Friday, December 1, 2023

విశాఖ ఉక్కుపై నాయకుల తుప్పు రాజకీయాలు

•     చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ప్రైవేటీకరణ

•      తెప్పదాటవేస్తున్న బీజేపీ, జనసేన

•       విశాఖ స్టీల్ ప్లాంట్ లో కొనుగోలుకు పోస్కో, హ్యుందాయ్ ఆసక్తి

•       2018లో స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన దక్షిణ కొరియా రాయబారి

•       2019, 2020 లలో ప్లాంట్ ను పరిశీలించిన పోస్కో, హ్యుందాయ్ అధికారులు

•       రాజీనామాలు, ఆందోళనలంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం            

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో   లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణపై పలు రహస్యాలను బహిర్గత పరిచారు.

గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు :

పోస్కో స్టీల్, హ్యుందాయ్ స్టీల్ ప్రతినిధులు 30 వేల కోట్లతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ కు చెందిన భూముల్లో గ్రీన్ ఫీల్ట్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి 2019 ఆక్టోబరులో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం, పోస్కో కంపెనీల మధ్య న్యాయపరంగా కట్టుబాట్లులేని అవగాహనా ఒప్పందంపై  సంతకాలు జరిగినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వాటాల కొనుగోలుకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇప్పటికే జాయింట్ వర్కింగ్ కమిటీ కూడా ఏర్పాటయిందని తెలిపారు. అవగాహనా ఒప్పందం ప్రకారం 50 శాతం వాటా కొనుగోలుకు పోస్కో స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. దీనికి కావాల్సిన భూమిని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం సమకూర్చనుంది.

    

Also Read: మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

దక్షిణకొరియా రాయబారి 2018లో విశాఖ సందర్శన

పోస్కో స్టీల్, హ్యుందాయ్ స్టీల్ ఉన్నతాధికారుల సంయుక్త బృందం భారత్ లోని దక్షిణ కొరియా రాయబారితో కలిసి అక్టోబరు 22 2018 న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను సందర్శించారు. అనంతరం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం, ఎన్ఎండీసీ, ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తర్వాత కూడా పోస్కో స్టీల్ ఏర్పాటుకు సంబంధించిన అధికారుల బృందం జులై 9 2019న, సెప్టెంబరు 23, 2019న ,  ఫిబ్రవరి 20, 2020 తేదీలలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం ను సందర్శించారని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

రాజ్యసభలో కేంద్ర ఉక్కు మంత్రిని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలు :

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ భూముల్లో 30 వేల కోట్లతో పోస్కో స్టీల్ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నదా?

ఒక వేళ పోస్కో స్టీల్ ఆసక్తి చూపి ప్రతిపాదనలను పంపితే  వాటి వివరాలు తెలియజేయండి.

పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తే అందులో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం వాటా ఎంత ?

పోస్కో ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం, దక్షిణ కొరియా రాయబారి రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను సందర్శించారనేది వాస్తవమా కాదా? అలా అయితే దాని వివరాలు తెలపాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు.

బాధ్యత మరిచి రాజకీయాలు :

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్న సమయంలో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ముసుగులో జరుగుతున్న తతంగంపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నవిజయసాయిరెడ్డికి 2018లో దక్షిణ కొరియా రాయబారితో కలిసివచ్చిన పోస్కో స్టీల్, హ్యుందాయ్ స్టీల్ సంయుక్త ఉన్నతాధికారుల బృందం విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను సందర్శిస్తే తెలియకుండా ఎలాఉంటుంది. పైగా ఆయనను ఉత్తరాంధ్ర బాధ్యుడిగా పార్టీ నియమించింది. దాదాపు ప్రతివారం విశాఖ సందర్శిస్తూ ఉంటారు. ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నాంకదా మాకు తెలియదు అంటే  జులై 2019, ఫిబ్రవరి 2020లో పోస్కో, హ్యుందాయ్ అధికారుల బృందం మళ్లీ స్టీల్ ప్లాంట్ ను సందర్శించింది. అప్పటికీ వైసీపీ అధికారంలోనే ఉంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు.

Also Read: విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?

అధికార, ప్రతిపక్షాల దాటవేత ధోరణి:

పోస్కో, హ్యుందాయ్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో 50 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి చూపినట్లయితే దీనిపై ప్రజలకు ఎందుకు చెప్పలేదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమయింది. మరి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై రెండు పార్టీలు ఎందుకు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయి.

లేఖాస్త్రాలతో సమస్య పరిష్కారమవుతుందా?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్  మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసి మమ అనిపించారు. బీజేపీకి మిత్ర పక్షంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమిత్ షాకి వినతి పత్రం ఇచ్చి సరిపెట్టారు. టీడీపీ, వైసీపీలతో పాటు బీజేపీ, జనసేనలు కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి ముందే తెలిసినా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? అంత పెద్ద అంశాన్ని ప్రజాక్షేత్రంలో చర్చించాల్సిన పనిలేదా?  దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా ఎందుకు వ్యవహరించలేదు? సాధారణ ప్రజలతో పాటు వాటాదారులు, ఏపీ ప్రభుత్వం, రాజకీయ పార్టీల మధ్య ఎందుకు చర్చ జరగలేదు?

Also Read: విశాఖ ఉక్కు అమ్మకం మరణ శాసనమే

Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles