Thursday, April 18, 2024

అలా ఉండే వెంకయ్య నాయుడ్ని ఇలా మార్చిన తెన్నేటి!

వోలేటి దివాకర్

స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ప్రియశిష్యులు, ఆంధ్ర రాష్ట్ర తొలి రెవెన్యూ మంత్రి తెన్నేటి విశ్వనాధం భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడును పూర్తిగా మార్చివేశారు.

గురువారం రాజమహేంద్రవరంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన తెన్నేటి విశ్వనాథం విగ్రహం

రాజమహేంద్రవరంలోని ఆంధ్ర కేసరి సెంటినరీ జూనియర్ కళాశాల  అర్థ శతాబ్ది ఉత్సవ వేడుకల్లో  గురువారంనాడు  వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తన గురువు తెన్నేటి విశ్వనాధం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  మాట్లాడుతూ…‘‘నా చిన్నతనంలో దురుసుగా, ఆవేశపూరితంగా  ఉండేవాడిని. వారితో సాహిత్య సాన్నిత్యం పొందడం వలన  నాలో ఎంతో మార్పు వచ్చింది..వారు నాకు మార్గదర్శకయ్యారు’’ అని అన్నారు. తాను ఏ సభకు వెళ్లినా వారిని స్మరిస్తుంటానని తెలిపారు.

‘‘తెన్నేటి విశ్వనాధం వారి వెన్నంటే ఉండటం వల్ల దాని ప్రభావం నా మీద కొంత ఉంది’’ అన్నారు.

నైతిక విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవే పరమావధిగా భావించి రాజకీయాలు నెరపిన కొద్ది మంది నాయకుల్లో అగ్రగణ్యులు తెన్నేటి విశ్వనాధం ఒకరని పేర్కొన్నారు.  న్యాయ శాస్త్రం, ఆంగ్ల భాషలోను పట్టభద్రులై, మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టిన తెన్నేటి విశ్వనాథం  గాంధీజీ పిలుపుతో 1922 లో న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారన్నారు.

సబర్మతి ఆశ్రమంలో ఉండి గాంధీజీ సిద్ధాంతాలు ఔపోసన పట్టి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శిగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ రెవెన్యూశాఖ మంత్రిగా ప్రకాశంగారి మంత్రి వర్గంలో పనిచేశారన్నారు.  విశాఖ మున్సిపల్ చైర్మన్ గా,  శాసన సభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా సేవలందించి విశాఖ ఉక్కు ఫాక్టరీ కోసం పదవీత్యాగం చేసిన ధీరుడు,  పదవులకే వన్నె తెచ్చిన మహోన్నతుడన్నారు. 

జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ప్రకాశం పంతులు వంటి వారితో ఆయన పని చేశారు. తెన్నేటి విశ్వనాథం ఉద్యమ స్ఫూర్తి కారణంగా జమీందారీ విధానం, భూ సంస్కరణల వ్యవస్థ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, కృష్ణ బ్యారేజీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందన్నారు. దేశభక్తి, నిస్వార్థం, సద్గుణ సంపద ఈ తరం యువతరానికి స్ఫూర్తిని ఇస్తాయన్నారు.

 రాజమహేంద్రవరం అనగానే  ఒకవైపు  వేద ఘోష, మరోవైపు గోదావరి గలగలం, దాని కంటికి రెప్పలా కాచే సోమలమ్మ తల్లి దేవాలయం క్షేత్రపాలకుడు వేణుగోపాలకృష్ణ శిల్ప సంపద ఆలయాలు, నన్నయ్య వ్రాసిన ఆంధ్రమహాభారతం, కాటన్ మహాశయుడు నిర్మించిన ధవళేశ్వరం ప్రతి ఒక్కటి ఆనందాన్ని స్ఫూర్తిని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అన్నారు.

నాయకులు గోడలు దూకద్దు

నేటి రాజకీయ వ్యవస్థ లోని ప్రజా ప్రతినిధులు పార్లమెంట్, శాసనసభలో ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిత్వం, నైపుణ్యం, శక్తి సామర్థ్యాలు  పెంచే విధంగా పని తీరు ఉండాలన్నారు. రాజకీయ నాయకులు తరచూ పార్టీలు మారడం వలన  నమ్మిన సిద్ధాంతాలకు దోహదం చేయలేరన్నారు. రాజకీయాల్లో  ప్రత్యర్థులే గాని శత్రువులు  ఉండరన్నారు.

 మన సంస్కృతి సాంప్రదాయాలకు  కాపాడుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి రామనాథ్, కోవింద్, మాజీ ప్రధాన న్యాయమూర్తి  ఎన్ వి రమణ, ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ లు మాతృభాషలోనే వారి విద్యాభ్యాసాలను పూర్తి చేశారన్నారు. సభ ప్రారంభకులు  మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ వెంకయ్య నాయుడు దక్షిణాన సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ భారతదేశ ఉన్నత శిఖరాలను అధిరోహించారని, వారి జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. పొలిటిషన్ అంటే ఒక స్నేహితుడిగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒరవడిని నేర్పిన నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles