Thursday, April 25, 2024

వివేకానందుని మాట‌లు వ‌న్నె త‌ర‌గ‌ని స్ఫూర్తి మంత్రాలు

యువ‌త‌కు స్ఫూర్తి , మార్గ నిర్దేశ‌కుడు స్వామి వివేకానంద‌.   ఆయ‌న మాటలు తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు. ఆయ‌న అడుగులు యువతకు నిత్య చైత‌న్యాన్ని నింపే అస్త్రాలు. ఆయ‌న  ఇచ్చిన ప్ర‌తీ సందేశం   ప్ర‌తికూల ఆలోచనల్ని దూరం చేసి ధైర్యాన్ని నింపుతుంది.

 ‘సత్యమే నా దైవం.. విశ్వమే నా దేశం’ అని ప్రకటించుకున్న  వివేకానంద  తాను భారతదేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతానని స్పష్టం చేశారు. తాను చెప్పినట్టుగానే  తన జ్ఞానసంపదను, ఆధ్యాత్మిక చింతనను విశ్వవ్యాప్తం చేశారు.

Also read: అద్భుత చిత్రాల సృష్టిక‌ర్త‌… విక్టరీ మ‌ధుసూద‌న‌రావు

భారతదేశ ఖ్యాతిని,  సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పి,  భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ తత్త్వచింతనను,  ప్రపంచానికి చాటి చెప్పిన  ధీశాలి .   స్వామి వివేకానంద అంటే భూమిపై అవతరించిన ఓ జ్ఞానకాంతి.  ఆ గొంతు నీకేం కావాలో చెబుతుంది. అసలు నీకు నీవెవరో తెలియపరుస్తుంది. నిరాశ, నిస్పృహలతో ఓటమి అంచుల దాకా వెళ్లిన నీలో వెయ్యి ఏనుగుల బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. 

 1863వ సంవ‌త్స‌రం జనవరి 12 తేదీన  కలకత్తాలో విశ్వనాథ దత్తు, భువనేశ్వరి దంపతులకు  న‌రేంద్ర ద‌త్తు (వివేకానంద‌) జ‌న్మించారు. అతని సోదరుడైన భూపేంద్రనాథ్ దత్తు  విదేశీ పాలకుల పాలనను ద్వేషించాడు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారత దేశాన్ని విముక్తి చేయాలని వారికి వ్యతిరేకంగా పోరాడే విప్లవ పోరాట యోధులతో చేతులు కలిపాడు. అలాంటి కుటుంబంలో జ‌న్మించిన వివేకానంద‌కు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. చిన్న తనంలో తల్లి ద్వారా రామాయ‌ణ‌, మ‌హాభార‌త క‌థ‌ల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు.  చిన్న త‌నం నుంచి దేవుడున్నాడా? ఒక వేళ ఉంటే ఎక్కడున్నాడ‌ని దేముడి ఉనికినే సందే హించాడాయ‌న‌.

Also read: పాత్రలకు ప్రాణం పోసిన మ‌హాన‌టి సావిత్రి

రామకృష్ణ పరమహంస శిష్యరికం

నరేంద్రుడికి బాల్యం నుంచి ధైర్యసాహసాలు ఎక్కువ.   కాలేజీలో చదువుతుండగా తండ్రి మరణించడం, మరోవైపు ఆధ్యాత్మిక చింతన అధికం కావడంతో స్వామి రామకృష్ణ పరమహంస శిష్య బృందంలో చేరారు.  అనతికాలంలోనే రామకృష్ణుడి ప్రియు శిష్యుడయ్యారు.   1886లో గురువు పరమహంస నిర్యాణం చెంద‌డంతో  ఆయ‌న గురువు ప్రభావంతో ప్రసంగాలిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

ఒక సారి త‌న పర్యటనలో ఖేత్రీ మహరాజును కలిసారు. అయ‌నే న‌రేంద్ర ద‌త్తు ను త‌న పేరు మార్చుకోవాల‌ని సూచించారు. రాజు కోరిక మేర‌కు  ఆనాటి నుంచి నరేంద్రుడు  వివేకానందుడయ్యాడు.

బలహీనతే మ‌హా పాపం.  పోరాటంలోనైనా, మృత్యువులోనైనా ఎవ‌రికి వారు వారి శక్తిని న‌మ్ముకోవాల‌ని  బోధించిన మ‌హ‌నీయుడాయ‌న‌. ధైర్యంలోనే బతుకు ఉందని.. భయంలోనే చావు ఉందని,‘సంపదలో దారిద్య్ర భయం , జ్ఞానంలో అజ్ఞాన భయం , సౌందర్యంలో వృద్ధాప్య భయం, శరీర విషయంలో సైతం మృత్యు భయం ఉంద‌ని నిన‌దించారు.   లోకంలో సమస్తమూ భయంతో కూడుకొని ఉంద‌ని,  వైరాగ్యం ఒక్కటే భయం లేనిద‌ని చాటారు.

Also read: నియమ, నిష్ఠల అపూర్వ సంకల్పం అయ్యప్ప దీక్ష

చికాగో మహాసభలలో చారిత్రక ఉపన్యాసం

1893లో చికాగో నగరంలో  విశ్వమత మహాసభల‌లో ఆయ‌న  హిందూ ధర్మ ప్రతినిధిగా పాల్గొన్నారు.  అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడేముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకుని ‘మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా’ (ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా) అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆ పదాలు వినగానే స‌భంతా క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో నిండిపోయింది. ఈ క్ర‌మంలో  భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, హైందవ సనాతన ధర్మ ప్రాధాన్యాన్ని వివ‌రించారు.   భారత దేశం అద్భుతాలకు నిలయమని,  సందర్శిస్తే  ఎన్నో విషయాలు తెలుస్తాయని విదేశీ ప్రతినిధులను ఈ సంద‌ర్భంగా ఆహ్వానించారు.

అలాగే,  దేశంలో ప్రబలిన బలహీనతలను, మూఢా చారాలను, విదేశీ వ్యామోహాన్ని, కుల దురభిమానానలను వీడనాడాలని ప్రబోధించారు. స్త్రీలను, పేదలను ఆదుకో వలసి ఉందని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని రూపు మాపేందకు  పరిశ్రమించాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల వనిత మార్గరెట్ నోబెల్ ను స్వచ్ఛమైన భారతీయ యువతిగా మలచి, ఆమె పేరును  సోదరి నివేదితగా మార్పు చేశారు.  ఆమె వివేకానందుడి అడుగు జాడల్లో నడుస్తూ  స్త్రీలను అక్ష‌రాస్యులుగా చేయడానికి ఎంతో శ్ర‌మించింది.  అనాధ బాల బాలికల కోసం అనేక అనాధాశ్రమాలను నెలకొల్పింది.

01 మే 1897 శ్రీ రామకృష్ణ సేవా సమాజాన్ని(రామ‌కృష్ణ మిష‌న్‌) నెలకొల్పారు. ఈ సంద‌ర్భంగా బేళూరులో తొలి మఠాన్ని ప్రారంభించారు.   భారతదేశంలోనూ, ఇత‌ర పాశ్చాత్య దేశాలలోనూ రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారాయ‌న‌.

Also read: తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిద‌ర్శ‌నం బాపు బొమ్మ‌

యువతే పట్టుగొమ్మ

దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం.  చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగానికి ముందే  ఆయ‌న  సికింద్రాబాద్‌ మెహబూబియా కళాశాల వేదికగా 1893, ఫిబ్రవరి 13న ప్రసంగించారు. అదే  ఆయన తొలి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.

