Friday, April 19, 2024

కీచకుడు లేని “విరాట పర్వం”

సినిమా కథ —  సమీక్ష

డా. సి. బి. చంద్ర మోహన్

9440108149

——————————————-

   (“ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది”

                                         — జేమ్స్ జాయిస్

    అనువాదం శ్రీ శ్రీ —  ఖడ్గసృష్టి )

Virata Parvam: Sai Pallavi, Rana Daggubati's film gets LEAKED on  Tamilrockers, Telegram and other torrent site
సాయి పల్లవి

 మూల ప్రశ్నలను లేవనెత్తిన సినిమా ‘ విరాటపర్వం ‘.

       ప్రేమ — విప్లవాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయా?

  ఉంటే అవి   స్నేహ వైరుధ్యాలా?

         ( లేక)   శత్రు వైరుధ్యాలా?

   స్నేహ వైరుధ్యాలు పరిస్థితుల ప్రభావంతో శత్రు వైరుధ్యాలు అయితే?

    పరిస్థితుల ప్రభావం — అంటే?

  అధిగమించలేని చెడ్డ పరిస్థితులా?

   అవగాహనా లోపమా ?

  ఒక విప్లవ కార్యక్రమంలో — లోపాలు, పొరపాట్లు సహజమా?

 అయితే ఎంతవరకు సహజం?

 విప్లవ ద్రోహం జరిగితే మరణశిక్షయే  ఆఖరి పరిష్కారమా?

  అది ద్రోహం కాదని తేలితే —

  మరణశిక్షను వెనక్కి తీసుకోగలమా?

  ప్రేమ విప్లవాన్ని జయిస్తుందా?

  విప్లవం ప్రేమను జయిస్తుందా?

  ఏది దేన్ని జయించినా — రెండవ భావం తప్పా?

Virata Parvam Movie Download Full Movie 619 MB
రాణా, సాయిపల్లవి

  వ్యక్తిగత ప్రేమ సమాజ ప్రేమను అక్కున చేర్చుకుంటుందా?

మానవ సంబంధాలను అమితంగా ప్రేమించే వారు మాత్రమే సమాజాన్ని ప్రేమించగలరా?

 లేక అందరికీ అది సాధ్యమా?

 అందరు విప్లవకారులూ, సమాజ శ్రేయస్సును ప్రేమించే విప్లవకారులవుతున్నారా?

 లేక ఇంకా ఏమైనా పరిస్థితులు, ప్రభావాలు ఉంటాయా?

  అందరి ప్రేమకు మూలాలు ఒకటేనా?

  విప్లవకారులు అందరిదీ ఒకే లక్ష్యమా?

  అయితే,  అభిప్రాయ బేధాలెలా వస్తున్నాయి?

  అందరి ఆలోచనా సరళి ఒకే రకంగా ఉంటుందా?

  ఇన్ని రకాల ప్రశ్నలను లేవనెత్తిన ‘ విరాటపర్వం ‘ చిత్రం వాటికి పరిష్కారాలు చూపించిందా? లేక ప్రేక్షకులనే జవాబులు వెతుక్కోమందా?

  భావోద్వేగాలు హేతువుకు లొంగుతాయా?

  ” REASON HAS ALWAYS EXISTED BUT NOT IN A REASONABLE FORM “

                               — KARL MARX

ఈ కార్ల్ మార్క్స్ కొటేషన్ తో మొదలవుతుంది సినిమా. కథకుడు, మాటల రచయిత, దర్శకుడు అయిన వేణు ఊడుగుల పై కొటేషన్ను ఆసరా తెచ్చుకున్నాడు. హేతువుపై ఆధారపడిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని, దాన్ని ఆధారం చేసుకొని వచ్చిన తిరుగుబాట్లను, ( నక్సల్ బరి రైతాంగ పోరాటం) వాటితో రూపాంతరం చెంది, ప్రస్తుత స్థాయికి వచ్చిన నక్సలిజాన్ని,  ప్రేమ కథతో మిళితం చేసి, ఒక విప్లవ ప్రేమ కథను, దాని విపరీత పరిణామాలను దృశ్య కావ్యంగా మలచడానికి పూనుకున్నాడు దర్శకుడు.

విప్లవాగ్నుల మధ్య పుట్టిన వెన్నెల (హీరోయిన్) సహజంగానే ధిక్కార స్వభావము, మొండి పట్టుదల గలదై ఉంటుంది.

 విప్లవ నాయకుడు– రవన్న (హీరో)రాసిన 

‘మేఘ గర్జన ‘ చదివి ప్రభావితం అవుతుంది.  “తూర్పు భారతంపై వసంత మేఘ గర్జన”  (SPRING THUNDERS ON NORTHEAST INDIA) అని 1968 — 70 లో విడుదల అయి, తర్వాత ఒక చారిత్రక పాత్ర వహించిన కరపత్రం పేరు అది. వెన్నెలను ప్రభావితం చేసిన ‘మేఘ గర్జన’ పుస్తకానికి మూలం ఆ కరపత్రం అనుకుంటా.

రవన్నను ప్రేమించడానికి కారణం ఏమిటి అని అడిగితే — ” ఆకలి, దాహానికి కారణాలు ఉంటాయా! ప్రేమ కూడా అంతే బావా” అంటుంది వెన్నెల.

  — ప్రేమ కూడా వాటిలాగే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అని అర్థం వచ్చేటట్లుగా!

ఈ సమాజంలో  ‘ ప్రేమ అనేది ఒక బూటకం. నిన్ను నీవు ప్రేమించుకోవడం ఒకటే నిజం.’ అన్న రవన్నతో

 ‘‘కార్ల్ మార్క్స్ ప్రేమ నిజమా కాదా? లెనిన్ ప్రేమ నిజం కాదా? మావో  ప్రేమించడం నిజం కాదా?’’ అన్న వెన్నెల మాటకు రవన్న దగ్గర  కానీ, భారతక్క దగ్గర కానీ జవాబుండదు. దళంలో చేర్చుకుంటారు హీరోయిన్ ని!

అక్కడి నుండి  ‘రవన్న’  శిక్షణలో విప్లవాన్ని అవా హన చేసుకుంటుంది  ‘వెన్నెల’.

అనుకోని పరిస్థితుల్లో అపవాదుకు గురై  (పోలీసుల కుట్రతో) తాను ప్రేమించిన విప్లవకారుడు రవన్న చేతిలోనే చావుకు గురవుతుంది. ‘వెన్నెల’  జీవితం కొడి గట్టిన వెంటనే అసలు నిజం బయటపడుతుంది.

Virata parvam Movie Leaked Online on Movierulz and Tamilrockers
రాణా, పల్లవి

      — ఇదీ కథ!

శృంగారముతో కూడినదే  ‘ ప్రేమ ‘ కాదనీ –

అలౌకిక ప్రేమ అనేది ఉంటుందనీ (platonic love)

 “మనిషిని మనిషి ప్రేమిస్తే — ఆ ఇంకో మనిషి ప్రేమించేదాన్ని — అంతే ఇష్టంతో మనమూ ప్రేమించవచ్చు.”  అనీ –

‘ఒక మహత్తర కార్యసాధనలో — ప్రేమ అనేది ఏమాత్రం అడ్డు కాదు అనీ — ఒక్కోసారి విప్లవ సాధనలో కూడా లోపాలు, పొరపాట్లతో  కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు  అనీ —

ఏమి జరిగినా విప్లవమూ,  ప్రేమా వైరుధ్యాలు కావని —

చెప్పదల్చుకున్న రచయిత ఎంతవరకు కృత కృత్యుడయ్యాడో  తెలియాలంటే  ‘ విరాటపర్వం ‘ సినిమా చూడాల్సిందే.

కీచకుడు లేని ఈ విరాట పర్వంలో కౌరవులు ఎవరు? అనే ప్రశ్నకు  జవాబు సూటిగా ఉండదు. భారతంలో విరాటపర్వం ‘ అజ్ఞాతవాసం + కీచక వధ’  కదా! ఈ టైటిల్ సరిపోయిందా?

ఇక , కథా కథనంలోకి,  చిత్రానువాదంలోకి వెళితే–

సాయి పల్లవి (వెన్నెల), రానా (రవన్న), ప్రియమణి (భారతక్క), సాయిచంద్ (వెన్నెల తండ్రి), ఈశ్వరి బాయ్ (వెన్నెల తల్లి) జరీనా వాహబ్ (హీరో తల్లి), నందితా దాస్ (ప్రొఫెసర్), బెనర్జీ (పోలీసు) , రాహుల్ రామకృష్ణ (వెన్నెల బావ)– వారి వారి పాత్రలలో చక్కగా ఇమిడిపోయారు. సాయి పల్లవి వెన్నెలను ఆవాహన చేసుకుంది.

నేపథ్య సంగీతం (సురేష్ బొబ్బిలి) ఒక చక్కటి కావ్యం చదువుతున్న ఫీలింగ్ కలిగించారు. సెలయేటి పాటలా హృద్యంగా ఉంది. గుండె చప్పుళ్లు ఉన్నాయి గాని ధ్వని కాలుష్యంతో గుండెలు అదరగొట్టలేదు. సినిమాటోగ్రఫీ( డాని సంచెజ్ – లోపెజ్, దివాకర్ మణి) చక్కగా ఉంది. ఎడిటింగ్ బాగుంది.

ఈ చిత్రంలో కనపడని హీరో దర్శకుడు — వేణు ఉడుగుల. కథను కలవరించి ,పలవరించి మమేకమై తీశాడు. సెన్సార్ లోపమో ఏదో తెలియదు కానీ అనుభూతులు, భావోద్వేగాలు బాగా పండాల్సిన కొన్ని సన్నివేశాలను కుదించినట్లయింది. మొత్తానికి ఆలోచింప చేసే చిత్రం.

కథ, సాంకేతిక విలువలు అవగతం అవడానికి ఈ చిత్రం రెండు సార్లు చూడొచ్చు.

కథకుడిగా, మాటల రచయితగా, దర్శకుడిగా —  వేణు ఉడుగుల చేసిన కృషి అభినందనీయం!

(ఇది నిజంగా జరిగిన కథ —  అని చెప్పారు. వాటి నిజా నిజాలపై ఎన్నో  వీడియోలు వెలుగుచూస్తున్నాయి. వాటి మూలాల్లోకి నేను పోవటం లేదు. ఇది సినిమా కథగానే తీసుకొని పరిశీలించాను.)

 “YOUR SOUL IS OFTEN TIMES A BATTLE FIELD UPON WHICH YOUR REASON AND YOUR JUDGEMENT WAGE WAR AGAINST YOUR PASSION AND YOUR APPETITE.”

                                        —- KAHLIL GIBRAN

పై చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు.

Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన

                      

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles