Thursday, September 29, 2022

ఆదివాసీ బిడ్డ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటాం : కేసీఆర్

ఆదివాసీలకు రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతాం

కే్ంద్రంలోని పాలకులు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు, విభజన రాజకీయాలు చేస్తున్నారు

మనం కూడా దేశంలో భాగమే. మన హక్కులు మనకు రావలసిందే

భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేళ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభమైన మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశ పౌరులైన మెజారిటీ ప్రజలను నేటివరకు తమమీద ఆధారపడేలా చేస్తూ వస్తున్న పాలక వర్గాలకు గుణపాఠం నేర్పేవిధంగా గత పాలకులకు భిన్నంగా ఎన్నో ఆదర్శవంతమైన ‘ఇంక్లూజివ్’ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మారిజినల్ సెక్షన్లుగా పిలువబడుతున్న దళిత బహుజన భారత శూద్ర జాతి ని మందిలో కలుపుతున్న సువర్ణాధ్యాయం ఒకటి వర్తమాన తెలంగాణ రాజకీయ పాలనారంగ యవనిక మీద లిఖించబడుతున్నది.

తలపాగాతో కేసీఆర్

తెలంగాణలో గిరిజన బిడ్డలైన ఆదివాసీలు, బంజారాల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో కోట్లాది రూపాయల ఖర్చుతో ఆదివాసీ వీరుడు కొమురం భీం పేరుతో నిర్మించిన ఆదివాసీ భవన్ ను,  సేవాలాల్ మహరాజ్ పేరుతో నిర్మించిన బంజారా భవన్ లను కేసీఆర్  శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇన్నేండ్లకు ఖరీదైన బంజారా హిల్స్ లో నిర్మితమైన తమ ఆత్మగౌరవ భవనాలను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ కు హర్షాతిరేకాలతో చప్పట్లతో కేరింతలతో జై కేసీఆర్ నినాదాలతో తమ కృతజ్జతలను చాటుకున్నారు.

ఈ సందర్భంగా.. ఆదివాసి బంజారా జంట భవనాల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వందలాదిమంది గిరిజన కళాకారులు గోండు బంజారా సాంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ భవన్ కు చేరుకున్న సీఎం అక్కడ సమ్మక్క-సారలమ్మలకు పూజలు చేశారు. అనంతరం ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు. భవనంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆ గోండు వీరునికి, తెలంగాణ సాయుధ పోరాట స్వాతంత్ర్య సమరయోధునికి జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేళ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సోదరులు తాము సంప్రదాయంగా ధరించే తలపాగాను సీఎం కేసీఆర్ కు ధరించారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఆదివాసీ, బంజారాల ఆనందోత్సాహాల మధ్య సీఎం కేసీఆర్ ఆదీవాసీ భవనాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆదివాసీ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. అనంతరం…జంట భవనాలలోని బంజారా భవన్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు బంజారా భవన్ లో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహించారు. మద్దిమడుగు సంత్ సేవాలాల్ పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో బంజారా సాంప్రదాయ ‘భోగు బండారి’ పూజలు జరిపారు.

అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంజారాల ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు. ‘యాడీ బాపు రామ్ రామ్’ అంటూ సీఎం  ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సదర్భంగా సభలోంచి హర్షధ్వానాలు మిన్నంటాయి.

ఈ రెండు భవనాల ఆవిష్కరణోత్సవ సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘ఎస్టీ సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనాలకు తండోపతండాలుగా విచ్చేసిన ఆదివాసీ, బంజారా బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఇది భారతదేశ గిరిజన జాతి బిడ్డలకు స్ఫూర్తి కి కలిగించే సందర్భం. ఉద్యమ సమయంలో నేను ఎన్నోసార్లు చెప్పిన. మన రాజధానిలో బంజారా హిల్స్ అని ప్రాంతం ఉంటది.. కానీ, అక్కడ బంజారాలకే గజం జాగ లేదని చెప్పిన. ఆ మాటను తిరగరాస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తం తెలిసేలా చేసుకుంటున్నం, చాలా సంతోషంగా మనం ఆదివాసీ బంజారా భవనాలను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ స్ఫూర్తి..’ అని అన్నారు.

గిరిజన జాతి నుంచి పైకెదిగిన ఉద్యోగులు నాయకులు మేధావులకు వారి భవిష్యత్తు తరాలను ముందు వరసలో నడిపే బాధ్యత వున్నదని సీఎం అభిప్రాయపడ్డారు.

‘‘కేవలం భవనాలను నిర్మించుకోవడమే కాదు. వాటిని సద్వినియోగం చేసుకునే దిశంగా గిరిజన మేధావి వర్గం ఉద్యోగులు ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర నీటిపారుదలశాఖలో పనిచేసే హరిరామ్ లాంటి అనేకమంది బంజారా బిడ్డలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. వారికి నా అభినందనలు.’’ అని సీఎం అన్నారు.

‘‘ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి. వాటన్నింటినీ వేర్వేరు చోట్ల వేర్వేరుగా మాట్లాడుకుంటారు. కానీ, గిరిజన భాషను మాత్రం ప్రపంచమంతటా ఒకేవిధంగా మాట్లాడుకుంటారు. ఇదొక గొప్ప విషయం. గిరిజన బిడ్డలు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా ఉంటే, మహారాష్ట్రలో బీసీలుగా, మరోచోట ఓసీలుగా ఉన్నారు. వీరందరినీ సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వానికి మేం చెప్పడం జరిగింది. అలాగే, రాష్ట్రంలో పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించుకునేందుకు ఇటీవలే కమిటీలు కూడా వేసుకోవాలని జీవో ఇచ్చినం. మీరందరూ పోడు భూముల సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలి.’’ అని సీఎం కేసీఆర్ గిరిజనులకు పిలుపునిచ్చారు.

సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles