Friday, April 19, 2024

కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!

  • కూల్ కెప్టెన్లు రహానే, ధోనీ

టీమ్ గేమ్ క్రికెట్లో నాయకత్వం ఓ కళ. ఆటగాళ్లలో స్పూర్తినింపడం, అత్యుత్తమంగా రాణించేలా చేయడం, తుదివరకూ పోరాడేలా చేయడం, జట్టును ముందుండి విజయపథంలో నడిపించడం కెప్టెన్ గా ఉన్న ఆటగాడి విధి. అయితే…కెప్టెన్లు అందరూ ఒకేతీరుగా ఉండరు. మనుషులు వేర్వేరుగా ఉన్నట్లే, కెప్టెన్లు సైతం భిన్నంగానే ఉంటారు. భారత బౌలింగ్ చీఫ్ కోచ్ భరత్ అరుణ్ మాటల్లో చెప్పాలంటే…మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్యా రహానే కూల్ కూల్ కెప్టెన్లుగా కనిపిస్తే విరాట్ కొహ్లీ మాత్రం దూకుడుగా ఉండే హాట్ హాట్ కెప్టెన్.

 కొహ్లీ అలా….రహానే ఇలా…!

భారత క్రికెట్ కు గత దశాబ్దకాలంగా టెస్టులు, వన్డేలు, టీ-20 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించిన ధోనీ, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మలు తమదైన శైలిలో జట్టును ముందుండి నడిపించారు. భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కూల్ కెప్టెన్ గా పేరుంది. భావావేశాలను బయటకు వ్యక్తం చేయకుండా గంభీరంగా ఉండటం, ఎలాంటి ఒత్తిడి ఎదురైనా దానిని సహ ఆటగాళ్ల మీద పడకుండా పనికానిచ్చేయడం ధోనీకి మాత్రమే చెల్లు. వికెట్ కీపర్ గా బాధ్యత నిర్వర్తిస్తూనే ఫీల్డ్ లో ఏం జరుగుతుందో ఓ కంట కనిపెట్టడం, కనుసైగలతోనే ఆటగాళ్లను శాసించడం ధోనీ నాయకత్వానికే ప్రత్యేకతగా అనిపిస్తుంది. ధోనీ కెప్టెన్ గా భారత్ టీ-20 ప్రపంచకప్,వన్డే ప్రపంచకప్, మినీ ప్రపంచకప్, టెస్ట్ క్రికెట్ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ఓ అరుదైన రికార్డుగా నిలిచిపోతుంది. అందుకే మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కూల్ కెప్టెన్ గా పేరుంది.

ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్

దూకుడే కొహ్లీకి అలంకారం…

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి భారతజట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ నాయకత్వాన్ని చూడగానే హడావిడి, దూకుడు మాత్రమే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఫీల్డ్ లోకి దిగాడంటే చాలు  ఎక్కడలేని ఎనర్జీ కొహ్లీలోకనిపిస్తుంది. వికెట్ పడితే కేరింతలు కొట్టడం, సహఆటగాళ్లతో కలసి సంబరాలు జరుపుకోడం, ప్రతికూల పరిస్థితి ఎదురైతే ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేయడం కనిపిస్తాయి. కొహ్లీలోని ఈ లక్షణాలు, ప్రవర్తన చూసి  కోపంతో అలాచేస్తున్నాడేమోనని బయటవారు తరచూ అపార్థం చేసుకొంటూ ఉంటారని అయితే కొహ్లీ స్టయిలే అంతని భరత్ అరుణ్ చెబుతున్నారు.

ధోనీ వారసుడు రహానే…

భారతజట్టుకు టెస్ట్ సిరీస్ ల్లో నాయకుడిగా కొహ్లీ అందుబాటులో లేని సమయంలో జట్టు పగ్గాలు చేపట్టే స్టాప్ గ్యాప్ కెప్టెన్ అజింక్యా రహానేకు నూటికి నూరుశాతం విజయాల రికార్డు ఉంది. కేవలం ఐదు టెస్టుల్లో మాత్రమే నాయకత్వం వహించినా తన నాయకత్వ ప్రతిభతో అందరి దృష్టీ ఆకట్టుకొన్నాడు. ఇటీవలే ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్రేలియా గడ్డపై 2-1తో ఓడించి సిరీస్ నెగ్గడంతో పాటు గత మూడుదశాబ్దాల కాలంలో బ్రిస్బేన్ గబ్బాలో కంగారూలను కంగుతినిపించిన తొలిజట్టుగా భారత్ చరిత్ర సృష్టించడంలో రహానే కెప్టెన్సీ ప్రతిభ అంతాఇంతా కాదు. ఫీల్డ్ లో గడ్డు పరిస్థితి ఎదురైతే ప్రశాంతంగా ఉండటం, సహ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి అత్యుత్తమంగా రాణించేలా చేయటం, కీలకసమయాలలో తెలివైన నిర్ణయాలు తీసుకోడం, బ్యాటుతోనూ రాణించడం ద్వారా జట్టును ముందుండి నడిపించడంలో రహానేకు రహానే సాటి. సహఆటగాళ్లపై ఏ మాత్రం ఒత్తిడి పడకుండా చేయటంలో రహానే ప్రత్యేకశ్రద్ధ చూపుతాడని భరత్ అరుణ్ కితాబిచ్చారంటే రహానే కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకేనేమో టెస్ట్ కెప్టెన్ గా కొహ్లీకి బదులుగా రహానేను కొనసాగించాలని క్రికెట్ దిగ్గజం బేడీ లాంటి వారు సలహా ఇస్తున్నారు.

ఇది చదవండి: ఇంగ్లండ్ తో సిరీస్ కు కొహ్లీ, పాండ్యా, ఇశాంత్

మిక్సిడ్ మసాలా రోహిత్ శర్మ..

భారత వన్డే, టీ-20 జట్లకు వైస్ కెప్టెన్ గా, కొహ్లీ అందుబాటులో లేని సమయంలో స్టాండిన్ కెప్టెన్ గా వ్యవహరించే రోహిత్ శర్మ లో చక్కటి, తెలివైన కెప్టెన్ దాగిఉన్నాడు. ఐపీఎల్ లో ముంబైని విజేతగా, అత్యంత విజయవంతమైనజట్టుగా నిలపడంలో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు అమోఘం. అంతేకాదు భారత్ ను ఆసియాకప్ చాంపియన్ గా నిలపడంలోనూ రోహిత్ నాయకత్వమే ప్రధాన కారణం. ధోనీ, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానేల కూల్ కూల్, హాట్ హాట్ లక్షణాల కలగలుపే రోహిత్ శర్మ. ఫీల్డ్ లో ప్రశాంతంగా ఉండటం, పరిస్థితి ప్రతికూలంగా ఉంటే దూకుడుతత్వాన్ని ప్రదర్శించడం రోహిత్ శర్మ నాయకత్వంలో మనకు కనిపిస్తుంది. భారత క్రికెట్ చరిత్రను ఓసారి తిరిగేస్తే తొలి కెప్టెన్ కర్నల్ కఠారీ కనకయ్యనాయుడు, లాల్ అమర్ నాథ్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, అజిత వడేకర్, బిషిన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రి లాంటి ఎందరో నాయకులు మనకు కనిపిస్తారు. అయితే ప్రస్తుత మన భారత క్రికెట్ మాత్రం రహానే, కొహ్లీ, రోహిత్ లాంటి సమర్థులైన కెప్టెన్ల చేతిలో సురక్షితంగా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇది చదవండి: పూజారాకు అశ్విన్ సగం మీసం ఛాలెంజ్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles