిన బృందంలో సభ్యుడు ఖలీలీ. తాలిబాన్ నాయకత్వం స్థిరమైన రాజకీయవ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. ఖలీలీ వయస్సు 71 సంవత్సరాలు. వీరే కాకుండా ఇంకా కొంతమంది సాయుధ ముఠాల నాయకులు ఉన్నారు. అఫ్ఘానిస్తాన్ మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మదీ వంటి నేతలు ఉన్నారు. ఆయన అహ్మద్ మసూద్, సాలే శిబిరంలో ఉన్నట్టు భోగట్టా.

అహ్మద్ మసూద్ కీ, తాలిబాన్ కీ మధ్య సమాలోచనలు ప్రారంభమైనాయి. ఈ చర్చలు ఫలప్రదమైతే తాలిబాన్ లో మార్పు వచ్చిందని భావించవచ్చు. వేచి చూడటం ఉత్తమం. తొందరపాటు ప్రమాదకరం.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles