Thursday, April 25, 2024

నవంబర్ 1 న అమరావతి-తిరుపతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం

  • తుళ్ళూరు నుంచి తిరుపతి వరకూ…
  • షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన పోలీసులు
  • అమరావతి వెలుపల విస్తరించనున్న ఆందోళన
  • రైతుల త్యాగాలను గుర్తించని ప్రభుత్వం : జేడీ లక్ష్మీనారాయణ

అమరావతి : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  సోమవారంనాడు రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానున్నది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడనుంది. తుళ్లూరు నుంచి తిరుమల వరకూ రైతులు చేయనున్న ఈ పాదయాత్ర నిరాటంకంగా సాగేందుకు 20 కమిటీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా తక్కిన పార్టీలన్నీ మహాయాత్రకు మద్దతు ప్రకటించాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు 684 రోజులుగా వివిధ రకాల ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే. ఇన్నాళ్లూ 29 గ్రామాలకే పరిమితమై సాగుతున్న ఆందోళన ఈ పాదయాత్ర ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది.

రాజధాని రైతులూ, అమరావతి రక్షణ సమితి నాయకులు ఈ పాదయాత్రను నిర్వహించనున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు మాత్రమే పాదయాత్ర సాగాలనీ, పాదయాత్రంలో ఎట్టి పరిస్థితులలోనూ సభలూ, సమావేశాలు నిషిద్ధమనీ, 157 మందికంటే ఒక్కరు కూడా ఎక్కువమంది పాల్గొనరాదనీ పోలీసులు ఆదేశించారు. పాదయాత్రలో పాల్గొనేవారంతా గుర్తింపు కార్డులను ధరించాలనీ, ఒకటి, రెండు మైకులు మాత్రమే ఉండాలనీ పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్రికులు రోడ్డు మధ్యలో నడవరాదనీ, రోడ్డుకు పక్కగా నడవాలనీ పోలీసులు తెలిపారు. మీడియా ప్రతినిధులు పాదయాత్రతో పాటు రావలసిన అవసరం లేదనీ, ఎక్కడైనా విరామం కోసం ఆగినప్పుడు యాత్రావిశేషాలను మీడియా ప్రతినిధులకు తెలియజేయవచ్చునని అన్నారు. దూకుడుగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం నిషిద్ధం. ఇటువంటివే అనేక షరతులు విధించాలు.

వెంకటేశ్వరస్వామి రథం ముందు

తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నందున యాత్రలో స్వామివారి విగ్రహం ఉంచిన వాహనం ముందువరుసలో ఉంటుంది. ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గుండా పాదయాత్ర సాగనుంది. రోజూ రెండు దఫాలుగా  12నుంచి 14 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించారు.  నవంబర్ 1న ప్రారంభమయ్యే పాదయాత్ర మొదటి 6 రోజులు గుంటూరు జిల్లాలో సాగి పర్చూరు వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది.

 నవంబర్ 8నుంచి 17వ తేదీ వరకూ పది రోజుల పాటు ప్రకాశం జిల్లాలో సాగనుంది.  18వ తేదీన నెల్లూరు జిల్లా కావలికి పాదయాత్ర చేరుకుంటుంది.  ఈ జిల్లాలో అత్యధికంగా 16 రోజుల పాటు జరగనుంది.  డిసెంబర్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది.  అదే నెల 15 వ తేదీ తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.  రాజధాని రైతుల పాదయాత్రకు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ సంఘీభావం ప్రకటించారు.  తెలుగుదేశం సోషల్  మీడియా విభాగం-ఐ టీడీపీ ప్రతినిధులు యాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు. పాదయాత్ర ద్వారా అమరావతి ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని ఐకాస నేతలు చెబుతున్నారు.

వీలున్న చోట కదం కలుపుతా: జేడీ లక్ష్మీనారాయణ

రాజధాని రైతులకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సంఘీభావం తెలిపారు.  ఇందుకోసం ఆయన తుళ్లూరు రైతుల శిబిరం వద్దకు వచ్చి ప్రసంగించారు.  రైతులు భూములు ఇచ్చింది వారి స్వప్రయోజనాల కోసం కాదనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమనీ ఆయన అన్నారు. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుంది అని వ్యాఖ్యలు చేసారు. మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి భాధ ఆవేదన కలిగిందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రాజధానిని ఇక్కడే నిర్మించాలి అని డిమాండ్ చేసారు. ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా రాజధానిపై ఒక విధానంతో ముందుకు వెళ్ళాలి అని ఆయన కోరారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదనీ, అమరావతి అనేది రాష్ట్ర సమస్య అనీ అన్నారు. రైతుల న్యాయస్థానం నుండి దేవస్థానం రైతు మహా పాదయాత్రలో నేను వీలున్న చోట భాగస్వామిని అవుతా అన్నారు. రాజధాని రైతుల ఉద్యమం కు తనకున్న పరిజ్ఞానం మేరకు న్యాయ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు చేసింది

గత ప్రభుత్వం 10 వెల కోట్లు ఖర్చు చేసి ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. వాటిలో చాలా నిర్మాణాలు70 నుండి 90 శాతం పూర్తి అయ్యాయి అన్నారు ఆయన. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల త్యాగం మరిచింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులు వారి స్వార్ధం కోసం భూములు ఇవ్వలేదు అని రైతులపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల తరువాత కూడా రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే రైతులకు కౌలు పీరియడ్ మరో ఐదేళ్లు పెంచాలి అని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles