Tuesday, November 29, 2022

అచ్చ తెలుగు ఆణి ముత్యం మన వేటూరి

“అలివేణి ఆణిముత్యమా”, ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా”, “అంతర్యామి” అన్నమయ్య పాటలు ఇలా శృంగార,  వీర, కరుణ, హాస్య, శాంత రసాలన్నీ ఆయన కలం నుండి పాటల రూపంలో జాలువారాయి…ఆయనే వేటూరి సుందర రామమూర్తి. తెలుగు సాహిత్యానికి తరగని ఆస్తి. తెలుగు సినిమాకు నవరసదీప్తి.

వేటూరి 29 జనవరి 1936 న ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెదకల్లేపల్లిలో జన్మించారు. 22 మే 2010న హైదరాబాద్ లో మరణించారు.  ఒక తెలుగు కవి అనే కన్నా భారతీయ కవి అనడానికి యోగ్యంగా అనేక ఉత్తమ గీతాలు రాశారు.  తెలుగు గేయ రచయితగా ఆయన ఖ్యాతి ఆసేతుహిమాచల పర్యంతం విస్తరించింది. తెలుగు పాటల బాణికి ఆయన సరికొత్త మెరుగులు దిద్దారు.  తెలుగు సినిమాలో వేటూరి గారి సాహిత్య వ్యాసంగం నాలుగు దశాబ్దాలకు పైగా సాగింది. తెలుగు పాటల్లోని లోతైన,  అర్ధవంతమైన సాహిత్యానికి ఆయన ఎంతో కృషి చేశారు. చాలా మంది గీత రచయితలు వేటూరిని ప్రేరణగా తీసుకున్నారు!

వేటూరి చంద్రశేఖర్ శాస్త్రి, కమలాంబ దంపతులకు కృష్ణాజిల్లాలోని చల్లపల్లికి సమీపంలో ఉన్న పెదకళ్ళేపల్లిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తెలుగు పరిశోధనా పండితుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి సుందర రామ మూర్తి గారు సమీప బంధువు. వేటూరి తాత వేటూరి సుందర శాస్త్రి గారు కూడా ఒక కవి. విజయవాడలో విశ్వనాథ సత్యనారాయణ గారి వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేశారు. వేటూరి విద్యాభ్యాసం చాలా వరకు విజయవాడలో జరిగింది. వెంటనే ఆయన తనకు ఇష్టమైన పత్రికా రంగాన్ని ఎంచుకున్నారు.  1952 లో ఆంధ్రప్రభలో సబ్-ఎడిటర్ గా ఉద్యోగంలో చేరారు. పత్రికా రంగంలో తనకు  మొదటి గురువు శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారే అని చెప్పుకొనే వారు. ఆయన నుంచి వార్త ఎలా రాయాలో నేర్చుకున్నారట.  తరువాత 1959 లో ఆంధ్రపత్రికలో చేరారు, అక్కడ ఆయనకు బాపు, ముళ్ళపూడి వెంకట రమణ గారితో పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పింది అనేవారు. ఆంధ్రపత్రికలో సినిమా విభాగానికి ఇన్‌ఛార్జిగా కూడా వేటూరి  పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిక దినపత్రిక ఆంధ్రజనతకు ఆయన సంపాదకుడిగా కూడా వ్యవహరించారు. “సినిమా వాళ్ళతో లౌక్యంగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను.’ అని “రాజకీయ నాయకుల పరిచయం వల్ల బ్రతుకుకు కావాల్సిన విజ్ఞానాన్ని నేర్చుకున్నాను,” అని చెప్పుకునే వారు౹

1962లో శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన మొదటి, ఏకైక తెలుగు పాత్రికేయుడు వేటూరి. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి జాతీయ నాయకుల ప్రసంగాలను ఆయన తర్జుమా చేశారు. 1964 లో అసెంబ్లీ రిపోర్టర్‌గా పనిచేశారు. వేటూరి వ్యాసాలు చాలా ఆకర్షణీయంగా, చమత్కారంగా ఉండేవి.  ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సమీపంలో ఉన్న హోటల్ ద్వారకాలో ఎమ్మెల్యేల సమావేశాన్ని “అదిగో ద్వారకా- ఇవిగో అలమందలు” (“ఇది ద్వారకా, ఇక్కడ పశువులు”) అని ప్రస్తావించారు.

వేటూరి కంటే ముందు ఉన్న గేయ రచయిత ఆత్రేయ గొప్ప సినీ కవి అయితే ఆయన నిర్మాతలకు పాటలు రాయకుండా ఏడ్పించే వారట. ఒకొక్క పాటకు రెండు నెలలు తీసుకోవడం తో అప్పటి నిర్మాతలు కొత్త గేయ రచయిత కోసం వెతుకుతుండగా వేటూరి గారి సాహిత్యం వాళ్లకు నచ్చింది. 1970 లో వేటూరి పాటలు ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించాయి. 1977 లో సీనియర్ ఎన్.టి.ఆర్ యొక్క “అడవి రాముడు” సినిమాలో స్ఫూర్తిదాయకమైన, శృంగారభరితమైన సాహిత్యాన్ని రాసిన వేటూరి ప్రతిభతో నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. ఈ సినిమా పాటల హిట్ తో ఆయనకు కనకవర్షం కురిసింది.  1978 లో కె. విశ్వనాథ్ గారు “సిరిసిరిమువ్వ” సినిమా కవిత్వంతో విభిన్న భావోద్వేగాలను పలికించడంలో తన పాటల విశ్వరూపాన్ని చూపించారు. ఆ రోజుల్లో ప్రముఖ గీత రచయిత లు చేయలేని పనిని కొన్ని నిమిషాల్లో దర్శకుడి అభిరుచికి తగినట్టుగా  పాట రాయగల సామర్థ్యం ఉన్నందున వేటూరి దర్శకులకు, నిర్మాతలకు ప్రీతిపాత్రులు అయ్యారు. వేటూరి తన కెరీర్లో 5,000 పాటలకు పైగా రాశారు.  ‘వేటగాడు”, “డ్రైవర్ రాముడు’ వంటి సినిమాలకు రాసిన మాస్ పాటల కు ఎంత ఆదరణ లభించిందో, ‘శంకరభరణం”, ‘సాగర సంగమం’ వంటి క్లాస్ సినిమాలకు రాసిన పాటలకు కూడా అంత కన్నా ఎక్కువ ఆదరణ లభించింది. ముఖ్యంగా, “శంకరభరణం’ సినిమాకు ఆయన రాసిన పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచాయి.

(జనవరి 29 వేటూరి సుందరరామమూర్తి జయంతి)

Ramprasad Rao Bandaru
Mr. Bandaru Rama Prasad has been a journalist since his 21st year. Starting with Andhra Bhoomi as a sub-editor he became desk in-charge at Andhra Prabha before becoming a freelancer and a script writer in electronic medium. Did his MA from Osmania University. He founded Amrita Tele Films..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles