Friday, June 21, 2024

విశ్వనాథ చిరంజీవి

ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా విశ్వనాథ తీరు వేరు. విశ్వనాథ ఖ్యాతి వేరు. ఎందరు పూర్వాంధ్ర మహాకవులు చరిత్రలో ఉన్నా, ఒకడు నాచన సోమన అని ఆయనే అన్నట్లుగా, ఆధునిక యుగంలో “ఒకడు విశ్వనాథ”. కవిసార్వభౌముడు అనగానే శ్రీనాథుడు, కవిసమ్రాట్ అనగానే విశ్వనాథుడు తెలుగువారికి గుర్తుకు వచ్చి తీరుతారు. తెలుగునేలపై అంతటి అనుపమానమైన ప్రభావం చూపించిన అసమాన ప్రతిభామూర్తి విశ్వనాథ సత్యనారాయణ. కావ్యాలు, నాటకాలు, శతకాలు, నవలలు, కథలు, పీఠికలు, వ్యాసాలు, గీతాలు, చరిత్రలు, విమర్శలు ఇలా… పుంఖానుపుంఖాలుగా రాసిన ఆధునికయుగ కవి ఒక్క విశ్వనాథ తప్ప ఇంకొకరు లేరు. ఎన్ని రచనలు చేపట్టారో, అంతకు మించిన ప్రసంగాలు చేశారు. ఇంతటి  సాహిత్య వ్యవసాయం ఇంకొకరికి అసాధ్యమనే చెప్పాలి. ఇంతటి కీర్తి ఇంకొకరికి అలభ్యమనే చెప్పాలి. సెప్టెంబర్ 10వ తేదీకి విశ్వనాథ జన్మించి 125 ఏళ్ళు పూర్తయ్యాయి. 1976 అక్టోబర్ 18 వ తేదీన భౌతికంగా లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు.

4 దశాబ్దాలు దాటినా వీడలేదు

నాలుగు దశాబ్దాలు దాటినా, సాహిత్యలోకం అతన్ని వీడలేదు. వీడజాలదు. విశ్వనాథ ఎంచుకున్న మార్గం సంప్రదాయం. ఎదిగిన విధానం నిత్యనూతనం. తను ముట్టని సాహిత్య ప్రక్రియ లేదు. పట్టిందల్లా బంగారం చేశాడు. “ప్రతిభా  నవనవోన్మేషశాలిని” అన్నట్లుగా, ప్రతి ప్రక్రియలోనూ, ప్రతి దశలోనూ అతని ప్రతిభ ప్రభవించింది, విశ్వనాథ శారద వికసించింది. విశ్వనాథ సృజియించిన శారద సకలార్ధదాయిని. విశ్వనాథ వెంటాడని కవి ఆనాడు లేడు. విశ్వనాథ చాలాకాలం నన్ను వెంటాడాడని మహాకవి శ్రీ శ్రీ స్వయంగా చెప్పుకున్నాడు.అంతటి ప్రభావశీలత్వం కల్గిన రచనలు సృజియించిన  కవి విశ్వనాథ. విశ్వనాథను “కవికుల గురువు” అని అభివర్ణించాడు  శ్రీ శ్రీ. కవికులగురువు అనేది కాళిదాసుకు పర్యాయపదం.  శ్రీ శ్రీ దృష్టిలో విశ్వనాథ ఆధునిక యుగంలో అంతటి గురుస్థానీయుడు. ఎందరో శిష్యులు ఈ గురుపీఠంలో కవులై, సాహిత్యవేత్తలై, విమర్శకులై, ఉపాధ్యాయులై రాణించారు.

కల్పన, వర్ణనలో  అద్వితీయుడు

విశ్వనాథలోని సాహిత్యప్రతిభను  విశ్లేషిస్తే రెండు గుణాలు  ప్రధానమైనవిగా కనిపిస్తాయి. ఒకటి కల్పన, రెండు వర్ణన. అనిందంపూర్వమైన కల్పనలు, అద్భుతమైన  వర్ణనలు విశ్వనాథను కవిసమ్రాట్ గా నిలబెట్టాయి. ఆ ఊహలు, ఆ కల్పనలు, ఆ రచనా సంవిధానములు విశ్వనాథను విశిష్టుడ్ని చేశాయి. వేయిపడగలు వంటి నవల రాసినా, శ్రీ రామాయణకల్పవృక్షం వంటి మహాపద్యకావ్యం రాసినా ఆ కల్పనా ప్రతిభ, ఆ ధిషణా ప్రవీణత అడుగడుగునా, అక్షరమక్షరంలో దర్శనమవుతాయి. చిక్కని కవిత్వం కిన్నెరసాని పాటల్లో ముచ్చటగా  మూటగట్టుకుంది. ఋతువుల వర్ణనలో ప్రకృతి, పల్లెదనం పాఠకుడి కన్నుల ముందు నాట్యం చేస్తాయి. ఏకవీర, తెరచిరాజు వంటి నవలలు , హాహా హూహూ, మ్రోయి తుమ్మెద వంటి రచనలు, ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం  వంటి పద్యకావ్యాలు, నేపాల, కశ్మీర రాజవంశ చరిత్రలు, పురాణవైరి గ్రంథమాల మొదలైన అనేక చారిత్రక నవలలు, నర్తనశాల, వేనరాజు వంటి నాటకాలు, విశ్వేశ్వర శతకం వంటి శతకములు, గుప్తపాశుపతము వంటి సంస్కృత నాటకాలు, అల్లసాని అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన, నన్నయగారి ప్రసన్న కథా కలితార్ధయుక్తి వంటి విమర్శనా వ్యాసాలు, పీఠికలు కుప్పలు తెప్పలుగా రాశారు. ఇవన్నీ ఒప్పులకుప్పలే.

సృజన, ధారణ ఆయన ఆస్తులు

విశ్వనాథలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఈ మూడు చాలా ఎక్కువ. కావ్యహేతువుగా చెప్పుకునే ఈ శక్తి ఆధునికకాలంలో విశ్వనాథకు ఉన్నంతగా మరొకరికి లేదనే చెప్పాలి. అసాధారణమైన జ్ఞాపకశక్తి. నిరంతర పఠనశీలం. అంతే సమానమైన సృజనశక్తి విశ్వనాథ ఆస్తులు. తాను చెప్పాలనుకున్నవి హృదయంలో, మెదడులో జవజీవాలతో నిక్షిప్తమై   ఉంటాయి. కొన్ని రచనలు స్వయంగా రాసినవి ఉన్నాయి. కొన్ని తను చెబుతూవుంటే వేరేవాళ్లు రాసినవి ఉన్నాయి. అది కథ, పద్యకావ్యం, సాంఘిక నవల, పాట, పీఠిక, వ్యాసం   ఏదైనా కావచ్చు…ఉన్నపళంగా మొదలుపెట్టి, అప్పటికప్పుడు చెప్పే శక్తి అచ్చంగా విశ్వనాథ ఐశ్వర్యం. దీన్ని మహితమైన ఆశుకవిత్వ ప్రతిభగా చెప్పవచ్చు. సంప్రదాయం, భారతీయత మధ్యనే తాను తిరుగుతున్నప్పటికీ ఇంగ్లీష్ సాహిత్యాన్ని బాగా చదివేవాడు. విజయవాడ లీలా మహల్ లో వచ్చే ప్రతి ఇంగ్లీష్ సినిమాను చూచేవాడు. ఇంగ్లిష్ సంస్కృతిని ద్వేషించాడు కానీ, ఇంగ్లీష్ భాషను ఎప్పుడూ ద్వేషించలేదు. వాడుకభాషా పదాలతో పద్యాలు చెప్పడంలో బహుశా  గురువు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి ప్రభావం వుండి వుంటుంది.

ఎదురులేని కవులుగా గురుశిష్యులు

గురు శిష్యులిద్దరూ ఎదురులేని కవులుగా తెలుగునాట సందడి చేశారు. చెళ్ళపిళ్ళ ప్రభావం, ఆకర్షణ విశ్వనాథ పద్యకవితా జీవితంపై ఉన్నా, తన మార్గం పూర్తిగా వేరు. ఈ విషయం చెళ్ళపిళ్ళ కూడా చెప్పాడు. విశ్వనాథది నా మార్గం కాదు. పూర్వ కవితా పితామహుల మార్గం కాదు. అదేదో ప్రత్యేకమైన మార్గమని చెప్పాలి, విశ్వనాథ సామాన్యుడు కాడు, అని చెళ్ళపిళ్ళ విశ్వనాథ గురించి ప్రశంసించాడు. రామాయణ కల్పవృక్షం -వేయిపడగలు రెండూ కవిసమ్రాట్ నిర్మించిన మహా సారస్వత సౌధాలు. ఎంత కృషి చేశాడో, అంతటి కీర్తి కూడా పొందిన భాగ్యశాలి విశ్వనాథ. తెలుగుసాహిత్య లోకానికి మొదటి జ్ఞానపీఠం పురస్కారం ఆయనే సంపాయించి పెట్టాడు.  పద్మభూషణ్, కళాప్రపూర్ణ వంటి అత్యున్నతమైన గౌరవాలు పొందాడు. డి లిట్ కైవసం చేసుకున్నాడు. కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవి కూడా విశ్వనాథను వరించింది.

ధిషణాహంకారం ఆయనకు అలంకారం

ధిషణాపూర్వక అహంకారంతో పాటు లౌక్య ప్రతిభ కూడా చాలా ఎక్కువని ఆయన పొందిన వైభవాలే చెబుతాయి. లోకజ్ఞత, శాస్త్రజ్ఞత, కావ్యజ్ఞత మూడూ సమపాళ్లలో ఉన్న శక్తిస్వరూపుడు. ఈ వైభవ ప్రయాణంలో ఎంత శిష్య సంపద చేరిందో, అంత శత్రుగణం కూడా పోగైంది. తిట్టినా, పెట్టినా ఆయనకే చెల్లింది. అదొక యోగం. అందరికీ అది సాధ్యపడదు. ఇంతటి  కృషి చేసిన సాహిత్యమూర్తి కూడా  ప్రపంచ సాహిత్య చరిత్రలోనే చాలా అరుదుగా ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే విశ్వనాథ అసామాన్యుడు. తెలుగువాళ్ళ “గోల్డునిబ్బు”. విశ్వనాథ కవిరాయని దివ్య స్మృతికి నీరాజనాలు పలుకుదాం.

(విశ్వనాథ వర్ధంతి సందర్బంగా)

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles