Thursday, September 29, 2022

‘మా’ ఎన్నికలు చెప్పే గుణపాఠం ఏమిటి?

  • మెగాస్టార్ సోదరుల ఆధిక్యం అంతమైనట్టేనా?
  • స్థానిక, స్థానికేతర అంశాలు రావడంతో గాడి తప్పిన ఎన్నిక
  • రాజకీయ నాయకుల ప్రస్తావన చీలికలకు దారితీసింది
  • వైరాన్నీ, వైషమ్యాన్నీ అదిగమించగలరా?

ఈటూరు అశ్వినీకుమార్

హైదరాబాద్ : చాలా కాలంగా ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. ‘మా’ అధ్యక్షుడుగా మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మంచి మెజారిటీతో గెలుపొందారు. నరేష్ స్థానంలో విష్ణు ‘మా’ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. మీడియా కారణంగానూ, నటీనటుల హావభావాల ప్రదర్శన కారణంగానూ ఈ ఎన్నికలకు చాలా ప్రచారం లభించింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం జరిగింది. నటి హేమ నటుడు శివబాలాజీ చేతిని కొరకడం విశేషం.

హైప్ కు కారకులు ఎవరు?

ప్రకాష్ రాజ్ కు ప్రత్యర్థిగా మంచు విష్ణు రంగంలోకి దిగుతున్నాడని ప్రకటించిన క్షణం నుంచి హైప్ మొదలయ్యింది. తిట్టుకోవడం, వ్యంగ్యంగా వ్యాఖ్యాలు చేయడం, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావించడం నిత్యకృత్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును మంచు విష్ణు దుర్వినియోగం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపించింది. మోహన్ బాబు అకస్మాత్తుగా దిల్లీ వెళ్ళారు. ఆయన ఎందుకు దిల్లీ వెళ్ళారో, అక్కడ ఏమి చేశారో ఎవ్వరికీ తెలియదు. మీడియా తనదైన శైలిలో ఊహాగానాలు చేసింది. సోషల్ మీడియా అగ్నిలో ఆజ్యం పోసింది. మొత్తం మీద అందరూ కలిసి ‘మా’ను వివాదంలోకి దించారు.

మోహన్ బాబు, ప్రకాష్ రాజ్

పవన్ వ్యాఖ్యలతో పోరు మొదలు

యుద్ధం ప్రారంభించిన నటుడు పవన్ కల్యాణ్ అని చెప్పుకోవచ్చు. రిపబ్లిక్ చిత్రం ప్రీరిలీజ్ సమావేశంలో  ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన నిప్పులు కురిపించడంతో పోరాటం మొదలయింది. ఇది ఫిలిం పరిశ్రమ నియమాలకు విరుద్ధం. సినిమా ఫంక్షన్ లో రాజకీయ విమర్శలు చేయడం తగదనేది నియమం. దాంతో మెగాస్టార్ కుటుంబాన్ని టాలీవుడ్ లక్ష్యం చేసుకున్నది. మంచు విష్ణు తాను ఎదురు చూస్తున్న అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాహాటంగా వెనకేసుకొచ్చాడు. పవన్ కల్యాణ్ కు మద్దతు ఇస్తారో, ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తారో తేల్చుకోవలసిందిగా మా ఓటర్ల ముందు ప్రశ్న ఉదయించింది.

నాగబాబు రంగప్రవేశం

కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటూ పరిస్థితిని పరిశీలిస్తున్న నాగబాబు పోలింగ్ కు రెండు రోజుల ముందు రంగంలో దుమికారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపైన వ్యాఖ్యానం చేశారు. ప్రకాష్ రాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. అవసరమైతే ప్రధాని నరేంద్రమోదీతో కూడా ప్రకాష్ పోరాడగలడండూ ప్రధాని పేరును వివాదంలోకి లాగారు. విష్ణుకు తెలుగు మాట్లాడటం రాదంటూ ఎద్దేవా చేశారు. విష్ణుపైన వ్యక్తిగతంగా దాడి చేశారు. స్థానిక, స్థానికేతర అంశం ముందుకు రావడంతో ప్రకాష్ రాజ్ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. చిరంజీవి ప్రకాష్ రాజ్ ను బలపర్చుతున్నాడంటూ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు ప్రకటించారు. నిజానికి చిరంజీవి ఎటువైపూ మొగ్గు చూపలేదు.  ప్రఖ్యాత దర్శకుడూ, నటుడూ దాసరి నారాయణరావు మృతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దదిక్కుగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ఈ అంశాన్ని మోహన్ బాబు అంగీకరించకపోయినప్పటికీ పరిశ్రమలో చాలామందికి చిరంజీవి మాటపైన గురి ఉంది.

కమ్మలకూ, కాపులకూ మధ్య పోటీ?

జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో  ఆదివారంనాడు పోలింగ్ జరుగుతున్నప్పుడే పరిస్థితి మంచు విష్ణుకు అనుకూలంగా ఉన్నట్టు కనిపించింది. విష్ణు ఎంత మెజారిటీతో గెలుస్తాడన్నదే ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ పోటీ కాపులకూ, కమ్మవారికీ మధ్య పోరాటంగా, చిరంజీవికీ, మంచు మోహన్ బాబుకూ మధ్య సంఘర్షణగా కనిపించింది. ఇంత వివరంగా సినీ ప్రముఖులు ఎవ్వరూ మాట్లాడలేదు కానీ సోషల్ మీడియా ఇటువంటి అభిప్రాయాన్ని విజయవంతంగా సృష్టించింది.

చిరంజీవి ఆత్మప్రబోధం

చిరంజీవి తన ఓటు వేసిన తర్వాత తాను ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేశానని ప్రకటించారు. ఫిలిం పరిశ్రమ ఎన్నటికీ చీలిపోదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఓటింగ్ జరిగిన తర్వాత సాగిన వాగ్యుద్ధం ఇందుకు విరుద్ధంగా కనిపించింది. చంపేస్తానంటూ నటుడు బెనర్జీని మోహన్ బాబు బెదిరించడం ఈ పోరాటంలో చెప్పుకోదగిన విశేషం. అన్ని విభేదాలనూ సినిమా పరిశ్రమ విస్మరించి సమైక్యంగా, సద్భావంతో పనిచేసుకంటూ వెడుతుందనీ, ఎన్నికలలో కనిపించిన వైరాలూ, వైషమ్యాలూ ఎన్నికలతోనే అంతం అవుతాయనీ, సినిమా పరిశ్రమ మళ్ళీ గాడిలో పడుతుందనీ, పరిశ్రమ పెద్దలందరూ పేదరికంలో బతుకులు ఈడ్చుతున్న సినీరంగానికి చెందిన బడుగుల బతుకులను పట్టించుకుంటారనీ ఆశిద్దాం.

Also read: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ విజయం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles