Sunday, December 8, 2024

భారాస భవిష్యత్తు ఎమిటి?

  • కేసీఆర్ శక్తికి మించి పథకాలు వేస్తున్నారా?
  • దిల్లీలో చక్రం తిప్పడం అంత తేలికా?
  • బీజేపీని ఓటమికి వ్యూహరచన చేస్తారా?
  • అవసరమైతే కాంగ్రెస్ తో భుజం కలుపుతారా?

గత ఏడాది డిసెంబర్ లో ‘భారత రాష్ట్ర సమితి’ జెండాను దిల్లీ వీధుల్లో ఎగరేసి, కొత్త యుద్ధాన్ని కెసీఆర్ మొదలెట్టారు. నేడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి సరిగ్గా ఒక్కరోజు ముందే తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొత్త సచివాలయాన్ని ఆవిష్కరించి ధూమ్ దామ్ చేశారు. ఈ కార్యక్రమాలకు ఇంకొంచెం ముందు.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంశంలో తలదూర్చి ఆంధ్ర రాజకీయాల్లో అగ్గి రగిల్చారు. ఒక సంవత్సరంలోపే జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన వ్యూహరచనా వేగానికి  పదును పెడుతున్నారు. దిల్లీ నుంచి మహారాష్ట్ర దాకా వేస్తున్న అడుగులే  చెబుతున్నాయి. ముఖ్యంగా బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా.. కేసీఆర్ గారాల కూతురు కవిత కేంద్ర ఏజెన్సీల దర్యాప్తు దాడుల మధ్య నలిగిపోతున్నారు. కుమార్తెను కాపాడుకోడానికి కేసీఆర్ చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నారు. బిజెపిని, ముఖ్యంగా నరేంద్రమోదీ, అమిత్ షా ను లక్ష్యంగా చేసుకుంటూ కేసీఆర్ మండిపడిపోతున్నారు. మోదీని అధికారం నుంచి దించడమే తన ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అవసరమైతే కాంగ్రెస్ తో కూడా జత కట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. భారసా స్థాపనపై సొంత రాష్ట్రంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ అడుగంటిపోయిందని కొందరు – జాతీయ స్థాయికి తెలంగాణ జెండా ఎదిగిందని కొందరు భావిస్తున్నారు. తెరాసను జాతీయ పార్టీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో పూర్తిగా తెలిసిన వ్యక్తి కెసీఆర్ మాత్రమే. మిగిలినవన్నీ ఊహాగానాలే.

రైతు సంఘం స్థాపించడం మంచిపనే!

టీఆర్ఎస్ రూపు మార్చుకొని బీఆర్ఎస్ గా జాతీయ యవనికపై తన విన్యాసం ప్రారంభించిన  వేళల్లో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందుగా అనుబంధ రైతు సంఘం స్థాపించి తను రైతుపక్షపాతియని, తమ పార్టీ రైతు పక్షమని కేసీఆర్ బలంగా చెప్పే ప్రయత్నమూ చేశారు. ఆ సంఘానికి అధ్యక్షుడిగా గుర్మామ్ సింగ్ చడూనీ నియమించి తొలి రోజునే తన ముద్ర వేసుకొనే యత్నమూ చేశారు. దిల్లీ కేంద్రంగా ప్రారంభమైన కేంద్ర కార్యాలయం ఎప్పుడు చూసినా కిక్కిరిసిగా ఉండాలనన్నది కెసీఆర్ ఆకాంక్ష. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేసిన నేతగా కేసీఆర్ ఇంటాబయటా మంచిమార్కులే తెచ్చుకున్నారు. ఇప్పుడు తన జాతీయతా భావజాలాన్ని బలంగా చూపించి ఒప్పించాల్సిన తరుణం వచ్చింది. ముఖ్యమంత్రిగా సింహాసనం అధిరోహించి తన సంకల్పసిద్ధిని చాటిచెప్పుకున్నారు. ఎన్నికలబరిలోకి దిగి వరుసగా రెండు పర్యాయలు గెలిచి తన సత్తానూ చూపించారు. ఇదంతా గతమై, ఇప్పుడు మరో యుద్ధం మొదలైంది.

మరి కొన్ని నెలల్లోనే  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం.

మళ్ళీ గెలిస్తే  ఈసారి కుమారుడు కెటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి కేసీఆర్ దిల్లీ రాజకీయాలపై దృష్టి పెడతారని అర్ధం చేసుకోవచ్చు. కూతురు కవిత,సంతోష్ వంటి బంధుగణాన్ని తనతో దిల్లీలో ఉంచుకోవచ్చు.

బీఆర్ఎస్ పుంజుకోవాలంటే పదేళ్ళు పడుతుంది

ఇప్పటి వరకూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీకెసీఆర్ పక్షమే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంటగెలుపుకే పరిమితం కావాల్సివస్తుందని ఎక్కువమంది వెల్లడిస్తున్న అభిప్రాయం. జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు తెచ్చుకొని దిల్లీలో చక్రం తిప్పడం ఆషామాషీ కాదని ఆయనకూ తెలుసు. బీఆర్ఎస్ బలంగా పుంజుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుందని కెసీఆర్ పార్టీకి చెందినవారే కొందరు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఆర్ ఎస్ ఎస్, విశ్వహిందూ పరిషత్, ఏబీవీపీ వంటి వ్యవస్థలున్న బిజెపికే అధికారంలోకి రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఇక బీఆర్ఎస్ కు ఎంత కాలం పడుతుందో ఊహించలేం. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వినపడుతున్నప్పటికీ అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తే? ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.  ఉద్యమనేతగా,ప్రాంతీయ పార్టీ అధినేతగా,రెండు పర్యాయాల ముఖ్యమంత్రిగా, మాజీ కేంద్రమంత్రిగా అనుభవం ఉండి ఉండవచ్చు గాక. ఉర్దూ,హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి  కలిగిఉండవచ్చు గాక. కేవలం ఈ శక్తియుక్తులే సరిపోవు. దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షించ గలగాలి.మిగిలిన పార్టీల నుంచి విశ్వాసాన్ని పొంద గలగాలి. బీఆర్ఎస్ ఇంకా శైశవదశను కూడా దాట లేదు.కనీసం ఆమ్ ఆద్మీ పార్టీ వలె ఫలితాలను పొందిన చరిత్రకు కూడా నోచుకోలేదు. నరేంద్రమోదీ, అమిత్ షా ద్వయ నాయకత్వంలో బిజెపి ఇంకా బలంగానే ఉంది.

తెలుగువారికి మేలు జరిగితే అదే పదివేలు

సుదీర్ఘ చరిత్ర కలిగిన మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎంతోకొంత బలంతో సజీవంగానే ఉంది. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో గట్టిగా వున్నారు. జోడో యాత్రతో కొత్త నెత్తురు ఎక్కించుకొని రాహుల్ గాంధీ ఊపులో ఉన్నాడు. తాజాగా  లోక్ సభ సభ్యత్వాన్ని పోగొట్టుకొని మంచి కాకలోనూ ఉన్నాడు. జాతీయ స్థాయిలో అతిపెద్ద నేత శరద్ పవార్ పార్టీ పగ్గాలు వదిలేసి, కాడి పడేసి కూర్చున్నారు. నితీశ్ కుమార్, మమతా బెనర్జీ మాత్రం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తిప్పలు పడుతున్నారు. ఇంకోపక్క కేజ్రీవాల్ కూడా అదే వేడిలో రగిలిపోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్లంతా కెసీఆర్ వెంట నడుస్తారని చెప్పగలమా? కొన్ని రైతు సంఘాలు, కాసిన్ని ఇతర పార్టీలు మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ తో ఉన్నాయి. కెసీఆర్ పదేళ్ల పాలనలో కొన్ని మంచి పథకాలు లేకపోలేదు. ఎంతోకొంత అభివృద్ధి జరగకపోలేదు. కానీ, దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసేంత తెలంగాణ మోడల్ ఏముందనే ప్రశ్నలే ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. మంచో చెడో ఒక తెలుగు నాయకుడు జాతీయ పార్టీని స్థాపించాడు. అభినందనలు అందించడంలో తప్పు లేదు. గొప్ప ఆలోచనలతో, సహృదయంతో ముందుకు సాగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది. రాజకీయ రణతంత్రాలు ఎరిగిన నాయకుల్లో కెసీఆర్ ది ఒక భిన్నమైన శైలి. అన్నీ కలిసొస్తే అంతా బాగుంటుంది. తేడా వస్తే కర్రే పామై కరుస్తుంది. మిగిలిన సంగతులు ఎట్లా వున్నా, బీఆర్ ఎస్ స్థాపన వల్ల తెలుగువారికి కాస్త మేలు జరిగితే అదే పదివేలు.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles