Thursday, April 25, 2024

కాలుష్యం కోరలు పీకే హైడ్రోజన్ కారు

  • ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కార్లు
  • పర్యావరణ హితం జనహితం
  • ఎలక్ట్రిక్, హైడ్రోజన్ కార్లు భారత్ కు మేలు

భారతదేశంలో తొలిగా హైడ్రోజన్ కారు రోడ్డెక్కింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కారు అందుబాటులోకి వచ్చింది. పనితీరును తెలుసుకోవడంలో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు ఆయన నివాసం నుంచి పార్లమెంట్ వరకూ హైడ్రోజన్ కారులో ప్రయాణించారు. కాలుష్యాన్ని కట్టడి చేసే ప్రయాణంలో ఇది మంచి అడుగు. కాలుష్యాన్ని విరివిగా వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్లు మొదటగా రోడ్డుపైకి వచ్చాయి. ఇప్పుడు హైడ్రోజన్ కార్లు కూడా అందుబాటులోకి సిద్ధం కానుండడం మేలిమలుపు.

Also read: అప్రమత్తతే అవశ్యం

గ్రీన్ హైడ్రోజన్ కార్లకు స్వాగతం

డీజిల్, పెట్రోల్ కార్ల వల్ల కాలుష్యం పెరగడంతో పాటు ఆర్ధికంగా భారం కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది. అంతర్జాతీయ పరిణామాలను బట్టి, ధరలు అదుపు తప్పుతున్నాయి. వాడకం పెరగడం వల్ల వనరులు తరిగిపోతున్నాయి. దేశాల మధ్య పెరుగుతున్న అంతరాలు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో ధరలు ప్రతిక్షణం ఏ తీరున పెరిగిపోతున్నాయో మనం అనుభవిస్తూనే ఉన్నాం. కార్లు తయారు చేసే కొన్ని సంస్థలు కొన్ని డీజిల్ కార్ల తయారీని కూడా ఆపేశాయి. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ఈ దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు కూడా కాలుష్యాన్ని నివారిస్తాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి, పంపిణీ, వాడకం జరగడం లేదు. పెట్రోల్, డీజిల్ తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ప్రత్యామ్నాయంగా హైడ్రోజెన్ ఇంధన వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా దేశంలో తొలి హైడ్రోజెన్ కారును కేంద్రమంత్రి గడ్కరీ పోయిన నెలలోనే విడుదల చేశారు. నివాసం దగ్గర నుంచి పార్లమెంట్ వరకూ ప్రయాణం చేయడం మాత్రమే ఇదే తొలిసారి.  సమర్ధవంతమైన, పర్యావరణ హిత, స్వయం ఆధారిత ఇంధన మార్గంలో దేశం ప్రయాణించాలంటే  ‘గ్రీన్ హైడ్రోజెన్’ వినియోగం విరివిగా జరగాలి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన హైడ్రోజెన్ కారును జపాన్ సంస్థ టయోటా రూపొందించింది. కార్ల ఉత్పత్తిని పెంచడంతో పాటు గ్రీన్ హైడ్రోజెన్ ను త్వరలోనే ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంటుందనే విశ్వాసంలో మన ప్రభుత్వం ఉంది. అది సదా అభినందనీయం, హర్షదాయకం. ఎఫ్ సీ ఈ వీ ( ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ ) సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రోజన్ కారు నిర్మాణమవుతోంది. స్వచ్ఛమైన హైడ్రోజెన్ నుంచి ఉత్పత్తయ్యే శక్తితో కేవలం నీరు మాత్రమే బయటకు విడుదలవుతుంది.

Also read: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు ఎసరు

కాలుష్యానికి కట్టడి

అందువల్ల కాలుష్యం ఏర్పడే అవకాశం ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఖర్చు కూడా చాలా తక్కువ.కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని చెబుతున్నారు. ఒక్కసారి

ఫుల్ ట్యాంక్ చేస్తే 600 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయవచ్చునని తెలుస్తోంది. ట్యాంక్ నిండడం కూడా రెండు మూడు నిముషాలలోనే పూర్తవుతుందని చెబుతున్నారు. కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు కారు ఉండడమే గొప్ప. ఇప్పుడు మహా నగరాల నుంచి కుగ్రామల వరకూ ఎక్కడ చూసినా కార్లు కనిపిస్తున్నాయి. ఒకప్పటి ద్విచక్ర వాహనాల స్థానంలోకి ఇప్పుడు కార్లు వచ్చేశాయి. రెండు కార్లు ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి. కొందరి ఇళ్లల్లో మనిషికొక కారు చొప్పున ఉంటోంది. ఇలా… కార్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరగడం – సమాంతరంగా కాలుష్యం పెరిగిపోవడం సంభవించింది. ఈ నేపథ్యంలో, అటు పెట్రోల్, డీజిల్ ధరలు – ఇటు వనరుల కొరత భారీగా పెరిగిపోయాయి. మొత్తం మీద, పర్యావరణ హితంగా నడుచుకోవాల్సిన సందర్భాన్ని మానవాళి గుర్తించడం మంచి పరిణామమే. ఆ దిశగా ప్రభుత్వాలు కదలడం ఇంకా మంచి పరిణామం.

Also read: తెలుగు తేజాన్నిచాటిన త్రిబుల్ ఆర్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles