Wednesday, December 8, 2021

‘భారత్ గౌరవ్’ రైళ్ళకు స్వాగతం!

  • పరిశుభ్రత, ఆహార నాణ్యత పెంచుకోవాలి
  • తెలుగు రాష్ట్రాలు గౌరవ్ రైళ్ళను వినియోగించుకోవాలి
  • ఆజాదీ అమృత మహోత్సవ్ లో భాగంగా అనేక కొత్త రైళ్ళు

ప్రయాణ సాధనాలలో రైళ్ళ స్థానం విభిన్నమైనది. బ్రిటిష్ వాళ్లు నిర్మించిన ఈ వ్యవస్థ చారిత్రాత్మకం. దశాబ్దాల భారతీయ రైల్వే ప్రస్థానంలో ఎన్నో మజిలీలు, మరెన్నో ప్రగతి పయనాలు. పర్యాటక రంగం ఎదగడంలో రైల్వేల పాత్ర విశేషమైంది. ఇటు పర్యాటక రంగాన్ని – అటు రైలు ప్రయాణాలను ప్రోత్సహించే దిశగా భారతీయ రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో 190 రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వ రైలు సర్వీసులకు తోడుగా ప్రైవేట్ రైళ్లు కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. భారత్ గౌరవ్ రైలు సర్వీసుల కోసం 3033 కోచ్ లు / 190 రైళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దేశ సాంస్కృతిక, వారసత్వ సంపదను చాటే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతార్హం. ఈ దిశగా మంగళవారం నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ సర్వీసులకు సంబంధించిన చార్జీలను సంబంధిత టూర్ ఆపరేటర్లే నిర్ణయిస్తారని సమాచారం. భారత్ గౌరవ్ రైళ్ళ కోసం కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

భారత్ గౌవర్ రైళ్ళ గురించి వివరిస్తున్న రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్

రైల్వే సంస్కరణల అవసరం

రైల్వే వ్యవస్థలో సంస్కరణలు, పర్యాటక అభివృద్ధి జమిలిగా సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునీకరణ నేపథ్యంలో సౌకర్యాలు పెరిగినప్పటికీ, శుభ్రతలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది. ‘దురంతో’ వంటి రైళ్లు పట్టాలెక్కి ఏమంత కాలం కాలేదు. కానీ ఫస్ట్ ఏసీ కంపార్ట్ మెంట్లు సైతం శోభ తగ్గి వెక్కిరిస్తున్నాయి. ఆహార పదార్ధాల విషయంలోనూ స్వచ్ఛత, నాణ్యత ప్రశ్నార్ధకంగానే ఉన్నాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి మహా నగరాల రైల్వే స్టేషన్లను గమనిస్తే పరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో అవగతమవుతూనే ఉంది. ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టినా, ట్రాక్స్ ఇంకా మెరుగుపడాల్సి వుంది. తెలుగు రాష్ట్రాలలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. భారతదేశంలో పర్యాటక కేంద్రాలకు కొదవ లేదు. సౌకర్యాల మెరుగుదలతో పాటు రైల్వేలకు అనుసంధానం చేయడంలో సమగ్రత లోపించకూడా చూడడం ముఖ్యం.

Also read: నిలిచి గెలిచిన రైతు

ప్రభుత్వ రంగంపట్ల చిన్నచూపు తగదు

నాణ్యత, ఆదాయంలో మెరుగైన ఫలితాలు సాధించడం నెపంతో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, భారతీయ ప్రభుత్వ రైల్వే రంగాన్ని చిన్నచూపుచూడడం క్షమార్హం కాదనే విమర్శలు గట్టిగానే వినపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రైల్వే రంగం నిన్నటి వరకూ ప్రధాన స్రవంతిలో ఉండేది. ప్రైవేట్ ప్రాబల్యం దానిని దెబ్బతీసే ప్రమాదాన్ని విస్మరించలేం. ‘శతాబ్ది’ని మించిపోయే వేగం, ‘మెట్రో’ను అధిగమించే ఆధునికతతో  ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్ లను  కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సుమారు 100కు పైగా రైళ్లు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పం చేసుకుంది. ‘అమృత మహోత్సవ్’ లో భాగంగా దశలవారీగా పట్టాలకు ఎక్కించాలని సెప్టెంబర్ మాసంలో రైల్వే శాఖ ప్రణాళికలు వేసింది. దిల్లీ, ముంబయి వంటి నగరాలకే ఎక్కువగా పరిమితమైన ‘శతాబ్ది’ రైళ్లు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన నగరాలలోనూ విస్తరించాల్సిన అవసరం ఉంది. దూర ప్రాంతాలకు ఈ రైళ్ళను ఎక్కువగా వేయాలనే డిమాండ్ ను రైల్వే శాఖ పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. భారతీయ రైల్వే గౌరవాన్ని పెంచే  దిశగా  ‘గౌరవ్ రైళ్లు’ నడవాలని ఆకాంక్షిద్దాం. అదే సమయంలో, రైల్వే శాఖలోని లోపాలను సరిదిద్దుకుంటూ , ప్రభుత్వ రైల్వే వ్యవస్థ ఉనికికి ప్రమాదం రాకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.

Also read: ధర్మవర్తనుడికి బ్రహ్మరథం, యాచకుడికి ఘనంగా వీడ్కోలు!

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles