Monday, November 4, 2024

బెంగాల్ లో ‘తాటక’ దొరికింది, ఇక రావణుడు దొరకాలి!

పౌరాణిక, చారిత్రక ఘటనలకు; ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు; అప్పటి పాత్రలకు, ఇప్పటి వ్యక్తులకు మధ్య కనిపించే పోలికలు నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంటాయి.

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రధానంగా గురిపెట్టిన రాష్ట్రం ఏదంటే, పశ్చిమ బెంగాల్ అని ఎవరైనా ఠక్కున చెప్పవలసిందే. బెంగాల్ కు మొదటినుంచీ దేశంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

సంఘ సంస్కర్తల పుట్టినిల్లు

అక్కడినుంచి గొప్ప సంఘసంస్కర్తలు వచ్చారు, విప్లవకారులు వచ్చారు, రవీంద్రనాథ్ టాగోర్ అనే నోబెల్ బహుమతిని పొందిన అగ్రశ్రేణి సాహిత్యకారుడు వచ్చాడు; అమర్త్యసేన్ వంటి ఆర్థికవేత్త వచ్చాడు; సత్యజిత్ రే వంటి సినీదర్శకుడు వచ్చాడు; ఇంకా ఎందరో విద్యావేత్తలు, జగదీశ్ చంద్ర బోస్ లాంటి శాస్త్రవేత్తలు, సాధుసన్యాసులు వచ్చారు; స్వతంత్రభారతదేశానికి జాతీయగీతమైన జనగణమన వచ్చింది, వందేమాతరం వచ్చింది; నక్సల్ బరీ ఉద్యమం వచ్చింది. వామపక్షసంఘటన మూడుదశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న రాష్ట్రం కూడా అదే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెరుగుతూనే ఉంటుంది.

అలాగని దేశంలోని ఇతరప్రాంతాలు తీసిపోయాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇతర ప్రాంతాలనుంచి కూడా కచ్చితంగా పైన చెప్పిన తరహా వ్యక్తులు వచ్చారు. కాకపోతే ఆధునికభారతదేశానికి కొన్ని అంశాలలో బెంగాల్ అందించిన వరవడిని, ఆవిధంగా తను తెచ్చుకున్న ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠను అందరూ అంగీకరిస్తారనే అనుకుంటాను. కాలిఫోర్నియా ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో అమెరికా రేపు అదే చేస్తుందనో ప్రతీతి. అదే విధంగా, బెంగాల్ ఈ రోజు ఏమి ఆలోచిస్తుందో ఇండియా రేపు అదే చేస్తుందంటారు.

Also Read : ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!

బెంగాల్ పై విజయపతాకే ప్రతిష్ఠాత్మకం

మిగతా భారతదేశంపై విజయపతాకను ఎగురవేయడం కన్నా కూడా, ఒక్క బెంగాల్ ను జయించడం తమ కీర్తికిరీటంలో కోహినూర్ అవుతుందని హిందుత్వవర్గాలు భావించడం నావరకు సహేతుకంగానే కనిపిస్తుంది. ఒక భావజాలప్రాధాన్యం కలిగిన పార్టీ, లేదా సంఘటన బెంగాల్ లో అధికారంలోకి వస్తే అది కొన్ని దశాబ్దాలపాటు పాతుకుపోతుందని ఈ వర్గాలకు తెలుసు. పైన చెప్పుకున్న వామపక్షసంఘటన ఉదాహరణ ఉండనే ఉంది. అటువంటి బెంగాల్ లో కనుక హిందుత్వను స్థాపించగలిగితే మిగతా దేశమంతటిలో స్థాపించడం మంచినీళ్ళ ప్రాయం అవుతుందని వారు అనుకోవడంలో ఆశ్చర్యమేమీలేదు.

అలాంటప్పుడు, బెంగాల్ ను చిరకాలం ఏలిన వామపక్ష సంఘటన కూడా మిగతా దేశమంతటికీ విస్తరించాలిగదా అన్న ప్రశ్న రావచ్చు. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లోనూ, దక్షిణభారతంలోని కొన్ని ప్రాంతాలలోనూ బలంగా ఉన్న సాంప్రదాయికవర్గాలలోకి చొచ్చుకుపోవడంలో హిందుత్వభావజాలానికి ఉన్న వెసులుబాటు వామపక్షభావజాలానికి లేదన్నది బహుశా దీనికి చెప్పుకోగలిగిన ఒక సమాధానం.

Also Read : వ్యవసాయచట్టాలు, ఒక ఫార్ములా సినిమా కథ

పూర్తిస్థాయి యుద్ధం

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి హిందుత్వ పరివార్ కు, పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్నది పూర్తి స్థాయి యుద్ధమే తప్ప మరొకటి కాదు. ఈ యుద్ధంలో హిందుత్వ పరివార్ అన్ని రకాల వ్యూహ, ప్రతివ్యూహాలలో, అర్థబలంలో, అంగబలంలో, ప్రోపగాండా మిషనరీలో అన్ని విధాలా పై చేయిని చాటుకోగలుతోంది. వారిని దీటుగా ఎదుర్కొనే విషయంలో మమతాబెనర్జీప్రభుత్వానికీ, పార్టీకీ రెండు పరిమితులు అడ్డుపడుతున్నాయి. అదొక రాష్ట్రప్రభుత్వం కావడం, అదొక రాష్ట్రస్థాయి పార్టీ కావడంవల్ల హిందుత్వ పరివార్ కు ఉన్నంత అర్థబలం, అంగబలం, నాయకబలం లేకపోవడం ఒక పరిమితి. సాంప్రదాయికయుద్దపద్ధతిలో ‘శత్రుసేనలు’ అంచెలంచెలుగా చొచ్చుకొస్తూ ఉండి ఉండి అదాటుగా బెంగాల్ కోటపై ముప్పేటదాడి సాగిస్తుండగా, ఈ తరహా యుద్ధానికి అలవాటు పడని అవతలిపక్షం ఎదురుదాడికి బదులు ఎంతసేపూ దుర్గరక్షణకే చెమటోడ్చవలసి రావడం ఇంకొక పరిమితి.

యాగరక్షణ

ఇప్పుడు పౌరాణికపాత్రలతో, ఘటనలతో నేటి బెంగాల్ పరిణామాలకు ఉన్న పోలిక చూద్దాం:
యాగరక్షణ కోసమని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెడతాడు. దారిలో తాటకవనం వస్తుంది. తాటక ఎంత ‘దుర్మార్గు’రాలో రామునికి చెప్పిన విశ్వామిత్రుడు, ఆమెను నువ్వు చంపాలని చెబుతాడు. అప్పుడు రాముడు తాటక జన్మవృత్తాంతమేమిటని అడుగుతాడు.

Also Read : అంబేడ్కర్ దృష్టిలో దళిత రిజర్వేషన్ల చరిత్ర

విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారం, తాటక సుకేతుడనే మహాయక్షుని కూతురు. సుకేతుడు గొప్ప పరాక్రమవంతుడే కాక, సత్ప్రవర్తన కలిగినవాడు. తనకు సంతానం లేకపోవడంతో తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ఒక ‘కన్యారత్నా’న్ని ప్రసాదించాడు. ఆ ‘కన్యారత్న’మే తాటక. ‘వేయి ఏనుగుల బలం’ తో పుట్టిన తాటక సుకేతుడికి కూతురు, కొడుకూ కూడా తనే అయింది. మంచి ‘రూపసి’ అయిన తాటకను జంభాసురుని కొడుకైన సుందుడనే అతనికిచ్చి తండ్రి పెళ్లి చేశాడు. ఆ జంటకు మారీచుడనే కొడుకు పుట్టాడు.
ఇలా సాగుతున్న వీరి కాపురంలోకి అగస్త్యుడు అడుగుపెట్టాడు. ఎందుకు, ఎలా అడుగుపెట్టాడో రామాయణం చెప్పలేదు. అలాగే తాటక భర్త అయిన సుందుడితో అగస్త్యునికి శత్రుత్వం ఎందుకొచ్చిందో చెప్పలేదు. మొత్తానికి అగస్త్యుని వల్ల సుందుడు మరణించాడు. వారిద్దరి మధ్యా వైరమేమిటో కూడా తెలియదు.

అగస్త్యునిపై పగ

దాంతో తాటక, మారీచుడు అగస్త్యునిపై పగబట్టి అతన్ని చంపడానికి ప్రయత్నించారు. అప్పుడు ముందు మారీచుని ‘రాక్షసు’డివి కమ్మని అగస్త్యుడు శపించాడు. ఆ తర్వాత, “ఇప్పుడు నీకున్న ఈ రూపం పోయి భయంకరరూపం వస్తుంది. వికృతమైన ముఖంతో నరమాంసభక్షకురాలివి అవుతావు” అని తాటకను శపించాడు.

Also Read : తటస్థుల సంఖ్య తగ్గిపోతోంది

అగస్త్యుడి మీది కోపంతో తాటక అప్పటినుంచి, అగస్త్యుడు సంచరించిన ఈ ‘పవిత్రప్రదేశాన్ని’ ధ్వంసం చేస్తోందని చెప్పిన విశ్వామిత్రుడు, ఆడదని చూడకుండా ఆమెను చంపమని రాముడికి చెబుతాడు. అంతకుముందు ఇంద్రుడు, విష్ణువు స్త్రీలను చంపిన ఉదాహరణలను చూపిస్తాడు. అప్పుడు, తమ మీద దాడికి దిగిన తాటక చేతులను రాముడు తన బాణాలతో నరికేస్తాడు. ఆ తర్వాత లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు.(ఆ తర్వాత కొంతకాలానికి లక్ష్మణుడు ఇలాగే శూర్పణఖ ముక్కుచెవులు కోస్తాడు) చివరిగా ఆమె గుండెల మీద బాణాన్ని నాటి రాముడు ఆమెను చంపుతాడు. “ఆవిధంగా రాముడు ఆమెకు ముక్తిని ప్రసాదించా’డని రామాయణం చెబుతుంది.

మాతృస్వామ్యకోణం

ఈ మొత్తం తాటక కథను మాతృస్వామ్యకోణం నుంచి ఎలా అన్వయించుకోవాలో, నా ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే పుస్తకంలో చెప్పాను.

దానినలా ఉంచి ప్రస్తుతాంశానికి వస్తే, రామలక్ష్మణుల తాటకసంహారానికి, నేటి పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న యుద్ధానికీ పోలిక ఎంత బాగా కుదురుతోందో చూడండి:

రామలక్ష్మణులు మొట్టమొదట చంపినది స్త్రీ అయిన తాటక అయితే, హిందుత్వ పరివార్ మొట్టమొదట అతిముఖ్యంగా గురిపెట్టినది స్త్రీ అయిన మమతా బెనర్జీమీదే. రామాయణంలో తాటకను రాముడు ప్రత్యక్షంగా చంపితే, ఇప్పుడు మమతాబెనర్జీని ‘జై శ్రీరామ్’ వెంటాడి వెంటాడి చంపుతోంది. రామాయణంలో రామలక్ష్మణులకు భావజాలపరమైన మార్గదర్శకుడు విశ్వామిత్రుడైతే, బెంగాల్ పోరాటానికి భావజాలపరమైన మార్గదర్శనం చేస్తున్నది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.

“వాల్మీకి అబద్ధం చెప్పడు, నిజం దాచడు” అనేవారు రాంభట్ల కృష్ణమూర్తిగారు. తాటక వాస్తవానికి యక్షిణి అనీ, రూపసి అనీ, ఆమె తండ్రి కూడా ఉత్తముడనీ చెప్పిన వాల్మీకి; అగస్త్యుని శాపం వల్ల ఆమెకు వికృతరూపం వచ్చినట్టు, ఆమె కొడుకైన మారీచుడు ‘రాక్షసుడు’ అయినట్టు చెప్పాడు. మిడిమిడి జ్ఞానం వల్ల, లేదా నిజం చెప్పడంలో వాల్మీకికి ఉన్న నిజాయితీ లోపించడంవల్ల మన పౌరాణికులు తాటకను రాక్షసిగానే ప్రచారంలోకి తెచ్చారు. అంతకన్నా నిరక్షరకుక్షులైన సినిమావాళ్లు తాటకకు కొమ్ములు, కోరలు, వికృత, భారీ ఆకారమూ కల్పించి ఆ ముద్రనే ఇంకా పెంచి చూపించారు.

తాటకితో మొదలై రావణుడితో ముగిసింది

రామలక్ష్మణుల సంహారకాండ తాటకతో మొదలై రావణుడితో ముగిసింది. హిందుత్వపరివార్ కు ప్రస్తుతానికి తాటక దొరికింది కానీ, రావణుడు ఇంకా దొరకలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల యుద్ధఫలితం ఎలా ఉంటుందో, రామాయణంలోని తాటక కథను అది తిరగరాస్తుందో లేదో ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ, హిందుత్వ పరివారమే కనుక గెలిస్తే, మమతా బెనర్జీని అక్షరాలా తాటకకు ప్రతిరూపంగా చిత్రిస్తూ మరో రామాయణం తప్పకుండా అవతరిస్తుంది. వందలు, వేల సంవత్సరాలనుంచి ఒంటబట్టించుకున్న ప్రచారనైపుణ్యం అలాంటిది.
వికర్ణుడు, యుయుత్సుడు నేటి బెంగాల్ ఎన్నికల యుద్ధసమయంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జరుగుతున్న ఫిరాయింపులను చూసినప్పుడు మహాభారతంలోని రెండు పాత్రలు గుర్తొస్తాయి: ఒకరు వికర్ణుడు, ఇంకొకరు యుయుత్సుడు.

Also Read : బీజేపీ-శివసేనల పోరు ఎలా చూడాలి?

వందమంది కౌరవసోదరులలో ఒకడైన వికర్ణుడు ఒకే ఒక సందర్భంలో తన వ్యక్తిత్వపు వెలుగులు విరజిమ్మి ఆ తర్వాత తెరవెనక్కి వెళ్ళిపోతాడు. అది, నిండుసభలో ద్రౌపదిని పరాభవించిన సందర్భం. ‘నేను ధర్మవిజేతనా, అధర్మవిజేతనా?” అని ద్రౌపది అడిగిన ప్రశ్నకు సభలోని భీష్మద్రోణాదులు కానీ; ‘ధర్మమూర్తి’గా అందరూ ఆకాశానికెత్తే ధర్మరాజు కానీ సమాధానం చెప్పకుండా తలదించుకున్నప్పుడు; ద్రౌపది పక్షాన నిలబడి ఆమె అధర్మవిజేత అంటూ వికర్ణుడు ఒక్కడే ఎలుగెత్తి చాటతాడు. ఇప్పటి భాషలో చెప్పాలంటే అది, ‘పార్టీ వ్యతిరేకచర్య’ అవుతుంది.

శేషజీవితంలో వికర్ణుడు ఆ మేరకు నిందను ఎదుర్కొనే ఉంటాడు కానీ, యుద్ధంలో మాత్రం ‘పేరెంట్ పార్టీ’ పక్షానే పోరాడి వీరమరణం చెందుతాడు. బుద్ధిశాలిగా కనిపించే వికర్ణుడు కౌరవుల ఓటమిని ముందే ఊహించి ఉండవచ్చు కూడా. అయినా సరే చావో, రేవో తేల్చుకోవలసిన ఆ కీలకఘట్టంలో అతను పేరెంట్ పార్టీలోనే ఉండిపోవడం విలువల పట్ల అతని నిష్ఠను, నిబద్ధతను తెలియజేస్తుంది.

ధృతరాష్ట్రునికి ఒక వైశ్యస్త్రీవల్ల జన్మించిన యుయుత్సుడు వికర్ణునికి పూర్తిగా భిన్నమైనవాడు. అతను యుద్ధం వరకు పేరెంట్ పార్టీలోనే ఉన్నాడు. యుద్ధసమయంలో మాత్రం అవతలిపక్షంలోకి ఫిరాయించి అవకాశవాదాన్ని, పెంచి పోషించిన పార్టీపట్ల ద్రోహాన్ని చాటుకున్నాడు. పాండవుల పక్షంలో చేరి ప్రాణాలు దక్కించించుకున్న కౌరవుడు అతనొక్కడే. అపకీర్తిశేషుడయ్యాక ప్రాణాలు ఉంటేనేమి, పోతేనేమి!

సరే, రామాయణంలో విభీషణుడు ఇంకొక ఉదాహరణ. శరణు పేరుతో అతని పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించినది రాముడు!

Kalluri Bhaskaram
Kalluri Bhaskaram
సీనియర్ జర్నలిస్టు, బహుగ్రంథ రచయిత, సుప్రసిద్ద అనువాదకుడు

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles