Friday, December 9, 2022

నింగిని పరికిద్దాం!

ఆకాశవాణిలో నాగసూరీయం-22

ప్రకృతి అనంతమైంది, వైవిధ్యమైంది!  ‘నేచర్ ఈజ్ ది టీచర్’ అనే మాట ఇంగ్లీషులో ఉంది. నేర్వగలిగినంత మేర మనం నేర్చుకునే అవకాశం ఉంది! ప్రకృతి అంటే? నేల, ఆకాశం, నీరు, మొక్కలు, ప్రాణులు… ఇలా ఏమైనా కావచ్చు.  విజ్ఞాన శాస్త్రమంతా ప్రకృతి పరిశీలనలోనే రూపుదిద్దుకుంది, తయారైంది. ప్రకృతి అంటే స్వభావం కూడా!

Also read: తెలుగు కథానిక శతవార్షిక సందర్భం

ఆకాశం వైవిధ్యభరితం

మానవ ప్రకృతి అనే మాట అలానే పుట్టింది. పదార్థాల, ప్రాణుల స్వభావాన్ని చెప్పడమే సైన్స్.  మానవ సమూహాల స్వభావం – గతమైతే చరిత్ర, వర్తమానమైతే సోషియాలజి! నది ఒడ్డున ఎంతసేపు కూర్చున్నా బోరుకొట్టదు.  ఆకాశాన్ని ఎంతసేపు చూసినా వైవిధ్యంగా ఉంటుంది. అందుకే చిత్రకారులకు ప్రకృతి అనంతమైనస్ఫూర్తి. అదే కోవలో ఆకాశం. ఎన్నో, ఎన్నెన్నో నక్షత్రాలు… కొన్ని ఎక్కువ ప్రకాశవంతంగా, కొన్ని తక్కువ ప్రకాశవంతంగా… ఏదో మినుకు మినుకుమంటూ – ఇలా ఒక్కొక్కటి ఒక్కోరకంగా. అలాగే కొన్ని నక్షత్రాలు సమూహాలుగా మనలను చూడమని ఊరిస్తూ ఉంటాయి.  

ఒక్కో రాత్రి  ఒక్కో రకంగా…

అంతేకాదు ఒక్కరాత్రి చంద్రుడు ఒక్కోరకంగా ఉంటాడు. కొన్ని రోజులు అర్జంటుగా, ఠంచనుగా వస్తాడు. కొన్నిరోజులు ఆలస్యంగా వస్తాడు. వచ్చినా మొహం చూపాలా వద్దా అన్నట్టుంటాడు. వీటినే చంద్రకళలు అంటాం. అమావాస్య, పౌర్ణమి అంటాం. ఒక్క చంద్రుడే కాదు. మీ కిటికీలో పడే ఎండ ఒక్కోరోజు ఒక్కోరకంగా ఉంటుంది. 365 రోజుల్లో ప్రతిరోజు ఎంతో కొంత మార్పు ఉంటుంది. అదే ప్రకృతి! 

Also read: కదంబ కార్యక్రమాలకు పునాది

ఆకాశ దర్శనం

‘ఆకాశదర్శనం’ అనేది ‘స్కై వాచ్’ అనే ఇంగ్లీషుకు తెలుగుపదం. నిజానికి ఆకాశదర్శనం అనేది పెద్ద సైన్స్, పెద్దకళ!  నక్షత్రమండలాల కథలు పక్కన ఉంచుదాం. పున్నమిరోజు చంద్రుడు పెద్ద సైజులో సముద్రాన్ని సైతం ఊరిస్తుంటాడు. అందుకే సముద్రం ఎగిసి పడుతూ ఉంటుంది – వాటిని ఆటుపోట్లు అంటాం. అదే అమావాస్య రోజు చంద్రుడు దాదాపు రాడు అని చెప్పుకోవాలి. అమావాస్యను విషాదానికి, పున్నమిని ఆనందానికి సింబల్స్ గా చెప్పుకుంటాం. బోలెడు కవిత్వం, ఫిలాసఫీ దీని చుట్టూ అల్లుకోవచ్చు. మామూలుగా కనబడని చుక్కలు అమావాస్య రోజున చాలా సంఖ్యలో కనబడతాయి. అలాగే అమావాస్యకు ముందు రెండు, మూడురోజులూ, తర్వాత రెండు మూడు రోజులూ నక్షత్రాలు కనువిందు చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే 28 రోజుల్లో ఒక వారం పాటు నక్షత్ర దర్శనం విశేషంగా అందుబాటులో ఉంటుంది.

విద్యార్థినీవిద్యార్థులు టెలిస్కోప్ ద్వారా నింగిని చూశారు

2016లో మద్రాసులో పనిచేస్తున్న సమయంలో ఆకాశదర్శనం గురించి ఆలోచించాను. అలాంటిది ఏర్పాటు చేస్తే చాలా బావుంటుందని ప్రయత్నం ప్రారంభించాను. దీనికి నెల్లూరు మిత్రుడు జి. మల్యాద్రి, మద్రాసు మిత్రుడు కృష్ణస్వామి ఆసక్తి చూపారు. అలా 2016 మార్చి 6న ‘నింగిని పరికిద్దాం’  అనే కార్యక్రమం నెల్లూరు జిల్లా దుత్తలూరులో నిర్వహించాం. దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, వరికుంట పాడు, ఉదయగిరి, మర్రిపాడు, సీతారాంపురం మండలాలకు చెందిన 8, 9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులు 220 మంది దాకా నింగిని టెలిస్కోపు ద్వారా చూశారు.

Also read: రేడియోకూ, పత్రికలకూ పోలిక ఉందా?

జనవిజ్ఞాన వేదిక తోడ్పాటు

మొదట సమావేశంలో సాయంకాలం ఓ గంటపాటు ప్రాథమిక విషయాలు వివరించిన పిదప భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత రాత్రి 9 గంటల నుంచి 12 గంటల దాకా విడతలు వారీగా పిల్లలు టెలిస్కోపు గుండా ఆకాశం చూస్తూ ప్రశ్నలు అడగడం, సమాధానాలు పొందడం వీలయ్యింది. ఇందులో నెల్లూరు శాఖ జనవిజ్ఞాన వేదిక మిత్రులు తోడ్పాటు, కృష్ణస్వామి టెలిస్కోపుతో కూడిన ప్రసంగం చాలా ముఖ్యమైనవి. ఇదివరకే అన్నట్టు ఈ కార్యక్రమానికి ‘నింగిని పరికిద్దాం’ అనే పేరును ఖరారు చేశాం. అయితే పేరుకు సంబంధించి హోంవర్క్ చేశాను. 

పేరు మీద కసరత్తు

తొలుత దీనికి పేరు ‘ఆకాశ వీక్షణం’ అని అలవోకగా స్ఫురించింది. అయితే ఇందులో ఆకాశం, వీక్షణం – రెండు పదాలూ సంస్కృతమే!  తెలుగు మాటకోసం అన్వేషణ ప్రారంభించాను. ఇలాంటి సమయాల్లో టెలిఫోన్ పాత్ర, మిత్రుల పాత్ర ఎనలేనివి! 2016 ఫిబ్రవరి 19-21 తేదీలు సమయంలో ‘ఏలి పొలిమేరలు’ అనే ప్రసంగాల కార్యక్రమాన్ని మద్రాసులో స.వెం. రమేష్ తో నిర్వహించాం.  కనుక ఆ సమయంలో రమేష్ మా ఇంట్లోనే ఉన్నారు. ముఖాముఖిన చర్చించాను. మొదట ఇలాంటి మాటలు ప్రతిపాదించారు – వినుపారవ, వినుప్రేమ, వినుపొడ, వినుకనుకళి, వినుచూడ్కి, విను అరయిక, వినుకానుపు, విను కనుగోలు, ఇందులో ‘విను’ అంటే ఆకాశం, అలాగే ‘వినువీధి’ అనే మాట ఉంది.  ఇది సంస్కృతం. కనుక ‘విను’కు బదులుగా విన్ను, మిన్ను, మిను,  నింగి అనే మాటలు ప్రతిక్షేపించి పదాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంది!

Also read: నా మైక్రోఫోన్‌ ముచ్చట్లు

 డాక్టర్ ఎంవి రమణారెడ్డి సూచనలు

అయితే నా హోంవర్క్ ఇంకొంత అవసరమని ప్రముఖరచయిత డా.ఎం.వి.రమణారెడ్డిని కోరాను.  ఆయన మింటిచూపు, నింగిపై నిఘా అనే రెండు మాటలు సూచించారు. అలాగే ‘చుక్కల్లో చూపు’ అనే ఇంకో మాట కూడా ప్రతిపాదించారు. ఇక్కడ మాటను స్వీకరించే ముందు, అందుబాటులో ఉండేవాటిలో ‘ఎలిమినేషన్’ ప్రక్రియలో తీసివేయడం ప్రారంభించాను.  ‘చుక్కల్లో చూపు’ బావుంది. అయితే జోకులు వేసే అవకాశం ఉంది. కనుక పరిహరించాం. ‘నింగిపై నిఘా’ కూడా బావుంది. ‘నిఘా’ పదంలో  సూక్ష్మ పరిశీలన, అధ్యయనం అనే ధ్వని ఉంది. అయితే అందులో ఒక అధికార దర్పం ఉందనిపించింది. కనుక ‘నింగిని నిలకడగా చూద్దాం’ అనే మాటను ప్రతిపాదించాను. దీనికి రమణారెడ్డి గారు ‘నింగిని పరికిద్దాం’ అని మార్చి ప్రతిపాదించారు.  ‘పరికిద్దాం’ అనే మాటలో నిలకడ ఉంది, పరిశీలన ఉంది. కనుక ‘నింగిని పరికిద్దాం’ అనే మాటను కార్యక్రమానికి స్థిరపరిచాం.  అలా ఓ విలక్షణ కార్యక్రమం. దానికి అంతే విలక్షణమైన తెలుగు నామకరణం సాధ్యపడ్డాయి. 

మరి ‘నింగిని పరికిద్దాం’ ఆగిపోయిందా? లేదా మరోచోట కొనసాగిందా? అదే పేరుతోనే నడిచిందా? ఈ అనుభవం నాకు ఆకాశవాణి లో దోహదపడిందా? – ఇలాంటి మరిన్ని సంగతులు మరోసారి తెలుసుకుందాం!

Also read: హేమావతి… రత్నగిరి… సేద్యపు సుద్దులు

డా. నాగసూరి వేణుగోపాల్,

ఆకాశవాణి పూర్వ సంచాలకులు.

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles