Monday, March 20, 2023

సంపాదక శిఖరం నార్ల

ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కాలాన్ని ప్రభావితం చేసిన వారందరూ యుగకర్తలే. తెలుగు వార్తాపత్రికా ప్రగతి ప్రయాణంలో నార్లవారిది ఒక శకం. నేడు (సోమవారం) నార్ల వెంకటేశ్వరరావు వర్ధంతి. 15 ఫిబ్రవరి 1985న ఆయన మనల్ని వీడి వెళ్లిపోయారు. అప్పుడే మూడున్నర దశాబ్దాలు దాటిపోయింది. ఆయన వెళ్లిపోయినా, ఆయన రాసిన అక్షరాలు మనల్ని ఎన్నటికీ వీడవు. ఆ భావాలు మనలో చాలామందిని వెంటాడుతూనే ఉంటాయి. నార్లవారి పేరు వినపడకుండా తెలుగు జర్నలిజం లేనే లేదు. ఎప్పటి మనిషి? ఎంతటి మనీష? పత్రికా రచనలో వాడుకభాషను చొప్పించి, సామాన్య అక్షరాస్యుడికి కూడా పత్రికలను దగ్గరకు చేర్చాడు. ఆయన సంపాదకీయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఎందరినో విజ్ఞాన వీధుల్లో విహరింప చేశాయి. నార్ల గొప్ప ఎడిటర్ అని దేశం యావత్తూ బ్రాహ్మరథం పట్టింది. జాతీయస్థాయిలో ప్రఖ్యాతి చెందిన తెలుగు సంపాదకులలో తొలి వరుస ఆయనదే.

ఎవరు సంపాదకుడు?

“ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” ఈ మాటలు అన్నది నార్లవారు. పాత్రికేయ శిఖరం కోటంరాజు రామారావుకు నివాళి ఇచ్చే సందర్భంలో  నార్ల వాడిన ఈ అక్షరాలు అక్షరాలా నార్లవారికీ సరిపోతాయి. తన ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, తన అక్షరానికి గౌరవం తగ్గినప్పుడు అక్కడ నార్ల క్షణమైనా ఉండలేకపోయేవారు. ఆ విధంగానే, ఆయన ఆంధ్రప్రభను వదిలి వేయాల్సి వచ్చింది. కేవలం నార్లవారి గురించి కెఎల్ ఎన్ ప్రసాద్ వంటి పెద్దలు, అభిమానులు కలిసి “ఆంధ్రజ్యోతి”ని స్థాపించారు. ఒక ఎడిటర్ కోసమే అంత పెద్ద స్థాయిలో ఒక పత్రికను స్థాపించడం చరిత్రలో కేవలం నార్లవారి విషయంలోనే జరిగింది. ఆయన ఆ పత్రికను పెంచి పోషించిన తీరు చరిత్ర విదితం. ఆయనకు అక్షరమంటే ఎనలేని ఇష్టం.

Also Read : విశాఖ ఉక్కు ఆంధ్రులకు దక్కుతుందా?

వ్యక్తిగత గ్రంథాలయంలో వేల పుస్తకాలు

అందుకే ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో వేల పుస్తకాలు ఉండేవి. చదివేవారంటే అంతకంటే ఇష్టం. రాసేవారంటే అంతకు మించిన ఇష్టం. ఒక సందర్భంలో, వెలగా వెంకటప్పయ్య రాసిన విధానం నచ్చి, చిన్న చిన్న మార్పులతో, దాన్నే సంపాదకీయంగా ప్రచురించారు.ఏ మాత్రం రచనా ప్రతిభ ఉన్నా, ప్రోత్సహించే నార్లవారి మంచి లక్షణానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటి సుగుణాలు వారిలో  ఎన్నో ఉన్నాయి. మానవత్వం, హేతువాదం రెండు కళ్ళుగా జీవించారు. ప్రపంచానికి వాటి దారి చూపించే ప్రయత్నం అంతగానూ చేశారు. నార్లవారి సంపాదకీయాలకు వచ్చినంత పేరు మరి ఏ ఒక్కరి సంపాదకీయాలకూ రాలేదు.

వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రశంస

కేవలం ఆ సంపాదకీయాలు చదవడం కోసమే పత్రిక చదివేవారంటే, అదీ నార్లవారి ముద్ర. మహాత్మాగాంధీ మరణించినప్పుడు నార్లవారు రాసిన సంపాదకీయం జాతిమొత్తాన్ని కదిలించింది, కరిగించింది.”ఈ సంపాదకీయం రాసిన మహనీయుడికి నా సాష్టాంగ నమస్కారం” అని వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి మహాపండితుడు అన్నారంటే, నార్లవారి అక్షరశక్తి, భావనా బలం, వాక్యనిర్మాణ వైదుష్యం, రచనా శిల్పం ఎంత గొప్పగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆయన సంపాదకీయాలు పార్టీల గెలుపుఓటములను కూడా నిర్దేశించాయంటే, అదీ ఎడిటర్ గా నార్లవారి విశిష్ట స్థానం. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి రెండు పెద్ద పత్రికలను గొప్పగా నడిపిన గొప్ప ఎడిటర్. సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలకు ఎంత చోటు ఇచ్చారో, సాంస్కృతిక, చారిత్రక విషయాలకూ అంతే విలువ ఇచ్చి, అన్ని రకాల పాఠకులనూ పత్రికల వైపు ఆకర్షించారు. పుస్తక సమీక్షలను కూడా సంపాదకీయాలుగా మలిచి,కొత్త ఒరవడి సృష్టించారు.

Also Read : విజ్ఞాన విరాడ్రూపం వేటూరి ప్రభాకరశాస్త్రి

జర్నలిస్ట్, సాహిత్యవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు

నార్లవారు కేవలం జర్నలిస్ట్ కాదు. సాహిత్యవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు. ఇటు తెలుగులో – అటు ఇంగ్లిష్ లోనూ పటు నేర్పరి. ఇంగ్లిష్ లో వి ఆర్ నార్లగా ప్రసిద్ధులు. తను నమ్మిన విధానాలు, వ్యతిరేకించిన అంశాల పట్ల పత్రికల్లో క్యాంపెయిన్ నడిపేవారు. ఆయన కలంపోటుకు టంగుటూరు ప్రకాశంపంతులు, కాసు బ్రహ్మానందరెడ్డి, కళా వెంకటరావు వంటి యోధాను యోధులు కూడా బలిఅయ్యారు.ఆ కలం వివిధ భావాంబర వీధుల్లో విస్తృతంగా విహరించింది. పద్యాలు, నాటికలు, శతకాలు, పాటలు, చరిత్ర రచనలు, వివిధ విశేష వ్యక్తుల జీవిత చిత్రణలు అసంఖ్యాకంగా రాశారు.

భళారే చిత్రం

ఆయన రాసిన “చిత్రం, బహు చిత్రం, చిత్రాతి చిత్రం” అనే పాట ప్రభావం ఎన్టీఆర్ నిర్మించిన “దాన వీర శూర కర్ణ ” చిత్రంలోని “చిత్రం, భళారే చిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం ” అనే పాటపై కూడా ఉందేమో అనిపిస్తోంది. ఆయన పత్రికల్లో వాడిన మాటల స్ఫూర్తితో, చూపిన తోవతో, తర్వాత తరం పత్రికా రచనలు సాగినట్లే, ఆయన రాసిన పాటల ప్రభావం కూడా తదుపరి తరంవారు రాసిన పాటలపై ఉందంటే, అది నార్లవారికే చెల్లింది.” ఎవరూ మాటలు సృష్టించకపోతే, కొత్త పదాలు ఎలా పుట్టుకొస్తాయి”, అని పింగళి నాగేంద్రరావు అన్నట్లు, నార్లవారు ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు సృష్టించారు. మాండలీకాలకు పెద్దపీట వేశారు. ఇంగ్లీష్ పదాలకు సమానార్ధకాలు నిర్దేశించే క్రమంలో, తిరోగమనం, ఐక్య రాజ్య సమితి, దిగ్బంధనం మొదలైనవాటిని ఎన్నింటినో ఉదాహరణగా చెప్పవచ్చు. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన సొత్తు.

Also Read : నందమూరి తారక రామారావు – ఒక చరిత్ర

సంపాదకీయాలకు కావ్యగౌరవం

సంపాదకీయాలకు కావ్యగౌరవం తెచ్చినవారు నార్ల. నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ వంటి అగ్రేసర పాత్రికేయులు కూడా నార్లవారికి శిష్యప్రాయులే. తెలుగు పత్రికా సంపాదకులలో ముట్నూరు కృష్ణారావు, ఖాసా సుబ్బారావు తర్వాత తరంలో అంతటి ప్రభావశీలి, ప్రతిభాశాలి నార్లవారే. పత్రికా రచనలో, నడకలో, నడతలో ఆధునికత అద్ది, కొత్త దారులు చూపించిన దార్శనికుడు. మీదు మిక్కిలి దేశభక్తుడు. ప్రజాభిప్రాయాలపై నార్లవారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. ప్రజలకు ఎడిటర్ పట్ల విశ్వాసం, పత్రిక పట్ల నమ్మకం కలిగించినవారిలో ఈయన ప్రథమశ్రేణీయులు. నార్లవారి ఆలోచనలు, అక్షరాలు సమానంగా శరవేగంగా పరుగెట్టేవి. గ్రామీణ వార్తలకు, స్త్రీలకు సంబంధించిన అంశాలకు, వ్యవసాయ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు.

నేటి పత్రికలకు నాడే బీజం

ఇప్పుడు మనం చూస్తున్న పత్రికా రూపాలకు, ఆనాడే ఆయన బీజం వేశారు. ఎంఎన్ రాయ్ ప్రభావం కూడ నార్లపై బాగా ఉండేది. కాసు బ్రహ్మానందరెడ్డి పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి  బిల్లును తెచ్చిన సందర్భంలో, ఆయనపై విరుచుకు పడ్డారు. “బ్రహ్మంగారి తత్వాలు” అనే శీర్షికతో క్యాంపెయిన్ నడిపి, ప్రభుత్వం దిగివచ్చే దాకా వదల్లేదు.ప్రారంభంలో అనేక పత్రికల్లో పనిచేసినా,1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరినప్పటి నుంచీ వృత్తిలో నిలదొక్కుకున్నారు.1928లో “కాంగ్రెస్ ” అనే పత్రికకు రాసిన  ఉత్తరమే, ఆయన తొలి పత్రికా రచన. ఉపేంద్ర, రవీంద్ర అనే పేర్లతోనూ అనేక వ్యాసాలు రాశారు.

Also Read : రామోజీరావు – ఉన్నది ఉన్నట్టు

‘భారతి’ లో వ్యాసానికి పాతిక పారితోషికం

అప్పట్లో “భారతి” పత్రికకు రాసినందుకు వ్యాసానికి 25రూపాయలు చొప్పున ఇచ్చేవారు.ఆ కాలంలో అదే పెద్దమొత్తం. కొడుకు రచనకు ఇంత పారితోషికం వచ్చినందుకు ఆయన తల్లి ఎంతో మురిసిపోయింది. ఒక సందర్భంలో “ఆంధ్రపత్రిక”లో చేరడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. కాశీనాథుని నాగేశ్వరావుపంతులు అంటే అమిత గౌరవం.”ఈనాడు, జర్నలిజం ఇంత అభివృద్ధి చెందిందంటే, అదంతా ఆయన చలవే” అని కాశీనాథుని పట్ల తన కృతజ్ఞతను, గౌరవాన్ని నార్ల చాటిచెప్పుకున్నారు. నిర్భీతిగా, నిబద్ధతగా నడిచి జర్నలిజం వృత్తికి అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టినవారిలో నార్లవారి స్థానం నార్లవారిదే.

ప్రజలకు రక్షలేదు పత్రిక లేనిచో

ఇంతటి బహుజ్ఞాన సముపార్జన చేసినవారు చాలా అరుదుగా ఉంటారు. 1908 డిసెంబర్ 1వ తేదీ, జబల్ పూర్ లో జన్మించి, 1985 ఫిబ్రవరి 15న హైదరాబాద్ లో మరణించారు. వీరిది కృష్ణాజిల్లా కాటూరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం సాంస్కృతిక సలహాదారుగానూ ఉన్నారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు.”పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా, అంజలి ఘటిద్దాం.

Also Read : శ్రీమద్భాగవత కథలు

Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -

Latest Articles