మోతాదుకు మించింది ఏదైనా విషంతో సమానమని ఆయ‌న‌ బోధించారు. అతి ఎప్పుడైనా ప్రమాదమేనని హెచ్చరించారు.  ఇలా దేశ‌ వ్యాప్తంగా ఎన్నో స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌సంగాలు చేశారు. ఈ     క్ర‌మంలో అతని వాణి నలు దిక్కులా మారు మ్రోగింది. నిరంతరం పరిశ్రమిచడం వలన ఆయ‌న  ఆరోగ్యం క్షీణించింది. అదే ఆయ‌న మ‌ర‌ణానికి దారి తీసింది.  39 సంవత్సరాల పిన్న వయసులోనే 1902 లో  ఆయ‌న ఈ భౌతిక దేహాన్ని విడిచి పరమపధం చేరుకున్నారు.

‘ఆశించడమే పరమ దుఃఖం, ఆశించకపోవడమే పరమ సుఖం’ అనీ, కోరికలను పూర్తిగా త్యజించి మనిషి నిశ్చింతగా ఉండాలనీ ఆయన సూచించారు. మిత్రులు, శత్రువులు అనేవారు లేకుండా ఏకాకిగా జీవించాలని  అప్పుడే శత్రుమిత్రులు, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు లేకుండా, జీవాలను హింసించక, ఎలాంటి హింసకూ కారకులు కాకుండా జీవించగలుగుతామని ఆఖ‌రి శ్వాస‌వ‌ర‌కు  నిన‌దించారు.

మహోన్నత వ్యక్తి

ఆయ‌న మ‌ర‌ణించినా ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తి ఇప్ప‌టికీ నిత్య చైత‌న్యంగా వెలుగొందుతూనే ఉంది. ఆయ‌న స్థాపించిన రామ కృష్ణ సేవా సంస్థ‌లు  మానవసేయే మాధవసేవగా ఆనాటి నుంచి నేటి వరకు   పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.  స్వామి వివేకానంద ఈ ప‌విత్ర భార‌త దేశంలో జ‌న్మించిన మ‌హోన్న‌త వ్య‌క్తి.  హైందవ సంస్కృతి పరంపరలను,ధర్మాన్ని కాపాడడంలోనూ ఆయ‌నదో  విశిష్టమైన శైలి. ఇప్పటికీ అది మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. మ‌న భ‌విష్య‌త్ దిశా నిర్దేశాన్ని తెలియ చేస్తుంది.   ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గాను ఏటా ఆయ‌న  జ‌యంతిని జాతీయ యువ‌జ‌న దినోత్స‌వంగా మ‌నం జ‌రుపుకుంటున్నాం.   అత్యాశ, దురాశల‌తో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న నేటి తరం వివేకానందుడి మాటలతో స్ఫూర్తి పొందాల్సి ఉంది. ఆ మ‌హోన్న‌తుడి ఆశ‌యాల‌ను ప్ర‌చారం చేయ‌డ‌మే మ‌న‌ముందున్న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం.

Also read: అబ్బుర‌ప‌రిచే క‌ళాకృతుల‌కు నిల‌యం సాలార్ జంగ్ మ్యూజియం

(జ‌న‌వ‌రి 12 స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేకం)

దాస‌రి దుర్గా ప్ర‌సాద్‌

మొబైల్: 7794096169

Durga Prasad Dasari
Durga Prasad Dasari
దుర్గాప్రసాద్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్ సీ (స్టాటిస్టిక్స్) చేశారు. జర్నలిజం ప్రస్థానం ‘ఉదయం’ తో ప్రారంభించారు. వార్త, ఆంధ్రభూమి, ఈటీవీ, సివీఆర్ న్యూస్, టీవీ5లలో పని చేశారు. ఈటీవీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘తీర్థయాత్ర’ సీరియల్ కు మంచి వీక్షకాదరణ లభించింది. పది నవలలు రాశారు. పదుల సంఖ్యలో కథలు రాశారు. సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాయడమే కాకుండా సినిమాలలో నటిస్తున్నారు కూడా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles