Thursday, December 8, 2022

భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?

మొదటి భాగం

ప్రతీ విషయాన్ని, ప్రతీ అంశాన్ని ఈ ప్రజాస్వామ్యంలో  ఇలా జరగవచ్చా, వీళ్లంతా (ఎవరో ఎవరికీ తెలియదు) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు,  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు,  ఈ దేశంలో ప్రజాస్వామ్యం  బ్రతికి ఉన్నట్లేనా? సచ్చిపోయింది ….ఇలా బాధితులతో పాటు,  ప్రభుత్వ అధికారితో పాటు,  మంత్రులు, రాజకీయ పార్టీలు, వీరు,  వారు అని కాదు. ప్రతి ఒక్కరూ అనే మాటలు నేడు రోజూ వింటున్నాము. ఈ తతంగం మొత్తాన్ని గమనిస్తే  భారత దేశంలో ఇప్పుడు నడుస్తున్న ఒక “పాసియన్” అని చెప్పవచ్చు. భారత రాజ్యాంగం విశదీకరించిన ‘ ప్రజాస్వామ్యం‘ ను  మతపరమైన రాజ్యాలతోను, పెట్టుబడిదారీ వ్యవస్థల తో పరిపాలనలో  ఉన్న దేశాలతోనూ, రాచరిక వ్యవస్థలను కలిగి ఏలుతున్న దేశాలతోనూ, కమ్యూనిస్టు భావజాలాలతో నడుస్తున్న దేశాలతోనూ పోల్చి … పోల్చి భారత దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని చీల్చి చెండాడటంతోనే కొందరికి “రోజు” గడిచిపోతున్నది  అని చెప్పవచ్చు.

Also read: హిందీస్ ల్యాబ్ పేలుడు ప్రమాదంపైన అనుమానాలు

  ప్రజాస్వామ్యాన్ని ఎవరికి తోచిన విధంగా వారు, ఎవరికి వారుగా అన్వయించుకొని వారి వారి అనుభవాలను – సొంత అనుభవాలను జోడించి తాత్పర్యం ఇస్తున్నారు. ఇది వ్యక్తులకే కాదు, ప్రభుత్వాలకు, సమూహాలకు, సంస్థలకు, సంఘాలకు, సామాజిక కార్యకర్తలకు .. అన్ని రకాల వ్యవస్థలకు వర్తిస్తుంది. భారత దేశంలో ఉన్న “ప్రజాస్వామ్యాన్ని” రాజ్యాంగం పరిధిలో నిర్వచించాలి. ఇది ఎవరూ చేయరు. కానీ తునకలు తునకలు చేసి ఎవరికి ఎంత వరకు అనగా ‘ ఏ కులానికి – ఏ మతానికి – ఏ రాజకీయ పార్టీ’కి అవసరమో అంతవరకు తీసుకొని అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు, గోల చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. అందుకే ప్రజా అవసరాలు ధర్మ బద్ధంగా – న్యాయ బద్ధంగా – చట్ట బద్ధంగా తీరటం లేదు. సాధారణ ప్రజల యొక్క ఆకలిని తీర్చలేని పరిస్థితి దేశం ఎదుర్కొంటున్నది. ఉపరితలంలో (సూపర్ఫీసియల్) ఏదో కొంచెం కొంచెం మెత్తులతో కప్పిపెట్టి ‘దేశంలో ఆకలి పోయింది, మా ప్రభుత్వం ప్రజల పక్షం ఉంది,  ప్రజాస్వామ్యంగా పరిపాలిస్తుంది’ అని చంకలు గుద్దుకొని కొన్ని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటాయి, చేసుకుంటున్నాయి. మిగిలిన వారు ఆ “గోలలో” భాగస్వామ్యం అవుతున్నారు.

Also read: పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు

విభజించు-పాలించు

 ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా పాలించటం లేదు అని చూపే మార్గాలను ఎవరికి వారుగా వారి వారి సైద్ధాంతీకరణలతో ప్రజాస్వామ్యాన్ని నిర్వచించి, ఎన్నుకొని ఉద్యమాలను నడుపుతున్నారు. ప్రభుత్వాలేమో ఉద్యమకారులను వెతకి, వెతకి విడదీసి అణచివేస్తున్నారు .. కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేపిస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. ఆడవాళ్ళ విషయంలో … అదనంగా వారిపై అత్యాచారాలు చేపించటం, అమానుషంగా వారితో ప్రవర్తించటం, దూషించటం, అవమాన పరచటం అన్ని రకాలుగా హింసిస్తున్నారు. పసిపిల్లలనైతే – వీరిని నలిపి వేయటం, అన్ని వైపుల నుండి దారులను మూసివేసి చాలా హేయమైన పద్ధతులతో ఎవరిని పడితే వారిని వారు అనుకున్న పద్ధతులలో అణచి వేస్తున్నారు. అణచివేతకు గురైనప్పుడు మాత్రమే రాజ్యాంగం, పౌరుడికి రాజ్యాంగం కలిపిస్తున్న హక్కుల గురించి మాట్లాడటం, మిగిలిన సమయాలలో వారి వారి సిద్ధాంతాలను, మార్క్సిస్టు – లెనినిస్ట్ మ్యానిఫెస్టోల గురించి, సోషలిస్టు భావజాలంతో ఉన్న దేశాల మానిఫెస్టోల గురించి మాట్లాడుకోవటం జరుగుతుంది. అయితే, రాజ్యాంగంలో సోషలిజం గురించి చెపుతున్న రిపబ్లిక్ అఫ్ ఇండియా గురించి మాట్లాడే సందర్భాలు బహుతక్కువ. దీనిపై పనిచేస్తున్న సంస్థలు, క్రియాశీలకమైన రాజకీయ పార్టీలు లేవు. ఉంటే గింటే కులాన్ని, మతాన్ని, వర్గాన్ని ప్రాతిపదికగా చేసుకొని మాట్లాడే సంస్థలు, రాజకీయ పార్టీలు మాత్రమే దేశంలో ఉన్నాయి. ఇవి కూడా అస్తిత్వ పోరాటాలలో భాగంలో అంటే అనుభవాలు – సొంత అనుభవాల ప్రాతిపదికలో వచ్చిన రాజకీయ పార్టీలు, సంస్థలు మాత్రమే. ఇవి ప్రజలను ఇంకా బాగా విడగొట్టాయి. ప్రభుత్వాలకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సులువుగా విభజించు – పాలించు సూత్రానికి మంచి పదునైన కత్తిని ఒరలో పెట్టుకునేటట్లు అయ్యింది.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంను గురించి  ఏమని చెపుతుంది: ప్రజలు నిర్ణయాధికారాన్నికలిగి ఉంటారు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు సమానం, అందరూ స్వతంత్రాన్ని అనుభవించటం దీనియొక్క స్వరూపం, స్వభావం. ఇది ఒక రాజకీయపు ఆలోచన, ఒక భావన, ప్రభుత్వ ఏర్పాటుకు ఒక విధానం / ఒక మార్గం, ప్రజల జీవన విధానం కు ఒక ప్రామాణికం, ఒక మార్గం.

Also read: జుబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి: హక్కుల నేతలు

ప్రజాస్వామ్యం ఒక్కో దేశంలో ఒక్కో రూపం

వాస్తవానికి ప్రజాస్వామ్యం అనేది ఒక్కో దేశంలో ఒక్కో రూపాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం పరోక్ష రూపాన్ని, విధానాన్ని కలిగి ఉంది. పరోక్ష ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు పాలిస్తారు. ఈ విధానాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. అందుకే ప్రజలు ఎన్నికలలో 100 కు 100 శాతం పాల్గొన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయగలవు. అనగా ప్రభుత్వాలు ప్రజలకోసం ఎలాంటి నడవడికను కలిగి ఉండాలి అనే విషయం భారత రాజ్యాంగం లో ఆదేశిక సూత్రాలలో పొందుపరుచ బడ్డాయి. ఒక్క పుల్ల కూడా పక్కకు జరిగి ప్రభుత్వాలు పనిచేయకూడదు. అయితే, ఇక్కడ సమస్య, ఎక్కువ ప్రజలు ఓటును వినియోగించుకోలేక పోతున్నారు. ఓటును వినియోగించుకోక పోవటంతో, వారివైపు నుండి ప్రతినిధిని, వారి కోసం పనిచేసే ప్రతినిధిని కోలుపోతున్నారు. భారతదేశం ఓటు ద్వారానే ‘ప్రజాస్వామ్యం’ యొక్క విలువను, దిశ – నిర్దేశాన్ని కలిగివుండును. ప్రజలు స్వచ్ఛమైన ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించగలరు. ప్రజలయొక్క సమస్యలు రాజ్యాంగ బద్ధంగా పరిష్కారం చేయబడును. అయితే, భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యమనే ఒక జాడ్యానికి గురౌతున్నారు, గురి అయ్యారు. ఈ 75 ఏళ్ళ నుండి రాజ్యాంగం కలిపిస్తున్న అసలు సిసలైన ప్రజాస్వామ్యం యొక్క రుచిని ఆస్వాదించ లేక పోయారు, పోతూనే ఉన్నారు. ఒక చాదస్తంలోకి, ఒక జాడ్యంలోకి, ఒక భ్రమలోకి నెట్టివేయబడ్డారు.    

Also read: తెలంగాణ రాష్ట్రం – రాజకీయ సంక్షోభం?

భారతదేశంలోని ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నేరుగా వారి ప్రతినిధుల ధ్వారా పాలించే ప్రజాస్వామ్యం. దీనికి రాజకీయాలలో పౌరుల విస్తృత భాగస్వామ్యం అవసరం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. ఇక్కడనే, భారతదేశ రాజకీయనాయకులలో కొందరు ఓటుకున్న విలువను వక్రీకరించటం, గౌరవించకపోవడం, ప్రజలకు ఓటును వినియోగించుకోకుండా అడ్డుకోవటం, ఒకరి ఓటును మరొకరు వేయటం, ఓటును వినియోగించుకోవటానికే కనీసపు సౌకర్యాలను అనగా ముఖ్యంగా రవాణా సౌకర్యం లేకపోవటం, రవాణా సౌకర్యం ఒకవేళ ఉన్నప్పుడు విపరీతమైన ఖర్చుగా ఓటరు భావించటం, రౌడీలు, గూండాలు ఓటు వేసే స్థలాలలో ఉండి ఓటర్లను నిరోధించటం, ప్రజాస్వామ్యంకు కవచం ‘ఓటు’ మాత్రమే అనేదాన్ని ప్రజలవరకు తీసుకవెళ్లకపోవటం మరియు ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని విప్లవ రాజకీయ పార్టీలు ప్రజలకు చెప్పటం … వివిధకారణాలతో ప్రజాస్వామ్యాన్ని వారి వారి అనుభవాలతో, సొంత అనుభవాలతో ప్రజాస్వామ్యాన్ని తూకం వేస్తున్నారు. దీనిమూలంగా ప్రజాస్వామ్యం ప్రమాదానికి గురౌతున్నది, ప్రమాదపు అంచులకు చేరింది. ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం ? ….. ఇదే. ఇక్కడ ఒకటి చెప్పవచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ “ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని” ప్రజాస్వామ్యం అంటారు అని ఉటంకించారు.

Also read: 124-ఏ ఐపీసీ పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: పౌర హక్కుల ప్రజా సంఘం – తెలంగాణ రాష్ట్రం

స్వాతంత్ర్యానికి ముందు సైతం ప్రజాస్వామ్యం

 భారత దేశానికి స్వాతంత్య్రo రాక మునుపు అంటే  1947 కు ముందు కూడా ప్రజాస్వామ్యం ఉంది. సాంప్రదాయ ప్రజాస్వామ్యాన్నికలిగి ఉంది. రాజులూ, సామాంతుల వ్యవస్థలలో ఆయా సాంప్రదాయ రాజకీయాలతో కలిగిన ప్రజాస్వామ్యం ఉండేది. మరియు దీనియొక్క ముఖ్య లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక తేడాలు లేకుండా ప్రజలందరూ ఒకే విధమైన విలువలపైన ఆధారపడి జీవితాలను గడిపే హక్కు కలిగించడం. అయితే భారతదేశంలో ఉన్న పరిస్థితులు .. కులం, మతం, వర్గం లు ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఆధిపత్యం చేస్తూనే వస్తుంది. అందుకే ప్రజాస్వామ్యం తన లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది, పోతోంది. ప్రజాస్వామ్యం పేరుతో చేయవలసిన దారుణాలు అన్నీ మతం, కులం, వర్గం, పవర్ రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి. ప్రజలు నిరంతరం భయంలోనే బ్రతుకుతున్నారు.

Also read: బేగరి నాగరాజు (24) హత్య దేని పైన దాడి? అంటరానితనమా? వివక్షా? అగౌరవమా? పరువు హత్యా? మత హత్యా? రాజ్యాంగంపైన దాడా?

వామపక్షాలను ఒకసారి పరిశీలిస్తే…

దేశంలో వ్యక్తిగత కారణాలతో , సైద్ధాంతికలతో విడిపోయిన రాజకీయ పార్టీలను విశ్లేషిస్తే … వామపక్ష పార్టీల పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే ఎన్ని పీలికలతో ఉన్నాయో … ప్రజాస్వామ్యాన్ని వారి కోణంలో నే తూకం వేస్తున్నారు. ఒక్కసారి ఈ పార్టీలను పరిశీలిస్తే ..

 a). కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా,సిపిఐ కమ్యూనిజం/ మార్క్సిజం/ లెనినిజం, b).  కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా మార్క్సిస్టు-సిపిఎం/CPI M- కమ్యూనిజం, c). రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఇండియా) – కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/ రెవల్యూషనరీ సోషలిజం, d) కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా -మార్క్సిస్టు, లెనినిస్ట్, లిబరేషన్ – కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/మావోయిజం, e) వర్కర్స్ పార్టీ అఫ్ ఇండియా, WPI-కమ్యూనిజం/మార్క్సిజం, f). పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ అఫ్ ఇండియా, PWPI-కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం, g). మార్క్సిస్టు కోఆర్డినేషన్ కమిటీ, MCC/MCO/MCOR-కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం/మావోయిజం, h). యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా, UCPI కమ్యూనిజం/ మార్క్సిజం/ లెనినిజం, i). రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా , RCPI – కమ్యూనిజం. యాంటీ స్టాలినిజం, j). బోల్షివిక్ పార్టీ అఫ్ ఇండియా, BPI-కమ్యూనిజం/మార్క్సిజం/లెనినిజం, k). అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, AIFB-లెఫ్ట్ వింగ్ నేషనలిజం సోషలిజం యాంటీ ఇంపీరియలిజం మార్క్సిజం, l). మార్క్సిస్టు ఫార్వార్డ్ బ్లాక్ – మార్క్సిజం లెఫ్ట్ వింగ్ పాపులిజం, m) సత్యశోధక్ కమ్యూనిస్ట్ పార్టీ- మార్క్సిస్టు ఫూలే థాట్ అంబేద్కరిజం/ మార్క్సిజం -ఫూలే -అంబేద్కరిజం, n). జనతిపాతియా సంరక్షణ సమితి, JSS-కమ్యూనిజం మార్క్సిజం, o). కమ్యూనిస్ట్ మార్క్సిస్టు పార్టి, అరవిందాక్షన్,CMP-A -కమ్యూనిజం మార్క్సిజం, p) సోషలిస్టు యూనిటీ సెంటర్ అఫ్ ఇండియా (కమ్యూనిస్ట్-SUCI-C)- కమ్యూనిజం మార్క్సిజం లెనినిజం షిబ్దాస్ ఘోష్ థాట్ యాంటీ రివిజనిజం, q). మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (యునైటెడ్)-MCPI-U-కమ్యూనిజం మార్క్సిజం లెనినిజం, r). రెవల్యూషనరీ మార్క్సిస్టు పార్టీ అఫ్ ఇండియా, RMPI-కమ్యూనిజం మార్క్సిజం లెనినిజం. వీటి పంథా లోనే ప్రజాస్వామ్యాన్ని చూస్తారు, అలానే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవాలి. వీరు ప్రజల కు ఎంత దూరంలో ఉన్నారు. వీరు కనీసం సామాన్య ప్రజలను  చేరుకుంటున్నార? చేరుకుంటారా ?

యూపీఏకి అనుకూలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు

గతంలో, UPA కు అనుకూలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు – యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ  ఇండియా ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు మోహిత్ సేన్, (2). కమ్యూనిస్ట్ మార్క్సిస్టు పా ర్టీ (జాన్) ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు సి.పి. జాన్, (3). పార్టీ అఫ్ డెమోక్రటిక్ సోషలిజం ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు సైఫుద్దీన్ చౌదరి & సమీర్ ఫుత్తుండు, (4). కమ్యూనిస్ట్ రెవల్యూషనరి లీగ్ అఫ్ ఇండియా (CRLI) ను స్థాపించిన (లీడ్ చేస్తున్న ) వారు ఆశిం చెటర్జీ, (5). పీపుల్స్ రెవల్యూషనరి పార్టీ అఫ్ ఇండియా (పచ్ఛిమ్ బెంగ గణతంత్రిక్ మంచ్)  ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు సుమంత హీర, (6). త్రిపుర గణతాంత్రిక్ మంచ్  ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు అజయ్ బిస్వాస్, (7). జంగానోతాంత్రిక్ మోర్చా ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారుఅజయ్ బిస్వాస్, (8). మార్క్సిస్టు మంచ్ అఫ్ అస్సాం, (9). ఒరిస్సా కమ్యూనిస్ట్ పార్టీ ను స్థాపించిన (లీడ్ చేస్తున్న) వారు అజయ్  రౌత్, (10). క్రాంతికారి సామ్యవాది పార్టీ ఇది బీహార్ బేస్డ్ గా పనిచేస్తున్నది, (11). రాష్ట్రవాది కమ్యూనిస్ట్ పార్టీ, ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్ గా పనిచేస్తుంది, (12). మధ్య ప్రదేశ్ కిసాన్ మజ్దూర్ ఆదివాసీ క్రాంతి దళ్ లు. ఈ పార్టీలు అంబెడ్కర్ నాయకత్వంలో రాయబడ్డ భారత రాజ్యాంగం కల్పించిన పార్లమెంటరీనియం సిస్టమ్ ను ఒప్పుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు.

వీరితో యూపీఏ ప్రభుత్వం ఎందుకు భుజం కలిపిందో…

యూపీఏ ప్రభుత్వం ఎందుకు వీరితో జతకట్టిందో అయోమయం. వీరిద్దరి కలయికలో ” భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్యం” కు ఏ విధంగా శక్తి  సమకూరుతోంది చెప్పలేదు. ప్రజాస్వామ్యం – లౌకిక వాదం యొక్క స్వభావం ఎలా ఉన్నదో తెలియదు. వీరి యొక్క కలయిక తో ప్రజాస్వామ్యానికి మేలు జరిగిందా? కీలు జరిగిందా? కనీసం వారికైనా తెలిసిందా? ప్రజాస్వామ్య నిర్వచనాన్ని మార్చి వేయబడ్డది అని చెప్పాలి. యూపీఏ ప్రభుత్వం “ప్రజాస్వామ్యం – విద్య” అమలు విషయంలో ఎలాంటి పద్దతులను పాటించింది. మతాల, కులాల, కుల- మతాల విద్యను ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహ పద్ధతులనే ” ప్రజాస్వామ్యం” కు నిర్వచనం అన్నట్లు ప్రజల్లోకి సందేశం పోయింది. ఆ వికృత నిర్వచనమే .. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్యంకు “వారి అధికారం కోసం కొత్త భాష్యం” ఇచ్చుకున్నారు. ఏదీ సమాంతరంగా పోలేదు.

Also read: నాగచైతన్య, సమంతల విడాకులు సరే, అసలు పెళ్ళి నమోదు చేసుకున్నారా?

NDA కు అనుకూలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు

కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ రెవల్యూషనరీ మార్కిస్ట్స్ -CPRM – కమ్యూనిజం మార్క్సిజం – 1996 లో రత్న బహదూర్ రాయ్   స్థాపించారు. NDA ఒక వర్గం కు చెందిన మతం ప్రజలకే అనుకూలం అని ప్రచారం ఉంది. మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు జతకట్టినట్లు? గతంలో UPA కు అనుకూలంగా AIMIM ఉండేది. AIMIM కూడా ఒక వర్గం కు చెందిన మతం ప్రజలకే అనుకూలం అని ప్రచారం ఉంది. మత రాజకీయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పడిన రాజకీయ పార్టీలను స్థాపించుకునేటందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యంలో స్థానం వుందా? లేదు. మతపరమైన పోకడలతో నిర్మాణం చేసి భారత పార్లమెంటరీయంలోకి అడుగు పెట్టలేరు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకోలేవు. మతపరమైన పోకడలతో ఓట్లను అడగకూడదు. అయితే ఇక్కడ “ప్రజాస్వామ్యం” గురించి వీరు వక్రభాష్యం చెపుతున్నారు. ఇది ఎలా ఉందంటే గులకరాల్లతో శబ్ధం చేస్తున్నట్లూ. ప్రజాస్వామ్యం-లౌకికత్వం అంటే అల్ప సంఖ్యకులకు మాత్రమే వెసులుబాటు  అనే ఒక తప్పుడు భావనకు లోను అవుతున్నారు.  ప్రజాస్వామ్యం-లౌకికత్వం ప్రతి వాళ్ళు అనగా భారత పౌరులు పాటించాలి అని. అల్ప సంఖ్యాకుల కోసం మాత్రమే అని కాదు, అధిక సంఖ్యాకుల కోసం కూడా అని. ఒకరి పట్ల ఒకరికి సౌభ్రాతృత్వం తో  ప్రజాస్వామ్య బద్ధంగా లౌకిక తత్వం తో ఈ గణతంత్ర దేశంలో అత్యంత అరుదైన కలయిక తో సామ్యవాదం కోసం, దేశ ప్రగతికి కృషి చేయాలని భారత రాజ్యాంగం చెపుతున్న ప్రజాస్వామ్యం కు నిజమైన అర్థం. ఈ సందర్భంలో … రాజ్యాంగంలో పొందు పరిచిన సమానపు హక్కుల గురించి తప్పక ఇక్కడా ప్రస్తావించాలి ..

సమానత్వపు హక్కులు  14, 15, 16, 17, 18 వ అధికరణల ప్రకారం ప్రసాదించబడింది. ఈ హక్కు చాలా ప్రధానమైనది. స్వేచ్ఛా సమానత్వాలు ప్రసాదిస్తూ  గ్యారంటీనిస్తున్నాయి…

చట్టం ముందు సమానత్వం

రాజ్యాంగ అధికరణ (ఆర్టికల్) 14 ప్రకారం, బారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారత చట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ, పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు.

పౌరప్రదేశాలలో సామాజిక సమానత్వం, సమాన ప్రవేశాలు

అధికరణ 15 ప్రకారం, పౌరులు పౌర (పబ్లిక్) ప్రదేశాలయిన, పార్కులు, మ్యూజియంలు, బావులు, స్నాన ఘాట్‌లు, దేవాలయాలు, మజీదులు, చర్చ్ లు వగైరా వగైరా  మొదలగు చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు….(ఇంకా ఉంది)

Also read: న్యాయమూర్తులను ప్రశ్నించడమే కోర్టు ధిక్కారమా?

జయ వింద్యాల,

లాయర్, హై కోర్టు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం

మొబైల్ : 9440430263

Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles